Wednesday, 14 May 2008

ఎవండోయ్ శ్రీవారూ...


ఈ రోజు టైమ్స్ దినపత్రికలో వచ్చిన వ్యాసానికి నవ్వొచ్చింది . అందుకే ఈ ప్రతిస్పందన.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు చాలా బావుంది. కాని ఇల్లాలు చెసే పనులకు నిజంగా వెలకడితే ఎంతవుతుందో తెలుసా? అక్షరాలా 50,000 రూపాయలు. ఇది మీరు భరించగలరా. అంత స్తోమతు ఉందా? ఇటీవల టైమ్స్ అఫ్ ఇండియా పేపర్ వాళ్ళు జరిపిన సర్వేలో తేలిన విషయమేమిటంటే మీ భార్య/అమ్మ ఇంట్లో ఉండి చేసే పనులకు నిజంగా సరియైన వెల కడితే ఆమెకు ఇవ్వాల్సిన జీతం నెలకు అచ్చంగా యాభైవేలు. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? గుండె గుభేళుమంది కదా!


అందరికి తెలిసిన విషయమే కాని అంగీకరించడానికి మనసొప్పుకోదు. ఇల్లాలు ఎన్ని పనులు, ఎన్ని గంటలు పని చేస్తుంది.ఎన్ని సెలవులు ఆమెకు లభిస్తున్నాయి. ఇంత పని చేసిన ఆమెకు కనీసం తన ఖర్చులకు కూడ నెలకు ఇంత ఇవ్వాలి అని ఆలోచించే ప్రభుద్ధులు ఎంతమంది? అన్ని తెచ్చిపెట్టాక ఇంకా ఏమవసరం అంటారు? ఆదివారం భర్తకు, పిల్లలకు సెలవు అని హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. మరి ఇంటి ఇల్లాలికి సెలవు ఉంటుందా రోజు? అదే రోజు పని పెరుగుతుంది. అన్నిపనులు ఆలస్యంగా జరుగుతాయి. ఇంకా తినడానికి స్పెషల్స్ కావాలి? మరి తనకు రెస్ట్ ఎప్పుడు?

బయటకెళ్ళి చేస్తేనే ఉద్యోగమా? అదే అసలైన పనా? ఉదయం కాఫీ , పిల్లలను లెపి తయారు చేసి, భోజనం పెట్టి , క్యారేజీలు, పుస్తకాలు సర్ది పంపడం, భర్తకు కావలసినవి అందించి అతడి అవసరాలు చూడడం, ఇంటికి కావలసినవి షాపింగ్ చేయడం,పిల్లల చదువులు, ఆరోగ్యం, చుట్టాల మర్యాదలు, బిల్లులు కట్టడం వంటివి చేసే మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మహిళలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తమ ఉద్యోగాలు, కెరీర్ కూడా త్యాగం చేస్తారు.

ఐతె ఎంటంటా? ఇవన్నీ చేసినందుకు రోజు దండం పెట్టిపూజ చేయాలా . భార్య/అమ్మ ఐనందుకు చేయాలి తప్పదు. ఉన్నదెందుకు మరి అనేవారు కోకొల్లలు.నేను ఎన్నో కుటుంబాలలో చూసాను కూడా. ఇల్లాలు అంటె taken for granted అనుకుంటారు. సరేలేండి. ఇప్పుడు ఒక కెరీర్ అండ్ జాబ్ కన్సల్టెంట్ చేసిన లెక్కల ప్రకారం ఇల్లాలు చేసే పనులకు దేనికి ఎంత జీతం ఇవ్వాలి అని ఇలా ఉన్నాయి.


వంట : Rs. 6,000.(ఇంతోటి వంటకు అంతివ్వాలా. టూమచ్.) రెండు రోజులు హోటల్ టిండి తింటే కాని తెలీదు.ఎంత బరువు తగ్గుతారో - పర్సుకు,కడుపుకు)


శుభ్రపరచడం :Rs.4,500 (ఇక ఐనట్టే. అంతా? ఐదొందలు పడేస్తే పనిమనిషి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి, బట్టలు ఉతికి, గిన్నెలు కడుగుతుంది. అది చేస్తే చాలా .ఇక వేరే పని ఉండదా)


బాగోగులు చూసుకోవడం : Rs.18,000. (ఇది మరీ చోద్యం. ఊరుకుంటున్నామని ఇష్టమొచ్చినట్టు ధర కట్టడమే. రోజు ఏముంటుంది చూసుకోవడానికి . పిల్లలు కాస్త పెద్ద అయ్యారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. స్కూలుకి క్యారేజి కట్టడం మాత్రమే చేస్తే చాలు.ఇక జ్వరం లాంటి అనారోగ్యాలు ఎప్పుడూ వస్తాయా?)


