Monday, 17 December 2007

నా షడ్రుచుల ప్రయాణం.

రెండురోజుల నుండి ఆలోచించగా.. చించగా...ఎన్నెన్నో జ్ఞాపకాలు..ఎందుకో ఒక్కసారి నా వంటలు, షడ్రుచుల ప్రయాణం నెమరువేసుకున్నాను. చిన్నప్పుడూ చాలా గారంగా పెరిగాను ఒక్కతే కూతురిగా. అమ్మే అన్ని పనులు చేసుకునేది. ఏడు, ఎనిమిది తరగతిలో ఉన్నప్పుడూ మొదటిసారిగా వంటింట్లోకెళ్ళి స్వంతంగా టీ చేసుకునేదాన్ని పొద్దునే చదుకోడానికి లేచినప్పుడూ.ఇల్లు సర్దడం లాంటి చిన్న చిన్న పనుల్లో సాయం చేయడమే నా పని. ఆమ్‌లెట్ వేయడం తప్పితే ఎక్కువగా వంటగదిలో కాలు పెట్టిందిలేదు. పెళ్ళయ్యేవరకు కూడ, ఇంట్ళో ఎన్ని పార్టీలున్నా సరే. మా అమ్మ తిట్టేది , రేపు పెళ్ళయ్యాకా మీ అత్తగారు నన్ను తిడతారు - కూతురికి వంట, ఇంటిపనులు నేర్పించలేదు అని. నేననేదాన్ని పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు, అప్పుడు నేర్చుకుంటాలే, అంతగా ఐతే మా అమ్మ నేర్పించినా నేనే నేర్చుకోలేదు అని చెప్తాను అనేదాన్ని. మా నాన్న కూడా నాకే సపోర్ట్. కాని అప్పుడప్పుడు వడ్డన మాత్రం చేసేదాన్ని.కాలేజీ, ఇల్లు తప్ప వేరే లోకం లేదు.



ఇక నా అసలు ప్రహసనం మొదలైంది అత్తారింట్లో. ఉమ్మడి కుటుంబం. పెళ్ళయ్యాక మా తోటికోడలికి వంట చేయడంలో సాయం చేసేదాన్ని. కూరగాయలు కోయడం, బియ్యం కడగడం లాంటివి కాని అస్సలు అన్నం మెత్తగా కాని బిరుసుగా కాని ఉండకుండా సరిగా వండడం అసలు తెలీదు.సగం ఉడికాక ఎదో పనిలో సీరియస్సుగా ఉండేదాన్ని అప్పుడూ ఆవిడే చూసి దింపేవారు.మెల్లిగా అడిగేదాన్ని అన్నం పూర్తిగా ఉడికిందని ఎలా తెలుస్తుందని. ఆవిడ చెప్పేవారు.(మనసులో ఏమనుకున్నారో మరి). నాకు ఇంకా గుర్తుంది .పెళ్ళయ్యాక వారానికి మా తోటికోడలు తన స్నేహితురాలు వచ్చిందని నన్ను ఉప్మా చేయమన్నారు. అంతే. నా మైండ్ బ్లాక్ ఐపోయింది. రాదు అని చెప్పా. అప్పుడు ఆవిడ నిజంగా రాదా. మీ అమ్మా వాళ్ళింట్లో ఎప్పుడు ఉప్మా చేయలేదా అన్నారు.కాని మా అమ్మ చేస్తే తినడమే తెలుసు , చేయడం రాదని భయపడుతూనే చెప్పేసా తప్పదుగా మరి. అప్పుడూ రవ్వ బాగు చేసిచ్చి (నాకు అది కూదా రాదు మరి) అన్ని కోసి ఇస్తే నాకు చూపిస్తు చేసారావిడ. కొద్ది నెలలకే వేరు కాపురం. చచ్చినట్టు నేనే వండాలి. ఇక తప్పదన్నట్లు మా అమ్మ దగ్గరున్న వంటల పుస్తకాలన్నీ తెచ్చేసుకున్నా, అసలు పప్పు ఎలా చేయాలి, చారు , కూరలు బేసిక్‌గా ఎలా చేయాలి అని అడిగి మనసులో గుర్తుపెట్టుకున్నాను. గ్లాసుడు పప్పుకు నాలుగు పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిపాయ,కొద్దిగ కరివేపాకు, కొత్తిమిర, ఒక స్పూను కారం పొడి, ఒక పెద్ద స్పూనుడు ఉప్పు, పసుపు,నాలుగంటే నాలుగే టమాటాలు, (ఎప్పుడన్నా కావాలనుకుంటే వేరే కూరగాయలు వేసుకోవచ్చు) అని అమ్మ దగ్గర తెలుసుకున్నా. కనీసం ఇవన్నా రావాలిగా. రోజు అలాగే ఇదే కొలతలతో వంట చేసేదాన్ని. ఏంటో బానే ఉండేది పప్పు. మా వారు పెళ్ళికి ముందు వంట చేసుకోవడం అలవాటైనా వంటింట్లోకి వచ్చేవారు కాదు. ఎప్పుడైనా సలహాలు మాత్రం ఇచ్చేవారు. ఇక అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలతొ మెల్లి మెల్లిగా నేర్చుకోవడమ్మొదలుపెట్టా. కాని పూర్తి ఇష్టం, శ్రద్ధతో నేర్చుకోలేదు.

