సాంకేతిక నిపుణులకు సాదర ఆహ్వానం
కంప్యూటర్ పై కూర్చున్నప్పుడు ఎన్నో సందేహాలు, సమస్యలు. అవి తీర్చాలంటే నిపుణులు కావాలి. వారిని ఎలా పట్టుకోవడం. కంప్యూటర్ వాడేవారందరు నిపుణులు కారుగా నాలాగా. నాకు వచ్చే ఎన్నో సమస్యలు, సందేహాలకు వీవెన్ కాని సుధాకర్ కాని ఓపికతో చెప్పేవారు. కాని నాకు అర్ధమవ్వడానికి కొంచం ఎక్కువ సమయం తీసుకునేది. అలాంటప్పుడు వాళ్ళే నా సిస్టంలోకొచ్చి ఆ ప్రాబ్లం తీర్చేస్తే బావుండు అనుకున్న సందర్భాలెన్నో. అది వీలు కాదుకదా.. కాని మూడు నెలల క్రింద శ్రీధర్ చెప్పిన Team Viewer పద్ధతిలో అది సాధ్యమే అనిపించింది. అంతవరకు పిక్చర్ crop చేయడం తెలీదు. కాని శ్రీధర్ ఈ కొత్త పద్ధతిలో ఒక్క రెండు నిమిషాలలో ఎలా చేయాలో చూపించాడు. కంప్యూటర్ వాడేవారందరికి ఎన్నో సందేహాలు, సమస్యలు రావడం సహజం. వాటన్నింటి గురించి నిపుణులతో అడిగి తెలుసుకోవడానికి పనికొచ్చే వేదిక "కంప్యూటర్ ఎరా కూడలి". శ్రీధర్ ఆలోచన, వీవెన్ కృషి కలిసి ఇది ఏర్పడింది. ప్రారంభించిన మొదటి రోజే ఎంతొమంది సమస్యలు తీర్చబడ్డాయి. నేను కనీసం ఆరుగురికి ఆ రోజు తెలుగులో రాయడం ఎలాగో చెప్పాను. వాళ్ళకు ఎంత సంతోషమో. ఎంతోమంది తెలుగు వాళ్ళకు కంప్యూటర్‌లో తెలుగులో రాయడం తెలీదు. అలాగని ఇంగ్లీషులో మాట్లాడుకోలేక తెలుగునే ఇంగ్లీషులో రాసుకుంటున్నారు. కాని ఇప్పుడు వాళ్ళు బరహ గురించి తెలుసుకుని హాయిగా తెలుగులో రాసుకోవడం మొదలెట్టారు. సాంకేతిక నిపుణులు, అంతో కొంతో కంప్యూటర్ ఉపయోగంపై అవగాహన ఉన్నవాళ్ళు ఈ చాట్ రూం ని ఉపయోగించుకోవాలి. ఇందుకు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పని లేదు. మీకు వీలైన సమయంలోగాని, లేదా చాట్ రూం తెరిచి ఉంచుకుని , మీ పని చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారికి సహాయం చేయవచ్చు. ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు, లే్దా అర్ధం కానప్పుడు TeamViewer తో వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి అసలు సమస్యను చిటికెలో సాల్వ్ చేయవచ్చు. రోజు వీవెన్, శ్రీధర్ చేసేదే. ఇందులో ప్రసాద్‌గారు, శ్రీనివాస్‌గారు, మొదలైన వారు తమ వంతు సాయం తమకు వీలైన సమయంలో చేస్తూనే ఉన్నారు. నేనైతే ఓ పదిమందికి తెలుగు రాయడం నేర్పించి ఉండవచ్చు. మనకొచ్చింది అంతేగా.. తమ సమస్యలతో ఈ చాట్ రూంకి వచ్చి అవి నిమిషాల్లో తీర్చుకుని , వాళ్ళు కూడా మిగతావాళ్ళకి సహాయం చెయ్యడానికి పూనుకున్నవాళ్ళు గిరిచంద్, సీతారాం. ఇలాగే ఇంకా ఎందరో సాంకేతిక నిపుణులు కాస్త సమయం వెచ్చించి ఈ చాట్ రూంలో సహాయం చెయ్యండి. దీనికోసం TeamViewer మీ సిస్టమ్‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. వేరేవాళ్ళను మీ సిస్టంలోకి అనుమతించడం అనేది మీ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. ప్రమాదమేమీ లేదు. పని పూర్తవ్వగానే కనెక్షన్ కట్ చేయొచ్చు. వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఈ రూమ్ లో తరచూ కొద్ది సమయం గడుపుతూ... తమ నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా సహాయపడండి. మంటనక్కలో నాకు వచ్చిన తెలుగు ఫాంట్ సమస్యని వీవెన్ Team Viewer సాయంతో ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగాడు. నాలాటి సమస్య ఇంక ఎంతోమందికి వచ్చింది. నేను ఇదే పద్ధతిని వాళ్ళకూ చెప్పాను.
నాకు తెలిసి ఇంతవరకు కంప్యూటర్ కూడలి చాట్‌లో పరిష్కరించబడిన సమస్యలు...
డ్రైవ్ పై డబుల్ క్లిక్ చేస్తుంటే డ్రైవ్ కంటెంట్స్ చూపించబడడానికి బదులు సేర్చ్ బాక్స్ వస్తోందని ఒకతను డౌట్ అడిగితే నేరుగా అతని సిస్టమ్ లోకే టీమ్ వ్యూయర్ ద్వారా ప్రవేశించి రన్ కమాండ్ బాక్స్ లో చిన్న కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా పరిష్కరించడం జరిగింది. అలాగే టీమ్ వ్యూయర్ ద్వారా ఇన్ స్ర్కిప్ట్, బరహ, మాడ్యులర్, ఏపిల్ యూనీకోడ్ లేఅవుట్లని కాన్ఫిగర్ చేసిపెట్టడం దాదాపు 15 మంది వరకూ చేయడం జరిగింది. ఇప్పుడు వారందరూ స్వచ్చమైన తెలుగులో టైప్ చేయగలుగుతున్నారు. Core2Duo, DualCoreలకు మధ్య వ్యత్యాసం ఏమిటి, Win98, XPలకు మధ్య తేడా, వర్డ్ లో బరహతో తెలుగు రావట్లేదు వంటి అనేక సందేహాలకు అక్కడిక్కడే సమాధానాలు చెప్పడం జరిగింది.
రండి ,, మీకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయపడండి..
1 వ్యాఖ్యలు:
chaalaa chakkaga clear ga raasaaru.Very good
Post a Comment