Saturday, 8 December 2007

అన్నీ ఉన్న బిక్షగాళ్ళగా బ్రతక్కండి!

మనలో చాలామంది ’తీసుకోవటానికే’ అలవాటు పడిపోతారు.ఎదుటివ్యక్తి కురిపించే ప్రేమను తీసుకుంటారు.ఇతరులు అందించే ధన, వస్తు,సేవా సహాయాన్ని తీసుకుంటారు.ఇతరుల నుండి విజ్ఞానాన్ని గ్రహిస్తుంటారు.అయితే తీసుకోవడంలో కనిపించే ఆత్రుత ఇతరులకు ఇవ్వడంలో కనిపించదు.కోట్లాది రూపాయలు కూడబెట్టాలని పరుగులు తీస్తుంటారు.పోతూ పోతూ పాడెతో పాటు ఆ కోట్లని మూట గట్టుకుపోలేమన్న కనీసజ్ఞానం కూడా మనసుకు తట్టదు.సంపదగానీ, జ్ఞానంగానీ పంచుకుంటూ పోతేనేపెరుగుతుంటుంది.ఈ సృష్టిలో ఒక ప్రాధమిక నియమం ఉంది.ఏది ఇవ్వనిదే ఏది పొందలేము.ఉ.దా. మనము కొత్తబట్టలు ధరించాలంటే పాతబట్టలు పక్కనపెట్టాల్సిందే. కడుపునిండా తినాలంటే మలమూత్రాలు విసర్జించాల్సిందే. అలాగే డబ్బు,నాలెడ్జి కూడా! నాకు తెలిసిందే గొప్ప అని విర్రవీగుతూ ఇతరులకు తానోపెద్ద విజ్ఞానిగా ఫోజులు కొట్టేవారు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని స్వతహాగాపోగొట్టుకుంటారు.కారణం... అన్నీ తమకు తెలుసునన్న అహంకారమే.. వారిని కొత్త విషయాలు తెలుసుకోకుండా అడ్డుకుంటుంది. అంటే వారు తమకు తెలిసింది ఇతరులతో పంచు కోలేకపోతున్నారు.ఇతరుల నాలెడ్జిని పొందలేకపోతున్నారు. చివరకు ఏమవుతుంది.అపారమైన జ్ఞానసంపదలో అణువంతైననూ పొందకుండా బావిలో కప్పలా మిగిలిపోవడం తప్ప.ఇవ్వడంలో ఎంత తృప్తి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా?నాకు తెలిసిన నాలెడ్జ్‌ని పత్రిక ద్వారా నా పాఠకులతో పంచుకునేటప్పుడు నేను పొందే తృప్తిని కోటీష్వరులు కూడా పొందలేరు.నాకు తెలిసి నా బెస్ట్ నా ప్రియ పాఠకులకు అందిస్తున్నానన్న సంతృప్తికి మించి ఏమికావాలి! ఎవరికి వారు తమ తమ రంగాలలో, తాము చేసే వృత్తి ఉద్యోగాలలో, సామాజిక బంధాలలో ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగినంత సేవ,ఆనందం, చేయూత ఇవ్వగలిగితే ప్రపంచం ఆదర్శవంతం కాక మరేమవుతుంది.మీరు ఏమీ చేయనవసరంలేదు. కష్టాల్లో ఉన్నవారికి నాలుగు ధైర్య వచనాలు చెప్పండి. కుటుంబ సభ్యులతో కొట్లాటలకు బదులు సున్నితంగా వ్యవహరించండి. ఆర్ధికంగా సాయం కోరినవారికి మీకు తోచినంత..తిరిగి ఇస్తాడో లేదో అన్న సందేహం మాని సాయం చేయండి.తోటి వ్యక్తిని చూసి ఒక చిరునవ్వు నవ్వండి.ట్రాఫిక్ జామ్ అయితే మీవరకు మీరు అడ్డదారులు తొక్కకుండా బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి.తోటి వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వండి.ఇలాంటి చిన్న చిన్న చర్యలే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.అంతే తప్ప.. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇతరులకు ఎందుకివ్వాలి. నేనే ఎందుకు నవ్వాలి, వాడు ఎందుకు నవ్వవచ్చు కదా! నా నాలెడ్జ్ ఇతరులకు ఎందుకు చెప్పాలి అనుకుంటూ సణుక్కుంటూ కూర్చున్నామంటే మనం అన్నీ ఉండి జీవితాంతం "నేనేమీ ఇవ్వను,మీరే నాకు ఇవ్వండి" అంటూ బిక్షమెత్తుకునే బిక్షగాళ్ళమే అవుతాం.మీరూ బిక్షగాళ్ళగానే బాగుందంటే ఒకే. నో ప్రాబ్లం...

మీ నల్లమోతు శ్రీధర్.

3 వ్యాఖ్యలు:

cbrao

మంచి మాట.మనం ఇతరులకు ఎదైనా చెప్పాలంటే, తగినవిధంగా చదవాల్సుంటుంది. రచయిత ఏమైనా రాసినా, చెప్పినా పాఠకుడి తో పాటుగా రచయితకూ ప్రయోజనం.

జాన్‌హైడ్ కనుమూరి

ఇతరులతో పంచుకుంటున్నమంటే అనాందాన్ని, జ్ఞానాన్ని పదును పెడుతున్నట్టే

teresa

మంచి మాట చెప్పారు!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008