Friday, October 3, 2008

అనుబంధం - అనుమానం


నేను కవితలు, కావ్యాలు రాయలేను, అంతగా అర్ధం చేసుకోలేను.   పురాణగ్రంధాలు చదవలేదు. ఏదో అప్పుడప్పుడు  పౌరాణిక సినిమాలు చూడడం తప్పితే. మనదంతా దిన, వార పత్రికల చదువే. కొద్దిరోజులుగా బ్లాగ్లోకంలో జరుగుతున్నా ఒక చర్చ గురించి నా అభిప్రాయం. ఇది ఒక మామూలు గృహిణిగా నా ఆలోచనలు. తప్పైతే సరిదిద్దండి.
ఇద్దరు మనుష్యుల మధ్య మొదట్లో ఉండేది పరిచయం. కాస్త దగ్గరైతే అది బంధం అవుతుంది. అది స్నేహబంధం, వివాహ బంధం, వ్యాపార బంధం ఏదైనా కావొచ్చు. ప్రాణంలేని వస్తువుల మధ్య ఎటువంటి బంధం ఉండదు.అది అందరికీ తెలుసు. ఒక స్త్రీ, పురుషుడు వివాహంతో ఒక్కటవుతారు. అది ఎప్పటికి విడదీయలేని అనుబంధం అవుతుంది. అది ఒకరిమీద ఒకరికి ప్రేమ,నమ్మకం ఎల్లప్పుడు చెక్కుచెదరకుండా చేస్తుంది. అదే ప్రేమ, నమ్మకంతో వాళ్లిద్దరు  వంశాన్ని విస్తరింపజేస్తారు. ఇది అందరికీ తెలిసిందే..
కాని ఆలుమగల మధ్య  అనురాగం తప్ప అనుమానం అనేది చోటు చేసుకోకూడదు. నేను దేవుడిని మనస్పూర్తిగా నమ్ముతాను. కాని రామాయణంలో భార్యను అనుమానించడం అన్నది నాకు బాధ కలిగించె విషయం. రామాయణంలో రావణవధ అనంతరం రాముడు సీత శీలాన్ని శంకించాడు అని మన మిత్రులు పద్యాల ఉదాహరణలతో చూపించారు. సీతకు పెళ్లి అప్పుడు ఇరవై  ఏళ్లు కూడ ఉండవు. కాని భర్తదే లోకం అనుకుని అతనితో వనవాసానికేగింది. పదమూడేల్లు వనవాసం అనంతరం రావణుడు సీతను మాయోపాయముతో అపహరించాడు. సంవత్సరం తర్వాత రాముడు వానరమూకతో లంకపై దండెత్తి రావణాసురుడిని సంహరించి తన భార్యను చెరనుండి విడిపించాడు. చెరనుండి వచ్చిన సీతను రాముడు అనుమానించాడు. నిన్ను అయోధ్యకు కళంకితలా ఎలా తీసుకువెళ్లాలి అన్నాడు. అంత తల్లి అవమానభారంతో అగ్నిదేవుడిని ఆశ్రయించింది. కాని అగ్నిపునీత గా బయటకు వచ్చింది. దానితో ఆమె కళంకం తొలగి రాముని పత్నిగా అతనితో అయోధ్యకేగింది.
సంధర్భంలో రాముడు సీతావియోగంతో ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు.  కాని ఆమె శీలాన్ని అనుమానించాడు. దానికి పలు కారణాలు కూడా చూపెట్టడం జరిగింది. ముఖ్యమైనది రాముడికి సీతపై కోపం వచ్చి అలా అన్నాడంటూ సమర్ధన. కాని సీత భర్తతో  బంగారు లేడిని తెచ్చిమ్మని కోరుకోవడం తప్పా? అలా కొరుకోవడం వల్లనే కథంతా జరిగి యుద్ధంలో ఎన్నో వేల మంది మరణించారని రాముడికి కోపం వచ్చిందంట. కాని అసలు ఎన్నడు కనని, వినని బంగారు లేడి ఎలా వచ్చింది ? ఎందుకు వచ్చింది? రావణుడి సోదరి శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? దాని వర్యవసానమే కదా సీతాపహరణ. సీత తనంతట తానుగా రావణుడితో వెళ్లలేదు. మరి ఆయమ్మను అనుమానించడం ఎందుకు? అపహరించబడిన తన భార్యను కాపాడుకోవడం ప్రతి భర్త కర్తవ్యం కదా. ఇందులో సీత తప్పు ఎక్కడుంది. అది గాక హనుమంతుడు కూడా సీత ఎటువంటి దీనావస్థలొ ఉందో రాముడికి తెలియజేసాడు. అలాంటి సీతను రావణుడు  ఏమి చేయకుండా వదిలిపెట్టాడంటే రాముడు నమ్మలేదు. రాముడు నమ్మినా లోకం నమ్మదంట. అందువలన  రాముడు , తన భార్యను వేరే ఎవరినైనా వివాహము చేసుకోమని చెప్తాడు మాట విన్న సీత ఎంత బాధపడిందో కదా? ఇలా మాటలతో అవమానించడం  ఎంతవరకు సమంజసము. రాముడు కూడా ఏడాది కాలం సీతకు దూరంగా ఉన్నాడు అలా అని సీత అనుమానించలేదే అతని శీలాన్ని. ఆమె కూడా ఇదే మాట అనలేదే? రాముడు ఏకపత్నీవ్రతుడు అని కలకాలం నిలవాలి కాని సీత మాత్రం కళంకిత అని ముద్ర వేయించుకోవాలా?? సీత తన ఇష్టంతో రాముడిని వదిలి రావణుడితో వెళ్లలేదు. తనను కాపాడటానికి అంతమంది వీరులను చంపమనలేదే? మరి ఇలా ఎందుకు జరిగింది. అందరి ముందు తన శీలాన్ని తన భర్తే శంకిస్తే తల్లి ఎంత విలవిలలాడిందో  ఎవరికైనా ఆలొచన కలిగిందా? భర్తను ప్రేమించే ఒక