అఫిషియల్ వర్క్ : బ్యాంకు పని, పోస్ట్, బిల్లులు కట్టడం వంటివి Rs.3000 : ఎవరన్నా అబ్బయికి పది రూపాయలు ఇస్తే నెలకోసారి పనులన్నీ చేస్తాడు కదా.


డ్రైవింగ్ : Rs.6,000: అందరికి కారు, ఎగస్ట్రా స్కూటర్లు,స్కూటీలు ఉంటాయా?)


ఇతరత్రా ముఖ్యమైన పనులు : Rs.7,000. సర్లేండి. ఇలా ప్రతీ దానికి లెక్కలు కడితే ఐనట్టే.


లెక్కలు వేయలేని ఎన్నో పనులు : Rs.5,౫౦౦


మొత్తం జీతం : Rs.50,౦౦౦


మహిళలూ, ఇది చదివి మరీ ఎక్కువ ఊహించుకోకండి.ఇందులో కనీసం 1% కూడా అంటె నెలకు కనీసం 500 రూపాయలు కూడా ఇవ్వరు భర్తలు కాని, పిల్లలు కాని. కావాలంటె అడుగు తెచ్చిపెడతాం అంటారు. అంటే మన అవసరాలన్నింటికి అడిగితే కాని కాసులు రాలవు.


లైట్ తీసుకోండి.. నాలాగే!! ( ఇది ఒక వార్త మాత్రమే కాదు.నేను ప్రత్యక్షంగా ఎన్నో ఇళ్ళలో చూసిన నిజాలు. అలా అని వేలల్లో జీతాలు ఇవ్వమని ఎవ్వరూ అడగలేదు. కనీసం గుర్తిస్తే చాలు అనుకుంటారు. )

32 వ్యాఖ్యలు:

RG

నేనంత జీతం ఇచ్చుకోలేను వదిలేస్తా అంటే ఊరుకుంటారా... మరి మగాడు ఆడదానికి ఇచ్చే security feeling కి కూడా వెలకట్టాలని అనిపించలేదా??

ఎక్కడో విన్న పాట గుర్తొస్తోంది...

Woman needs man...
Man must have his mate...
That no one can deny...

arunakiranalu

chala bavundi mee sekarana, ippudippude magavalla alochana doranilo marpu kanipisthundi mana work lo vallu share chesukuntaru


aruna

Anonymous

Naku telisi USA lo job chestu entlo panulu anni magavalle chestunnaru ..Mari aapudu

రవి

ఎంత భరించు వాడు (భర్త - భరించు వాడు) అని చెబితే మాత్రం మరీ ఇంత భారమా జ్యోతి గారు ? :-)

ఈ విశ్లేషణ ఎక్కడో మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలో చదివానట్టు గుర్తు.

కొత్త పాళీ

@RSG - పొరబడ్డారు. పెళ్ళి అనే వ్యవస్థలో స్త్రీకి రక్షణని చ్చేది మొగుడి వేషంలో పక్కన నిలబడ్డ మగాడు ఖాదు, చుట్టూతా ఉన్న సమాజం. ఆ సమాజం అలా లేకపోతే ఈ పప్పుసుద్ద వల్ల ఏమీ కాదు.

దైవానిక

ఈ విషయంలో నాకు మాట్లాడే అర్హత రాలేదు కాని నేననుకున్నంత వరకు కొన్ని విషయాలకి వెల కట్టలేము.
అందులో భార్య భర్తి కి చేసేవి, భర్త భార్యకి చేసేవి కూడా ఉన్నాయి. ఇలా ఒక సగానికి వెల కట్టడం నాకు పెద్దగా నచ్చలేదు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

మగవాళ్ళు పప్పుసుద్దలా ?

RG

కొత్తపాళీగారు, నేను సెక్యూరిటీ అనలేదు... సెక్యూరిటీ ఫీలింగ్ అన్నాను. చుట్టూఉన్న సమాజం సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వదనుకుంటా... Infact it works the otherway around.

