Monday, January 26, 2009

దోసేలమ్మ దోసెలు ....

నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య విభాగంలోనే వచ్చిన వ్యాసం. ఇది చూసి మగమహారాజులు నన్ను తిట్టుకోకూడదు. ఇలా వెరయిటీలు చూపించి చంపేస్తున్నారు అని. మీకు ఓపికుంటే చేసుకోండి హాయిగా. లేదా మీ ఆవిడను కాస్త మస్కా కొట్టి చేయించుకోండి. కాని మీరు సాయం చేయాలిసిందే తనకు. ఇవన్ని మాకు దొరకవే అనుకోకుండా. మీ ఊర్లో ఉన్నా ఇండియన్ స్టోర్స్ లో ప్రయత్నించండి. ఇక అలాంటి దుకాణాలు లేవు అంటే తూర్పు లేదా పడమర ఎటైనా తిరిగి దండం పెట్టండి. వేరే దారి లేదు. :)మన దేశంలో దోసెలను ఒకో ప్రాంతంలో ఒకోలా తయారుచేస్తారు. ఎలా తయారు చేసినా రుచి మాత్రం అమోఘం. అద్వితీయం. కాకా హోటళ్లనుంచి కార్పొరేట్ హోటళ్లదాకా తిరుగులేని వివిధ దోసెల తయారీ విధానాలు మీకోసం..

గోల్డెన్ దోసె
బియ్యం: నాలుగు కప్పులు,
మెంతులు: అర స్పూన్,
పెసర పప్పు: అర కప్పు,
మినపప్పు: కప్పు,
శనగపప్పు: అర కప్పు. పప్పులు, బియ్యం కలిపి కడిగి మెంతులు వేసి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలన్నా అలా ఉంచాలి. తగినంత ఉప్పు వేసి కలిపి పలుచగా దోసెలు వేయాలి. కరకరలాడే దోసెలు రెడీ...


రాగి దోసె

రాగి పిండి: అర కేజీ,
ఉల్లిపాయలు: రెండు,
పచ్చి మిరపకాయలు: మూడు,
పుల్లపెరుగు: పావుకేజీ,
మినపప్పు: 100గ్రా,
ఉప్పు: తగినంత,
నూనె: అర కప్పు
రాగిపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, మినపప్పు, ఉప్పు పుల్లపెరుగు కలిపి దాదదాపు నాలుగైదు గంటలు నాన నివ్వాలి. గరిట జారుగా కలుపుకోవాలి. వేడి పెనంపై దోసెలు వేసుకుని పైన వెన్న, చిన్న బెల్లం ముక్క పెట్టి సర్వ్ చేస్తే బాగుంటుంది. చట్నీ సాంబారుతో తీసుకోవచ్చు.


తీపి దోసె

గోదుమ పిండి: నాలుగు కప్పులు, బియ్యపు పిండి: కప్పు, బెల్లం: రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము: అర కప్పు, యాలకుల పొడి: స్పూన్, నెయ్యి: అర కప్పు. బియ్యం పిండి గోధుమ పిండిని బాగా కలిపి ఉంచుకోవాలి, బెల్లాన్ని నాలుగు కప్పుల నీటిలో వేసి వేడి చేయాలి.కాస్త చల్లారాక అందులో పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇందులో తురిమిన కొబ్బరి, యాలకుల పొడి వేసి బాగా కలియబెట్టాలి. పెనంపై నెయ్యి వేసి దోసెలు వేసుకుని వేడివేడిగా తినాలి. పిల్లలకు ఈ దోసెలతో జాం కలిపి ఇస్తే ఇష్టంగా తింటారు.


గోధుమ రవ్వ- మైదా దోసె
గోధుమ రవ్వ: రెండు కప్పులు, మైదా: రెండు కప్పులు, బియ్యపు పిండి: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చి మిర్చి: మూడు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, ఉప్పు: తగినంత, కొత్తిమిర: రెండు స్పూన్లు. గోధుమ రవ్వ, మైదాలను నాలుగు కప్పుల నీటిలో కలిపి రెండు గంటలపాటు నాన బెట్టాలి.తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమిర పచ్చి మిర్చి పెరుగు, ఉప్పు వేసి బాగా కలియ బెట్టాలి. పెనంపై దోసెలు పోసుకుని టమాటో సాస్‌తో వడ్డిస్తే చాలా బాగుంటుంది.


పేపర్ దోసె
మినపప్పు: అర కప్పు, బియ్యం: నాలుగు కప్పులు, ఉప్పు: తగినంత, జీలకర్ర: స్పూన్, నూనె: అర కప్పు. మినపప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటల పాటు నానబెట్టాలి. తరువాత విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చి చట్నీ, సాంబార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.


