Sunday 27 April 2008

ఆంధ్రజ్యోతి లో బ్లాగు భారతం




మనవాళ్లంతా బ్లాగుడుకాయలే !
- జ్యోతి వలబోజు


కాఫీ తాగారా?
'తాగాం'
పేపర్‌ చదివారా?
'చదివాం'
టీవీ చూశారా?
'చూశాం'
అన్నం తిన్నారా?
'తిన్నాం'
మరి ... బ్లాగారా?
'లేదే...'
... అయితే ఆలోచించాల్సిందే! బ్లాగడం ఇప్పుడో నిత్యావసరం. అందులోనూ తెలుగువారికి అన్నంలో ఆవకాయంత అత్యవసరం!
ఆలస్యమైపోయినా ఫర్లేదు ... పదండి ... బ్లాగేద్దాం!్ల


రాజకీయాలంటేనే చిర్రెత్తుకొస్తోందా? ఖద్దరోళ్లను చూస్తే కత్తి తీయాలనిపిస్తోందా?
'హ్యాపీడేస్‌' చూశాక కాలేజ్‌ డేస్‌ కళ్లముందు తిరుగుతున్నాయా?
లొలి ముద్దు, తొలి ప్రేమ, తొలి ఉద్యోగం, తొలి పెళ్లి చూపులు ... అబ్బా, ఒకటే గుర్తుకొస్తున్నాయా?
.... అవన్నీ మనసులోంచి తన్నుకురావడానికి తహతహలాడుతున్నాయా?
.... ఆ కబుర్లన్నీ ఎవరితో అయినా చెప్పాలనుందా, మనసు విప్పాలనుందా?
మీ స్టోరీలు వినే ఓపిక ఎవరికుంది మహాప్రభో!
పోనీ .... ఏ కథో, నవలో రాస్తే ....
ప్రచురించడానికి పత్రికలవాళ్లకి ఎన్ని దమ్ములుండాలి!
అదృష్టంకొద్దీ ప్రచురించినా .... ఎడిటింగ్‌లోనే సగం విషయం ఖూనీ!
ఎందుకన్ని ఇబ్బందులు. మీ ఆలోచనల్ని, మీ సంఘర్షణల్ని, మీ ముచ్చట్లని మీరే రాసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రాసుకోండి.
బ్లాగే మీ వేదిక. మీరే ఓ సంపాదకుడు.
అది చదివి తమ అభిప్రాయాల్ని పంచుకోడానికి, ప్రశంసించడానికి, విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు.
ఇటీవలి కాలంలో మీలాంటి వాళ్లంతా బ్లాగాధిపతులైపోతున్నారు. అది లక్షాధికారులైపోయేంత కష్టం కూడా కాదు. కరెన్సీతో పనే లేదు. మీ వృత్తి ఏదైనా కానివ్వండి. మీ ఉద్యోగం ఏదైనా కానివ్వండి. ఇంజినీరు, డాక్టరు, సైంటిస్టు, జర్నలిస్టు, గృహిణి, విద్యార్థి .... మీరు ఎవరైనా కావచ్చు. మనసారా బ్లాగడానికి ఇవేవీ అడ్డంకి కాదు.

బ్లాగాలని ఉందా...
అదెంతసేపు? మహా అయితే ఐదు నిమిషాల పని.
http://www.blogger.com
http://www.spaces.live.com
http://blaagu.com
http://sulekha.కం/బ్లాగ్స్

ఈ బ్లాగు హోస్టింగ్‌ సైట్లలో ఎక్కడికెళ్లినా సులభంగా పనైపోద్ది. ఇంకేముంది, మీకు తోచినప్పుడల్లా రాసుకుంటూ పోవడమే. ఒక్కో వ్యాసాన్ని టపా లేదా జాబు అంటారు. జాబు రాసి పబ్లిష్‌ చేయగానే అది తేదీ, సమయం తదితర వివరాలతో ఒక పద్ధతి ప్రకారం బ్లాగులో కనిపిస్తుంది. దీనికి బొమ్మలు, సంగీతం, వీడియో ... వగైరావగైరా మసాలా జోడించి మరింతమంది చదువరుల్ని ఆకట్టుకోవచ్చు. ఇదంతా పెద్ద కష్టమైన పనేం కాదు. పర్సులోంచి పైసా తీయాల్సిన పని కూడా లేదు. హాయిగా తెలుగులో రాసుకోడానికి అవసరమైన సాధన సంపత్తి నెట్‌లోనే దొరుకుతోంది. ఇంగ్లిష్‌ కీబోర్డు మీద టైప్‌ చేస్తుంటే ... తెలుగు అక్షరాలు తెరమీద ప్రత్యక్షమవుతుంటాయి.

