వ్యామోహానికి అధారం అహంకారం....
"నేను" ఎవరైనా తమ గురించి చెప్పుకునేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రతీ వాక్యంలోనూ ప్రస్తావించే పదం ఇది. వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు గడించేకొద్దీ, సంపాదన, సర్కిల్ పెరిగేకొద్దీ "నేను" అనే భావనకు ప్రతి వ్యక్తి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకుంటూ అది నిరంతరం చెక్కుచెదరకుండా కాపాడుకోవడంలోనే చాలామంది జీవితాలు తెల్లారుతూ ఉంటాయి. పుట్టేటప్పుడు ఏమీ కాని తను, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోని తను మధ్యలో తాను పాత్రల్లా పోషించే హోదాలపై మమకారం పంచుకుంటూ తాను పోషించే హోదాలపై మమకారం పెంచుకుంటూ తాను పోషించే విభిన్న పాత్రలే తాననుకుంటూ ఓ రకమైన మాయలో కూరుకుపోవడం జరుగుతుంది.
చాలామంది ఇప్పటికీ తమ హోదాలను ఆసారాగా చేసుకుని డాబూ దర్పం ఒలకపోస్తే తప్ప మానసిక తృప్తి పొందనంతగా ఆయా పాత్రల్లో మమేకం అయిపోతున్నారంటే తమ నుండి తామూ విడిపడి ఎంత దూరం తాము పోషించే పాత్రల్లో లీనమై పయనిస్తున్నారో అర్ధమవుతుంది. "నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ... నేను ఎడిటర్ ని .. నేను కన్సల్టెంట్ ని.. " అంటూ మన గురించి మనం చెప్పుకునేటప్పుడు కూడా అందులో మనం పోషించే పాత్ర పట్ల అటాచ్ మెంట్ స్పష్టంగా కన్పిస్తుంది. ఇలా నేను (అహం ) అనే భావనకు.. నేను ఫలానా (ఆకారం) అనే తత్త్వం ఆపాదించుకుని అహంకారం పెంచుకుంటున్నాం. నేను అనే తత్వానికీ .. మనం ఏదైతే మనం అని అనుకుంటున్నామో ఆ ఆకారానికి ఎవరు ఎ రూపంలో బురద జల్లడానికి ప్రయత్నించినా అహంకారం దెబ్బ తింటుంది. మనసు జీర్ణించుకోదు . మనం మనది అనుకుంటున్న శరీరమే మూడుపూట్లా తిండి పెడితే కానీ, సరైన విశ్రాంతి తీసుకుంటే కానీ మన మాట వినదే ! ఇలా నిరంతరం అద్దె చెల్లిస్తూ పోషిస్తున్న మన శరీరమే అద్దె కొంప అయినప్పుడు మనం "నేను ఫలానా" అని విర్రవీగుతున్న హొదాలన్నీ ఎంత ఆధారరహితమైనవో కదా! నిన్న లేనిదీ రేపు లేనిదీ ఈ రోజు మాత్రమే ఉన్నదాన్నే మాయ అంటారు. ఎంత ప్రయత్నించినా ఈ మాయలో పడకుండా ఎవరూ ఉండలేరు.
ఇది వేదాంతము కాదు. అక్షర సత్యం. ప్రాక్టికల్ గా పరిశీలించి చూడాలంటే మీరు ఉద్యోగిగా, భర్తగా, భార్యగా, అన్నగా, చెల్లిగా, తల్లిగా, తండ్రిగా ఈరోజు మనం పోషిస్తున్న విభిన్న పాత్రల నుండి విడిపడి చూస్తే ఆ ఒంటరితనాన్ని మనం భరించగలమేమో చూడండి. భరించలేం! కారణం మనం మనం పోషించే పాత్రల పట్ల అంత అటాచ్ మెంట్ సృష్టించుకుంటున్నాము. అలాగే ఆ పాత్రలను ఆధారంగా చేసుకుని మనకంటూ మనం ఓ ప్రత్యేక వ్యక్తులుగా ముద్రని వేసుకుంటున్నాము . చాలామంది అహంకారం అంటే బయటకు ప్రకటించేదే అనుకుంటారు. మనం బయటకు ప్రకటించకుండానే మనలో లోలోన పెరుకుపోతున్న ఈ తరహా అహంకారాన్ని అధిగామించకపోతే జీవితం పట్ల వ్యామోహం పెరిగిపోతుంది.
నల్లమోతు శ్రీధర్
0 వ్యాఖ్యలు:
Post a Comment