భక్తి తత్వం సంక్లిష్టం !
భగవధ్యానం, దేవాలయ దర్శనం, ఉపవాసాలు మేలు చేస్తాయని భావిస్తూ చాలామంది వాటిననుసరిస్తూ ఉంటారు. భగవధ్యానంలో భగవంతునిపై నిశ్చలంగా మనసు లగ్నం చేసి ధ్యానిస్తేనే అత్మసాక్షాత్కారమవుతుంది. ఊరికే గుడులు తిరిగినంత మాత్రాన, ఓ నమస్కారం పడేసి వచ్చినంత మాత్రాన ఫలితం శూన్యం. భక్తుడి దృక్కోణంలో చూస్తే భగవంతుడి రూపానికి ప్రాధాన్యత లేదు. కేవలం నిరూపమైన భగవత్ భావననే, భక్తితత్వాన్నే భక్తుడు మనసా వాచా కర్మణా కలిగి ఉండాలి. అయితే నిరాకారుడైన భగవంతుడిని ధ్యానించడం సాధారణ మానవుల వల్ల కాదు. అందువల్లే గుడుల్లో విగ్రహాలు ప్రతిష్టించి భగవంతుడికి ఓ రూపం ఇచ్చి ఆ రూపం పైనైనా భక్తుడు మనసు లగ్నం చేసేలా ఏర్పాటు చేసారు. కాని దేవాలయ దర్శనం కూడా ఈ రోజుల్లో అలంకారప్రాయమవుతోంది. దేవాలయాల్లో భగవత్ స్వరూపం ముందు అణువణువూ భక్తితో నిండిపోయి ఇహం మర్చిపోయే భక్తులు ఎంతమంది ఉన్నారు? ఆ కొద్ది సమయం పాటైనా మనల్నిమనం మర్చిపోకపోతే దేవాలయాలనెందుకు దర్శించడం? ఇకపోతే, కడుపు నిండితే మనసు నిండా ఆలోచనలు, కోరికలు ముప్పిరిగొంటాయి. ఖాళీ కడుపు ఏకాగ్రతతో ఎంతో అనుకూలిస్తుంది. భగవత్ ధ్యానంలో పూర్తి ఏకాగ్ర చిత్తంతో ఉండాలన్న తలంపుతోనే ఉపవాసం ఉండి దేవుడిని ధ్యానించాలని సంప్రదాయం పెట్టారు. కానిఇ దైవభక్తి కన్నా వళ్ళు తగ్గాలన్న కాంక్ష అధికంగా ఉండి ఉపవాసాలు చేస్తున్న నేటి రోజుల్లో ఇంకా భగవంతుడెక్కడ గుర్తుకొస్తాడు? భగవంతుడిని కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా కమర్షియల్ ఏంగిల్‍లో చూసినంత కాలం మన కోరికల సాఫల్యం కోసం కపట భక్తిని మనం అనుసరిస్తూనే ఉంటాం. ఆత్మ సాక్షాత్కారం మాత్రమే మన ప్రధానమైన లక్ష్యం అయినప్పుడు మాత్రమే నిజమైన భగవత్ భావనను మనం అనుభూతి చెందగలుగుతాం.
నల్లమోతు శ్రీధర్
0 వ్యాఖ్యలు:
Post a Comment