ఇవన్నీ తెలుగు తలుపులే ....
లేఖిని -http://lekhini.org
బరహ - http://baraha.com
అక్షరమాల- http://aksharamala.com

బ్లాగోతం ...
ఇప్పుడున్న తెలుగు బ్లాగుల్లో రాజకీయాలు, సామాజిక అంశాలు, సినిమా, హాస్యం, వార్తలు, సాంకేతిక విషయాలు, వంటలు, కవితలు, పాటలు ... ఇలా పలు విషయాలు చోటుచేసుకుంటున్నాయి. బ్లాగుల నిర్వహణలో మహిళలూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. కాలక్షేపం కబుర్లతో సరిపుచ్చుకోకుండా, చక్కటి విశ్లేషణలనూ అందిస్తున్నారు. చాలామంది బ్లాగర్లు తమ ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని రాసుకోడానికి దీన్నో డైరీలా వాడుకుంటున్నారు. చిన్నప్పటి ఆటలు, పాటలు, అల్లరి, తొలి ప్రేమ, తొలి ముద్దు ... అన్నీ ఇక్కడ రాసుకుంటున్నారు. చదివిన వారు కూడా సందర్భోచితంగా స్పందిస్తున్నారు. తమ అనుభవాల్నీ పంచుకుంటున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, దుబాయి, అమెరికా, జర్మనీ, లండన్‌, ఆస్ట్రేలియా, అనకాపల్లి, చీరాల ... ఒకచోటనేమిటి, ప్రపంచమంతా మన తెలుగు బ్లాగర్లున్నారు. భాషాభిమానమే వీళ్లందర్నీ దగ్గర చేసింది.

బ్లాషావేత్తలు ...
'ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్‌' అన్న సంగతి మన బ్లాగర్లకు బాగా తెలుసు. అందుకే వీరలెవల్లో బ్లాషోద్యమానికి నడుంకట్టారు. ఏకంగా పదకోశం తయారు చేసే పనిలోపడ్డారు. ఇప్పటికే కొన్ని మాటలు బ్లాగర్ల నోళ్లలో నానుతున్నాయి కూడా.
రాసినవాడు ... బ్లాగరి.
రాసింది ... బ్లాగోతం.
ప్రహసనం లాంటిదే బ్లాహసనం.
రాజకీయాలు ఇక్కడ బ్లాజకీయాలు.
ఆశ ... బ్లాశ. ఫోటో ... బ్లోటో.
.. ఇలా అంతా బ్లాగ్మయమే!

బ్లాగెదనొక్కింత కొత్త ...
మనం ఎంతైనా ఇరగదీయొచ్చు. తిక్కనగారికి తిక్కరేగేలా పద్యాలు అల్లొచ్చు. శ్రీశ్రీ గారికి చిర్రెత్తుకొచ్చే పొయిట్రీ రాయొచ్చు. కానీ ఏం లాభం? ఎవరో ఒకరు చదవాలిగా! మనమేం రాశామో, ఎలా రాశామో నలుగురూ మాట్లాడుకోవాలి. అప్పుడే మనలోని కవిగారి కడుపునిండుతుంది. ఇందుకూ తగిన ఏర్పాట్లున్నాయి.
మన బ్లాగు గురించి నలుగురికీ తెలియడానికి, మనం కొత్తకొత్త టపాలు పెట్టగానే ... ఆ సంగతి తెలుసుకుని అంతా ఆ బ్లాగులోకి వెళ్లి చదువుకోడానికి 'బ్లాగు అగ్రిగేటర్‌' సహకరిస్తుంది. ఇక్కడ మనం వందలాది బ్లాగుల్ని చూసుకోవచ్చు. నచ్చిన బ్లాగులోకెళ్లి చదువుకోవచ్చు. మన అభిప్రాయాల్ని నిస్సంకోచంగా బ్లాగేయొచ్చు!
మీరు టపా రాయగానే కింది అగ్రిగేటర్లలో మీ బ్లాగు పేరుతో సహా ప్రత్యక్షమైపోతుంది (అయితే ముందుగా ఇక్కడ రిజిస్టరు చేసుకోవాలి). అక్కడికి వచ్చినవారు ఆ తీగ పట్టుకుని మీ బ్లాగులోకి వచ్చేస్తారు. మీరు రాసిందంతా చదువుకుంటారు. నచ్చిందా .... మీ అభిమానులైపోతారు. నచ్చకపోతే కటీఫ్‌!
http: //koodali.org
http: //thenegoodu.com
http: //telugubloggers.com
http: //jalleda.com