ఒక్కసారి మాత్రం గొడవైపోయింది.. పొద్దున పొయ్యిమీద ఒక వైపు కుక్కర్లో దోసకాయ పప్పు చేస్తూ అందులో అన్ని కోసి వేస్తున్నాను.మరోపక్క మా వారికి టీ చేస్తున్నా. కొత్త కొత్త వంటల ప్రయోగం కదా.టీలో వేసే టీపొడి చటుక్కున పప్పులో వేసా.ఇంకా నయం కారం తెచ్చి టీలో వేయలేదు. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అరగంటలో మావారు ఆఫీసుకెళ్ళాలి. ముందు టీ ఇచ్చేసి, మా పై పోర్షన్‌లో ఉంటున్న మా అమ్మ దగ్గరికెళ్ళి జరిగిన సంగతి చెప్పి చిన్న గిన్నెడు పప్పు తెచ్చి మా వారికి పెట్టెసా. తర్వాత మళ్ళీ పప్పు వండాననుకోండి. కాని టీపొడి పడిన పప్పు పనిమనిషి కూడ తినలేదే..ఏం చేయను. పడేసా.తర్వాత రాత్రికి మావారికి చెప్తే , ఏం చేస్తాం నా ప్రాప్తం.నా అదృష్టం అన్నారు. అప్పటినుండీ కాస్త జాగ్రత్తగానే ఉంటాను. వంట చేయడం రాకున్నా , వడ్డనలో మాత్రం పర్‌ఫెక్ట్. ఎవరింటికి వెళ్ళినా నన్ను వంటలు, వడ్డన అప్పజెప్పేవారు. ఎందుకంటే నేను తినేవారి మొహం చూడకుండా అందరికీ సమానంగా వడ్డించేదాన్ని వేగంగా. (చాలామంది ఏం చేస్తారంటే తినేవాళ్ళ మొహం చూసి వడ్డిస్తారు. వేసుకో, వేసుకో అంటారేగాని గిన్నెలోనుండి గరిటే బయటకు రాదు) పెళ్ళైన పదేళ్ళవరకు చపాతీలు చేయడం రాక అస్సలు చేసేదాన్ని కాదు. పూరీలు, పుల్కాలు మాత్రమే. చపాతీలు చేస్తే అవి ఒక్కోటి ఒక్కో దేశం నమూనా తయారయ్యేది. మెత్తగ ఉండేది కాదు. ఎందుకొచ్చిన తంటా అని చేయడమే మానేసా.కాని వంటలన్ని సరిగ్గా చేయడం నేర్చుకోడానికిన్ నాకు నా మీద నమ్మకం కుదరడానికి పదేళ్ళు పట్టింది. ఒక్కదాన్నే కదా. స్వంతంగా నేర్చుకోవాలి మరి.50 మందికి ఒక్కదాన్నే చేయగలను అనే ధీమా వచ్చింది చేసాను కూడా.. ఎప్పుడు కూడా నవళ్ళు, వంటల పుస్తకాలే కొనడం. చదవడం ఎక్కువ, చేయడం తక్కువ. ఆ మసాలాలన్ని చేయడానికి బద్ధకం.సింపుల్‌గా తక్కువ వస్తువులతో చేయడానికి ప్రయత్నించేదాన్ని.