ఇల్లాలిగా భర్తే శీలాన్ని శంకించడం అంటే ఆడదానికి అంతకంటే అవమానం ఉండదు. నీచమైన అభియోగానికి ఆమె తగలపడిపోవడమే మేలు. ఎవరో బయటివాళ్లు అంటే ఆమె ఎదురుతిరుగుతుంది. లేదా పట్టించుకోదు. కాని కలకాలం తోడుండాల్సిన భర్త అందునా ఇన్నేళ్లు కాపురం చేసిన వాడు తన ప్రవర్తన మంచిది కాదు చెడిపోయింది అంటే ఇల్లాలు భరిస్తుంది. దీని గురించి ఎక్కడైనా వివరించారా?? నాగరాజుగారు చెప్పిన పద్యాలు నేను మొత్తం చదవలేదు. ఇది శరీరానికి తగిలిన దెబ్బ కాదు. మనసుకు తగిలిన కోలుకోలేని గాయంఐనా ఆమె క్షమించి అయోధ్య కేగింది
అయోధ్యలో పట్టాభిషేకం తర్వాత అంతా సుఖంగా ఉన్నారు. సీత గర్భవతి ఐంది. మళ్లీ రాజ్యంలో ఎవడో ఒక చాకలోడు తాగి తన పెళ్లాన్ని కొడుతూ" రాముడు రాజు కాబట్టి పరాయి మొగుడి దగ్గర ఏడాది ఉన్న సీతను తెచ్చుకున్నాడు " అని వాగుతాడు. ఇది తెలిసిన రాముడు నిండు చూలాలు ఐన సీతను కారణం చెప్పకుండా అడవికి పంపాడు. రాముడు రాజ్య ప్రజలకందరికి మార్గదర్శి. అతనికి తనకంటూ వ్యక్తిగత జీవితం ఉండదు. ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాలి. సరే మరి తన భార్య సంగతేంటి. ఆమె కూడా రాజ్యంలో ఒక వ్యక్తి కదా. అన్యాయం చేయొచ్చా మరి. ఆమె చేసిన తప్పేంటి? తప్పు చేయని భార్యను అడవులకు పంపొచ్చా. ప్రతి దానికి ఏదో కారణం  ఉంది. అన్నీ పురుషుడికి అనుకూలంగా ఉన్నాయి. మరి సీత బాధ సంగతి ఎవరైనా వివరించారా? తన భార్య సుగుణవతి అని రాముడికి తెలుసు. మరి అది చెప్పి ఆమెను కాపాడడం అతని కర్తవ్యం కాదా ?  ఎవడో ఏదో అన్నాడని ఆమెను వదిలేయడమేనా. మళ్ళీ బాధపడ్డమెందుకు?? రాముడు కూడా తన భార్యను అమితంగా ప్రేమించాడు. సరే. మధ్యలో అనుమానం ఎందుకు.
అలనాటి రాముడే కాదు ఈనాడు కూడా ఎంతో మంది భార్యాభర్తలు అనుమానంతో తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సినవాళ్లు ఇలా అనుమానంతో  మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరికి అనురాగం, ప్రేమ , నమ్మకము ఉండాలి. తల్లితండ్రులు, పిల్లలు ఎప్పుడు తోడుండరు. చివరిదాకా తోడుండేది భార్యభర్తలే . అలాంటపుడు అనుమానం ఎంత నీచమైనదిమగాడు తప్పు చేస్తె ఊరందరికి తెలుస్తుంది.కాని ఆడది తన పక్కనున్న మొగుడికి కూడా తెలియకుండా తప్పు చెయగలదు తలుచుకుంటే అని అంటారు . కాని అలా చేయదు. ఒక అపరిచిత వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఆతని జీవన సహచర్యం కోసం తన వారినందరిని వదిలి అతనితో ఉండాలని వస్తుంది ఆడది. భర్త ఆమె ప్రవర్తన మంచిది కాదు అంటే ఆమెకు ఎంత బాధ కలుగుతుందో అది మగవాళ్లకి అర్ధం కాదు. గాయం మానేది కాదు. ప్రతి క్షణం అనుమానించే మొగుడితో కాపురం నరకంగా ఉంటుంది ఇల్లాలికిఅదే భార్య అనుమానిస్తే భర్త కోపంతో చేయిచేసుకోవచ్చు. తిట్టొచ్చు, లేదా నిజంగానే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ఏమంటే మొగాడు ఏది చేసినా చెల్లుతుంది అంటారు. కాని ఆడది అలా చెయలేదే. పిల్లలు, కుటుంబం , బంధువులు ఇలా అందరి గురించి ఆలోచించి విషయంలో గొడవ చేయదు. ఐనా ఇది పదిమందితో చెప్పుకుని చర్చించే  విషయమా? కాని భర్త తన భార్యను అనుమానించడమంటే తనను తాను అనుమానించుకోవడమే. అంత కంటే పెద్ద అవమానం ఉండదు
నేను స్తీవాదిని కాను, పురుషవాదిని కాను. అన్యాయం జరుగుతుంటే సహించలేను అంతేనేను చెప్పిన విషయాలు వాస్తవంగా చూసిన సంఘటనలే. మొగుడిని అనుమానించి అతని జీవితం నరకం చేసి , పోలీసు కేసు కూడా పెట్టిన మహా ఇల్లాలు ఉంది. పెళ్లయిన ఎన్నో ఏళ్లకు భర్త అనుమానించిడంతో  మానసికంగా కృంగిపోయి చావును కోరుకుంటున్న ఇల్లాలు ఉందిపెళ్లాం అంటే అది నా ఆస్థిలాంటిది,  ఏమైనా చెయొచ్చు , ఏమైనా అనొచ్చు అనే మగాళ్లుంతవరకు రోగం తగ్గదేమో.
అలా అని అందరూ మగాళ్లు ఇలా లేరు

