Saturday, 17 November 2007

తారాలోకం




ఎంత బలీయమైన మెసేజ్‌నైనా జనం మనసుల్లోకి తీసుకువెళ్ళాలంటే సినిమాని మించిన మాధ్యమం లేదు. అయితే సినిమా రంగం తన మనుగడని నిలుపుకోవడానికి ప్రేక్షకుల్ని వెదుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పైరసీ, టెలివిజన్ చానెళ్ళ దెబ్బకి కుటుంబం మొత్తం సినిమా థియేటర్లకి తరలి వెళ్ళే సందర్భాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రంగానికి మహారాజ పోషకులు యువతే మిగిలారు నచ్చితే విసుగు లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించే తీరికా, ఓపికా యువతకే ఉండడంతో దాదాపు ప్రతీ సినిమా డైరెక్టరూ, నిర్మాత ఎలాగైనా యువత నాడిని పట్టుకుని కాసుల వర్షం కురిపించుకోవడానికి 'ఫార్ములాలు ' వండి వారుస్తున్నారు. అయితే తమ లక్స్యం యువతని ఆకర్షించడమే అయ్యేసరికి... యువతలో అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న అనేక భావాలకు, ఉద్వేగాలకు, ఆవేశాలకు పెద్ద పీట వేసి సినిమాలను ఎలాగైనా పండించడానికి నానా తంటాలు పడుతున్నారు.


ఈ ప్రయత్నంలోనే కొందరు దర్శకులు నైతిక విలువలు, శృంగారపు హద్దులు అతిక్రమించి అంగాంగ ప్రదర్శనలతోనైనా యువతకు గాలం వేయడానికి జూమ్ కెమేరాలకు పనిపెడుతున్నారు. అది తప్పు , ఇది ఒప్పు అని సినిమాలకు దిశానిర్దేశం చేసే పెద్దలు కరువయ్యారు. ఓ ఇరవై లక్షలు చేతిలో ఉంటే... అనుభవం, అర్హతలు ఆలోచించకుండా సినిమా నిర్మాణంలోకి దిగేస్తున్న వారెందరో? వారికి కావలసింది తాము పెట్టే పెట్టుబడికి కనీసం వడ్డీ అయినా రావడం... అందుకే మినిమమ్ గ్యారంటీ ఫార్ములాలైన శృంగార, లవ్, సెంటి్‌మెంట్‌లకు పెద్ద పీట వేస్తున్నారు. హీరోహీరోయిన్లకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చిత్రీకరించి పోస్టర్లుగా వేసి సినిమాలకు క్రేజ్‌ని సంపాదించుకునే గిమ్మిక్కులు ఇలా మొదలవుతున్నవే. వారు సాధించదలుచుకున్నది మొదటి రెండు వారాల్లో అడ్డదారులు తొక్కయినా పాపులారిటీ సాధించుకోవడం.. దానితో సినిమాకి మినిమమ్ గ్యారెంటీ ఖాయం. ఇలా సినిమా రంగం పూర్తిగా పెట్టుబడి, నిర్వహణ, రాబడి అనే ఆర్ధిక చట్రంలోనే ఇరుక్కుపోతున్న తరుణంలో విలువలతో కూడిన సినిమాలను ఆశించడం సగటు ప్రేక్షకులుగా మనకు అత్యాశేనేమో!!!


మీ నల్లమోతు శ్రీధర్

1 వ్యాఖ్యలు:

netizen నెటిజన్

వెనకటికొక నిర్మాత ఉండేవాడు, యూ. విశ్వేశ్వర రావని. ఆయన అన్నాడు కదా, "వాళ్ళు అడుగుతున్నారని, మేము తియ్యడం, మేము తీస్తున్నాం కదా అని వాళ్ళు చొంగ కార్చుకుంటూ చూడడం" అగాలంటే కొంత కాలం ఆ "సెన్సారు బోర్డు"ని ఆ, "సెన్సార్ " సర్టిఫికట్ తీసేసి, ప్రేక్షక మహరాజులకి, వారికి కావలిసిన అందాలన్ని, అరబోసే వాళ్ళతో, సినిమాలూ తీసి, దేశం మీదకి వదిలితే, మోహం మీద మొహమోత్తి, వాళ్ళే చూడటం మానేస్తారు.

కాని ఈ వెధవాయిలు వింటేగా..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008