Thursday, 15 May 2008

హైదరాబాద్ బత్తీ బంద్ ....



అన్నలకు, తమ్ములకు,అక్కలకు, చెల్లెండ్లకు, పొరగాల్లకు అందరికి నమస్తె. బాగున్నరా . నేను సరూపను. చాల రోజులైంది కదా మిమ్మల్ని పల్కరించి.. ఏం జేయాలె. పోరగాల్ల పరీక్షలు, మాడికాయ తొక్కులు పెట్టుకోవాలే.ఇగ మిర్పకాయలు అవన్నీ కొనుక్కోవాలె కదా. ఎండలతోని ఒకటే ఉబ్బరం. ఇంట్ల ఉండరాదు.బయటకుపోరాదు. కూలర్ పెట్టుకుందమంటే , కరెంట్ ఏమో ఊర్కె పోతుంటది. ఉష్ ఉష్ అనుకుంట కూర్చుండి, రోజులు రెండుసార్లు సానం చేసుడు. ఇగ వేరే పనులేం గుర్తుంటయ్. ఇంక కరెంట్ బిల్లు కూడా ఏం తక్కువ రాదు. ఇప్పుడంటే ఏదో మన దగ్గర పైసలున్నయి, గవర్మెంటోళ్ళు కరెంటిస్తుండ్రు కొనుక్కుంటున్నం. మరి కరెంటే లేకుంటె .మనమందరం ఏం జేద్దాం? అందుకనే మీకు కొన్ని ముచ్చట్లు చెప్దమని ఇలా ఒచ్చిన. ఐనా మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు గాని , ఏదో నాకు పరేషన్ అయ్యి మీకు చెప్తున్న.



హైదరబాదుల, చాల ఇండ్లు, ఫాక్టరీలు, ఆఫీసులు, ఎన్నో ఉన్నయ్ గదా. వీళ్ళందరికి లైట్లు, ఫాన్లు, మిషన్లు అన్నీ కరెంటుతోనే నడుస్తయి కదా. మరి ఇంత మందికి ఎంత కరెంట్ కాల్తది రొజుకు, లేదా గంటకు. అందుకే అందరూ ఏమంటున్నరంటే వచ్చే నెల పదిహేన్ తారీఖునాడు రాత్రి ఏడున్నర నుండి ఎనిమిదన్నర వరకు అందరం కరెంట్ బంద్ చేయాలె అని. మంచిదే కదా. ఎందుకంటరా మన భూగోళం మస్తు గరం ఐతుంది, సముద్రాల నీల్లన్న్నీ మసులుతున్నాయి అంట . ఇలాగైతే కష్టమే కదా. ఇవన్నీ నాకెట్ల తెలుసు అనుకుంటున్నారా. మా బస్తికి కొంతమంది సార్లు వచ్చి చెప్పిండ్రు. నాకు కూడా నిజమే కదా అనిపించింది. మనకోసం ,మన పిల్ల కోసం ఈ మంచి పనికి నాకు చాతనైంది చేద్దామని ఇలా చెప్తున్నా. .. సరూపక్క నువ్వు బానే చెప్తవ్.లైట్లు లేకుండ ఎట్లుండాలె అసలే ఎండాకాలం,పోరలందరికి ఇస్కూల్లు తెరుస్తరు, సదూకోవాలె కద అని అంటరా?



అరే!! నేను చెప్పేది జర యినండి. వేల రూపాయలు బెట్టి హోటల్‌కి బోయి మోమ్‌బత్తీలు పెట్టుకుని గుడ్డి ఎలుతుర్ల తినరా?. అట్లనే ఇంట్ల అందరు మోమ్‌బత్తీలు పెట్టుకోండి. లేదా బంగ్ల మీదికి బోయి సాపలేసుకుని ముచ్చట్లాడుకోండి ఇంటోళ్ళందరు.


ఎప్పుడు జూసిన ఎవరి పని వాళ్ళకే. టివీ అంటరు, కంప్యూటర్ అంటరు లేదంటే సదువు అంటరు. అర్రే!! ఒక్క గంట ఇట్ల ఖుషీ చేయండి. బంగ్ల మీదికి పోనీకి లేదు అంటే ఇంట్లనే కిటికీలన్ని తెరిచి కూర్చోండి . సల్లగా గాలొస్తది,మీరే పాటలు పాడుకోండ్రి.ఆటలాడుకోండ్రి. దానికి కరెంట్ ఎందుకు.ఏమంటరు? అదే టైమ్‌ల ఎందుకు బత్తీలు బంద్ చేయలే అంటరా? మరి అప్పుడే కదా అందరు ఎక్కువ లైట్లు ఏసుకునేది. ఎండాకాలమ్‌ల మనకు ఎట్లైనా కరెంట్ పోతనే ఉంటది. కాని అందరం కలిసి ఒకేసారి బంద్ చేయాలే అని . మంచి పనికి మనం ఒక్క పైసా ఇచ్చేది లేదు, మైదానంకో పోయేది లేదు, మీటింగులకు పోయేది లేదు, ఇంట్లనే ఉండి చేయొచ్చన్నమాట. సంగతి హైదరబాదు, సికందరబాదుల ఉన్న మీ దోస్తులకు , సుట్టాలకు చెప్పండి. మర్సిపోవద్దు. నేను మళ్ళీ ఓసారి యాద్ జేస్త. ఉంట మరి. నమస్తే..

2 వ్యాఖ్యలు:

Bolloju Baba

యాసలో వ్యాసం చదూతుంటే హైదరాబాదులో ఉన్నట్లుంది.
మంచి కారణం.
అభినందనలతో
బొల్లోజు బాబా

Ramani Rao

మస్తుగుందక్కా! నే జేస్త! గట్లనే నే ఆసుంట, ఈసుంట తిరుగుతగదనే! ఆళ్ళకి, ఈళ్ళకి నే జెప్తా. మా పోరగాళ్ళు ఇనుకోరు, జర పరేషాను జేస్తరు. అయినా నేనొల్ల , ఆ దినంలో అదేందది, జూను 15 మా యింట్లో కరెంట్ బంద్,భూమి తల్లి కి జర్రమొచ్చిందంటే ఇనరు పోరగాళ్ళు, నా మాట ఇనకుంటే, అన్నం కూడా బంద్ జేస్తా.. ఉంటా అక్కా. మంచిగ జెప్పినవ్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008