బ్లాగుంపులో గోవిందయ్యలు!
కవులకేనా అరసాలు, విరసాలు, సరసాలు అంటున్నారు బ్లాగరులు. అనడమేమిటి, తమకంటూ ఓ గూగులు గుంపును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ చౌరస్తాలోనే కలుసుకుని కబుర్లు చెప్పుకుంటారు. సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారు, టెక్నాలజీని పంచుకుంటారు, సందేహాలు తీర్చేసుకుంటారు, సరదాగా జోకులేసుకుంటారు. చివర్లో బైటూ ఛాయ్‌ కొట్టేసి బాయ్‌బాయ్‌ చెప్పుకుంటారు. కొత్తగా బ్లాగులు పెట్టేవారి కోసం ఓ వీధి బడి కూడా ఉంది. ఆసక్తి ఉంటే పలకాబలపం పట్టుకెళ్లి అక్షరాలు దిద్దుకోవచ్చు. మొహమాటమెందుకు, ఓ సారి వెళ్లిరండి ...

బ్లాగు గుంపు
http: // groups.google.com/group/తెలుగుబ్లాగ్

సాంకేతిక సహాయం
http://computerera.co.in/చాట్

బ్లాగర్ల కబుర్ల కూడలి
http://chat.koodali.org

బ్లాగర్ల సంఘం వర్థిల్లాలి
తెలుగు బ్లాగర్లు ఎవరికి వారే యమునా తీరే అని కాకుండా సమష్టిగా పనిచేస్తున్న అంశాలు కూడా ఉన్నాయి. వందలాదిగా ఉన్న అందరి బ్లాగులనూ గుర్తు పెట్టుకుని రోజూ తెరిచి చూడడం శ్రమతో కూడుకున్న పని. తెలుగు బ్లాగర్లు తమ తమ బ్లాగుల్లో రాసే కొత్త జాబులన్నిటినీ ఎప్పటికప్పుడు ఒకేచోట చదవగలిగితే బాగుంటుందని ఒక బ్లాగరి (చావా కిరణ్‌)కి వచ్చిన ఆలోచనను ఇంకొక బ్లాగరి (వీవెన్‌) అమలుచేయగా ఏర్పడిందే కూడలి. తెలుగులో రాయడానికి బ్లాగరులు, వికీపీడియాలు అందరూ వాడే లేఖినిని అభివృద్ధి చేసింది కూడా ఈ బ్లాగర్లే.

హైదరాబాద్‌లో ఉన్న తెలుగు బ్లాగర్లు కొందరు ప్రతి నెలా ఒక ఆదివారం రోజు సమావేశమై ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తికి గల అవకాశాలను, అవరోధాలను గుర్తిస్తున్నారు. కంప్యూటర్లు మరింత సులభంగా తెలుగును అర్థం చేసుకోవడానికి అవసరమైన అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడానికి మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంటర్నెట్లో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆన్‌లైన్‌ విజ్ఞాన సర్వస్వం వికీపీడియా (http://te.wikipedia.org) నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్నదీ తెలుగు బ్లాగర్లే.
వీళ్ళంతా కలిసి 'మీ కంప్యూటర్‌కు తెలుగు నేర్పడం ఎలా?' అనే పుస్తకం కూడా ప్రచురించారు.

బ్లాగానుబంధం...
ఒకటి మాత్రం నిజం. తెలుగు మీద ఉన్న విపరీతమైన అభిమానం, తమకు తెలిసిన విషయాల్ని నలుగురితో పంచుకోవాలన్న ఆరాటం ... ఎంతోమంది కొత్త బ్లాగర్లను తయారుచేస్తోంది. మొదట్లో వీళ్లలో ఎవరికీ ఎవరితో ముఖపరిచయం కూడా లేదు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రాంతంలో, ఒక్కో దేశంలో ఉంటున్నవారు. అయినా అందరూ బ్లాగుల కూడళ్లలో కలుసుకుంటున్నారు. అనుబంధాల్ని బలోపేతం చేసుకుంటున్నారు. తమకు తోచిందేదో బ్లాగుతున్నారు. 'బ్లాగు... బ్లాగు' అన్న మెప్పూ పొందుతున్నారు. ఇక్కడ మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే మన బ్లాగుల్లో అశ్లీల, అనాగరిక ధోరణులు ఇప్పటిదాకా లేనే లేవు. వివాదాలూ తక్కువే. అప్పుడప్పుడూ వాడివేడి చర్చలు జరిగినా అవన్నీ ఆరోగ్యకరమైన ఆలోచనలే.