ఎగ్ దోసె

మినపప్పు: కప్పు,
బియ్యం: మూడు కప్పులు,
మెంతులు: టీస్పూన్,
మిరయాల పొడి: మూడు స్పూన్‌లు.
గ్రుడ్లు: మూడు, నూనె:
అర కప్పు. బియ్యం,
పప్పు, మెంతులు కలిపి ఆరుగంటలపాటు నాన బెట్టి మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి.గ్రుడ్లు ఉప్పు కలిపి బాగా గిలక్కొట్టి ఉంచుకోవాలి. లేదా అలానే కొట్టి వేసుకోవచ్చు. వేడి పెనంపై దోసెవేసుకుని దానిపై గుడ్డు కొట్టి లేదా గిలక్కొట్టిన మిశ్రమం వేసి నిదానంగా కాలనివ్వాలి. పైన చిటికెడు మిరియాల పొడి చల్లి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చి తినాలి.


సెట్ దోసె
మినపప్పు: ఒక కప్పు,
బియ్యం: మూడున్నర కప్పులు,
అటుకులు: అర కప్పు,
ఉప్పు: తగినంత,
కరివేపాకు: రెండు రెబ్బలు,
నూనె: అర కప్పు
మినపప్పు బియ్యం అటుకులు కలిపి ఆరుగంటలు నాన బెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణంలో కాస్త మందంగా దోసెలు చేసుకుని పైన తరిగిన కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ, ఖుర్మాతో వడ్డించాలి. ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.


మైసూర్ మసాలా దోసె

మినపప్పు: రెండు కప్పులు,
శనగ పప్పు: రెండు కప్పులు,
బియ్యం: పావు కప్పు,
ఉప్పు: తగినంత,
ఎండు మిర్చి: తగినన్ని,
పసుపు: పావు స్పూను,
ఉడికించిన బఠాణీలు: అర కప్పు,
పచ్చి మిర్చి: మూడు,
అల్లం: చిన్న ముక్క,
ఆవాలు: పావు స్పూన్,
మినపప్పు: టీస్పూన్,
శనగపప్పు: స్పూన్,
కరివేపాకు: రెబ్బ,
నూనె: రెండు స్పూన్‌లు

బియ్యం, పప్పులు విడివిడిగా కనీసం ఆరుగంటలు నాన బెట్టి తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు ఎండు మిరపకాయలు కలిపి మళ్లీ రుబ్బుకోవాలి. పిండిని బాగా కలియ బెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని చేసిన కూరతోకలిపి వడ్డించాలి. కూర తయారి: బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చి మిరపకాయ, అల్లం ముక్కలు కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠాణీలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియ బెట్టి దోసెలతో కలిపి తినాలి.


కీర దోసకాయ దోసె

మినపప్పు: గ్లాసు,
బియ్యం: మూడు గ్లాసులు,
మెంతులు: అర స్పూన్,
దోసకాయ గుజ్జు: ఒక కప్పు,
ఉప్పు: తగినంత,
చట్నీ పొడి: రెండు స్పూన్‌లు,
కొత్తిమిర: రెండు స్పూన్‌లు,
పచ్చి మిరపకాయలు: రెండు,
నూనె: సరిపడ మినపప్పు,
బియ్యం, మెంతులు కలిపి కనీసం ఆరుగంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కీర దోసకాయ గుజ్జుని కలిపి నాలుగు గంటలు పులియనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి గరిట జారుగా కలుపుకుని వేడి పెనంపై పలుచగా దోసెలు పోసుకుని చట్నీ పొడి, కొత్తిమిర, సన్నగా తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు వేసి రెండవ వైపు కాల్చకుండా మడిచి తినేయడమే.

రవ్వదోసె
బొంబాయి రవ్వ: పావుకేజి,
శనగ పిండి: పావుకేజి,
బియ్యం పిండి: పావుకేజి,
మజ్జిగ: అర కప్పు,
పచ్చిమిరపకాయలు: మూడు,
జీలకర్ర: స్పూన్,
కొత్తిమిర: స్పూన్,
ఉప్పు: తగినంత రవ్వ,
శనగ పిండి, బియ్యంపిండి మజ్జిగలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర కొత్తిమిర కలిపి కనీసం అరగంట నానపెట్టి గరిటజారుగా కలుపుకుని పలుచగా దోసెలాగా పోసుకుని ఎర్రగా కాల్చి చట్నీతో తీసుకుంటే రుచిగా ఉంటాయి.

మసాలా దోసె

మినపప్పు: గ్లాసు, బియ్యం: మూడు గ్లాసులు, మెంతులు: టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: అర కప్పు,
మసాలా కూర తయారీకి
బంగాళాదుంపలు: పావుకేజీ,
పచ్చి మిరపకాయలు: రెండు,
కరివేపాకు: ఒక రెబ్బ,
కొత్తి మిర: రెండు స్పూన్‌లు,
ఆవాలు: పావు స్పూన్,
జీలకర్ర: పావు స్పూన్,
మినపప్పు: అర స్పూన్,
శనగ పప్పు: టీస్పూన్,
పసుపు: చిటికెడు,
ఉల్లిపాయ: ఒకటి,
నూనె: మూడు స్పూన్‌లు