24 వ్యాఖ్యలు:

sujata

మంచి విచారం. చాలా బాగా విడమరచి చెప్పారు జ్యోతి గారు. అది అనుభవిస్తే గానీ తెలియని బాధ. నాకెప్పుడూ డౌట్ - సీత అగ్ని లో పడి చనిపోయుంటే ఆవిడ పతివ్రత కాదని ప్రూవ్ అయి ఉండేదా లేదా రాముడు మనసు లేని మనిషి అని ప్రూవ్ అయి వుండేదా ?

నల్లమోతు శ్రీధర్

జ్యోతక్కా, వండర్ ఫుల్ పోస్ట్!

Purnima

హమ్మ్...!

భైరవభట్ల కామేశ్వర రావు

జ్యోతిగారు,

మీకు సంతృప్తిని ఇస్తుందో లేదో నాకు తెలీదు కాని, ఈ విషయమైన్ నాకున్న అభిప్రాయం ఇది:

రాముడు సీతని అనుమానంతోనో, అవమానించడానికో అలా మాట్లాడ లేదు. రాముడికే సీతమీద అనుమానం వస్తే, అగ్ని కాదు కదా బ్రహ్మాదులు దిగివచ్చినా నమ్మే మనిషి కాదతను.
నిజంగా సీతమీద అనుమానమే ఉంటే, సీతని కావాలంటే లక్ష్మణుడి దగ్గరో భరత శత్రుఘ్నులవద్దో ఉండమని ఎందుకంటాడు? అప్పుడు మాత్రం తమ వంశప్రతిష్ఠకి నష్టం రాదా?

ఈ సందర్భంలో వాల్మీకంలో ఒక శ్లోకం ఉంది:

పశ్యతస్తాం తు రామస్య సమీపే హృదయప్రియాం
జనవాదభయాద్రాజ్ఞో బభూవ హృదయం ద్విధా

దీని అర్థం, హృదయప్రియమైన సీత దగ్గరగా ఉన్నప్పటికీ, జనుల అపవాదుకి భయపడే రాముని హృదయం రెండురకాలుగా ఉన్నాది. ఇక్కడ "జనాపవాదు" అంటే, సీత శీలాన్ని గురించిన జనాపవాదు అని చాలామంది అర్థం చేసుకున్నారు. కాని అది తప్పు.
మరి ఈ అపవాదు ఏవిటి? రామునికి సీతపై నిజంగా అనుమానం లేకపోతే ఎందుకంత అమానుషంగా మాట్లాడేడు?

దీని గురించి రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి కవిగా వాల్మీకి దృష్టినుంచి, రెండు రాముని దృష్టినుంచి. రెండు రకాలుగా ఆలోచించినా నాకు తట్టిన సమాధానం ఒకటే!
రాముడు ఇంత యుద్ధం చేసినదానికి వెనకున్న కారణం ఏవిటి? కేవలం సీత కోసమే ఇదంతా జరిగింది అని చదివిన పాఠకులనుకుంటే, రామాయణ కావ్యానికీ, కథానాయకుడైన రామునికీ ఔన్నత్యం రాదు. లౌకికమైన కారణం కన్నా కూడా గొప్పదైన ఒక దేవకార్యంగా ఈ రావణ సంహారాన్ని నిరూపించడమే వాల్మీకి ధ్యేయం. అగ్నిప్రవేశం తర్వాత జరిగిన పర్యవసానం చూస్తే ఇది స్పష్టమౌతుంది. బ్రహ్మాది దేవతలు స్వయంగా వచ్చి, రాముడు సామాన్య మానవుడు కాదనీ రాక్షస సంహారానికై అవతరించిన విష్ణువనీ, సీత స్వయంగా లక్ష్మీ స్వరూపిణి అనీ, ఆమెని శంకించడం తప్పని చెప్తారు. అంతటివాళ్ళు స్వయంగా వచ్చి రాముని విష్ణుతత్వాన్ని వివరించడానికి బలమైన కారణం ఉండాలి కదా! ఈ సన్నివేశానికి ప్రవేశికే అగ్నిప్రవేశం. ఇందులోని పారమార్థికత స్థాపించబడాలంటే, ముందు సీతమీద ప్రేమతోనో కామంతోనో ఇదంతా రాముడు చెయ్యలేదన్న విషయం నిరూపించబడాలి. రాముని ప్రవర్తనంతా కూడా దీనికి అనుగుణంగానే ఉంది.