ఆలస్యమెందుకు, కోరస్‌గా పాడదాం రండి...
చెయ్యెత్తి జైకొట్టు బ్లాగోడా...!
భవిష్యత్తంతా మనదే బ్లాగోడా...!

కవితలు

అందమైన మహిళలు రాసే అందమైన కవితలు ... ట్యాగ్‌లైన్‌ బావుంది కదూ! ఈ బ్లాగులోని కవితలు నిజంగానే బావుంటాయి ... చదవగానే మనసుకు హత్తుకుంటాయి.

రాధిక 'మనసు భాష' చదవండి...
ఏకాంత వనంలో
ఆమె-నేను
మౌనం గలగలా
మాట్లాడేస్తుంది
మనసులు ఏమి అర్థం చేసుకున్నాయో
కన్నులు ఏమి భాష చెప్పుకున్నాయో
చిత్రంగా...
చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి.

స్నేహమా...
http://www.snehama.blogspot.com
దోస్తానా చిరునామా ఇది. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. పాత జ్ఞాపకాల్ని నెమరేసుకోవచ్చు. చెప్పేదేముంది, మీ ఇష్టం, మీ నేస్తాల ఇష్టం!

జ్యోతి
http:// jyothivalaboju.blogspot.com
ఇది నాదే. హైదరాబాద్‌లో గృహిణిగా ఉంటూ అందరితో బోలెడు కబుర్లు చెపుతుంటాను. చాలామంది ప్రేమగా నన్ను జ్యోతక్కా అంటుంటారు.

జానుతెనుగు సొగసులు

http://janatenugu.blogspot.com
ప్రవాసాంధ్రులు వంశీ మాగంటి బ్లాగిది. దీన్ని ఒట్టి బ్లాగు అనడం కంటే, విజ్ఞాన ఖని అంటేనే బావుంటుంది. ఇందులో సంగీతం, సాహిత్యం, జానపదం ... ఇంకా చాలా పనికొచ్చే సమాచారం ఉంటుంది.

షడ్రుచులు
http://shadruchulu.blogspot.com
తెలుగులో మొట్టమొదటి వంటల బ్లాగు ఇది. ఇందులో దాదాపు 300కి పైగా శాకాహార, మాంసాహార వంటకాలున్నాయి. తక్కువ మసాలాలతో, తక్కువ సమయంలో చేసుకోగల కూరలు, స్వీట్లు, అల్పాహారాలు, పొడులు ... వగైరా వగైరాల వివరాలున్నాయి. దేశవిదేశాల్లోని తెలుగు వారికి బాగా పనికొస్తుందీ బ్లాగు.

కొత్తగా గరిట పట్టుకొన్నవారే కాదు, తలపండిన మామ్మలు కూడా రిఫరెన్సు కోసం అప్పుడప్పడూ చూడాల్సిన బ్లాగిది.

విహారి
http://blog.vihari.net

తెలుగు బ్లాగ్లోకానికి ఆస్థాన విదూషకుడనే బిరుదున్న విహారి సృష్టించిన పక్కా నవ్వుల ప్రపంచమిది. మీ మనసు బాగోలేనప్పుడు ఈ బ్లాగును పూటకు ఓసారి వేసుకోండి, అంతా సర్దుకుంటుంది.

రెండు రెళ్లు ఆరు
http://thotaramudu.blogspot.com
చెన్నైకి చెందిన గౌతమ్‌ రాసే ఈ బ్లాగులోని ప్రతి టపా చదివిన వారిని నవ్వించకమానదని బల్లగుద్ది చెప్పొచ్చు. వాస్తవంగా జరిగిన సంఘటనలకు సున్నితమైన హాస్యాన్ని జోడించి రాస్తారు రచయిత.

అంతరంగం
http://blog.charasala.com

అమెరికాని, ఆంధ్రాని ఆవకాయతో కలిపి తింటున్నామా అనిపించేంత చక్కగా తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు ప్రసాద్‌ చరసాల. క్రమంతప్పకుండా ఎన్నో అపురూపమైన టపాలు రాస్తారాయన.