నేను.. నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అన్న ఫీలింగ్ వల్ల వచ్చే నిశ్చింత గురించి నేను అన్నది.

సగంమంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేది అందుకే అని ఎక్కడో చదివాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

మగవాడు ఆడదానికి సెక్యూరిటీ కాదనేముందు కొన్ని ప్రశ్నలు :

౧. మీకొక కూతురుంటే ఆమెని ఒక మగవాడికిచ్చి పెళ్ళిచేస్తారా ? సమాజానికిచ్చి పెళ్ళి చేస్తారా ?

౨.సమాజమంటే ఏమిటి ? వ్యక్తులే కదా ? మగవాడు వ్యక్తి కాదా ?

౩. మీ కూతురికి ఏదైనా సమస్య వస్తే ఆమె దాని గుఱించి ముందు తన భర్తతో చెప్పుకుంటుందా ? సమాజంతో చెప్పుకుంటుందా ?

౪. మీ కూతురికి పిల్లలు పుడితే వాళ్ళ ఆలనా పాలనా మీ అల్లుడు చూస్తాడా ? సమాజం చూస్తుందా ?

౫. ఒకవేళ మీ అల్లుడు చనిపోతే మీ కూతురికి ఇన్సూరెన్సు డబ్బూ ఆస్తులూ మీ అల్లుడి నుంచి సంక్రమిస్తాయా ? సమాజం నుంచి సంక్రమిస్తాయా ?

తొందఱపడి మగవాళ్ళే మగవాళ్ళ గుఱించి నీచంగా మాట్లాడ్డం అనే పోకడ నేనీ మధ్య గమనిస్తున్నాను. ఇది ఆడవాళ్ళకు ఎంతవఱకు ఆమోదయోగ్యమౌతుందో నాకు తెలియదు. కాని నా వైపునుంచి తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేయక తప్పడంలేదు. మంచీమర్యాదా ఆడజాతి పట్ల చూపించినట్లే మగజాతి పట్ల కూడా చూపించమని మనవి చేస్తున్నాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

నేనేమైనా అతిగా రాసి ఉంటే. సరిహద్దులు దాటి ఉంటే క్షమించండి.

మేధ

ఈ రోజు రేడియో మిర్చిలో అనుకుంటాను, ఇదే టాపిక్క్ మీద, యాంకర్ అందరినీ ఇదే ప్రశ్న అడిగింది... ఆడవాళ్ళు అందరూ టైమ్స్ వాడు రాసినదానికి దగ్గర దగ్గర అంకెలనే చెప్పారు.. మగవాళ్ళు ఆ ప్రోగ్రామ్లో మాట్లడడానికి లేదు ఎందుకంటే దాని పేరే లేడీస్ కాలనీ!

రాధిక

అంకెలు మరీ దారుణం గా వున్నాయండి.పక్కన బ్రేకెట్లలో రాసినవి నిజమే కదా.పురుషులకు నిజాలు తెలియచెప్పడం వరకు ఓకే.కానీ ఇవన్నీ పనిమనుషులు కూడా చేస్తారు.మరి ప్రేమ మాటేమిటి అని మనం అడిగితే, మరి భర్తలు పంచే ప్రేమ మాటేమిటి?కాబట్టి ప్రేమకి ప్రేమ చెల్లు.వాళ్ళు మనకు సెక్యూరిటీ ఇస్తుంటే మనం వాళ్ళకి సమాజం లో మనం ఒక స్టేటస్ గా వుంటున్నాము.[స్టేటస్ సరయిన పదం కాదనుకుంటాను.ఏదో వేరే మాట వుంది.కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు]కాబట్టి అది,ఇది చెల్లు.
మనం చేసినపనికి మనకి ఇవ్వాల్సినదానిలో మన తిండికి,బట్టలకి,ఇతరత్రా అవసరాలకి పోనూ మహా అయితే మనకి నెలకి ఒక వెయ్యో, రెండువేలో వస్తాయి .అంతే.

