ఎంత గొప్ప జీవితం !!
రాళ్ళూ రప్పల్లా మనుషులం కూడా ప్రాణం లేని శిలలమనుకుందాం కాసేపు ! ఎలాంటి అనుబంధాలు, అనుభవాలు, భావోద్వేగాలు, ఆప్యానురాగాలు లేని మొండి శిలల్లా జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందన్నది ఓసారి ఆలోచించండి. కానీ ఇప్పుడు మనం జీవితంలో ఆనందాలన్నింటినీ దూరం చేసుకుంటూ మొండి శిలల్లాగే బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. ప్రాణం మనిషికి జీవితాన్ని ప్రసాదిస్తే.. భావోద్వేగాలు, మానవత్వం, ప్రేమ, ఆప్యాయతలనే రంగులతో ఆ జీవితాన్ని మనం అందమైన చిత్రంగా కాన్వస్‌పై మలుచుకోవాలి. మెటీరియలిజం అనే భావన ఇటీవలి కాలంలో బాగా తలకెక్కించుకుంటున్నాం. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనుషులు దగ్గరైనా , దూరమైనా ప్రతీదాన్ని విశ్లేషిస్తూ లాజిక్‌ని వెదికి పట్టుకుని మనల్ని మనం స్థిరపరుచుకుంటూ ఎమోషన్స్ ని లోపలే అణిచేసుకుంటూ ఎంతో గంభీరంగా హుందాతనం ప్రదర్సిస్తున్నాం. దీనివల్ల నిండు జీవితాన్ని నిస్సారంగా గడపడం తప్ప మనం సాధిస్తున్నదేమిటో అర్ధం కాదు?
జీవితమనే పెయింటింగులో అన్ని షేడ్‌లూ ఉంటాయి. ఆ షేడ్‌లకు తగ్గట్లే వివిధ సందర్భాల్లో మనం విభిన్నంగా ప్రవర్తించవలసి రావచ్చు. కానీ మనం ఓ గిరి గీసుకుని ఓ ఇమేజ్‌కి కట్టుబడిపోయి ఏమాత్రం మన ఎమోషన్సుని బయటకు పెడితే మన పట్ల అంతవరకూ ఉన్న ఇమేజ్ తల్లక్రిందులు అయిపోతుందేమోనని లోపల భావాలు మారిపోతున్నా పైకి నటిస్తున్నాం. దీంతో మనసులో నిరంతరం అపరిమితమైన వత్తిడి పడుతుంటుంది. అంతర్గతంగా ఉండే ఎమోషన్స్ ని, బయటకు సహజ సిద్ధంగా ఉండలేక మనసు నలిగిపోతుంటుంది. అసలు ఎందుకొచ్చిన ఖర్మ ఇదంతా ? మనం బ్రతికున్నది మనకోసం కాదా! మన స్వంత ఎమోషన్స్‌ని మనం ప్రదర్శించకపోతే ఇంకెవరు ప్రదర్శిస్తారు? ఎదుటి వ్యక్తుల కోసం మనల్ని మనం ట్యూన్ చేసుకోవలసిన అవసరం ఏముంది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఆహార్యం ద్వారా మనం ఎప్పుడూ గొప్పదనాన్ని సంపాదించలేం. మన వ్యక్తిత్వం, కృషి, పట్టుదల వంటి వాటి ద్వారానే మనకు ప్రత్యేకత లభిస్తుంది తప్ప ! అలాగే మన ఎమోషన్స్ ఇతరులను బాధ పెట్టనివైనంత వరకూ ఎలాంటి బిగింపులూ లేకుండా వాటిని బయటపెడితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఊహించండి. జీవితం చాలా విశాలమైనది మనమే దాన్ని చట్రాల మధ్య బిగిస్తున్నాం. మానవ సంబంధాలు అంతే... మనిషికి మనిషికి మధ్య ఉన్న అటాచ్‌మెంట్ ఎంతో గొప్పది.. కానీ వాటికీ మనం పరిధులు పెడుతూ ఎదుటి వ్యక్తి ప్రతీ కదలికకూ రీజనింగులు, లాజిక్కులూ అన్వేషిస్తూ క్రమేపీ ఒకరికొకరం దూరమవుతున్నాం.అందరం ఒకరికొకరు ప్రేమని పంచుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!!!!!
1 వ్యాఖ్యలు:
nijame, nenu tappkunda prayatnistanu, dhanyavadamulu
Post a Comment