పప్పు, బియ్యం మెంతులు కలిపి కనీసం నాలుగు గంటలు నాన బెట్టి మెత్తగా రుబ్బి ఆరుగంటలపాటు పులియ నివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. బంగాళాదుంపలు ఉడకపెట్టి పైచర్మం తీసి కావల్సిన సైజులో ముక్కలుగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. బణాలీలో నూనె వేడి చేసి పోపు సామానులు వేసి చిటపటలాడాక కరివేపాకు,

తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మరిపకాయలు వేసి అవి మెత్తబడే వరకు వేయించి చిదిమి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, పసుపు, వేసి బాగా కలియ బెట్టి అవసరమైతే కొద్దిగా నీరు- చల్లి ఐదు నిమిషాల పాటు వేయించాలి. దించే ముందు కొత్తిమిర చల్లి తీసి పక్కన పెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకున్న పిండితో దోసె వేసి ఎర్రగా కాల్చి తిరగేయకుండా పైభాగాన గరిటెడు మసాలాకూర వేసి మధ్యకి మడిచి కిందికి దింపేయాలి.


కొన్ని చిట్కాలు..


-దోసెల పిండిని కలియ బెట్టే సమయంలో రెండు చిటికెల పంచదార వేసి కలిపితే అందంగా, కరకరలాడుతూ ఉంటాయి.
-దోసె రుచిగా ఉండాలంటే బియ్యం, పప్పుల పిండితో పాటు ఒక చిన్న చెంచాడు మెంతిపొడి కలపాలి. లేదా బియ్యంలోనే చెంచాడు మెంతులు కలిపి నానబెట్టాలి.. -దోసెలు పెనానికి అతుక్కోకుండా వుండాలంటే ఒక దోసె వేసి తీసిన ప్రతి సారీ సగం కోసిన ఉల్లిపాయతో లేదా చెక్కు తీయని పెద్ద అరటికాయ ముక్కతో పెనాన్ని రుద్దాలి.

-దోసె, ఉతప్పం మందంగా తయారవ్వాలంటే బియ్యంతోపాటు అరకప్పు అటుకులు కూడా కలపాలి.
-ఒక చెంచాడు తినేసోడాను పిండిలో కలిపి దోసె వేస్తే కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
-చలికాలంలో దోసెపిండిలో ఒక చిన్న చెంచాడు ఈనోసాల్ట్ కలిపితే త్వరగా పులిసి దోసె కొంచెం పుల్లగా కూడా ఉంటుంది.
-ఒక పెద్ద వంకాయను సగానికి కోసి నూనెలో ముంచి దానితో వేడి పెనాన్ని రుద్ది దోసె వేస్తే దోసె పెనానికి అతుక్కోకుండా నీట్గా వచ్చి దోసె కరకరలాడుతూ ఉంటుంది.

8 వ్యాఖ్యలు:

Ramani Rao

good one.. :-)

సత్యసాయి కొవ్వలి Satyasai

ఇదీ చూసాను, మీ బ్లాగు పరిచయమూ చూసాను. అభినందనలు.

chetan sharma

జ్యోతిగారు మీ దోశలు నాకు బాగా నచ్చాయి. ఇంట్లో ట్రై చెయ్య వచ్చా.

chetan sharma

జ్యోతిగారు మీ దోశలు నాకు బాగా నచ్చాయి. ఇంట్లో ట్రై చెయ్య వచ్చా.

గీతాచార్య

ఒక చిన్న డౌట్!!! తీరుస్తారనే ఆశిస్తునాను.

చక్కగా వేరైటీలన్నీ చెప్పారు. చివరలో ఒక మంచి టెక్నిక్ చెప్పారు. ఇన్ని చెప్పాకా ఎందుకు తిట్టుకుంటారు? అట్టుకుంటారు కానీ.

దయచేసి ఫోటోలు పెట్టొద్దు. నెట్ సెంటర్ నుంచీ ఇంటికి వెళ్ళే లోపల ఏదో ఒక హోటల్ లో దూరాలనిపిస్తున్నది. రోజూ కష్టం కదా. అమ్మకి ఓపికలేదు. నేను చేసుకునే టైం ఉండదు.

అవునూ పచ్చడి బాంది అంటూ ముళ్ళపూడి వారు బాపూ గురించి చెప్పారు. వారి ఆత్మ కథలో. మీరూ వెరైటీగా పచ్చడి కూడా చెపితే బావుండునేమో?

Unknown

జ్యోతక్కా...
ఇన్ని రకాల గురించి బాగా వివరించినమీరే అంత బాగా చేయగలరేమో...అడ్రస్ ఇస్తాను కొరియర్ లో పంపాలిమరి.

Unknown

very nice aunty

బ్నిం

వావ్ ..దోసెను తినగోరి ఎంతో /ఆసక్తిని ఎదురుచూడ ఆశ నిరాశే /దోసమ ?కాదా ఆలిది /ఈసున మా జ్యోతి బుక్కు నెంచక మదితాన్ ll

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008