రాముని దృష్టితో చూసినా కూడా, ఇంత రాక్షస సంహారం కేవలం తన భార్యకోసం చెయ్యలేదు. తను మునులకిచ్చిన మాటకోసం (రాక్షస సంహారం చేస్తానని) చేసాడు. తన వంశప్రతిష్ఠని నిలుపుకోవడంకూడా secondary reason. అలాటిది తనిదంతా సీత కోసమే చేసాడని ప్రజలనుకోవడం అతని దృష్టిలో పెద్ద అపవాదు. ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో రాముడు భయపడ్డ జనాపవాదు ఇది.
అసలు రాముని మనసులో ఈ మార్పు, విభీషణుని పట్టాభిషేకం తర్వాత హనుమంతుడు సీతని చూసివచ్చి అన్నమాటతో వస్తుంది. "ఏ సీతకొరకైతే ఈ పనులన్నీ ప్రారంభించి చేసినామో, ఏ సీత ఈ పనులకు ఫలమో, అట్టి దుఃఖ సంతప్తురాలైన సీతాదేవిని నీవు చూడవలెను." అంటాడు హనుమంతుడు. హనుమంతుడు మాటవరసకే అలా అన్నా, ఆ మాటే రామునిలో బలంగా గుచ్చుకుంటుంది. అదివిన్న తర్వాతే రాముని మనసులో మార్పు మనం గమనిస్తాం.
ఈ అపవాదును తొలగించుకొనే మార్గం ఏవుంది రామునికి? దానికి మార్గం ఒకటే, సీతని స్వీకరించకపోవడం. పైగా తనకి సీతమీద ఏమాత్రం ప్రేమా లేదని నిరూపించుకొనేట్టు మాట్టాడం. అదే చేసాడు రాముడు. "భార్యయందు ఔదాసీన్యమును సూచించు ఇతని భయంకరములైన ముఖవికారాదులచేత ఇతనికి భార్యయందు ప్రీతి లేదా అనే సంశయం" లక్ష్మణాదులకే కలిగిందిట రాముని మాటలు వింటే. రాముడు సరిగ్గా ఇది జరగాలనే ఆ మాటలన్నది.
అయితే, ఏ ఉద్దేశంతో అన్నా అవి చాలా దారుణమైన మాటలు, అనకూడని మాటలు. అందుకే పర్యవసానంగా సీతచేత బుద్ధిచెప్పించుకున్నాడు. ఇప్పటికీ మన అందరిచేతా మొట్టికాయలు వేయించుకుంటున్నాడు.
ఇక, రాముడు సీతని అడవులకి పంపడం, నా ఉద్దేశంలో వాల్మీకి రాసినది కాదు.

అబ్రకదబ్ర

ఇంతకు ముందు ఓ మహిళాబ్లాగులో 'సీత అభిమానవతి' అంటూ రాసిన ఓ కవితకి బదులుగా నేను 'అందరి ముందూ శీలాన్ని నిరూపించుకోమన్న రాముడి చెంప పగలగొట్టని సీత పిరికిది అవుతుంది కానీ అభిమానవతి ఎలా' (పొల్లుపోకుండా ఇదే వాక్యం కాదు, కానీ ఇదే అర్ధం) అని క్వొశ్నిస్తే అక్కడ చేరిన మహిళాడవాళ్లంతా ఉగ్రరూపందాల్చి కాళికలై విలయతాండవం చేస్తూ 'హమ్మా, మా సీతనే పిరికిదంటావా' అని నాకు తలంటేశారు. ఆ దెబ్బతో రాములవారి, సీతాదేవి వ్యక్తిత్వాలపై కామెంటటం మానుకున్నాను :-) ఇప్పుడు మిస్టర్ రామ్ గురించి మీరు సహేతుకమైన ప్రశ్నలు లేవనెత్తారు. చూద్దాం, సమాధానాలెలా ఉంటాయో.

