నవ్వుల పండగ - మధు (ది) రోపాఖ్యాయనం .
మగాడు - మగువ - మధిర - ఈ మూడింటికి ఒక అవినాభావ సంబంధముంది. ఈ బంధం ఈనాటిది కాదు. అలనాటి క్షీరసాగరకాలం నుండి ఉన్నదే. సాగరమధనంలో వచ్చిన హాలాహలాన్ని పాపం భోలాశంకరుడు సేవించి గొంతులో దాచుకున్నాడు. అమృతాన్ని మాత్రం మాకంటే మాకు అని సురాసురులు గొడవపడ్డారు. తప్పనిసరై శ్రీహరి మోహినిగా వచ్చి అందరి మతులు పోగొట్టి తెలివిగా అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవతలకు మాత్రమే పంచేసాడు. అందుకే సురాపానం అంటారేమో. ఆ మందుకు ఎన్ని పేర్లో.. సుధ, మధువు, మదిర, అమృతం వగైరా.. పైగా ఇప్పుడదో స్టేటస్ సింబల్. తాగనివాడో వెర్రిమాలోకం అంటారు.
పొగతాగనివాడు దున్నపోతై పుట్టును అన్నడో మహాకవి. మరి మందు కొట్టనివాడు ఏమవుతాడు? అవునూ పొగ తాగడమేంటి? మందు కొట్టడమేంటి? సిగరెట్ పొగని పీలుస్తారు. మందును గ్లాసులో పోసుకుని తాగుతారు కదా? అదేంటో మరి. ఈ మందులో కూడా ఎన్ని రకాలో! చెట్టుమీది నుండి తీసిన తాటికల్లు నుండీ షివాస్ రీగల్ వరకు. మగాడి చేతిలో ఉన్న మందు విలువను బట్టి ఆ వ్యక్తి అంతస్థు, తాహత్తు అందరికి అర్ధమవుతుంది. పెగ్గులతో కొలుచుకుని మరీ తాగి ,ఎంచక్కా కారు నడుపుకుని వెళ్లేవాళ్లున్నారు. సీసాలతోనే లాగించి తూలుతూ, ఊగుతూ వెళ్లేవాళ్లున్నారు. నెల ఆరంభంలో ఫుల్ బాటిల్, నంజుకోవడానికి చికెన్ 65, నెల మధ్యలో హాఫ్ బాటిల్ - పక్కన మిక్చర్, ఇక నెలాఖరులో క్వార్టర్ కి జోడీగా ఆవకాయ బద్ద. ఇదీ మధ్య తరగతి మందు బాబుల ప్రోగ్రాం. ఎలా ఐనా హ్యాపీస్.
"మందు పార్టీ" .. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మందు తప్ప వేరే ఎటువంటి బేధభావాలు ఉండవు. రాజు, పేద, అగ్రవర్ణాలు, రంగుల గొడవ ఉండదు. నీటుగా తయారై చేతిలో మందు గ్లాసు ఉంటే చాలు ...అంతా సమానం. అసలు ఈ మందు పార్టీ అంటే ఒక విజ్ఞాన ఖజానా అని చెప్పవచ్చు. పెగ్గు పెగ్గుకు జ్ఞానం వరదలా పొంగుతుంది. అజ్ఞానం ఐసులా కరుగుతుంది. వివిధ రౌండ్ల వద్ద చాలా మందికి (ప్రతీరోజు) జ్ఞాననేత్రం వికసించి వేదసారాలు, జీవిత సత్యాలు బయటపడతాయి. అందరూ మాట్లాడేది తెలుగు ఐనా దానికి వ్యాకరణం గురించి ఆలోచించడానికి అస్సలు వీలు లేదు. ఎందుకంటే చాలా మంది తాగినప్పుడు నిజాలే మాట్లాడతారు. అవి వారి గుండె లోతుల్లోంచి లావాలా పెల్లుబికి అలా అలా పొంగుతూ ప్రవహిస్తుంటాయి. ఆ సమయంలో భావ వ్యక్తీకరణ మాత్రమే ముఖ్యం . భాషాదోషాలు కాదు. కాని అక్కడున్న వారికందరికి ఆ మాటలు పూర్తిగా అర్ధమైనా కూడా అర్ధం కానట్టే ఉంటాయి.
