Friday 25 April 2008

పురాణాలు ఎం చెప్తున్నాయి ???

నేను చదివిన కొన్ని పురాణగాధలు, కథలు బట్టి నాకు కలిగిన కొన్ని సందేహాలు ఇవి.


రాముడు సకల గుణాభిరాముడు. అందరు అతడిని ఆదర్శంగా తీసుకోవాలి అంటారు కదా. ఏంటా ఆదర్శాలు? ఒకటే బాణం, ఒకటే మాట, ఒకే పత్ని.కాని అతను చేసిన పెద్ద తప్పు మాత్రం ఎవరూ ఎత్తి చూపరు. భార్యను అనుమానించడం.ఒకటి కాదు రెండు సార్లు. అదేంటంటే దానికో పిట్టకథ చెప్తారు. కొత్తపెళ్ళికూతురైనా కూడ భర్తతో వనవాసం చేసింది. పదమూడేళ్ళు కలిసి అడవుల్లో తిరిగారు. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిన సంవత్సరం తర్వాత చెరనుండి విడిపించబడింది.సీతారాములు విడిపోయి చాలా బాధపడ్డారు . వీరుడిలా రాముడు వెళ్ళి రావణాసురుడిని చంపి, తన భార్యను విడిపించాడు.కాని అగ్నిపరీక్ష ఎందుకు చేయించాల్సి వచ్చింది? లోకానికి సీత పతివ్రత, అగ్నిపునీత అని నిరూపించడానికి అంటారు. అస్సలు సీత మీద అనుమానం ఉంటే భర్తకు ఉండాలి.లోకానికెందుకు నిరూపించాలి. అలాగైతే రాముడు ఎలాంటి పరీక్ష ఇవ్వక్కరలేదా. అతను కూడా భార్యకు దూరంగా ఉన్నాడు కదా. మరి సీత ఎందుకు అనుమానించలేదు. సరే తర్వాత తన రాజ్యానికి వెళ్ళాక కొంత సమయం గడిచాకా ఎవడో చాకలోడు తాగి అన్నాడని , నిండు గర్భిణి ఐన సీతను అడవిలో వదలి రమ్మని లక్ష్మణుడికి చెప్పాడు. ఇదేనా పతి ధర్మం. అందునా ఏకపత్నీవ్రతుడు ..భార్యను అనుమానించి పంపడమెందుకు, మళ్ళీ ఆవిడకోసం బాధపడడమెందుకు. పైగా కాంచనసీతను పెట్టుకుని యాగం చేసాడని పొగుడుతారు. తన భార్య ఎలా ఉందో తెలుసుకున్నాడా అస్సలు. సరే.. పిల్లలతో యుద్ధం చేసిన తర్వాత నిజం తెలిసింది. వాళ్ళు తన పిల్లలే అని. సీతను కలుసుకున్నాడు. కాని అభిమానవంతురాలైన సీత తల్లి ఒడికి చేరుకుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అబ్బాయిలకు చెప్తారే కాని భార్యను అనుమానించడం కూడ ఆదర్శమేనా? కట్టుకున్న భార్య శీలాన్ని అనుమానించడం అనేది ఎంత అవమానకరమో మగాళ్ళకు అర్ధమవుతుందా? మహాతల్లి ఎంతలా బాధపడిందో కథ రాసినవాళ్ళకు తెలుసా?


ఇక మహాభారతానికి వస్తే..


ఎవరు బుద్ధిమంతులు కారు.భార్య ఉన్నా కూడా, ఆవిడను రాజభవనంలో ఉంచి వెళ్ళిన ప్రతీ ఊరిలొ పెళ్ళి చేసుకోవడం. పాండవులు కూడా ద్రౌపది కాకుండా వేరే భార్యలు ఉన్నారు. కాని తన ప్రమేయం లేకుండా ఐదుగురికి భార్య ఐన ద్రౌపదిలా మళ్ళీ ఎవరికీ బహు భర్తృత్వం ఉండకూడదని ధర్మరాజు శాపం ఇచ్చాడంట. నిజమో కాదో తెలీదు. మగవాళ్ళు తమ మానాన తాము ఇష్టమున్నట్టు పెళ్ళిల్లు చేసుకోవడం. కాని మొదటి భార్య మనోభావాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకున్నారా? తన భర్తను ఎంతమంది స్త్రీలతో పంచుకోవాలో ఆమెకే తెలీదు. ఆమె మాత్రం పతివ్రతలా వంచిన తల ఎత్తకుండా ఉండాలి. అలా అని ఆవిడ కూడ ఎక్కువమందిని పెళ్ళి చేసుకోమని కాదు.



