Thursday, March 27, 2008

సెల్లాయనమః


ఈ రోజు 27.3.08 ఆంధ్ర జ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసం.

సెల్లాయనమ
పూర్వం సెల్వమణి అనే ఒక భక్తుడు శ్రీమహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేసెను. అంతట శ్రీహరి ప్రత్యక్షమై " భక్తా! నీ తపమునకు సంతసించితిని. ఏదైనా వరము కోరుకొనుము'' అని చెప్పెను. అప్పుడు అతగాడు " దేవా! నాకు ఎటువంటి మోహము లేదు. సదా నీ హృదయ పీఠముపై నిలచి ఉండేలా వరమివ్వు'' అన్నాడు. అప్పుడు విష్ణువు " భక్తా! నా హృదయ పీఠం ఖాళీగా లేదు కదా. అది నా సహచరి మహాలక్ష్మి నివాస పీఠమాయె. వేరే ఏదైనా వరం కోరుకొనుము'' అనెను. అప్పుడు సెల్వమణి " స్వామి! నారాయణుడి హృదయస్థానము కాకున్నను, కనీసం నరుని హృదయ స్థానముపై ఉండే వరమునిమ్ము'' అని కోరాడు.

" అటులనే భక్తా! కలియుగములో నరుడు తన అపార మేధా సంపత్తితో ఒక మాటాడు యంత్రమును కనుగొని, దానికి సెల్‌ఫోన్‌ అని నామకరణము చేసి అది ఎల్లప్పుడు తన హృదయమునకు దగ్గరగా జేబులో ఉంచుకొనును. అది నువ్వే కనక అప్పటినుండి నీకు నరుని హృదయపీఠముపై స్థానం లభించును'' అని వరమిచ్చాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. అయితే సెల్‌ఫోన్‌ కొన్నవాళ్లందరూ సెల్వమణిని ప్రార్థిస్తూ చేయాల్సిన వ్రతం ఒకటుంది. ప్రతి ఒక్కరు కొత్త సెల్‌ ఫోన్‌ కొన్నప్పుడు ఈ వ్రతం తప్పకుండా చేయాలి. ముందుగా ఒక పీటపై కొత్త గుడ్డ పరిచి వెండి పళ్లెంలో కొత్త సెల్లును ఉంచి మీ శక్తికొలది రీచార్జ్‌ కూపన్లు ఉంచి ఐదు రకాల పూలు, పండ్లు, ప్రసాదాలు పెట్టి పూజ చేయాలి. మొదట సంకల్పం చెప్పుకోండి ఇలా... ఓమ్‌! సెల్లాయనమః రింగ్‌ టోన్‌ ఘల్లాయనమః సెల్లుంటే థ్రిల్లాయనమః బిల్లు చూస్తే ఝల్లాయనమః అది కట్టేసరికి జేబుకు చిల్లాయనమః ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ సెల్‌ఫోన్‌కు వైరస్‌ రాకుండా, దొంగలు ఎత్తుకుపోకుండా, రాంగ్‌ నెంబర్లు రాకుండా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ పూజ శాస్త్రోక్తంగా జరిపించాలి. ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి.

