Monday 4 February 2008

ఇదీ పోలిక అంటే … !

విచిత్రమేమిటో కాని ఒక విజయం లభిస్తే.. ఆ విజయం అందించే మాధుర్యం కన్నా విఫలమైన వారితో పోల్చుకోవడం ద్వారా పొందే ఆనందమే ఎక్కువ ఉంటుంది మనకు. ఏదైనా వైఫల్యం ఎదురైనా అంతే.. వైఫల్యం చిన్నదే అయినా ఇతరులతో పోల్చుకుని కుళ్ళి కుళ్ళి దుఖపడితే కానీ ఊరట పొందదు మనసు ! ప్రతీ దానికీ ఇతరులతొ పోల్చుకోవడం ద్వారా భావోద్వేగాలను ఒంటరిగా ఆస్వాదించగలిగిన ధైర్యం, అదృష్టం చాలామంది కోల్పోతుంటారు. దాంతో అసలైన సంఘటన మిగిల్చిన అనుభూతులు చెరిగిప్యి పోల్చుకోవడం ద్వారా
మనసులో పాతుకుపోయే సంకుచిత భావాలు ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఇవి క్రమేపీ మన వ్యక్తిత్వాన్ని పతనం చేస్త్తుంటాయి. ఏ ఒడిదుడుకులూ లేనంత కాలం "నేనే రాజుని" అంటుంది మన బుద్ధి. చూసే చూపులోనూ, నడిచే నడకలొనూ, మాటలోనూ మిడిసిపాటు కవర్ చేసుకున్నా కానవస్తూనే ఉంటుంది. ఎవర్నీ లెక్కచేయం ! మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లు పురుగుల కన్నా హీనంగా కన్పిస్తుంటారు. కన్పించిన ప్రతీ వాళ్లకీ వెధవ సలహాలు ఇవ్వడమే.. ఏదో కారణ జన్ములమైనట్లు ! అంతలొ అనుభవించిన భోగాలు చాలు కానీ కాస్త ఈ హాట్ రుచి కూడా రుచి చూడు నరుడా" అంటూ కొన్ని కష్టాలు మనపై కుమ్మరిస్తాడు భగవంతుడు. కష్టం అలా తలుపు తట్టిందో లేదొ "చూశావా కొద్దిగా జాగ్రత్తగా ఉండమంటే ఉన్నావా, చూడు ఇపుడు ఏం జరిగిందో" అంటూ బుద్ధి తన తప్పేమీ లేనట్లు మనల్ని నిందించడం మొదలు పెడుతుంది.

అంతటితో ఆగకుండా" అయినా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని కష్టాలన్నీ నీకే రావాలా..? ఆ ప్రక్కనున్న సుబ్బారావుని చూడూ , ఎలా హాయిగా ఉన్నాడో ! నువ్వే ఇలా పడి ఏడవాల్సి వస్తోంది. ఇక నీ జన్మ వ్యర్ధం. ఏ హుస్సేన్ సాగర్‍లో పడి చావరాదూ" అంటూ నిరంతరం మనసుతో యుద్ధం చేస్తుంటుంది తప్పుడు బుద్ధి. ఇలా డ్రామా వేషగాళ్ళ మాదిరిగా లోపల కష్టాలు దాచుకుని పైకి నవ్వుతూ కన్పించే ప్రతీ ఒక్కరినీ వారెంతో ఆనందంతొ ఉన్నారని నిరంతరం పోల్చుకుంటూ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది అదే బుద్ధి. ఇలా కష్టాల్లొ ఉన్నప్పుడు సుఖాలు అనుభవిస్తున్న వారితో పోల్చుకుంటూ చివరకు మనం రెండింటినీ సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞతని కోల్పోతాం. ఒక్కసారి కష్టాల్లొ ఉన్నప్పుడు మనకన్నా పీకల్లోతు కష్టాల్లొ ఉన్నవారిని తలుచుకోండి. ఎంత మెరుగైన స్థితిలో ఉన్నామన్న ధైర్యం కలుగుతుందో ? అదే సుఖాలనుభవించేటప్పుడు మనకంటే కోట్ల రెట్లు ఉన్నతంగా ఉన్న ఏ బిల్‍గేట్స్ తోనో పోల్చి చూడండి. కనీసం మనం సాధించింది అణుమాత్రమైనా ఉందేమో అర్ధమవుతుంది. మీ విజయాలను, వైఫల్యాలను ఇతరులతో పోల్చుకోనిదే నిద్రపట్టనపుడు ఆ పోల్చుకునే విధానాన్నయినా ఇలా పాజిటివ్‍గా చేయండి !.

నల్లమోతు శ్రీధర్.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008