Friday 23 November 2007

మనసుకు సంకెళ్లు వేయకండి!

పాజిటివ్ గా చూస్తే జీవితంలో అడుగడుగునా అవకాశాలే కన్పిస్తాయి. అయితే మనలో చాలామంది కొన్ని పరిధులు గీసుకుని అదే జీవితమనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఒక్కసారి మన ఆలోచనా విధానానికి వేసుకున్న ముసుగుని తొలగించి విశాల దృక్పధంతో ఆలోచిస్తే మన ముందు లెక్కకు మిక్కుటంగా ఉన్న అవకాశాలు గోచరిస్తాయి. ఎవరి బ్రతుకూ ఒక స్ధాయికే పరిమితం అయినది కాదు. స్థాయిని పెంచుకోవడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తే ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్ కన్నా మరింత మెరుగైన స్ధానానికి చేరుకోవడానికి మార్గాలు కన్పిస్తాయి.

"ఓ యాభైవేల జీతం వస్తే చాలు.. ఎలాంటి చీకూ చింతా లేకుండా బ్రతకవచ్చు" అని ఆలోచించేవారు తమ ఆదాయాన్ని పరోక్షంగా యాభైవేలకే పరిమితం చేసుకుంటున్నారన్నమాట. అంతకన్నా విస్తృతంగా ఎందుకు ఆలోచించకూడదు? అలాగని పగటి కలలు కనమని కాదు. మనలో అంతర్గతంగా నిభిడీకృతం అయి ఉన్న శక్తియుక్తులను గుర్తించి.. మనం ఏం చేయగలమో, ఆ చేయగలిగేది ఎంత సమర్ధవంతంగా చేయగలమో బేరీజు వేసుకుని మన శక్తియుక్తులతో చేయగలిగిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఉన్నత స్ధానం వైపు అడుగులు వేయవచ్చు. అంతే కానీ "ఈ జన్మకు ఇది చాల్లే.. ఇంత కన్నా తృప్తి ఏమి ఉంది.." అన్నట్లు ఆలోచించడం మన పరిధిని మనం కుంచింపజేసుకున్నట్లే!

ఈరోజు మీరు ఒక కంఫర్టబుల్ జోన్ గా దేన్ని ఫీల్ అవుతున్నారో దానితో సరిపెట్టుకుని నిజంగా తృప్తిగా బ్రతకగలుగుతున్నారా.. ఒక్కసారి ఆలోచించండి? అంటే మీరు తృప్తి అనుకుంటున్న ప్రస్తుత జీవితం మీకు అంతర్లీనంగా అసంతృప్తిని మిగుల్చుతోందన్నమాట. కానీ.. మరింత ఉన్నత స్ధానం కోసం కృషి చేయడం రిస్క్ గా భావించి లేదా బద్ధకించి ఇదే గొప్ప జీవితం అన్నట్లు మిమ్మల్ని మీరు కట్టిపడేసుకుంటున్నారు. ఆ సంకెళ్లని తొలగిస్తే తప్ప ఇంతకన్నా గొప్పగా మీరు బ్రతకలేదు.

- నల్లమోతు శ్రీధర్

ఫిబ్రవరి 2004 కంప్యూటర్ ఎరా నుండి

1 వ్యాఖ్యలు:

వింజమూరి విజయకుమార్

శ్రీధర్ గారు తెలిసే రాసారో తెలీకే రాసారో గానీ, గ్లోబలైజేషన్ దిశగా దేశాలకు దేశాలే అమ్ముడవుతున్న ఈ తరుణంలో,IMF (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్) పేరున అప్పులపాలై రేపో మాపో దక్షిణ కొరియా మాదిరి చిన్న దేశాలూ, అధిక జనాభా గల దేశాలూ సెకండ్ హ్యాండ్ బట్టలకి, వస్తువులకి పరిమితమైపోవాల్సిన ఈ సమయంలో ఈ సంపాదకీయం నిజంగా నూటికి నూరుపాళ్ళూ నిజమే. జాడ్యం వదిలి సంపాదన కోసం, ఆర్థికపరమైన పుష్టి కోసం ప్రతి ఒక్కరూ త్వరపడాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008