అప్పుడు ఏం జరిగిందంటే...

http://kranthigayam.blogspot.com

క్రాంతి ఈమధ్యే మొదలుపెట్టారు దీన్ని. చక్కటి, చిక్కటి హాస్యం ఆపకుండా చదివిస్తుంది. ఈ అమ్మాయి చెప్పే కబుర్లు ఎవరినైనా నవ్వించి తీరతాయి. మీ పెదాల మీద చిరునవ్వుకు నాదీ భరోసా.

పాటల పందిరి
పాత పాటలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. ఆపాత మధురాల్ని ఆస్వాదించాలనుకునేవారి కోసం ఈ బ్లాగుల్లోని ఆడియో, వీడియో టపాలు సిద్ధంగా ఉన్నాయి.

సత్యం శివం సుందరం
http://satyamsivamsundaram.blogspot.com

గీతలహరి
http://geetalahari.blogspot.com

ఆణిముత్యాలు
http://geetalu.blogspot.com

కలగూరగంప
http://www.tadepally.com
మంచి సమాచారం, విమర్శనాత్మక ధోరణి కలగలసిన బ్లాగు ఇది. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం పక్కా తెలుగులో పలకరిస్తారిందులో. ఇందులోనే రైతుల ఆత్మహత్యల మీద ఓ వ్యాసముంది. 'రైతుల ఆత్మహత్యలకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. నాకు తెలిసింది మాత్రం ప్రధానంగా చిన్న కమతాల సమస్య. ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నా నేను అతని అప్పుల కంటే భూమి వివరాల్నే శ్రద్ధగా చూస్తాను. వాళ్లంతా ఐదెకరాల లోపు చెలికల్ని సాగు చేస్తున్నవారే' అంటారు రచయిత.


సాలభంజికలు

http://www.canopusconsulting.com/salabanjhikalu/
తెలుగు సాహితీ వైద్యం చేసే అతి కొద్ది బ్లాగుల్లో నాగరాజు పప్పు నిర్వహించే సాలభంజికలు ఒకటి. అత్యున్నత ప్రమాణాలు దీని సొంతం. ఈ బ్లాగులో నాగరాజు 'వాక్యం రసాత్మకం కావ్యం' అంటూ ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల భిన్నమైన పద్ధతుల గురించి చర్చించారు. ఓసారి రచయిత 'మావయ్యా కవిత్వం రాయడం సులువా, కథలు రాయడం సులువా' అనడిగితే 'రాయడం వరకూ అయితే కవిత్వమే సులువు' అని చెప్పారట ఓ పెద్దమనిషి. భలే చమక్కు కదూ!

చదువరి
http://chaduvari.blogspot.com
ఒరిజినాలిటీ అడుగడుగునా ఉట్టిపడే తెలుగు బ్లాగుల్లో ఇదొకటి. ముక్కుసూటిగా మొట్టికాయలేస్తూ అందరికీ సుపరిచితమైంది. చదువరిగా బ్లాగర్లందరికీ తెలిసిన హైదరాబాద్‌వాసి శిరీష్‌ తుమ్మల నిర్వహిస్తున్నారు దీన్ని. రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, రాజకీయ పరిణామాలు ఎక్కువగా చర్చకు వస్తుంటాయి.


ఇ-పుస్తకం ... మీ పుస్తకం!
బ్లాగులు ఈ కాలానికి ప్రతీకలు. తెలుగు బ్లాగులు రాసిలోనే కాదు, వాసిలోనూ ఎక్కువే. తెలుగంటే ఈ తరానికి ఉన్న అభిమానాన్ని తెలుసుకోవాలంటే ఓసారి బ్లాగుల వైపు చూస్తే అర్థమవుతుంది. చక్కని పద్యాలు, కథలు, వ్యాసాలు, చతుర్లు, చమక్కులు ... అన్నీ బ్లాగులలో ఉంటాయి. అలాంటివి కొంతమందికే ఎందుకు, అందరికీ చేర్చాలనే ఆలోచనే ఈ బ్లాగు పుస్తకానికి నాంది. బ్లాగరులు సమష్ఠిగా రాయడమే కాదు, కలిసి పని చేయగలరని చెప్పడానికి ఈ పుస్తకమే నిదర్శనం. చక్కని టపాలు స్వీకరించి, వాటిని కూర్చి, ముఖ చిత్రం తయారు చేసి, అందంగా ఫార్మాటు చేస్తే వచ్చిన పుస్తకం ఇది. బ్లాగర్ల గురించి, తెలుగు బ్లాగుల గురించి అందరికీ తెలియజేసి తెలుగులో రాయడానికి ప్రేరేపించడమే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. ఈ బ్లాగు పుస్తకంలో హాస్యం, కవిత, కథ, రాజకీయాలు, సినిమా, సాంకేతికం, అనుభవాలు, వ్యాసం, ఆలోచన అనే వివిధ విభాగాల్లో అందరి ఆదరణ పొందిన వ్యాసాలు సుమారు 260 పేజీల్లో పొందుపరిచాం. ఇది తెలుగువారికి ఇవ్వగల ఒక అందమైన బహుమతి అని చెప్పవచ్చు. ఈ ఇ-పుస్తకాన్ని