అలా అలా సాగిన నా వంటల ప్రయాణం షడ్రుచులు బ్లాగు మొదలెట్టడానికి కారణమైంది. కాని నాకు అర్ధం కానిదొక్కటే నేను రోజు ఇంట్లో చేసుకునే వంటకానికే ప్రముఖ దినపత్రికలో బహుమతి రావడమేమిటీ. మళ్ళీ ఇంకో దినపత్రికలో మరో వంటకం ప్రచురింపబడటమేమిటీ అని నమ్మలేకుండా ఉన్నాను. నిన్నటి అంటే ఆదివారం 16 డిసెంబర్ Times of India పేపర్లోని hyderabad timesలో ఆంధ్రా కిచెన్‌లో వచ్చింది. ఎలా ఉందో ఆ వంటకం కాస్త చూడండి.

7 వ్యాఖ్యలు:

అనిర్విన్

జ్యోతి గారు, బాగుంది మీ ప్రయాణం. కానీ, Times of India లంకె లో నాకేం దొరకలేదు.

జ్యోతి

go to tht link, click 16 dec and page 32... then u get yest edition

lalithag

జ్యోతి,
WOW!
అయితే నా లాంటి వాళ్ళకి కూడా hope ఉందన్న మాట.
మీ షడ్రుచులు నాకు నిజంగా మార్గం చూపించాయి.
ధైర్యంగా వంట చేస్తున్నాను ఈ మధ్య. అప్పటికప్పుడు ఏమైనా చెయ్యాల్సి వస్తే నేను కూడా blank అయిపోతాను. ఈ మధ్యే కాస్త confidence వచ్చింది.

"ఎప్పుడు కూడా నవళ్ళు, వంటల పుస్తకాలే కొనడం. చదవడం ఎక్కువ, చేయడం తక్కువ. ఆ మసాలాలన్ని చేయడానికి బద్ధకం.సింపుల్‌గా తక్కువ వస్తువులతో చేయడానికి ప్రయత్నించేదాన్ని. "
దాదాపు నా పరిస్థితీ ఇదే. కొనడం కాదనుకోండి, అంతర్జాలంలో వెతకడం అన్న మాట.

బహుశా మీ రెసిపీలు అందుకే అంత బావుంటాయి. చదువుతుంటే చెయ్యగలను అని, చెయ్యాలి అనీ అనిపిస్తాయి.

Thanks!
Congratulations too!

Unknown

జ్యోతి గారూ.. ముందుగా మీ ఐటెమ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైనందుకు శుభాకాంక్షలు. నిజంగా మీ వంటల హిస్టరీ చదివి నవ్వు ఆగలేదు. కానీ మీ పట్టుదలే ఈరోజు మిమ్మలను చాలా గొప్ప స్థాయికి చేర్చింది. కీపిటప్.

- నల్లమోతు శ్రీధర్

Rajendra Devarapalli

అమ్మా జ్యోతి గారూ,మీ వంటల ఫొటో చూసి నేను నోరు ఊరి చస్తుంటే మా వాడు అది చూసి అవి కొంటావా?బస్ కొంటావా?కుల్కులే కొంటావా అన్నాడు.బస్ కంటే కుల్కులే కొంచెం రేటు తక్కువ కదా అదే కొన్నాను,మీరు నాకు ఇరవై రూపాయలు బాకీ.

Srinivas

జ్యోతక్కా,
సాయంకాలం చెప్పిట్లు మీ ఆర్టికల్ చదివాను, చాలా బాగుంది. రాజేంద్రకుమార్ గారి అబ్బాయి బస్ కానీ, కుల్కులే కాని ఛాన్స్ ఇచ్చాడు. మా అమ్మాయి అలా కాదు నాకు బెల్లం గాలే కావాలంది. రేపు స్కూల్ నుండి తిరిగి వచ్చేసరికి లెడీ (రెడీ) అని ప్రామిస్ చేశా. మళ్లీ చెపుతా ఏం జరిగిందో

venku ...

జ్యోతక్కా,
నేను చూసాను & చదివాను... చాలా బాగుంది..
మీ రాతలు చూసి నేను మీకు పెద్ద ఫంకా అయ్యాను...
ఎప్పటినుంచొ మీరు ఎలా ఉంటారా అని అనుకునెవాడిని..
మీ ఫొటొ గురుంచి అడుగుతే ఎమనుకుంటారొ అని మొహామాట పడెవాన్ని
కాని నా కొరిక దీంతొ తీరింది ...
నెనరులు...
ఇట్లు
వెంకు...
http://venkoos.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008