laxmi

జ్యోతక్క, చాలా బాగా రాశారు. తరతరాలుగా జరుగుతున్న అమానుషమే ఇది. ఇది రాముడు, సీత దగ్గరే ఆగిపోలేదు, ఇప్పటికి కుడా ఎంతో మంది మహానుభావులు భార్యని అనుమానం అనే రాక్షసికి బలి చేస్తున్నరు. మా కొలీగ్ ఒకామె రీసెంట్ గా ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఎందుకూ అంటే తన భర్త కంటే కెరీర్లో ఆమె పైకి వస్తోంది, అది తట్టుకోలేని ఆ మహానుభవుడు అమెని లేనిపోని మాటాలు అనటం మొదలుపెట్టాదు. ఆడవాళ్ళకి ఉద్యోగం రావటం, ప్రమోషన్ రావటం చాలా సులభం... కొంగు జార్చేస్తే ఇచ్చేస్తారు అంటూ ఏరోజూ ఆమెకి మనశ్శాంతి లేకుండా చేసేవాడు. మగవాడు ఆడదాన్ని కించ పరచాలీ అంటె ఆమె కారక్టర్ గురించిన ఒక్క నింద చాలు, అందరూ చీ కొట్టటానికి. ఏది ఏమైనా ప్రేమ, నమ్మకం, గౌరవం ఆధారంగా పెనవేసుకుని పెరగాల్సిన బంధం అనుమానం, అసూయ మొదలైన కారణాలతో తెగిపోతున్నయి. గుడ్ పోస్ట్

రమణి

రాముడేమి చేసాడు? సీత ఎందుకు పిరికిదయ్యింది? అగ్నిలో దూకి ఆత్మాహుతి ఐతే సీత గురించి రాముడేమనుకొనేవాడు? లాంటి పుక్కింటి పురాణాల గురించి ఆలోచిస్తూ, సీతా రాముల వ్యక్తిత్వాల్ని అంచనా వేస్తే మనకి ఒరిగేదేమి లేదనిపిస్తోంది. మనము ఆలోచించాల్సింది నిజజీవితంలో ఇలాంటివి జరిగినప్పుడు ఏమి చెయగలము? అని! ఆ కథ ని అధారంగానో లేక నిజాంగా జాతి ఝాఢ్యమో తెలీదు కాని, ఇప్పుడు 75 యేళ్ళ వయసులో 50 యేళ్ళ వైవాహిక భందం తరువాత " నువ్వు అప్పుడెప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నేను ఎవరితోనో చూసాను , ఇప్పుడు నిన్ను ఏలుకోను అంటూ బార్యని అవమానపరుస్తూ, ఆమె గురించి చిలవలు పలవలు చేసి, దగ్గరి భందువులందరికీ చెడుగా చెప్తూ, ఆవిడ అవమానభారంతో కళ్ళనీళ్ళు పెట్టుకొంటే, చూసి ఆనందిస్తున్న పైశాచిక ప్రవృత్తి గల ఓ మహానుభావుడు, మా కళ్ళముందే దర్జాగా తిరుగుతుంటే అసలు అతనితో మాట్లాడడానికే అసహ్యం, జూగుప్స లాంటిది కలుగుతోంది. అసలు ఇలాంటి వాళ్ళని ఏమి చెయ్యాలి అన్న ఆవేశం వస్తోంది. జ్యోతి మీతో నేను చర్చిస్తానన్నది ఇలాంటి అంశమే.

Anonymous

జ్యొతిగారు మీదయవల్ల మళ్ళీ రాముణ్ణి ఏకిపరెసే అవకాసం వచ్చింది.
రాముడు "ఏకపత్నీవ్రతుడు" అని గొప్పగా స్తుతించేస్తరుకాని, ఒక్క భార్యనే సుఖపెట్ట్లేక నానా అవస్తలు పడ్డ రాముడి కి మరో భార్య వుంటే వాల్మీకి రామాయణం పార్ట్-2 రాయాల్సివచ్చేది. కావాలంటే రాముణ్ణి గొప్పరాజుల లిస్టులో చేర్చుకొండికాని, గొప్ప భర్తల లిస్టులొంచి మాత్రం తొలగించండి. రాముడంతటి వాడే అనుమానించగా లేనిది... .... అంటూ అదో గొప్ప అదర్సంగా తీసుకొవడం. " దేసానికి రాజైనా అమ్మకి కొడుకే "అంటారుగా! అలాంటప్పుడు భర్తగా అతని ధర్మం నెరవేర్చడా? గొప్పైతే నాది, తప్పైతే నీది అని తప్పించుకొనే లక్షణం రాముడిది. ఆ సమయానికి నువ్వు బంగరులేడిని కోరతావని ఆ రక్షసులకి ఎల తెలిసిందో అన్నాడట .ఆ తెలివితేటలన్నీ లేడి వెనకాల పరిగెట్టినప్పుడు ఏమయ్యాయొ?

Anonymous

రమణి గారు వాటిని గురించి చర్చించల్సిన అవసరం వుందండి . అప్పుడే రాముణ్ణి వుదహరణగా చూపించడానికి, తమని సమర్దించుకోడానికి మగవాళ్ళు సిద్దమవకుడా వుంటారు.

జ్యోతి

నేను ఈ టపా రాసింది భార్యను అనుమానించే భర్తల గురించి. కాని రామాయణంలో అగ్నిప్రవేశం గురించి చర్చ జరుగుతుంటే ఆ విషయం కూడా ప్రస్తావించాను.