కామేశ్వరరావు

ఆడవాళ్ళు చేసే ఇంటిపని విలువని గుర్తించాలని అనడం చాలా సబబైన విషయమే! అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే దాన్ని డబ్బుతో విలువకట్టడం అన్నది నాకు మింగుడుపడని విషయం. ఉద్యోగాలు చేసేవాళ్ళని, వాళ్ళు తెచ్చే జీతాన్నిబట్టే విలువకట్టడం లాంటిదే ఇదీను.
"విలువ"కట్టడానికి డబ్బు తప్ప మనకి వేరే ఏ ప్రమాణాలు లేవా?!

krishna rao jallipalli

ఈ ఆదాయ వ్యయాల లెక్కలు వదిలేయండి. ఈ మద్యన జరిగిన అన్ని సంఘటనలలో ఆడ వాళ్లు చనిపోయారా?? మగ వాళ్లు చనిపోయారా?? అది చెప్పండి.

krishna rao jallipalli

ఆడాళ్ళు గొప్పా?? మగ వాళ్లు గొప్పా?? అనే ఈ సోది సొల్లు చర్చలు, నా చిన్నప్పటి నుండి వింటున్నవే.. ఎవరి జీవితాలలోను మార్పు లేదు.

Anonymous

అరె అంత తక్కువ జీతమా?

నేను నా జీతమంతా మా ఆవిడకు జీతం కింద ఇచ్చేస్తున్నానే. అయితే మా బాసు దేవి నాకు చాలా బాకీ అన్నమాట.

-- విహారి

కొత్త పాళీ

@RSG - సెక్యూరిటీకి సెక్యూరిటీ ఫీలింగ్ కి తేడాం ఏంటో సెలవియ్యండి.

@తాడేపల్లి గారు - మగవాళ్ళని పప్పు సుద్దలు అన్నందుకే మీ మనసు నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి. It was a little exaggeration, a figure of speech, used to drive the point home. నాకు పరిచయమున్న పెళ్ళైన మగవారిలో పప్పుసుద్దలు - పప్పుసుద్దలు కాని వారూ సుమారు 50-50 నిష్పత్తిలో ఉన్నారు.
పెళ్ళి అన్నాక భార్యా భర్తా ఇద్దరూ తమ తమ పాత్రలు పోషించాలి, తమ బాధ్యతలు నిర్వర్తించాలి, ఒకరికొకరు తోడు అని గనక మీ ఉద్దేశం ఐతే నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను.
మీరు చెప్పిన ఐదు ప్రశ్నలనే పిల్లలున్న ఒక వితంతు స్త్రీకి, పెళ్ళికాకుండా పిల్లని కన్న ఇంకొక స్త్రీకి అన్వయించి చూడండి. స్త్రీకి సమాజం ఎలాంటి రక్షణ ఇస్తోంది అనేది తెలుస్తుంది.

కొత్త పాళీ

@venu - మహాశాయా .. USA లోనే కాదు, ఎక్కడైనా ఇంటిపనుల్లో ఇల్లాలికి చేదోడుగా ఉన్న భర్తలు లేకపోలేదు. వారికి అభినందనలు. కానీ తమరు వక్కాణించిన USAలోనే తరచూ కనిపించే గృహదృశ్యం ఇదే!
http://onamaalu.wordpress.com/2008/04/15/asahayatahasyalu/

నిషిగంధ

రాధికా, సరైన పదం 'గుర్తింపు ' :-)

సుజాత వేల్పూరి

రాధిక గారితో 100 శాతం ఏకీభవిస్తున్నాను.

netizen నెటిజన్

చదువుకోవడానికి కూడ ఎబ్బేటుగా ఉంటాయి ఇలాంటి వ్యాసాలు. కాని జీవితం అన్న తరువాత కొన్ని మనం అనుభవంలోకి రాక తప్పవు. అలాంటి వాటిల్లో ఇది ఒహటి.

"ఆ ఆంటీ, అంకుల్ మీద అలా వాళ్ళ ట్రాన్సిస్టర్ని విసిరిపారేస్తున్నది ఎందుకని?", అని అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలి?

తిమ్మాపురంలో తన "బాబు" ఆరోగ్యం గురించి చింతించి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన భువనేశ్వరి "ఆలోచన" (ప్రేమ లేదు దోమా లేదు అంటారా) కి ఎంత వెల కట్టాలి?

గాయని పీ.సుశీల భర్తకి ఎంత విలువగట్టాలి?
ప్రతిదానికి ఇలా వెలగట్టుకుంటూ పొవడేమేనా?
ఎదో తమషాకా?
అసలు ఈ ఆలోచనలన్ని సరైనవేనా?