మందు బాబులు శాఖాహారమైనా, మాంసాహారమైనా ప్రాబ్లం లేదు. జస్ట్ మందులోకి మంచింగ్స్ మారతాయి. మంచూరియా, కబాబ్ లేక మిక్చర్ , జీడిపప్పు, వేయించిన వేరుశనగపప్పు అంతే. మందు కొట్టడం మొదలుపెట్టగానే బుద్ధి వికసిస్తుంది. దేశరాజకీయాలు, సినిమా తారలు, షేర్లు ఇలా మెల్లి మెల్లిగా చర్చ మొదలవుతుంది. ఆ చర్చకు ఆరంభం మాత్రమే ఉంటుంది కాని అంతం ఉండదు. అలా అని ఆ చర్చలలో టాపిక్కులు కూడా ఒకేలా ఉండవు. లెక్కలేనన్న్ని విషయాల మీద చాలా సీరియస్ చర్చలు జరుగుతాయి. ఈ శాస్త్ర విజ్ఞాన చర్చాలు చాలా సామరస్యంగానే నడుస్తాయి. ఖర్మగాలి ఎవడైనా ఏ చిన్న పాయింటైనా విభేదిస్తే మాత్రం దూర్వాసుడిలా కోపంతో రెచ్చిపోతారు. ఒకోసారి ఆ చర్చలు తీవ్రస్థాయికి చేరి తాగే సీసాలతోనే బుర్రలు బద్దలు కొట్టుకునే చాన్స్ లేకపోలేదు. కొందరు ఈ సమయంలో తమ టాలెంట్లను చూపించేస్తారు. ఫలించని ప్రేమ కవితలు, భార్యాబాధితులు, భావావేశాలు, సినిమా పాటలు, బాసుపై కోపంతొ అనర్ఘళంగా ఉపన్యాసాలు, ఆక్రోశం, కచ్చ అన్నీ గలగలా సెలయేరులా పారతాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాలెన్నో ఈ మందుపార్టీలో చూడవచ్చు. ఇక చివరి రౌండ్ కొచ్చాక మాత్రం ఫింగర్ బౌల్‌లో నీళ్లు కూడా తాగి అందులోని నిమ్మడిప్పను చప్పరిస్తారు. కొందరు ప్రభుద్దులైతే కట్టుకున్న పంచెను విప్పు అదే దుప్పటీలా కప్పుకుని అలాగే నిద్దరోతారు. లేద వేదపారాయణం మొదలెడతారు. దీనికి సినిమా కవులు కూడా నగిషీలు చెక్కారు.
"తాగితే మరచిపోగలను, తాగనివ్వరు
మరచిపోతే తాగగలను మరువనివ్వరు.."
" కుడి ఎడమైతే పొరబాటు లేదోయీ..."
" కల కానిది విలువైనదీ..."
ప్రేమలో పడకముందు ఖుషీగా తాగుతూ నిషాలో "నేను పుట్టాను.. లోకం మెచ్చింది.. నేను నవ్వాను .. ఈ లోకం ఏడ్చింది.." అన్న ఏ.ఎన్.ఆర్ గారు ప్రేమ విఫలమై మానేసిన తాగుడు ఇంకా ఎక్కువై " ఎవరికోసం ఈ ప్రేమ మందిరం.. ఈ శూన్యమందిరం" అంటూ విషం కూడా తాగేసారు మరి.
