త్వరగా ముసలివాళ్లం ఎందుకు అవుతామంటే...
అనుకోని సంఘటన ఒకటి జరిగింది. వెంటనే షాక్ అవుతాం. దాన్ని అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోదు. "నాకే ఎందుకు ఇలా జరగాలి.. ఇవ్వాళ లేచిన వేళ అస్సలు బాగోలేదు.. అబ్బ ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుణ్ణు.." అని సణుక్కుంటూ ఉంటాం. ఆ సంఘటనని ఒప్పుకుని ఉన్నది ఉన్నట్లు స్వీకరించడానికి మనస్కరించదు. దాంతో మనకు తెలియకుండానే మనసులో సంఘర్షణ ప్రారంభమవుతుంది. మొక్కుబడిగా పనులు చేస్తూనే ఉంటాం మరో పక్క మైండ్ లో జరిగిన సంఘటన తాలూకు ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. దాంతో చేసే పనుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. శ్రద్ధ పెట్టని పని వ్యర్థమే అన్నది మనకు తెలిసిందే. ఇలా ఎప్పుడో జరిగిన సంఘటనలను కూడా మనం రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి "మోస్తూనే" ఉంటాం. అందుకే అత్తగారు చనిపోయినా ఆవిడి పెట్టిన కష్టాలను పనిమాలా గుర్తు తెచ్చుకుని ఆవిడని నాలుగు తిట్లు తిట్టుకుంటే తప్ప పొద్దుపోని కోడళ్ల లాంటి వాళ్లు మనకు కనిపిస్తూ ఉంటారు. అత్తాకోడళ్లు అనేది ఉదా. మాత్రమే. ఈ బాపతు జనాలు ఎంతోమంది ఉంటారు. గతించిన క్షణం 'చచ్చిన శవం'తో సమానం.శవాలను మనం ఇంట్లో కుళ్లబెట్టుకోం. కానీ శవాల్లాంటి చేదు జ్ఞాపకాలను మాత్రం జీవితాంతం మనసులో మోస్తూనే ఉంటాం. అందుకే ఎంతో ఆనందించదగ్గ సందర్భం వచ్చినా... ఆ సందర్భాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యడానికి బదులు మనసులో పేరుకుపోయిన శవాల్లాంటి పాత జ్ఞాపకాలతో సావాసం చేస్తుంటాం. దీనికి అసలైన కారణం జరిగిన సంఘటనని "జీవితాంతం ఒప్పుకోకపోవడం"! అత్త గయ్యాళి అని, గయ్యాళి వాళ్లు తిడతారు అని ఒప్పుకుంటే పోయేదానికి.. అత్తపోయినా "అది నన్ను తిడుతుందా" అంటూ జీవితాంతం మొండిగా మనసులో ఘర్షణ పడుతూనే ఉంటే బీపీలు రాక ఏం వస్తాయి?
చిన్నతనంలో ఎలాంటి బలమైన సంఘటన ఎదురైనా కొద్దిరోజుల్లో మర్చిపోయేవాళ్లం. కానీ వయస్సు పెరిగేకొద్దీ పట్టుదల కూడా పెరుగుతోంది. "ఇలాగే ఎందుకు జరగాలి, దీన్ని నేను ఒప్పుకోను. ఎలాగైనా దీన్ని మార్చి చూపిస్తా.. నా పవర్ ఏంటో చెబుతా" అంటూ మొండికేసి కూర్చుంటున్నాం. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. జరిగిన సంఘటనను ఒప్పుకుంటేనే మున్ముందు అలా జరగకుండా ఏం చెయ్యాలి అన్నది తోస్తుంది. నేను ఒప్పుకోను అని కూర్చుంటే మనసులో అశాంతి తప్ప ఏమీ మిగలదు. అందుకే వయస్సు పెరిగే కొద్దీ మన అభీష్టానికి విరుద్దంగా జరిగిన ప్రతీ సంఘటనకి సంబంధించిన బరువును మనసులో మోసుకుంటూ వస్తూ జీవశ్చవాల్లా బ్రతుకుతుంటాం. ఎంత బలమైన సంఘటన అయినా "ఒకే జరిగితే జరగనివ్వు.. ఏం చేస్తాం" అంటూ ధీమాగా కూర్చుంటే దాని తాలూకు ప్రభావం మనసుపై చాలా స్వల్పంగా ఉంటుంది. మనసు ఆ చిక్కుముడిలో ఇరుక్కుపోదు. పరిస్థితులు చక్కబడేటంత వరకూ ఓపికగా వేచి ఉంటే తర్వాతి మనం చేయవలసింది నిదానంగా చేసుకోవచ్చు. ఇది అత్యద్భుతమైన జీవిత రహస్యం.. దీనిని అర్థం చేసుకుని ప్రతీ క్షణం మీ జీవితానికి అన్వయించుకుంటూ పోతే అరవైలలోనూ ఇరవైల పడుచువాళ్లుగా జీవించవచ్చు.
- నల్లమోతు శ్రీధర్
1 వ్యాఖ్యలు:
well said
Post a Comment