Tuesday, 4 March 2008

కనబడుట లేదు ...





మార్చి 3 నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నవ్య విభాగంలో ప్రచురించబడిన ఈ సరదా వ్యాసం. ఇందులో మొదటిభాగం గతంలో పొద్దులో ప్రచురితమైంది. అనామకులకు ముందస్తు హెచ్చరిక. ఇది నా స్వంత రచన.



అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గతవారం రోజుల నుండి మా శ్రీవారు కనబడడం లేదు. గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి 'బట్టతలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి' అని, ఇంకా అదేదో సినిమా చూసి 'నాకూ ఆదివారం సెలవు కావాలి' అని అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్లిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్లారో ఆచూకీ తెలీటం లేదు. ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడం వల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.
l. ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. ఏంటో మరి?
2. ఎప్పుడైనా వంట బాగా లేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం 'బా గుంది' అనరు. కామ్‌గా తినేసి వెళ్లిపోతారు.
3. నా పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటివి ఆయనకు గుర్తుండవు. పనీ పాటా లేని నాలాంటి వారే 'సెంటిమెంటల్‌ ఫూల్స్‌'గా ఉంటారని ఆయన అభిప్రాయం.
4. స్నేహితులతో ఎన్ని గంటలైనా సరదాగా మాట్లాడగలరు, భార్యతో మాత్రం పది నిమిషాలు మాట్లాడడానికి కూడా టైంలేనంత బిజీ మనిషి
5. నీకీ చీర బావుంది, నువ్వంటే ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావులాంటి అనవసరపు మాటలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.
6. నేను చేసిన పలావ్‌ నచ్చదు కాని పక్కింటోళ్లు ఇచ్చిన పచ్చగడ్డి మాత్రం పరమాన్నంలా మిగల్చకుండా తినేస్తారు.
7. కష్టపడి పది రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. ఇంట్లో తిని కూర్చుని, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో సొల్లు కబుర్లేసుకునే వారికి ఏం తెలుస్తుంది లాంటి డైలాగులు రోజుకొకసారైనా అంటుంటారు.

మొత్తం మీద "తినడానికి''..."పడుకోవడానికి'' మాత్రమే ఇల్లు ఉన్న ది అన్నట్టు ప్రవర్తిస్తారు. పై లక్షణాలున్న వ్యక్తి కనబడితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి ప్లీజ్‌. మీకు రానూపోనూ ఆటో చార్జీలు కాని బస్‌ చార్జీలు కాని ఇస్తాను.

ఇట్లు వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు హైదరాబాద్‌



అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ దీక్షితులండి. ఎవరా అనుకుంటున్నారా? అదేనండి.. నెలక్రితం 'కనపడుట లేదు' అని మా ఆవిడ వీరవెంకట అలమేలు మంగతాయారుప్రకటన ఇచ్చింది కదా. ఆ శాల్తీని నేనేనండి. ఇంటికొచ్చేసానండి. రాక చస్తానా. అయినా ఎవడా అడ్డ గాడిద అన్నది ఆడది ఇల్లు దాటితే మంచిది కాదు, బయటికెళ్లి బతకలేదు అని. నిజానికి పెళ్లైన మగాడు ఇల్లొదిలి వెళితే అస్సలు బతకలేడండి. నా స్వానుభవంతో చెబుతున్నా. ఇంట్లో మనశ్శాంతి లేదని వెళ్లిపోతే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి. మా ఆవిడ చెప్పిన విషయాలు గురించిన నిజాలు, నేను పడ్డ కష్టాలు చెప్పుకుందామని ఇలా వచ్చాను. కాస్త ఊరట కలుగుతుందని.
1. నేను ఇంట్లో సీరియస్‌గా ఉంటాను అంటుంది. కాని తను ఎప్పుడు చూసినా టీవీలో చెత్త సీరియల్స్‌ చూస్తూ అవి మా ఇంట్లో
జరుగుతున్నంతగా లీనమైపోతుంది. ఎవరితో మాట్లాడదు. పైగా వాటి గురించి ఇరుగుపొరుగమ్మలతో చర్చలు.
2. ఏదో పెళ్లయిన కొత్తలో వండిన కూరలు బావున్నాయంటే ఇక ప్రతీ రోజూ చెప్పాలా.అసలే ఆఫీసుకెళ్లే టెన్షన్‌.వంట బాగోకుంటే
కోపంరాదా మీరే చెప్పండి.
3. తన పుట్టిన రోజు, పెళ్లి రోజు నాకెందుకు గుర్తుండవు.నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ప్రతి సంవత్సరం జేబుకు
చిల్లుపెట్టుకుని మరీ గుర్తు చేసుకోవాలా.పైగా వాళ్ల మొగుడు ఖరీదైన చీర కొన్నాడు..వీళ్లాయన ఇంత ఖరీదు బహుమతి
ఇచ్చాడు అని వాళ్లతో పోల్చుకుని నా ప్రేమను బేరీజు వేయడం బాగుందా..?
4. నా స్నేహితులతో మాట్లాడతాను తనతో మాట్లాడను అంటుంది కదా, ఎప్పుడన్నా కాస్త సరసంగా మాట్లాడదామని పలకరిస్తే
చాలు..వాళ్లవి కొన్నారు,ఇవి కొన్నారు..మనమెప్పుడు కొందామంటూ నస పెడుతుంది.మీరే ఆలోచించండి ఇంట్లో ఉండ బుద్దేస్తుందా?
5. పెళ్లై పదేళ్లయ్యింది. ఇంకా రుచిగా వండడం రాదు.పుస్తకంలోనో, టీవీలోనో చూసి ప్రయోగాలు చేస్తుంది.నేనూ మనిషినే కదా?