ఇక మగాడు - మగువ - మగువ గురించి ఎటువంటి సంబంధం ఉందో చూద్దాం. చల్లని సాయంకాలం, నిశిరేయిలో ఏ మగాడికైనా గుర్తొచ్చేది మనసైన చెలి లేదా కవ్వించే మధిర. రెండూ అతనికి వేడిని, మత్తును, సంతోషాన్ని, సాంత్వనని ఇచ్చేవే. ఎవరున్నా లేకున్నా, ఆ వ్యక్తి బాధను, ఆనందాన్ని ఈ రెండింటిలో ఏదో ఒకదానితో పంచుకుని సేదతీరుతాడు. అలా కాకుండా ఏ కారణం లేకుండా తాగాలి అంటే తాగాల్సిందే అనుకునే ఘనులెందరో ఉన్నారులెండి. వీళ్లు తమ శారీరక , మానసిక శ్రమను, అలసటను కొద్దిసేపైనా మర్చిపోవడానికి ఎంచుకున్న ఏకైక మార్గం ఈ మధిరాపానం. చుక్కచుక్కగా ఇది గొంతులోంచి క్రిందకి పోతుంటే, లోపలున్న బాధ అలా బయటకు వెళ్లిపోతుంది అని ఫీల్ అవుతారు. ప్రేమ విఫలమైనా, భార్య బధించినా, బాసు వేధించినా, అప్పులోల్లు సతాయించినా, మందు ఒక్కటే సత్వర పరిష్కారంగా గుర్తొస్తుంది చాలా మందికి. తాగినప్పుడు పిల్లి లాంటి మగాడు పులిలా అవుతాడు. ఏ సమస్యలు అతడికి గుర్తుకు రావు. అందుకే ఎవరిమీదైనా చచ్చేంత కోపంగా, ద్వేషంగా ఉంటే (ముఖ్యంగా పెళ్లాం, అత్తమామలు, బామ్మర్ధులు సతాయిస్తుంటే) పుల్లుగా తాగేసి, వాళ్లను కసిదీరా తన్నొచ్చు. కేసు కూడా ఉండదు. పెట్టినా కూడా వాళ్లను అంత ధైర్యంగా తన్నానన్న సంతృప్తి ఉంటుంది కదా. అది తెలిసినవాళ్లు కూడా "అయ్యో పాపం! పిల్లాడు తాగేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలీదు" అంటారు. అర్ధరాత్రి ఆడది నడిరోడ్డుపై తిరగగలిగినప్పుడే స్వాతాంత్ర్యం వచ్చినట్టు గాంధీగారు అన్నారు కదా. కాని ఈ రోజు ఎందరో ఆడవాళ్లు మేము మాత్రం తక్కువ తిన్నామా అని ధైర్యంగా షాపు కెళ్లి కొబ్బరినూనె కొన్నత ఈజీగా కొనుక్కుంటున్నారు. అలాగే తమ భర్తలతోపాటు షాపింగుకు వెళ్లినట్టు మందు షాపుకు వెళ్లి అతనికి మందు బాటిల్ ఇప్పించి బిల్లు కడుతున్నారు. వాహ్వా..
ఇక మందు పార్టీ చివర్లో భాషాప్రవాహం మందగిస్తుంది. పదాలు పూర్తిగా పలికే ఓపిక ఉండదు. సైగలు, పెదాల కదలిక బట్టి వాళ్లు ఏం చెబుతున్నారో అర్ధం చేసుకోవాలంతే. అప్పటికి అందరూ ఇంటికి వెళ్లిపోవాలని అర్ధమైపోతుంది. ఇక అక్కడ ఉండి చేయాల్సిన పని లేదు. ఇంటికెళ్లి తొంగోవాల్సిందే. మళ్లీ తెల్లారి కొలువుకు వెళ్లాలి కదా!
ఇది అందమైన మధి(ధు)రోపాఖ్యాయణం. ఇది సరదాకి రాసింది. ఎవరిని నొప్పించడానికి, ఎగతాళి చేయడానికి కాదు. కాని ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలు నేను స్వయంగా విన్నవి , చూసినవి. G.R.Maharshi గారి వ్యాసం చదివిన స్పూర్థితో ఈ టపా.
