బంధాలు ముఖ్యం
ఎవరూ మనతో కలవడం లేదని బాధపడుతుంటాం.. మనం మాత్రం ఎవరినీ కలుపుకుపోం!
ప్రేమ కురిపించే ఆత్మీయులు ఎవరూ లేరని కుంగిపోతుంటాం.. మన ప్రేమకై
అర్రులు చాచే వ్యక్తులు అనేకమంది ఉన్నా వారి ఉనికే పట్టించుకోం!
ఆత్మీయులు డబ్బుకిచ్చిన విలువ మనకివ్వడం లేదని వాపోతుంటాం.. మనం మాత్రం
"చూశారా.. ఆ సందర్భంలో అది పెట్టలేదు,ఇది పెట్టలేదు" అని నసుగుతుంటాం!
గడ్డు పరిస్థితుల్లో మానసికంగా ధైర్యం ఇవ్వకపోగా లోకువ చేశారని
ద్వేషాన్ని పెంచుకుంటాం.. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వారి
కష్టాలను ఆసరాగా చేసుకుని మనమూ మాటల తూటాలు వదిలి బాధపెడుతుంటాం.
పరిస్ఠితుల్ని కేవలం మన కోణం నుండి మాత్రమే చూడడం వల్లది తలెత్తే
అనర్థాలు ఇవి. మరో విధంగా చెప్పాలంటే మనలోని స్వార్థం మన గురించి
మాత్రమే
ఆలోచించేలా చేస్త్లోంది తప్ప ఇతరుల అంతరంగాల్లోని కష్టాలను, బాధలను,
భావోద్వేగాలను అంచనా వేయడానికి మనస్కరించదు. నేను చేసే ప్రతీ పనీ
కరెక్టే.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుటి వారిదే తప్పు అనుకోవడం
అవివేకం! ఏ ప్రాపంచిక బంధాల పునాదులు గట్టిగా ఉండాలన్నా.. "నేను
కరెక్టే.. ఎదుటి వ్యక్తీ కరెక్టే.. ఎక్కడో సమస్య ఏర్పడింది.. దానిని
వెదికి పట్టుకుని పరిష్కరించుకుందాం" అనే ధోరణి అలవర్చుకోవాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా నిత్యజీవితంలో చోటుచేసుకునే చిన్నచిన్న
అభిప్రాయబేధాలను, పొరపొచ్ఛాలను మనసులో పాతుకుపోయేలా చేసుకుని, చిలవలు
పలవలుగా ఊహించుకుని ఎదుటి వ్యక్తులపై ద్వేషాన్ని పెంచుకోవడం మనం చేసే
పెద్ద తప్పు! ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు వారిద్దరూ బాధపడుతుంటే..
ప్రక్కవారు బాధ నటిస్తూ మనసులో మాత్రం ఆనందపడుతుంటారు. కొంతమందైతే
మరికొంత ముందుకువెళ్లి లేనివీపోనివీ మరిన్ని కారణాలను చూపించి ఆ ఇద్దరి
మధ్య 'వీలైనంత దూరం' పెరిగేటట్లు శాయశక్తులా క్రుషిచేస్తారు. దీనితో
అసలు
సమస్య పెట్టే బాధ కన్నా చాడీల బాధ మనల్ని కలచివేస్తుంది. ఇలాంటి
పరిస్థితుల్ని మన మానసిక లోపంతో మనమే కొనితెచ్చుకుంటుంటాం. ఎవరితో సమస్య
ఆ ఇద్దరు పరిష్కరించుకోవాలే తప్ప ఇతరుల జోక్యం, ప్రమేయాన్ని మనం
అనుమతించకూడదు. అప్పుడు బంధాలు, బంధుత్వాలు గట్టిగా ఉంటాయి.
- నల్లమోతు శ్రీధర్
1 వ్యాఖ్యలు:
wordpress నా ఫెవ్ ఐనా దాన్లొ తెలుగు చదవటం కష్ఠంగ వుంది. ఇది బాగుంది ప్రశాంతంగ.
ఎన్నొ సంవత్సరాల నుంచి నెట్ని చావగొడుతున్నా తెలుగు బ్లాగులు ఇన్ని వున్నయ్ అన్న విషయం ఈమధ్యే తెలిసింది. కళ్ళు తెరుచుకున్నయి
Post a Comment