జ్యోతి

అస్సలు నేను చెప్పాలనుకున్న పాయింటు ఎవ్వరు అర్ధం చేసుకోలేదు. లేదా అర్ధం కానట్టు ఉన్నారా? నేను చెప్పదలుచుకున్నది ఇల్లాలు చేసే పనులకు అంత డబ్బులు ఇవ్వమని కాదు. ఒకవేళ ఖరీదు కడితే అంత అవుతుందంట అని. ఇప్పుడు నా విషయం అడుగుతా చెప్పండి. నేను ఉద్యోగం చేయను. నాకు నెలకు ఎటువంటి ఆదాయం అంటూ లేదు. కాని నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను. పైన చెప్పిన వివరాలలో డ్రైవింగ్ తప్ప (కారు లేదు కాబట్టి). కాని నాకు నా స్వంతం అంటూ నెలకు ఖచ్చితమైన ఆదాయం లేదు. నాకు కావాలంటే మావారిని అడగాలి. లేదంటే ఇంటి ఖర్చులకిచ్చిన వాటిలో మిగిలినవి వాడుకోవాలి. తిండి,బట్ట, తల మీద నీడ, అప్పుడప్పుడు కావల్సినవి (అదీ అడిగినవన్నీ కావు) కొనిస్తే చాలా. నాకంటూ స్వంతంగా ఎదైనా కొనుక్కోవాలి, ఖర్చు పెట్టాలి అంటే మావారు ఇచ్చేవరకు ఆగాలి, లేదా ఇవ్వకుంటే కోరికను అణచివేయాలి.అంతేనా. నేను ఇంట్లో చేసే పనిలో సగం బయట చేస్తే నాకు రెండు వేలు రావా అని నేను అనుకోనా. ఇప్పుడు పిల్లలు పని చేస్తున్నారు.వాళ్ళను అడగాలా నాకు డబ్బులివ్వండి అని. అది వారి కష్టార్జితం. అడగాలంటే నాకు అస్సలు ఇష్టముండదు. నాకు స్వంతానికి ఖర్చులు ఉంటాయని వాళ్ళకు తెలీదా. అడగాలా. అదే నాకు నెలకింత అని ఆదాయం ఉంటే. ఈ పరిస్తితి ఉండదు కదా. ఇప్పుడంటే కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కాబట్టి పర్లేదు. ముందు ముందు శరీరం అన్నింటికి సహకరించదు. పిల్లలు ఎవరి జీవితాలు వారివి,అప్పుడు నాకు మందులు, పళ్ళు లాంటివి అవసరం కావొచ్చు. ఎలా మరి? పిల్లలను అడుక్కోవాలా?

ఇలాంటి అమ్మలు, ఇల్లాల్లు ఎంతో మందిని నేను చూసాను. ఇందులో ఆడ, మగ అనే తేడాలు అవి ఎందుకు? ఎక్కువ తక్కువ అనే ప్రశ్నే లేదు?

నిషిగంధ చెప్పినట్టు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యోగం లేని ఇల్లాల్లు ఇంట్లో ఉండి చేసే పనులను గుర్తించండి.అంతే..వాళ్ళకూ ఎన్నో కోరికలు, ఉంటాయి. అది వాళ్ళను మనస్పూర్తిగా నెరవేర్చుకోనివ్వకండి. ఎప్పుడూ ఇంట్లోవాళ్ళకు అన్ని అమర్చిపెట్టడానికే ఉన్నట్టు ప్రవర్తించకండి.

కామేశ్వరరావు

మీరిచ్చిన లిస్టులో చాలా పనులు మా ఆవిడ చెయ్యదండీ!(మా ఆవిడతో ఈ మాట చెప్పేరుకనక, నేనేదో మాటవరసకి అంటున్నాను:-) మరి అలాటప్పుడు, తను కావాలని అడిగితే అంత డబ్బులివ్వాల్సిన అవసరం లేదంటారా?
నా ఉద్దేశంలో భార్యగా, తను ఏ పనులుచేసినా చెయ్యకపోయినా, భర్తసంపాదనలో సమానమైన హక్కు ఉందని నా ఉద్దేశం. అసలిక్కడ హక్కుల ప్రసక్తే రాదు, భర్త సంపాదనైనా భార్య సంపాదనైనా వాళ్ళిద్దరిదీ అన్న భావన వస్తే. అలా రాకపోతే అది దాంపత్యమే కాదు!

