కలగంటి కలగంటి
మామూలుగా కలలు ఎప్పుడు వస్తాయి కాని గుర్తుండవు. చిన్నప్పుడు ఎక్కువ కలలొచ్చేవి. బహుశా బాధ్యతలు ఎక్కువ శారీరక శ్రమ లేనందువల్లనేమొ, మనసుకు పనేమీ లేక కలలుకనేది. స్కూలులో ఉన్నప్పుడూ పొద్దున్న జరిగిన చదువులు, పోట్లాటలు అన్ని నిద్రలో కలల్లో కూడా వెంటాడి కలవరింతలుగా మారేవి. మళ్ళీ ఉదయం అమ్మ చెప్పేవరకు కూడా అలా కలవరించామని తెలీదు. నాకు ఎన్నో కలలు వచ్చాయి. కాని గుర్తుపెట్టుకునేటంతగా ఏమీ లేవు. కానీ పెళ్ళి కాకముందు మాత్రం నాకు ఒకే కల ఉండేది. అది ప్రతి ఆడపిల్లకు ఉండేదే.. అప్పుడు సినిమాలు చూసి అందులోని పాత్రలు, కథలు నిజమని నమ్మేదాన్ని. మగవాళ్ళు అంటే ఎక్కువగా మద్యం తాగడం, అమ్మాయిలతో తిరగడం, విలాసాలతో భార్యను నిర్లక్ష్యం చేయడం ఇలా.నేను మనస్పూర్తిగా కన్న కల మాత్రం నాకు వచ్చే భర్త ఎక్కువ చదువుకుని ఉండాలి, కనీసం డాక్తరైనా, ఇంజనీరైనా( ఆ కాలంలో వీళ్ళిద్దరంటే చాలా గొప్ప) అయి ఉండాలి, మంచి ఉద్యోగం (ఎక్కువ అస్థి లేకపోయినా ఫర్వాలేదు నెలకు జీతమొస్తే చాలు) బజాజ్ చేతక్ స్కూటర్,కట్నం తీసుకోకూడదు, తాగుడు అమ్మాయిల అలవాటు ఉండకూడదు. ఇలా కలలు కంటూ ఉండేదాన్ని అది నిజమవుతుందనే నమ్మకం లేకున్నా. కాని అది మొత్తం అక్షరాలా నిజమైంది. అలాంటి వ్యక్తి నాకు జీవితభాగస్వామి అయ్యారు. ఇంజనీర్, స్కూటర్ ఉంది,కట్నం వద్దన్నారు,చెడు అలవాట్లు లేవు (ఇప్పటికీ కూడా, అప్పుడప్పుడు నేనే ఒకసారి మద్యం రుచి చూస్తానంటే తిట్టి, మీ పుట్టింటికెళ్ళి ఫుల్లుగా తాగేసి మొత్తం దిగాక ఇంటికి రా అంటారు. ప్చ్ ) ఇక ఆ తర్వాతి కల అంటే మా పిల్లలు మంచి( పెద్ద కంపెనీలో) ఉద్యోగాలలో సెటిల్ కావాలి, మంచి మనుష్యులుగా ఉండాలి ముందు అని. అది దాదాపు తీరినట్టే. మా పిల్లలకు కూడా నేను చెప్పేది ఇదే. పెద్ద పెద్ద కలలు కనండి కాని అవి తీర్చుకోవడం అసంభవమేమీ కాదు, వాటికోసం కష్టపడితే చాలా సులభం అని. అది వాళ్ళిద్దరూ పాటించారు. విజయులయ్యారు.
ఐతే నాకు గుర్తున్న అస్సలు మర్చిపోలేని కల ఒకటుంది. ఇప్పటికీ నా కళ్ళముందు కనిపిస్తూ ఉంది.
అదేంటంటే..
మేము కారులో (నేను తప్ప కలలో ఎవరూ కనపడలేదు)కారులో తిరుమల కొండలపై వెళుతున్నాము. హటాత్తుగా కారు ఆగిపోయింది. అందమైన ప్రకృతి. పచ్చని చెట్లు,కొండలు, ఆహ్లాదకరమైన వాతావారణం. అలా చూస్తూ ఉంటే తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీనివాసుడు సర్వాలంకారణ భూషితుడై. వివిధ వర్ణముల పుష్పములతో కనిపించాడు. అప్పుడూ నేను ఆ స్వామి , ఆ కొండలు తప్ప ఏవీ కనపడలేదు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్లముందే ఉంది. అస్సలు మర్చిపోలేదు,కళ్ళ ముందు నుండి చెరిగిపోలేదు.
1 వ్యాఖ్యలు:
This post left a very good feeling on me. Best wishes.
Post a Comment