పెద్దలు చెప్పే నీతులన్నీ ఆడాళ్ళకేనా? కుమారీ శతకంలో పెళ్ళి కాబోయే అమ్మాయికి ఎన్నో నీతులు చెప్పారు. చివరకు భర్త చనిపోతే ఆవిడ కూడా సహగమనం చేయాలని. మరి ఆవిడ పిల్లల గతేంటీ? మరి కుమార శతకంలో భార్యను ఎలా చూసుకోవాలి అని మాత్రం చెప్పలేదు. సమాజంలో ఎలా ఉండాలో మాత్రమే చెప్పారు?



ఇదంతా నేను ఏదో పండితురాలిని అని తప్పులు ఎత్థి చూపడంలేదు.పిల్లలకు మంచి విషయాలు చెప్పాలంటే పురాణాలే ఉదాహరణగా చెప్తాము కదా? మరి వాటిల్లోని మంచి కంటే చెడు త్వరగా గ్రహించుకుంటారు? అలాంటప్పుడు వీటిని మార్గ దర్శకాలుగా ఎవరికైనా ఎలా చెప్పగలము.మనలాగా పిల్లలు చెప్పినవన్నీ సరే అని తలాడించి ఒప్పుకోవడం లేదు. అందులోని తప్పొప్పులు ఎత్తి చూపించి సమాధానం అడుగుతున్నారు మరి?

7 వ్యాఖ్యలు:

Budugu

ahalya story koodaa inthe.

chandramouli

మిమ్మల్ని చిన్న ప్రశ్న అడిగుతాను తప్పుగా అనుకోవద్దు...
పిల్లలకు నేర్పించటం అనేదానికి మాత్రమే ఈ వ్యాఖ్యవర్తిస్తుంది.....

మీరు ఒక కంపెనీకి రెజ్యుమ్ రాసేప్పుడు, మీలో ఉన్న నెగేటివ్ పాయింట్స్ ఎన్నిరాస్తారు.
అన్ని పాజిటివ్ పాయింట్స్ రాస్తారా..లేక మొత్తం ఉన్న చోటూలో బాగా ప్రజెంట్ చేసుకోవటానికి ప్రయత్నించరు...
మీ పిల్లలకు కూడా అంతే..వారికి ఇలాంటి వ్యక్తిత్వం రావలి అనుకుంటున్నారో...అటువైవు ఉన్న పురాణ కధలు చెప్పండి.
చెడు ఎటూ తెలుస్తూంది,మంచి తెలుసుకునేది ఎవరన్న చెబితేనే అదీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే....

అయిన చిన్న పిల్లలకు భార్యకి బతికుండగానే చితి పేర్చాడు అని ఎందుకు చెప్పాలి చెప్పండీ...అతని విలువిద్యగురించి,సత్యవ్రతం గురించి,పిత్రుభక్తి గురించి,సమాజాన్నిప్రేమించటం గురించి చెప్పండి..

ఇక పురాణం - తప్పుల గురించి ఒక పెద్దపోష్ట్ పడుతుంది... రాయగానె తెలియఛేస్తాను

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

ఇది మీరు రాసిన టపాలాగా లేదు. సరే !