http://employees.org /praveeng/telugubolgbook/telugublogbook.pdf నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

12 వ్యాఖ్యలు:

venkat

mam bagundi expecting lot of articles from u like this

Unknown

జ్యోతి గారు ఆంధ్రజ్యోతిలో మీ ఆర్టికల్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్లాగుల గురించి మరోసారి ఇలా ప్రముఖ పత్రికాముఖంగా ప్రచురణ కావడం మనందరికి ఆనందదాయకం. మీ వరుస చూస్తుంటే కొంపదీసి మీరు బ్లాగులు రాయడం మానేసి పత్రికలకు రాయడంతోనే కంటిన్యూ అయేటట్లున్నారు. ఇలాంటి మంచి ఆర్టికల్స్ మీ నుండి మరిన్ని పత్రికాముఖంగా ఆశిస్తున్నాను.

విహారి(KBL)

Very Nice article jyothigaru

సత్యసాయి కొవ్వలి Satyasai

వావ్ గ్రేట్

Ramani Rao

చాలా బాగుంది జ్యోతిగారు! బ్లాగ్లోకంలో మీరు చేసే సేవ, చాలా గొప్పగా చెప్పుకోవచ్చు.

రాధిక

జ్యోతిగారూ ఇరగదీసారుగా.ఇకనుండి మిమ్మల్ని తరచుగా పత్రికల్లో చూడాలనుకుంటున్నాము.

Anonymous

జ్యోతక్కా,

శెభాషో...
చాలా బావుంది.

-- విహారి

Dr. Ram$

కేకో, కేక.. బ్లాగో బ్లాగు అంటూ, జ్యోతి గారు, ఈ రోజు ఆంద్రజ్యోతి లో మీరు వెలిగించిన బ్లాగు జ్యోతి, ఒక్క బ్లాగరు కే కాదు, తెలుగు భాషాభిమానము వున్న ప్రతి తెలుగుతల్లి ముద్దు బిడ్డ, గర్వము గా అంతర్జాలము లో మన తెలుగు జాతి అని రొమ్ము విరిచి చదువుకునేలా వుంది.. తెలుగు బ్లాగొకానికి మీరు చేస్తున్న సేవ నిరూపమానము..వందనములు, అభివందనములు..కాని ఈ ప్రస్థానము ఇంతటి తో ఆగకూడదు, యిది "తొలి మెట్టు" మాత్రమే..తెలుగు తల్లి ఒడి లో ఓలలాలి, తెలుగంటే ఏమిటో , తెలుగు తియ్యదనమంటే ఏమిటొ తెలియకుండా అనామకము గా బతుకుతున్న యెందరో మన తోటి తెలుగు వారికి ఆ తీపి రుచి చూపిద్దాము..తెలుగు భాషాబివృద్దికి తోడ్పడదాము..

Unknown

జ్యోతి గారు,

మొత్తానికి చక్కని వ్యాసం రాసారు ఆంధ్రజ్యోతికి. అది చూసి ఇంకెందరో మన బ్లాగు ముఖం పడతారని ఈ బ్లాగ్వేదికగా మనవిచేసుకుంటున్నాను.

జాన్‌హైడ్ కనుమూరి

Congratulations

నిషిగంధ

జ్యోతి గారు, అసలు సిసలు జర్నలిస్టు రాసినట్టే రాసారు!! చాలా బావుందండీ.. ఇక మీరు అంధ్రజ్యోతిలోనే ఏదో ఒక రెగ్యులర్ కాలం మొదలుపెట్టేయడి :)

Hemanth Potluri

బాగుంది జ్యోతి గారు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008