నాకూ మా ఆవిడకీ joint-account ఉంది. అయినా తను అందులోంచి తానుగా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఇంటిఖర్చులకి (నావైనా, తనవైనా, ఇద్దరివీ అయినా) కొంత డబ్బు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది తనకి అందుబాటులో. ఒకవేళ అవసరమైనా, తను నన్ను డబ్బడగడం "అడుక్కోడం"కింద ఎప్పుడూ భావించినట్టు నాకయితే తెలీదు. (అన్నట్టు ఇవన్నీ మాటవరసకి కాదు నిజంగానేనండోయ్!)

ఉద్యోగం చేస్తూ కూడా ఆర్థికస్వాతంత్ర్యం లేని భార్యలను కూడా నేనెరుగుదును.

కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళుచేసే పనిబట్టి జీతం ఇస్తేనో, లేదా ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటేనో - అసలు సమస్య తీరిపోతుందని నేననుకోను. నిజమైన దాంపత్యమంటే ఏవిటో భార్యాభర్తలిద్దరూ గుర్తించి, ఒకరిమీద ఒకరు గౌరవంతో కలిసి బతకడమే దీనికి పరిష్కారం. అలాటి దాంపత్యంలోని విలువని గుర్తించి, ఆలాటి ఆలోచనలని ప్రజలలో కలిగించడం సంఘం (అంటే మనమే!) బాధ్యత.

SD

భైకా గారూ
జాయింట్ అక్కౌంట్ సంగతి బానే ఉంది గానీ, అందులోంచి తొంభై శాతం నాకు, మావాళ్ళకీ మాత్రమే ఇవ్వాలి లేకపోతే నీకు నిప్పూ లేదు నీరు లేదు అంటే మాత్రం కష్టం. అసలు దాంపత్యం లో దెబ్బలాటలు రావడానికి ఇదే నెంబర్ వన్ కారణం.

నాకో తెల్సినావిడ ఉండేది (ఇప్పుడు లేరు లెండి. చాలా దగ్గిర బంధువే) ఆవిడకి పెళ్ళవలేదు. ఆవిడ ముఖ్య సిద్ధాంతం ఇది - మగాళ్ళంతా వెధవలు. కానీ డబ్బులు కావలిస్తే మాత్రం ఆవిడ ఏమాత్రం సిగ్గు లేకుండా ఆవిడ నాన్నగారి దగ్గిరా, తమ్ముళ్ళ దగ్గిరా నిరభ్యంతరంగా తీసుకునేది. అప్పుడు మాత్రం మగాళ్ళందరూ వెధవలని గుర్తు ఉండేది కాదు కాబోలు.

కామేశ్వరరావు

బండిగారూ,
మీరు కొంచెం తీవ్రవాదిలా ఉన్నారే:-)
లోపాలనేవి ఆడవాళ్ళలోనైనా మొగవాళ్ళలోనైనా ఉంటాయి. తాగుబోతు భర్తలలానే గయ్యాళిభార్యలూ ఉంటారు. అయితే సాంఘికంగా(మొత్తం సమాజం గురించి) ఆలోచించాలంటే, మనకి తెలుసున్న ఉదాహరణలు మాత్రం తీసుకుంటే సరిపోవు. గణాంకాలూ, సాంఘిక కట్టుబాట్లూ వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆలా చేస్తే, ఆడవాళ్ళు సమాజంలో మగవాళ్ళ అణచివేతకి గురయ్యారన్న వాస్తవం బోధపడుతుంది. ఇప్పుడా పరిస్థితి చాలామారింది కానీ ఇంకా పూర్తిగా ఆ మార్పు జరగలేదు. ఉదాహరణకి, పెళ్ళవ్వగానే ఆడది భర్తకుటుంబలోని వ్యక్తిగా మాత్రమే గుర్తింపబడాలి అన్న ఆలోచన ఇంకా అధికశాతం చదువుకున్నవాళ్ళలో కూడా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రులని, కొడుకు తెచ్చి ఇంట్లోపెట్టుకుని చూసుకున్నంతగా కూతురు తెచ్చి ఇంట్లోపెట్టుకు చూసుకోడం అంత సులభం కాదు.
ఇలా ఆలోచిస్తే ఇంకా చాలా అసమానతలే ఉన్నాయి...
నేను చెప్పదలచుకున్న విషయం ఒకటే. వీటిని ఆర్థిక దృష్టితో చూడడం తప్పని.