6. మహిళా మండలి మీటింగుల్లో పడి ఇంటివిషయమే పట్టించుకోదు.సరుకులెన్ని తెచ్చిచ్చినా అన్నీదుబారాగా వాడేస్తుంది.అందుకే
సొల్లు కబుర్లు చెపుతావు..డబ్బు విలువ తెలియదన్నాను.తప్పా.. చెప్పండి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్నట్టుండి ఒక రోజు వచ్చి ఏదో పేపర్‌ కటింగ్‌ తెచ్చి ఏవండి మీరు కూడా బట్ట తల మీద జుట్టు
మొలిపించుకోండి అంటూ గొంతెమ్మ కోరికొకటి కోరింది. పైగా జస్ట్‌ పాతిక వేలంట అంటుంది. మళ్లీ ఒకరోజు ఏదో సినిమా చూసొచ్చి.. నాకూ ఆదివారం సెలవు కావాలి.. ఇంట్లో పనంతా మీరే చేయాలి. ఇది మా కాలనీ మహిళా మండలి నిర్ణయం అని తెగేసి చెప్పింది. ఏదని భరించను.. కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఇల్లొదిలి వెళ్లిపోయా. అయినా ప్రశాంతంగా బతకనిచ్చిందా... పేపర్లో ప్రకటన ఇచ్చి నా బ్రతుకు బజారు పాలు చేసింది. అది చూసి నాకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి పెళ్లాం మా వాడికి వార్నింగ్‌ ఇచ్చింది. నన్ను పంపేయమని లేదా వాడిని కూడా నాతో పాటు బయటికెళ్లమని. మా బాస్‌ పిలిచి నా జీతం కూడా మా ఆవిడ తీసుకెళ్లింది కాబట్టి బుద్ధిగా ఇంటికెళ్లమని సలహా ఇచ్చాడు. మా అమ్మా వాళ్లకి ఫోన్‌ చేస్తే వాళ్లూ నన్నే తిట్టారు. నాకే వేరే దిక్కూ దివాణం లేక చచ్చినట్టు ఇంటికొచ్చా. పాపం చెప్పొద్ద్దూ తాయారు నన్ను చూసి ఏడ్చేసింది. ఏవండీ మళ్లీ ఎక్కడికీ వెళ్లొద్దు, మీరు చెప్పినట్టే వింటాను అని. అది కూడా ఆదివారం వరకే. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఛీ ఎదవ బ్రతుకు... అయినా ఆ దేవుడిననాలి మగాడై ఉండి కూడా నన్ను మగాడిగా పుట్టించి ఇన్ని కష్టాలపాలు చేసినందుకు.

ఇట్లు మీ సత్యనారాయణ దీక్షితులు

14 వ్యాఖ్యలు:

బ్లాగాగ్ని

చాలా బాగుంది. మంచి హాస్యరసం పండించారు జ్యోతిగారూ. చూడబోతే మీరు అనామకులకు మరీ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగావుంది. అంత అనవసరం అనుకుంటా.

babu

jyothi garu, very well written

oremuna

ఇరగ! ఇలాంటివి మరిన్ని వ్రాయడానికి ట్రై చెయ్యండి.

Anonymous

పినిశెట్టి గారి బొమ్మలతో సోమవారం సరదాగా బాగుంది.
మీరు ఇది వరలో రాసిన "శ్రీవారి విచిత్ర అలవాట్లు", "పడ్డానండి ప్రేమలో" అనే టపాలు చదివినప్పుడు నేటి యువ జంటలు కూడ ఇవి చదివి - వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని గ్రహించగలైగితే ఎంత బాగుండును.

"సరిహద్దుకిరువైపుల" లోని పాత్ర కూడ మీ టపాలు చదివుంటే - బహుశ "ఆమె" - ""నాకు డైవోర్స్ కావాలి." అని అడిగి ఉండేది కాదేమో!

ముణిమానిక్యం గారి "కాంతం" కధలు, "పురాణం సీత" స్థాయికి, మీ రచనలు ఎదగాలి.