మరో ముఖ్య విషయం. ఈ రోజు మన బ్లాగ్ ప్రముఖులు సత్యసాయికొవ్వలిగారు, రమణిగారు ఇద్దరూ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ టపాలో సారమంతా ఫ్రొఫెసర్‌గారికి, టపావల్ల వచ్చే దరహాసాలన్నీ రమణిగార్లకు పుట్టినరోజు కానుకలు.. మీకిద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
ప్రమదావనం తరఫు నుండి ..ఈరోజు బ్లాగ్లోకంలోని హాసాలు, మందహాసాలు, చిరుహాసాలు, దరహాసాలు, వికట్టాట్టహాసాలు అన్నీ సత్యసాయిగారు, రమణిగార్లకే..
15 వ్యాఖ్యలు:
షానా షక్కగా రాషారు గానీ..ఓరెండు షీకులు(చీకులు)ఉంటే పంపిన్షండి మందులోకి ..జ...యో..త్ గా....(ధబ్బు....)
మందు ఎంత లోపలికి వెళితే అంత భాష రూపం లో బయటికి రావడాని "ఆర్కిమెడిస్ ప్రిన్సిపుల్ గా" పోలిస్తే సరిపోవచ్చా..
పుట్టిన రోజు శుభాకాంక్షలు సత్యసాయి గారికి, రమణి గారికి...
బాగుందండీ జ్యోతిగారు. కానీ మగాడు మందు తాగి తన బాధలని మర్చిపోగలడు (అలా అని అనుకుంటాడు) కాని పాపం ఆ మగాళ్ళ చేతిల్లో పడి ఎన్నో తిప్పలు పడుతున్న ఆడవాళ్ళు ఏమి చెయ్యాలంటారు? కింది తరగతి వాళ్ళు నిర్మొహమాటంగా కల్లు దుకాణంలో కూర్చుని తాగి రాగలరు, కావలంటే మొగుణ్ణి నాలుగు పీకగలరు. హై క్లాస్ వాళ్ళకోసం పబ్బులు ఎటూ ఉండనే ఉన్నాయి, పాపం ఎటూ పోలేక గుండెల్లోనే బాధని దాచుకునే మధ్య తరగతి మహరాణులకే అన్ని తిప్పలూనూ.. ఏమంటారు?
మీరేమి చెప్పదలుచుకున్నారు?
జ్యోతి గారు,
సాంత్వన కాదనుకుంటాను అది స్వాంతన.అలాగే భోలాశంకరుడు హిందీ వాళ్ళ శివుడు.తెలుగువాళ్ళకు భోళాశంకరుడు.
Happy bairthday SatyaSai gaaru & Ramani gaaru.
సాంత్వన యే కరెక్ట్. శాఖాహారం కాదు, శాకాహారం.
Hppy B'day to RAmani and Satyadai garu.
Sorry for the Typos. Happy B'day Satyasai garu and Ramani.
లక్ష్మి గారు,
100% కరక్టుగా చెప్పారు.
హన్నా......... ఈ విషయంలో ఇంత నాలెడ్జి ఎలా సంపాదించారు
ఆమధ్య వీకెండ్ మస్తీ కోసం పబ్బులో దూరినప్పుడు.........కొంపతీసి మీరుగాని...............?
సత్యసాయి గారికి, రమణి గారికి పుట్టినరోహు శుభాకాంక్షలు.
మందు పార్టీల గురించి మంచి నాలెడ్జి సంపాదించారు గా. :)
కృష్ణుడు గారూ, మీరిచ్చిన లింక్ నాకు పని చెయ్య లేదు గానీ brown dictionary,online ఇప్పుడే చెక్ చేశాను, సాంత్వనము యేనండీ!
Teresa gaaru,
http://dsal.uchicago.edu/cgi-bin/philologic/search3advanced?dbname=gwynn&query=swaantana&matchtype=exact&display=utf8
Teresa gaaru,
I sent the link again.I read somewhere that it is svaantanamu.Anyway I will try to locate where I read .Sorry to bother you again.
ayya,mee satire bavundi--gr.maharshi
Post a Comment