శ్రీసీతారాములు ఒక అవతారకార్యం కోసం జన్మించారు.అందులో భాగాలు ౧. దుష్టసంహారం ౨. శిష్టరక్షణ ౩. మానవాళికి మార్గదర్శనం

సీతమ్మవారిని శ్రీరామచంద్రులవారు అనుమానించారు అని బాగా ప్రచారమైంది. వాస్తవం మాత్రం అది కాదు. ఎవరో చెప్పగా విన్నవాళ్ళెక్కువ. స్వయంగా రామాయణం చదివినవాళ్ళెంతమంది ? "అమ్మవారిని చూశాను. ఇంకో నెలరోజులకు మించి వాడు నన్ను బతకనివ్వడని ఆవిడ మీతో విన్నవించమన్నారు" అని ఆంజనేయులవారు చెప్పినప్పుడు శ్రీరామచంద్రులవారు ఇలా అంటారు :

శ్లో. చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి
క్షణమపి న జీవేయం తామ్ అసితేక్షణాం వినా.

ఒక్క నెలరోజులపాటు ఓర్చుకుంటే సీతాదేవి బతికిపోతుంది. నా సంగతేమిటి ? ఆమె లేకుండా నేనొక్క క్షణం కూడా బతకలేకుండా ఉన్నానే !"అన్నారు.

"రావణుడితో యుద్ధం తర్వాత. మిత్రమా ! ఎక్కడుంది నా సీత ? పద, ఇప్పుడే నీవెంట వస్తాను. నన్ను తీసుకెళ్ళు. ఆమెని చూడాలి, ఆమెని చూడాలి" అంటూ శ్రీరాములవారు దు:ఖించారు.

శ్రీరామచంద్రులవారు ఒక భర్త మాత్రమే కాదు, ఒక బాధ్యత గల రాజు అనే విషయాన్ని ఆయన శత్రువులు మఱుగుపఱుస్తూంటారు. ఆయన ఆవిధంగా తన కుటుంబానికే కాదు, యావద్దేశానికీ జవాబుదారీ అని వాళ్ళు మర్చిపోతూంటారు. పరాయివాడి ఇంట్లో - అందులోను పచ్చికాముకుడుగా ప్రపంచమంతటా పేరుమోసిన రావణాసురుడి ఇంట్లో ఒక సౌందర్యవతి అన్ని నెలలపాటు పవిత్రంగానే ఉందని శ్రీరామచంద్రులవారు నమ్మినా ఆయన ప్రజలు నమ్మడం కష్టం. అపవిత్రురాలైన మహారాణీని ప్రజలు అంగీకరించరు. అందరి నోళ్ళూ మూసి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా పరిపాలించడానికి కోసలరాజ్యమేమీ నిరంకుశ రాజఱికం కాదు. అది Elected Monarchy.

ఆయనకు సంబంధించినంతవఱకు ఆయనకే విధమైన అనుమానాలూ లేవు. కానీ అవతారకార్యం అవతారకార్యమే. నెఱవేర్చితీఱాలి. ఆయనకే విధమైన అనుమానాలూ లేవని సీతమ్మవారిక్కూడా తెలుసు. అందుకే ఆయన అడిగినవెంటనే ఆయన చెప్పినట్లు చేసింది. తన అవతారకార్యమేంటో ఆ లక్ష్మీదేవికి తెలుసు.

"నువ్వు కూడా నాలా పవిత్రత నిరూపించుకో" అని తిరగబడ్డానికి అమ్మవారు ఫెమినిస్టూ కాదు, అది మగవాడినుంచి ఏకపత్నీవ్రతాన్ని ఆశించే రోజులూ కావు.
ప్రతియుగానికీ తనదంటూ ఒక ధర్మం ఉటుంది. ఒక యుగధర్మాన్ని మఱొక యుగధర్మపు కొలమానంతో judge చెయ్యడం సరికాదు. దశరథ మహారాజుకు ఆ ముగ్గురే కాక చాలామందే ఉండేవారని చెబుతారు. ఒకవేళ శ్రీరామచంద్రులవారు తన పరోక్షంలో వేఱే వివాహం చేసుకున్నా ఆ దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి అది సీతమ్మవారికి ఆమోదయోగ్యమే అయ్యుండేది. మానవజాతికి ఈ ఏకపత్నీవ్రతధర్మాల్ని నేర్పింది మొదట శ్రీరామచంద్రులవారే.

