Wednesday, August 13, 2008

విజ్ణానవంతమైన విల్లు రాద్దాము రండి...
అందరికీ నమస్సుమాంజలి. సుస్వాగతం


ఇటీవలి కాలంలో అంతర్జాలంలో తెలుగు వాడకం బాగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు బ్లాగులలో. కానీ మనమందరం చేయాల్సిన పన్లు ఇంకా చాలా ఉన్నాయి. అదీ మన మాతృభాష తెలుగులోనే. చాల సులువుగా చేయదగినవే. ఈ పని ఒక్కరి వల్ల అయ్యేది కాదు. సమిష్టిగా పని చేస్తే సాధించగలిగిన ఒక అద్భుతం. వీవెన్ చెప్పినట్టు ఇది శ్రమదానం కాదు. ఇది మనకోసం మన తర్వాతి తరం కోసం వారసత్వంగా ఇవ్వగలిగే జ్ఞాన సంపద. బ్లాగులు రాయడం మన సంతోషం కోసం.కాని వికీపీడియాలో రాయండి వేలాది తెలుగు వారికోసం. ఈ రోజుల్లో తెలుగు కన్నా ఇంగ్లీషు బాష ఎక్కువగా వాడుకలో ఉంది. మన పిల్లలకు బలవంతంగా తెలుగు నేర్పించాల్సి వస్తుంది. అది మన దురదృష్టం. కాని అరవై దశకంలో ఫ్యాషన్లు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఐనట్టు చాల కొద్ది కాలంలో మళ్ళీ అందరూ తెలుగును ఉపయోగిస్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని అప్పుడు వారికి కావాల్సిన సమాచారం , విజ్ఞానం తెలుగులో దొరకాలి కదా. ఇప్పుడు మనం శ్రమ అనుకోకుండా మనకు తెలిసిన సేకరించిన, తెలుసుకున్న విలువైన సమాచారాన్ని మనవరకే దాచుకోకుండా అది పదిమందికి, రాబోయే తరానికి అందుబాటులో ఉండేలా తయారు చేసి పెడదాము. ఎక్కడ అంటారా? వికీపీడియాలో. ఇందుకోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. వారాంతం లో కనీసం ఆదివారం రోజు ఒక్క గంట అయినా వికీపీడియా కోసం కేటాయించండి. మీకు తెలిసిన సమాచారం రాయండి. లేదా అనువాదాలు చేయండి. ఇప్పుడు అది మీకు ఎటువంటి లాభం ఇవ్వలేకపోవచ్చు కాని ఎందరికో ఉపయోగపడే విషయాలు వికీలో పొందుపరిచామన్న సంతృప్తి లభిస్తుంది. వికీలో ఎం రాయాలి అనుకుంటున్నారా ? సినిమాలు, మీ ఊరి విశేషాలు, లేదా వంటకాల గురించి, సాంకేతిక సమాచారం, ఆటలు, పాటలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. వికీలో మీ అడుగులకు ఎల్లవేళలా సాయం చేయడానికి ఎందఱో ఉన్నారు. రండి మరి.

తెలుగు వికీపీడియా

వికీపీడియా :ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు,
ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.

వికీ వ్యాఖ్య

వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు,
వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి,
తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి! తెలుగు వికీవ్యాఖ్యలో ఇప్పటివరకూ 84 పేజీలు తయారయాయి.
ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు సామెతలు ఉంటాయి. సహాయ పేజీని
సందర్శించో ఇక్కడ ఎలా మార్పులు చేర్పులు చేయాలో నేర్చుకోండి. అంతేకాదండోయ్ ఇక్కడున్న ఏ పేజీనయినా
మీరు ఇప్పటికిప్పుడు మార్చేయవచ్చు.

విక్షనరీ

తెలుగు పదాలకు అద్భుతమైన నిఘంటువు.

తెలుగు పదం

కొత్త పదాల సృష్టి, అందుకు కావలసిన సముదాయిక చర్చా వాతావరణాన్ని కల్పించడం తెలుగుపదం.ఆర్గ్ సైటు ప్రధాన లక్ష్యం. ఔత్సాహికులు కొందరు (తమతమ బ్లాగులలో, సందేశాల్లో) వివిధ ఆంగ్ల భాషా పదాలకు తెలుగు పదాలను సృష్టిస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించడం కూడా ఒక అనుబంధ లక్ష్యం.

ఇది నిఘంటువు కాకపోయినా, ఇక్కడున్న తెలుగు పదాల్ని వాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ పోగయ్యే పదసంపద అంతా అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయత్నంలో మిమ్మల్నికూడా పాలుపంచుకోమని ఆహ్వానిస్తున్నాం. కొత్త తెలుగుపదాల కొరకు అభ్యర్ధనలు, సందేహాలు, మీ ప్రతిపాదనలు తెలుగుపదం గూగుల్ గుంపులో చర్చించవచ్చు.

బీటావికీ

మీలో చాలా మందికి తెలుగు వికీపీడియా, మరియు ఇతర అన్ని వికీపీడియాలకు మీడియావికీ అనే సాఫ్టువేరును వాడతారని తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మీడియావికీ సాఫ్టువేరు User Interfaceను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అనువదిద్దామనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. అందుకోసం, అనువదించటాన్ని సులభతరం చేయటానికి బేటావికీ అనే సాఫ్టువేరును కూడా తయారు చేసారు. ఈ సాఫ్టువేరును మీడియావికీ డెవలపర్లు తయారు చేసారు ఇతర వివరాలు ఇక్కడ చదవండి.


పైవాటిలో మీకు నచ్చిన, సులభమైన అంశాలలో రాయడం ప్రారంభించండి. రేపటి తరానికి ఎప్పటికీ తరిగిపోని ఆస్థినిస్తు విల్లు రాయండి.

1 వ్యాఖ్యలు:

సుధాకర బాబు

జ్యోతి గారూ! వికీపీడియా కృషిని గురించి చక్కని సందేశాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. తెలుగులో వ్రాయడానికి ఇప్పటికే అలవాటు పడిన మన బ్లాగర్లు మరికొంత చేయూతనిస్తే ఈ ప్రయత్నానికి మరింత చైతన్యం లభిస్తుంది.


బ్లాగర్లందరికీ మనవి. ముందుగా మీ వూరి గురించి తెలుగు వికీలో వ్రాయండి. ఇతరులను కూడా అందుకు ప్రోత్సహించండి. ఆంధ్రప్రదేశ్‍‌లోని 25,000 పై చిలుకు గ్రామాలకు, ఒక్కో వూరికీ ఒక్కో వ్యాసం వ్రాసే ప్రయత్నం ఇంతకుముందెన్నడూ తెలుగు రచనా చరిత్రలో జరుగలేదు. ఈ బృహత్కార్యానికి సహకరించమని అందరినీ కోరుతున్నాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008