కామేశ్వరగారు,
ధన్యవాదాలు. నాకు రాముడిని నిందించడం అనేది అభిమతం కాదు. భార్యను అనుమానించడం అన్న విషయం మీద బాధ అంతే. అలా చేసేవారు ఈనాటికి ఉన్నారు. చదువుకున్నవారు కూడా. మగవారికి అది అంతగా బాధించదేమో.లైట్‍గా తీసుకోవచ్చు. కాని ఆడవాళ్లకు అలా కాదండి. శరీరం మీద పడే దెబ్బల కన్నా దారుణంగా బాధిస్తుంది ఈ విషయం.

రమణి,
ప్రమదావనంలో తప్పకుండా చర్చిద్దాం. ఇది చాలా దారుణమైన విషయం. ఇన్నేళ్ల తర్వాత భార్యను అనుమానించడం సహించరానిది.

జ్యోతి

అబ్రకదబ్రగారు,

అనుమానించిన మొగుడిని కొట్టడం అంత సులువు కాదండి భర్తను ప్రేమించే స్త్రీకి. ఆ తెగింపు వచ్చినరోజు ఈ వేదింపులు అస్సలుండవు.

రవి

ఓ గృహిణి గా చక్కటి ప్రశ్నలు సంధించేరు.బహుశా ఈ ప్రశ్నలకు convinsing గా సమాధానం దొరకదేమో. అలా దొరక్కూడదనే రాసి పెట్టారేమో అలా.

నాకు ఇలాంటి ప్రశ్నలే కలిగితే, ఓ చర్చ జరిగి, పర్యవసానం ....ఎందుకు లెండి :-)

ప్రవీణ్ గార్లపాటి

ఏ వాదినీ కాదంటూనే మగాళ్ళను ఏకి పారేశారు.


అదే భార్య అనుమానిస్తే భర్త కోపంతో చేయిచేసుకోవచ్చు. తిట్టొచ్చు, లేదా నిజంగానే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ఏమంటే మొగాడు ఏది చేసినా చెల్లుతుంది అంటారు. కాని ఆడది అలా చెయలేదే.


ఏదీ జనరలైజు చెయ్యవద్దంటూనే మీరే ఇలా మాట్లాడితే ఎలా ?

జ్యోతి

ప్రవీణ్,
నేను జనరలైజ్ చేయలేదు. ఆడవాళ్లను గౌరవించే మగాళ్లు ఎంతోమంది నాకు తెలుసు.నేను చెప్పింది ఈ బాధిత స్త్రీల విషయంలో జరిగినవి. చెప్పడంలో తడబడ్డానేమో. నాలో కలిగిన ఆవేదన ఈ టపాను రాయించింది. మగాళ్లను అందరిని ఏకిపారేయడం నా ఉద్దేశ్యం ఎప్పటికి కాదు.తప్పు చేసే వాళ్ళమీదే నా యుద్ధం..

భైరవభట్ల కామేశ్వర రావు

జ్యోతిగారు,
మీరు రాముని నిందించారని నాకెలాటి బాధా లేదండీ. మీరు రాముణ్ణీ, అగ్నిప్రవేశాన్ని అంత విస్తృతంగా మీ టపాలో ప్రస్తావించారు కాబట్టి, ఆ సందర్భంలోని నిజానిజాలని(అంటే వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలు) పరిశీలించే ఆసక్తి ఉందేమో అని అంత పెద్ద వ్యాఖ్య రాసాను.
మీరు మగవాళ్ళు చేసే దురాగతాలని ఖండిచడానికి రాముణ్ణి ఒక సాకుగా మాత్రమే తెచ్చుకున్నారని తెలిస్తే నేనలా రాయకపోయే వాడిని. కాకపోతే, దీనికోసం మీరు మనకి సరిగా అర్థం కాని రాముడి పాత్రని కాకుండా, ఈ కాలంలో మీకు తెలిసి అలా భార్యలని శంకిస్తున్న భర్తల గురించి చెప్పి ఏకిపారేస్తే బావుండేది. నేనుకూడా ఓ రెండు రాళ్ళు వేసి ఉండేవాడిని.
లేదు, వాల్మీకి రాసినదాంతో సంబంధంలేదు, రాముడు సీత శీలాన్ని శంకించాడనే మా నమ్మకం, అలా నమ్మి అతన్ని పురుషుల దుర్మార్గానికి ప్రతినిధిగా తిట్టడమే ఆత్మతృప్తినిస్తుంది అనుకుంటే, నేను మాట్లాడేది ఏమీ లేదు.

chantigadu

hello meeru rasindi chala bagundi yenduko meeru cheppina vidanam naku nachindi,marchipoya naa peru hanumanthu

జ్యోతి

కామేశ్వర రావు,

క్షమించండి. నేను నాగమురళిగారి బ్లాగులో జరిగిన చర్చలో నాకు కలిగిన సందేహాలు అడిగాను. కొంతవరకు మీరు చెప్పినదానితో సంతృప్తి పడ్డాను. కాని రాముడు భార్యను అనుమానించాడు అన్న విషయమే పైకి కనిపిస్తుంది. నిజమే ఆ తప్పు చేసి రాముడు ఇప్పటికి మొట్టికాయలు వేయించుకుంటున్నాడు. సీతారాముల గురించి తాడేపల్లిగారు మరికొన్ని విషయాలు చెప్పారు. మీకు అభ్యంతరం లేకుంటే ఎప్పుడైనా (నాకు ఎప్పుడూ) వచ్చే సందేహాలు మిమ్మల్ని వేగు ద్వారా అడగొచ్చా...