ఉత్తర కాండ ప్రక్షిప్తభాగం. అది వాల్మీకి వ్రాసినది కాదు. ఎవరో వ్రాసి ఆయన పేరుతో చెలామణి చేసినటువంటిది. అందులోని విషయాలు ఏవీ జరగలేదు. కనుక అక్కణ్ణుంచి తెచ్చుకున్న ప్రస్తావనల మీద నేను చర్చించలేను.

శ్రీరామచంద్రమూర్తి గుఱించి సీతమ్మవారిక్కూడా తెలియని విషయాలు తమకు తెలుసునన్నట్లు మాట్లాడేవాళ్ళ ధైర్యానికి నేనాశ్చర్యపోతాను. ఆ దివ్యజంట నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది పోయి వాళ్ళలో దోషాలెంచడానికి ప్రయత్నించడం-చాలా అసహ్యం. ఇది ఒక "ఇజమ్" గా చెలామణి అవ్వడం ఇంకా అసహ్యం.

అదంతా పక్కన పెడదాం. శ్రీరామచంద్రులవారు సాక్షాత్తు భగవంతుడని వందలాదిమంది పెద్దలు, మహర్షులూ హెచ్చరించినమీదట ఆయన గుఱించి ఇలాంటి అవాకులూ చెవాకులూ పేలడం నరకానికి ఒక సూటి మార్గాన్ని ఏర్పఱచుకోవడమే అవుతుంది. సంయమనం పాటించండి. ఈ పాపం క్షమించబడదు.

chandramouli

ఒక్క ముక్క అటూ ఇటూ కాకుండా తాడేపల్లి గారు రాసేసారు... ఇదే విషయం నేను...
www.untoldhistory.blogspot.com బ్లాగులో రాసాను....

తప్పులు ఉన్నాయి,అన్నిటిలో ఉంటాయి,వాటిని చూస్తూ అక్కడే ఆగిపోతే,వాటీతోనే సతమత మయితే.....ముందున్న మంచి రుచి తెలీయకుండానే పొతుంది అని నా అభిప్రాయం...

ఇంకోక దౌర్బాగ్యమయిన విషయం ఏమిటంటే.... మన తెలుగు సినిమా స్క్ర్రిప్ట్... పౌరాణికాలను పౌరాణికాలుగా తీయక, తెలుగు నేటివిటీ పేరుతో... వాళ్ళమనో వైకల్యాన్నంతా మాటల్లో రాసి... ఇలా కధలో ఎక్కడ తప్పులున్నయ్యో... అవి బాగా హైలైట్ చెయ్యడంతో.... (మంచి కంటే ఎక్కువగా చూపించటం అని నా ఉద్దేశ్యం ..తప్పులు లేవు అని కాదు).... అది బాగా నాటుకుపోయింది...ఒకప్పుడు నేను .. ఈ సినిమా స్టోరీ భాధితుడనే...

Naga

నా ఊహకు మించిన వ్యాఖ్యలను ఇప్పటికే రాసేశారు కనుక, గురువు గారి నుండి ఒక పద్యం :-

"తప్పు లెన్ను వారు తండోపతండము
లుర్వి జనులకెల్ల నుండుఁ దప్పు
తప్పు లెన్నువారు తమతప్పు నెఱుఁగరు
విశ్వదాభిరామ వినర వేమ."

Naga

ఈ కామెంటు నా ఉద్దేశాన్ని ప్రతిబింబించడం లేదని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి రాస్తున్నాను, "ఉర్వి జనులకెల్ల నుండు తప్పు" అని మాత్రమే నేను హైలైట్ చెయ్యాలనుకున్న విషయం. రాముడైనా భీముడైనా ఎవరైనా తప్పులు చేసి ఉంటారు, "మానవులు తప్పులు చేస్తారు, వారు నేర్చుకునే విధానమే అది" అని ఒక మహానుభావుడు సెలవిచ్చారు.

Naveen Garla

ఇలాంటి చర్చకే ఇంతకు ముందు వ్యాఖ్యలు వ్రాసి, పలువురి చేత అక్షింతలు వేయించుకున్నాను.

http://mynoice.blogspot.com/2007/10/blog-post_24.html

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008