నీ నవ్వే చాలు...
కమ్ముకున్నమబ్బుల మాటు నుండి చందమామ కొంటెగా తొంగి చూడడం మొదలెట్టాడు.. ఆ అద్భుతదృశ్యం మనోఫలకంలోకి చేరడం ఆలస్యం ముడుచుకుపోయిన మనసుపైన ఆహ్లాదం పరుచుకుని మోముపై ముగ్ధమనోహరంగా దరహాసం వెల్లివిరవడం మొదలైంది. ఒక్క చిరుదరహాసం మన మోముకి ఎంత అందం ఆపాదించిందీ..! మన దరహాసపు సమ్మోహనశక్తి ముందు చందమామ కాంతూలూ, కళలూ వెలవెలబోవట్లేదూ..? ఆనందంతో వచ్చిన అందం చూపరుల్ని ఎంత సమ్మోహితం చేస్తోంది! "మైమరిపింపజేసే మరొక్క నవ్వు కోసం " మన మోము వైపు ఎన్ని కళ్ళు తనువెక్కడ ఉన్నా దృష్టిని మనవైపు నిలిపి వేచి చూస్తున్నాయీ..? స్వచ్చంగా చిన్నపిల్లల్లా మనం నవ్వుతుంటే శత్రువులు సైతం ఒక్క లిప్తపాటు తాదాత్మ్యంలో మునిగిపోవట్లేదూ! కళ్ళల్లొ వెలుగు నిండుతూ మొహం విచ్చుకుంటుంటే కమలం కూడా మన అందం ఓర్వలేక కుంచించుకుపోదూ! పడుచుపిల్ల కొంటె నవ్వుని చాటుగా మనసులో పదిలపరుచుకోవడానికి ఎన్ని యువ హృదయాలు దొంగచాటుగా చూస్తుంటాయి.
బుడిబుడి అడుగుల బుడ్డోడు మొహమంతా నవ్వు నింపుకుని పలకరిస్తుంటే పట్టనట్లు సాగిపోవడం ఎంతటి కఠినాత్ములకైనా సాధ్యమా...? " నీ భవిష్యత్‌కి మేమున్నాం కన్నా" అంటూ కన్నవారు నిశ్చింతగా నవ్వుతుంటే భరోసా నింపుకోని పిల్లలెవరుంటారు? కొంటె చేష్టలతో కవ్విస్తూ జీవిత భాగస్వామి నవ్వుల పూవులు పూయిస్తుంటే తన్మయత్వం తన్నుకురాదూ..! ఇవాళా రేపా అన్నట్లు వెళ్లదీస్తున్న నానమ్మ మొహంలో అరక్షణం పాటైనా వెలుగురేఖలు పరుచుకుంటే సంతృప్తిగా సంతోషించని వారెవరుంటారు? ఎవరైనా తనివితీరా నవ్వుతుంటే, ఎంతసేపైనా మంత్రముగ్దులమై అలానే చూడాలనిపించదూ. అలా ఐస్ చేసే అదృష్టాన్ని మిస్ అవుతున్నట్లు అనిపించడం లేదూ! మరెందుకు ఆలస్యం. ఎప్పుడూ ఉండే కష్టాల్ని, నష్టాల్ని, విచారాల్ని,ఈతి బాధల్ని కొంతసేపైనా జ్ఞాపకాల్లోకి నెట్టేసి మనసారా నవ్వుకుంటే ఎంత బాగుంటుంది? ఒక్క సంతృప్తికరమైన నవ్వు మన జీవితం పట్ల మనకుఎంత నమ్మకాన్ని పెంచిందో చూడండి. అంతకు మించి ఇన్నాళ్ళూ ముడుచుకుపోయిన మన మొహాల్లో ఆనందం తాండవిస్తుంటే మన ఆత్మీయులు ఎంత సంతోషాన్ని మూటగట్టుకుంటున్నారో గమనించండి. భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన వరాన్ని ఫోటో ఫ్రేమ్ లకే పరిమితం చెయ్యకుండా జీవితపు ప్రతీ ఫ్రేమ్ లోనూ సద్వినియోగం చేసుకుంటే జీవితం ఎంత మనోహరంగా ఉందో కదా! మన దరహాసం కోసం ఎందరో అభిమానులు క్యూలు కట్టి ఎదురుచూస్తుంటే బాక్సులు రాని థియేటర్‌లా నిరాశపరచడం ఏమైనా భావ్యమా చెప్పండి! ఇకనైనా పలకరింపు నవ్వులకు చిట్లించుకుని చూడడం మానేసి మనమూ ఓ నవ్వు విసిరేసి అవతలి వారిని ఫ్లాట్ చేసేద్దామా.. ఎవరి నవ్వులోని సమ్మోహనశక్తి ఎంతో పోటీలు పెట్టుకుని మరీ అరమరికలు లేకుండా జీవితాంతం ఆనందంగా నవ్వుకుందామా!
మీ నల్లమోతు శ్రీధర్.
2 వ్యాఖ్యలు:
నవ్వుల్లో చాలా పవరుందండోయ్! ఒప్పుకుని తీరవలసిందే. కానీ మీరు "అరనవ్వు"ల గురించి చెప్పనందుకు కొంచెం గుర్రుగా ఉంది.
కత్తి మహేష్ కుమార్ గారు, అరనవ్వుని గుర్తుతెచ్చుకోండి, గుర్రు గాలికిపోతుంది. బుర్రలో వెలగలేదు.
Post a Comment