భైరవభట్ల కామేశ్వర రావు

జ్యోతిగారు,

అయ్యో మీరు క్షమించమనాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వ్యాఖ్యలో నా ఆంతర్యాన్ని గ్రహిస్తే చాలు.
మీరన్నట్టు, రాముడు సీతని అనుమానించాడు అన్నదే ఎక్కువమందికి కనిపిస్తుంది. అలా చాలామంది ప్రచారంలోకి తెచ్చారు. అంత కఠినమైన మాటలాడినందుకు ఒక పాత్రగా రాముణ్ణి తప్పుపట్టాల్సిందే అందులో సందేహం లేదు. కాని రామునికి సీతపై అనుమానం ఉందని అనుకోవడం మాత్రం తప్పు. రామాయణం మొత్తం చదివితే రాముడికి సీతపై ఎంతటి అనురాగం ఉందో తెలుస్తుంది.
నాకు పురాణ పరిజ్ఞానం ఎక్కువేమీ లేదు. అయినా మీరు నిరభ్యంతరంగా వేగు పంపవచ్చు. తెలిస్తే చెప్ప్తాను లేదంటే తెలుసుకుని చెప్పడానికి ప్రయత్నిస్తాను.

జ్యోతి

కామేశ్వర రావు,
దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అన్ని అవతారాలలో extrordinary talent చూపించాడు ఆ దేవదేవుడు. అవి భగవంతుని లీలలు,మహిమలుగా జనులు అనుకున్నారు.కాని రామావతారం మాత్రం మామూలు మానజన్మగా భావించారు లేదా అలా నటించాడేమో శ్రీహరి., ఎటువంటి మహిమలు చూపించలేదు. చందమామను కోరడం, విశ్వామిత్రుని యాగరక్షణ, స్వయంవరం, తండ్రిపాట పాలించడం. వనవాసం, సమిద్రాన్ని దాటి రావణుడిని చంపి తన భార్యను రక్షించడం. మళ్ళీ అనుమానం ... ఇలా ఒక వీరుడిగా ,రాముడిని చూపించారు. కాని జనాలు రాముడిని తప్పుపట్టడం కూడ సహజమే కదా. వాళ్లు కూడా అతడిని సమాజంలో భార్యను అనుమానించిన భర్తగా నిందించారు. అంటే రాముడిని ఒక దేవుడిగా present చేయలేదు. ఏమంటారు? కాని సీతారాముల గురించి ముఖ్యంగా ఈ అగ్నిపరీక్ష, అనుమానం గురించిన సరైన వివరాలు మీరైనా ఇవ్వక్కూడదు ? కొందరికైనా తమ సందేహాలకు సమాధానం దొరుకుతుందేమో?? చాలా మంది ఆడవాళ్లు తమ భర్త రాముడిలా ఏకపత్నీవ్రతుడు ఉండాలని కోరుకుంటారు , అలా అని రాముడు భార్యను అనుమానించినా కూడా గొప్పవాడు అనుకోలేము కదా.