విష్ యూ ఆల్‌ ది బెస్ట్!!!

krishna rao jallipalli

చాలా బాగుంది. మంచి హాస్యరసం పండించారు జ్యోతిగారూ.
jyothi garu, very well written,
ఇరగ! ఇలాంటివి మరిన్ని వ్రాయడానికి ట్రై చెయ్యండి
ముణిమానిక్యం గారి "కాంతం" కధలు, "పురాణం సీత" స్థాయికి, మీ రచనలు ఎదగాలి.
పినిశెట్టి గారి బొమ్మలతో సోమవారం సరదాగా బాగుంది.
మీరు ఇది వరలో రాసిన "శ్రీవారి విచిత్ర అలవాట్లు", "పడ్డానండి ప్రేమలో" అనే టపాలు చదివినప్పుడు నేటి యువ జంటలు కూడ ఇవి చదివి - వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని గ్రహించగలైగితే ఎంత బాగుండును.
విష్ యూ ఆల్‌ ది బెస్ట్!!!
(భలే భలే వెరైటీ గా comments ని కూడా కాపీ కొట్టాను కదూ... కాపీ రయిట్ .. అంటే కాపీ కొట్టే హక్కు అన్నమాట .. నాదే)

Raghuram

చాల బాగా నడిపించారండి.

Anonymous

జ్యోతి గారూ, బొమ్మా,బొరుసుల్లో ఇద్దరిమీదా సానుభూతి వచ్చే లా చాలా బాగా వ్రాశారు..సూపర్.

త్రివిక్రమ్ Trivikram

వావ్!

జ్యోతక్కా ఈజ్ గ్రేట్!!

ఇలాగే మరిన్ని సరదా రచనలు, వెరైటీ వంటకాల రెసిపీలతో అఖిలాంధ్ర పాఠకులను అలరించాలని నా కోరిక. Health is Wealth బ్లాగును ఇప్పుడే చూస్తున్నాను. మంచి ప్రయత్నం.

జ్యోతి

బ్లాగాగ్ని గారు,
అనామకుల విషయంలో నాకున్న అవినాభావం అలాగే ఉందండి.అందుకే చెప్పకతప్పలేదు. ఐనా ఇప్పుడా బాధ లేదు.అనామకులకు దారి మూసేసా కదా!

బాబుగారు, కిరణ్, నెటిజన్ గారు, థాంక్స్.
ఈ వ్యాసాలు రాసేటప్పుడు సరదాగానే రాసా. కాని పేపర్లో బొమ్మలతో చూస్తుంటే నాకే నవ్వాగలేదు.

కృష్ణారావుగారు,
కామెంట్లని కూడా ఎంత ధైర్యంగా కాపీ కొట్టారండి :)

త్రివిక్రమా!!

ఎన్ని రోజులకు నీ దర్శనం. నా బ్లాగు ధన్యమైపోయింది . నీ కామెంటుతో. కాని థాంక్స్.

శ్రీనివాస్ పప్పు

సూపరహో అద్దరకొట్టేహారంతే(భలే...అనుభవం మీద రాసారా హేవిటీ)

పరిమళం

:) :)

నాగప్రసాద్

>>"మా బాస్‌ పిలిచి నా జీతం కూడా మా ఆవిడ తీసుకెళ్లింది కాబట్టి బుద్ధిగా ఇంటికెళ్లమని సలహా ఇచ్చాడు."

హిహిహి ఇది 1980 కాలంలో ఆలోచన. ఇప్పుడు జీతం నేరుగా ఆన్‌లైన్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది కాబట్టి, భర్త జీతం భార్య ఎత్తికెళ్ళిపోతుందన్న బెంగలేదు. కాబట్టి, భార్య పెట్టే చిత్ర హింసలను తప్పించుకోవడానికి ధైర్యంగా ఇంటి నుంచి జంపైపోవచ్చు. :)))

ఇక బయటి తిండి గురించి నో ప్రాబ్లెమ్. కావల్సినన్ని వెరైటీలు దొరుకుతాయి. :))

పేపర్లో ప్రకటన ఇవ్వడం కూడా ఓల్డ్ ఫ్యాషన్. టీవీ9 వాడికి చెప్పుకుంటే సరి. రోజుకు స్ర్కోలింగ్‌‍ల మీద స్క్రోలింగ్‌లు. ఫ్రీ పబ్లిసిటీ. :))

ఇక వాళ్లకు కొనాల్సిన చీరలు, నగలు గురించి. ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి కావల్సినంత గీకేస్కోండి అని చెబితే చాలు. బిల్లు వచ్చాక నెల నెలా ఎంత EMI కడుతోంది చెప్పితే (నటిస్తూ), ఇక జీవితంలో మళ్ళీ గొంతెమ్మ కోరికలు కోరరు. :))

(మీరు పేపర్లో రాసింది సరదాకి కాబట్టి, నా వ్యాఖ్య కూడా సరదాగా రాసినదే. :-) ))

Apparao

చాలా బాగా రాసారండీ :)

Ennela

hahahaha...taayaaru gaariki naa santaapam..deekshitulu gaariki pragaadha santaapam...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008