మేధ

నాకు ఈ కామెంట్స్ అన్నీ చదువుతున్నప్పుడు ఒక కధ గుర్తుకు వస్తోంది.. దాంట్లో కూడా ఆ ఇల్లాలు ఇంట్లో అందరికీ అన్నీ చాల మంచిగా అమర్చిపెడుతూ ఉండేది. బాగా చదువుకున్నా కూడా ఇంట్లో అందరినీ చూసుకోవడం కష్టమవుతుందని ఉద్యోగం చేసేది కాదు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ తోడికోడలు ఉద్యోగం చేస్తుంది. ఈమెని అందరూ బాగా చూసుకుంటారు. ఇంట్లో కూడా ఈవిడ మాటే చెల్లుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ హడావిడితో సరిపోయేది, తరువాత వాళ్ళు స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుండి, ఇంట్లో అంత తోచేది కాదు. అదీ కాక ఆవిడకి ఏమైనా కావలంటే, భర్తనో, మామగారినో, మరిదిగారినో, తొడికోడలినో అడుగుతూ ఉండాల్సి వచ్చేది. దీనితో, ఆవిడలో ఉద్యోగం చేయాలన్న కోరిక పెరిగిపొతుంది. చివరికి ఉద్యోగం లో చేరడానికి నిశ్చయించుకుంటుంది.

ఇంట్లో ఒప్పుకోరు. నాకు ఆర్ధిక స్వాతంత్ర్యం కావాలి అంటే భర్త మనిద్దరికీ కలిపి జాయింట్ ఎక్కౌంట్ ఉంది కదా, నీకు కావల్సినంత తీసుకో అంటాడు. కానీ అది ఆవిడకి నచ్చదు. ఎలాగైతేనేమి ఉద్యోగంలో చేరుతుంది. డబ్బులు ఐతే వస్తున్నాయి కానీ, ఇంట్లో పనులు, అక్కడ పనులు చేయలేక ఆరోగ్యం దెబ్బ తింటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఆలోచిస్తారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని. చివరికి తన పేరు మీద ఒక అక్కౌంట్ ప్రారంభించి, దాంట్లో ప్రతి నెలా అందరూ కొంత మొత్తం వేయాలని నిశ్చయించుకుంటారు. అలాగని ఆమె ఆ డబ్బుని విచ్చలవిడిగా ఏమీ ఖర్చ్చు పెట్టేది కాదు. కానీ ఆమె ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలిగింది. ఆ కధలో తోడికోడలు అంటుంది, అక్కా నేను ఆడదాన్నయి ఉండి, ఉద్యోగం చేస్తూ ఉండి కూడా, నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను అని! కధ కాబట్టి, సుఖాంతం అవుతుంది. కానీ నిజ జీవితంలో మాటేంటి..?

అలా అని ఇది ఎవరూ కావాలని చేస్తారు అని అనను, కాకపోతే తెలియకుండానే, అవతలి వాళ్ళని బాధపెట్టడం జరుగుతోంది

Bolloju Baba

ఈ టాపిక్ చాలా హాట్ గురూ అంటూ లోపల అంతరాత్మ చెపుతున్నా, నేనూ వేలు పెట్టేస్తున్నా........

ఏవైన పనులు ఉద్యోగ ధర్మంగానో, లెక జీవికకోసమో చేసింప్పుడు, ఆయా పనులను బట్టి, వెచ్చించిన సమయాన్ని బట్టి ఆపని విలువను డబ్బురూపంలో తూచటం జరుగుతుంది.
కానీ ఇద్దరు వ్యక్తుల మద్య ముఖ్యంగా కుటుంబసబ్యులమద్య (మరీ ముఖ్యంగా భార్యా భర్తల మద్య) ఒకరికొకరు చేసె పనులకు విలువకట్టటం ధర్మమా?

ఇక్కడ చేసే పనులు ఐచ్చికంగా చేయబడతాయి (చాలా సందర్భాలలో, ముఖ్యంగా మద్యతరగతి కుటుంబాలలో) లాభనష్టాలు బేరీజువేసుకొని కాపురం చేస్తారా? (అలా ప్రవర్తించే కుటుంబాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం గురించే నేను మాట్లాడుతున్నాను, ఫ్రీక్స్ గురించి రెలిక్స్ గురించీ కాదు)

ఈ ఐచ్చికతా కోణంలో బహుసా స్త్రీ ఎక్కువగా ఇవ్వవలసి రావటం కొంతమందికి అన్యాయమనిపించవచ్చు. కానీ పురుషుడు పాత్ర లేనే లేదని భావించటం మరీ, మరీ అన్యాయం.