భైరవభట్ల కామేశ్వర రావు

జ్యోతిగారు,

మీరన్నట్టుగా మిగతా అవతారాలలో లాగ ఎక్కువ మహిమలు చూపించని అవతారం రామావతారమే. అంత కన్నా ముఖ్యంగా ఈ అవతారంలో రామునికి తాను విష్ణువుని అన్న స్పృహ లేదు. అంతర్గతంగా ఏ మూలనో లీలగా ఉంటే ఉండవచ్చు కాని, ఇతర అవతారాలలో లాగ తాను విష్ణువు అంశని అని స్పష్టంగా రామునికి తెలియదు. దానినే "మాయామానుషస్వరూపం" అంటారు.
అయితే, రాముడు విష్ణుమూర్తి అవతారమన్న స్పృహ ఇతరులకి కొంతమందికి ఉంది. వశిష్ఠునికి, విశ్వామిత్రునికి ఇంకా తతిమ్మా ఋషులందరికీ ఉంది. అలాగే మరికొందరికి ఉంది. కైకకి కూడా ఉందని విశ్వనాథ కల్పవృషంలో ఒక కల్పన చేసారు. అది వేరే విషయం.
అతను విష్ణువు అవతారమన్న స్పృహవల్లనే, రాముడు వనవాసానికి వచ్చినప్పుడు, ఋషులందరూ అతన్ని తమని పట్టిపీడిస్తున్న రాక్షసులందరి నుంచి తమని రక్షించమని కోరుకుంటారు. రాముడు, ఒక రాజుగా, రాజ ప్రతినిధిగా అది తన కర్తవ్యంగా భావించి, రాక్షస వినాశనం చేస్తానని శపథం చేస్తాడు. ఆ మాటకి కట్టుబడే వనవాసంలో పదమూడేళ్ళూ అడవుల్లో పలుచోట్ల సంచరిస్తూ రాక్షసులని చంపుతాడు. ఈ పని లేకపోతే, రాముడూ వాళ్ళూ అడవులన్నీ అలా సంచరిస్తూ పంచవటి దాకా రావాల్సిన అవసరమే లేదు కదా!
ఆ తర్వాత రావణుడు సీతని అపహరించాక కూడా, తిరిగి సీతని తెచ్చుకోడానికి అనేక (సక్రమమైన)మార్గాలే ఉన్నాయి. రావణుడు దొంగతనంగానే సీతని ఎత్తుకు వెళ్ళిపోయాడు కనక అలాగే తిరిగి తీసుకువస్తే రాముని ప్రతిష్ఠకి భంగమేమీ రాదు. లేదా రావణుని ద్వంద్వయుద్ధానికైనా ఆహ్వానించవచ్చు. కానీ అంత మహా యుద్ధం ఎందుకు చేసాడు? తను మునులకు చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చుకోడానికి. ఇది వాల్మీకి రామాయణంలో మనకి చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది.
నేను రాముణ్ణి దేవుడన్న దృష్టితో సమర్ధించడానికి ప్రయత్నించ లేదు. రాముణ్ణి ఒక కావ్యంలోని పాత్రగా అర్థం చేసుకోడానికే ప్రయత్నం చేస్తున్నాను. కవిగా వాల్మీకిని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా రాముణ్ణి నిజంగా ఒక దేవునిగానో, ఈ లోకంలో నిజంగానే జీవించిన మనిషిగానో కాక ఒక కావ్యంలోని పాత్రగా ఆలోచించండి.
అంత పెద్ద కావ్యానికి కథానాయకునిగా ఎన్నో గొప్ప గుణాలతో చిత్రించిన వాల్మీకి ఆ పాత్రని అథఃపాతాళానికి తొక్కేసేలా ఎందుకు చిత్రిస్తాడు? దానివల్ల కావ్యానికి కలిగే లాభం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ రాముడన్న మాటలు ఈ రోజుల్లో తప్పుకాని ఆ రోజుల్లో సమర్థనీయమే, అని అనుకోడానికీ లేదు. ఎందుకంటే, అలా అయితే తర్వాత సీత చేత రాముణ్ణి ప్రశ్నలు వేయించి, అతన్ని దోషిగా నిలబెట్టాల్సిన అవసరం లేదు కదా? అంచేత వాల్మీకి ఎందుకలా చిత్రించి ఉంటాడో ఆలోచించండి. అలాగే నిజంగా రామునిది తన భార్యని అనుమానించే స్వభావం కలిగిన పాత్రేనా, నిజంగా అతను అనుమానించి ఉంటే, అతనన్న మాటలన్నీ తర్కబద్ధమైనవేనా ఆలోచించండి. అప్పుడు నాపై వ్యాఖ్య మళ్ళీ చదవండి.
ఆ తర్వాత కూడా ఏవైనా సందేహలుంటే మళ్ళీ మాట్లాడుకుందాం.

viswakiran

జ్యోతి గారు.
మీరు వ్రాయటం బావున్నది... కామేశ్వర రావు గారి సమాదానలూ బావున్నాయి..! కాని నాకైతె కొంచేం అర్థం అయ్యి అవనట్టూ.. మీ అందరి రాతలు సరిగా అర్థం చేసుకొవాటానికి ఇంకా టైమ్ పడుతుందేమో.. ఇప్పుడే ఇప్పుడే బయటి ప్రపంచాన్ని చూస్తూన్నాను... అంతా గజిబిజి బిజిగజి.. ఈ రోజు ఒకలా కనిపించిన వారు రేపు వేరొకలా... బయట ఒకలా.. లొపల ఒకలా.. ఏమిటో అంతా అయోమయం. ఇక్కడ ఇది సందర్బం కాదేమో నా వ్రాత..! మన్నించండి... అంతా చదివిన తరువాతా నా feelings.

జ్యోతి

విశ్వకిరణ్‍గారు,
నిజమే మా వ్యాఖ్యలు గందరగోళంగా ఉండొచ్చు. నేను తెలుసుకున్న విషయాలన్నీఒకే టపాలో పెడతాను.

విహారి(KBL)

మీకు విజయదశమి శుభాకాంక్షలు

గీతాచార్య

ఈ విషయం గురించి చాలా చర్చ జరిగిందండీ. ఎవరి కోణం లో నుంచీ వారు చెప్పారు. మంచి విషయమే లేవనెత్తారు. కానీ ఇలాంటి వాటిలో చర్చ తెగదు. ఎవరూ వినరు. సమస్య అదే. అయినా పాత విషయాలని త్రవ్వుకొనే బదులు మనమేం చేస్తున్నామో ఆలోచిస్తే బాగుండును కదా.

ఒక రేషనల్ థాట్ లేకుండా ఏదో ఒకరు చెప్పారని పట్టుకుని కూచుంటే ఇలాగే ఉంటుంది రామాయణం లో పనికి వచ్చే విషయాలు చాలానే ఉన్నాయి. వాటినోదిలేసి ఈ విషయాలని ఆలోచించే బదులు ఇప్పటి సమాజావసరాలని గురించి ఆలోచించటం మంచిది కదా!

మీరడిగిన ప్రశ్నలకి సమాధానాలూ వస్తాయి. వాటి మీద మరిన్ని సందేహాలూ వస్తాయి.

ఆలస్యమైనా దసరా శుభాకాంక్షలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008