ఆ తర్వాత ఈ సెల్‌ఫోన్‌ వ్రతం చేస్తానని లాభపడిన ఒక వ్యక్తి కథ తప్పనిసరిగా వినాలి. ( ఎక్కువ కథలైతే మీకు వినే ఓపిక ఉండదుగా అందుకే ఒక్కటి చాలు). ఈ వ్రతం చేసేవారు వ్రత విధానం పూర్తిగా పాటించాలి. లేకుంటే మీ సెల్‌ఫోన్‌ను ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. సిమ్‌ మార్చి వాడుకోవచ్చు. మీకు నిత్యం ప్రకటనదారుల కాల్స్‌, మెసేజీలు రావొచ్చు లేదా మీ సెల్లును మీరే సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో కొనాల్సి రావొచ్చు. జాగ్రత్త మరి. ఒకానొక పట్టణములో కవిత అనే యువతి ఇంజనీరింగ్‌ చదువుతున్నది. ఎన్నిసార్లు అడిగినా ఆమె తండ్రి ఆమెకి సెల్‌ఫోన్‌ కొనివ్వలేదు. అది కొనిస్తే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుందని. కవిత స్నేహితులందరికి సెల్‌ఫోన్‌ ఉంది. తనకే లేదని బెంగగా ఉండేది. పెంపుడు జంతువులు సైతం ఆమెను వెక్కిరించేవి. ఏం చేయాలో తోచని కవిత ఈ వ్రతం గురించి తెలుసుకుని "దేవుడా! త్వరగా నాకు సెల్‌ఫోన్‌ వచ్చేలా చూడు తండ్రీ. వెంటనే ఈ వ్రతం చేసుకుంటాను'' అని మొక్కుకుంది.
ఇది జరిగిన పది రోజులకే అమెరికాలో ఉన్న కవిత అన్నయ్య ఆమె పుట్టినరోజుకు కొత్త సెల్‌ఫోన్‌ పంపాడు. కొడుకు పంపాడని తండ్రి కూడా అభ్యంతరం చెప్పలేదు. సంతోషంతో కవిత ఒక హోటల్‌లో ఈ వ్రతాన్ని జరుపుకుంది మరికొందరు స్నేహితులను కూడా పిలిచి (ఎలాగూ వాళ్లకు పార్టీ ఇవ్వాలిగా ). కథ సమాప్తం. ఈ కథ విన్నవారికి సకల శుభములు చేకూరి సెల్‌ లేనివారికి కొత్త సెల్‌, ఉన్నవారికి మరొక సెల్‌ ప్రాప్తించును. చివరగా కొత్త సెల్లును ఒక వెండి పళ్ళెంలో ఉంచి భక్తితో కర్పూరం వెలిగించి దానికి శక్తి కొలదీ రీచార్జి కూపన్లను నైవేద్యముగా సమర్పించి ఆ సెల్లును తమ జేబులో పెట్టుకుని వచ్చినవారికి పండ్లతో పాటు రీచార్జి కూపన్లు వాయనమిచ్చినచో సకల ఐశ్వర్యములు సిద్దించును. మీ సెల్లు మూలంగా మీకు, ఇతరులకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండుగాక ! -జ్యోతి వలబోజు

7 వ్యాఖ్యలు:

జాన్‌హైడ్ కనుమూరి

jyathigaaru
abhinaMdanalu

కొత్త

సెల్లాయ నమ .. జేబు చిల్లాయ నమ .. వొళ్ళు గుల్లాయ నమ .. బాగుంది ..

రాఘవ

బావుంది, బాగా వ్రాసారు. ప్రాసలు అదుర్స్. కథ యింకా అదుర్స్. వ్రతం యింకా యింకా అదుర్స్.

రాధిక

వ్రతం చాలా బాగుందండి.అభినందనలు.కానీ ఇలాంటిదే మీ రచనల్లో ఒకటి చదివినట్టు గుర్తు.మీకేమన్న గుర్తుందా?

జ్యోతి

రాధిక
నిజమే, ఏడాది క్రిందా నా బ్లాగులో రాసాను. అది అంతర్జాలంలో విహారం చేసి నాకు కూడా రెండు సార్లు వచ్చింది. ఇంకా ఒకసారి రేడియోలో కూడా చదివారు. సెల్ ఫోన్ అప్పుడూ విలాస వస్తువు. కాని ఇప్పుడది నిత్యావసర వస్తువైపోయింది. అందుకే ఈ వ్రత విధానం మరి కొంత వివరంగా చేసి ఆంధ్రజ్యోతికి పంపాను.

ఒంటరి చుక్క(వెంకట్)

ఆ వ్రతం మీరు చేసేవుంటారుకదా నాకు ఒక నాలుగు రీచార్జ్ వాయనాలు పంపకూడదండి.

jaya simha

cellphone vratham chala bagundi time vunten nenu chesthaa...............jayasimha

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008