చాలా కుటుంబ సభ్యుల మద్య జరిగే చాలా చాలా విషయాలకు వెలకట్టలేము.
చిన్న ఉదాహరణ: నేను 3 సంవత్సరాల వయసులో ఉండగా తీవ్రమైన సుస్తీ చేస్తే, మా అమ్మ నన్ను భుజాన వేసుకొని అర్ధరాత్రి, 2 కి.మీ దూరంలో ఉన్న హాస్పటలు కు రొప్పుకుంటూ, రొప్పుకుంటూ పరిగెట్టుకొని తీసుకువెళ్లటానికి ఎవరూ ఖరీదు కట్టలేరు. (ఈ విషయం ఆ దృశ్యాన్ని చూచిన వ్యక్తి చెప్పితే, అవునా అని అమ్మను అడిగినపుడు నిజమే అప్పుడు నాకేం చెయ్యాలో తోచలేదు అని అమాయకంగా అన్నప్పుడు నేనేం చెప్పగలిగాను ) ఇటువంటి సంఘటనలో లేక ఇంతకంటే బలమైనవో ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉండవా? వాటిని తూచే తూనికరాళ్ళు మనవద్ద ఉన్నవా అని ప్రశ్నించుకోవాలి?

ఆత్మీయులకు నలతగా ఉన్నప్పుడు గుండెల్లో ఎంప్టీనెస్ ను తూచగలరా ఎవరైనా?
అన్నాలు తింటున్నప్పుడు ఈ ముక్క తిను బాగుంటుంది అని మనకంచంలోని మంచి ముక్కలను ఎదుటివారికివ్వటాన్ని ఎంత రేటుకు రేట్ చేస్తారు.
తల్లితండ్రులకు దగ్గరగా ఉండాలని మంచి దూరపు ఉద్యోగాలను ఒదులుకొని చిన్న ఉద్యోగాలు చేసే వారు లేరంటారా?

ఇట్లాంటి చాలా చాలా విషయాలను తూకం వేసే రాళ్లు మనదగ్గర లేవు. కుటుంబ సంభంధాలు అనేవి చాలా వరకు లాభనష్టాలకు అతీతంగానే సాగుతాయి. ఎదో సినిమా డైలాగు అనుకోకపోతే భార్యాభర్తల మద్య సంబంధం గురించి a wife and husband should be like water and fish and not like fish and fisherman.

ఇక్కడ నీరు పెద్దది చేపచిన్నది అని రంద్రాన్వేషణ చేయటం తగదేమో. నీరు లేకపోతే చేపలేదు, అదేవిధంగా చేపలేకపోతే నీటిలో జీవం లేనట్టే అని అర్ధాన్ని తీసుకోవచ్చు.

ఇలాంటి విషయాలకు (పనులే కావచ్చు కానీ నాదృష్టిలో అవి చాలామట్టుకు ఐచ్చికంగా చేసేవి) రేటింగ్ ఇవ్వటాన్ని మానవసంభందాలమీద వేసే ఒక ప్రాక్టికల్ జోక్ గా నేను తీసుకుంటున్నాను.

బొల్లోజు బాబా

Bolloju Baba
This comment has been removed by the author.
Bolloju Baba

జ్యోతిగారు నా కామెంటులోని ఆఖరు వాక్యం మీగురించి కాదండోయ్. టైమ్స్ వాడిపైన.
మంచి డిస్కషను పెట్టారు మీరు. థాంక్స్
బొల్లోజు బాబా

Chandra A

c

Chandra A

This article seems to be written by some cheap editor at Times. If everything costs something, nobody would live in this world. In that case wife can also asks some money for sex. Infact even husband can demand some money for the sex. I like the first comment by RSG. By all means why you are calling "Sreevaru" I dont understand. Your husband either is not so good guy or killing all of your ambitions with out giving proper recognition. You better do not generalize it on a gender.

SD

భై.కా గారూ
నేను చెప్పింది ఒకావిడ నైజం. నేను రాసిన కామెంట్లో తీవ్రవాదం మీకు ఎక్కడ కనిపించిందో కాస్త శెలవిస్తారా? తీవ్రవాదం? చాలా విచిత్రంగా ఉందే? థేంక్సు.
బండి సున్నా

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008