Monday, February 2, 2009

రాజమకుటం ...అర్ధం కాని పాటలు, మాటలు, అసలు కథ అంటూ కనపడని నేటి సినిమాలతో విసుగెత్తినవారికి అలనాటి రాజమకుటం మరపురానిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా జానపద కథలు ఇష్టపడేవారికి ఇది తప్పక నచ్చుతుంది. ముఖ్యంగా సడిసేయకో గాలి అనగానే అందరికీ గుర్తొచ్చేది రాజమకుటం చిత్రం. అందాల నందమూరి తారకరామారావు, ముద్దుగుమ్మ రాజసులోచన ముఖ్య తారాగణంగా నిర్మించబడింది.

Get this widget | Track details | eSnips Social DNAవాహినీ పతాకం మీద, తెలుగులో, తమిళంలో ఏకకాలంలో నిర్మించిన ఒకే సినిమా రాజమకుటం.. ఎప్పుడు కూడా కళకు ప్రాధాన్యమిచ్చే బి.ఎన్.రెడ్డి తీసిన మొదటి మరియు ఒకే ఒక జానపద చిత్రం ఇది. భావుకుడి నెత్తిన బలవంతంగా బాక్సాఫీస్ ఫార్ములా బరువు పెడితే అది ఎలా వికటిస్తుందో తెలియచెప్పిన దాదాపు యాభై ఏళ్ల క్రిందటి సినిమా రాజమకుటం అని చెప్పవచ్చు.

అనాదిగా బలవంతులు బలహీనులను చేసే దోపిడీ, ఆ పీడిత ప్రజానీకం చేసే తిరుగుబాటు ఈ చిత్రం యొక్క ప్రధానాంశం..

అనగనగా గాంధార రాజ్యం. ఒక సమయంలో ఆ రాజ్యం విజయోత్సవాలలో ఓలలాడుతూ ఉంటుంది. భార్యాసమేతంగా ఆ వేడుకలను తిలకిస్తున్న మహారాజుపై ఒక ముసుగు వ్యక్తి దాడి చేసి హత్య చేస్తాడు. ఈ సంగతి తెలిసి గురుకులంలో విద్య నభ్యసిస్తున్న యువరాజు ప్రతాప్ తిరిగి వస్తుండగా అతని మీద కూడా హత్యాప్రయత్నం జరుగుతుంది. అది తప్పించుకుని స్పృహతప్పిన ప్రతాప్‌ను ప్రమీల అనే యువతి కాపాడుతుంది. ప్రతాప్ తనను ఒక పరదేశిగా పరిచయం చేసుకుంటాడు. ఈ హత్యా యత్నాలన్నీ చేసింది గాంధారరాజ్య సేనాని ప్రచండుడు. అతను మహారాజుకు స్వయానా తమ్ముడు, ప్రతాప్‌కు చిన్నాన్న . రాజమకుటం కోసం బంధుత్వాన్ని కూడా లెక్కచేయక ప్రచండుడు సాగించిన నరమేధమే ఈ కథలోని ముఖ్య అంశం. తన కుమారుడు బజరంగుడిని మహారాజును చేయడానికి అన్నకొడుకు ప్రతాప్‌ను చంపడానికి కూడా వెనుకాడడు ప్రచండుడు. ఈ క్రమంలోనే మహామంత్రిని కూడా హత్య చేయిస్తాడు. ఇలా హత్యలకు కారణమడిగిన ప్రతాప్‌కు , దేశంలోని రాజభక్తులందరినీ దేశద్రోహులుగా, విప్లవకారులుగా చూపిస్తాడు ప్రచండుడు. ఆవేశంలో ఉన్న ప్రతాప్ రాజద్రోహులను విచారణ లేకుండా మరణశిక్ష విధించమంటాడు. ప్రచండుడు వాళ్లందరినీ చంపించి ప్రతాప్ ఆదేశానుసారం జరుగుతుంది అని ప్రకటిస్తాడు. ఈ క్రమంలో ప్రతాప్‌పై మరోసారి హత్యా యత్నం జరుగుతుంది. కాని దాడి చేసినవాడు పట్టుబడి ఈ దుశ్చర్యలన్నింటికీ ప్రచండుడే కారణమని చెప్పి కన్నుమూస్తాడు.

అది తెలుసుకున్న ప్రతాప్ ఆవేశంతో చిన్నాన్నను చంపడానికి వెళుతుంటే తల్లి అడ్డగించి ఆలొచనతో ముందడుగు వేయమంటుంది. ప్రచండుని నరమేధంలో తండ్రిని పోగొట్టుకున్న ప్రమీల, తండ్రిని పోగొట్టుకున్న శూరసేనుడు ,మరి కొందరు బాధితులు కలిసి ఒక విప్లవదళం తయారు చేస్తారు. పట్టాభిషేక మహోత్సవంలో ప్రతాప్‌కు విషమిచ్చి చంపడానికి ప్రయత్నిస్తాడు ప్రచండుడు కాని తెలివిగా తప్పించుకున్న ప్రతాప్ పిచ్చివాడిలా నటిస్తాడు. "నల్లత్రాచు" అనే ముసుగు వీరుడి రూపంలో ప్రచండుడి అక్రమాలను అడ్డుకుంటాడు ప్రతాప్. అలాగే ప్రమీలను కూడా కాపాడతాడు. తను మెచ్చిన ప్రమీల పరదేశిని వరించిందని తెలిసి శూరసేనుడు ఆగ్రహంతో ప్రచండునితో చేతులు కలిపి తాను తీసుకున్న గోతిలో తానే పడి చనిపోతాడు.ప్రచండుని అరాచకాలను , అక్రమాలను అడ్డుకుంటున్న నల్లత్రాచు ప్రతాపేనని అందరికి తెలుస్తుంది. అతడిని చంపి తన కుమారుడికి పట్టం కట్టాలని ప్రయత్నించిన ప్రచండుని హతమారుస్తాడు ప్రతాప్. ప్రతాప్ ప్రమీలల వివాహంతో కథ ముగుస్తుంది.


రాజమకుటం చిత్రానికి మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. ఈ సినిమాకు దేవులపల్లితో పాటు కొసరాజు కూడా పాటలు రాసారు. అలాగే బాలాంత్రపు రజనీకాంతరావు నాగరాజు అనే మారుపేరుతో రాసారు . అది "ఊరేది.. పేరేది.. ఓ చందమామా", ఇక దేవులపల్లి రాసిన మధురమైన, మరపురాని పాటలు ... "సడిచేయబోకే..(ఎన్నేళ్లయినా ఆకట్టుకునే పాట.) ఏడనున్నాడో. ఎక్కడున్నాడో." అలాగే జిక్కి గారు పాడిన "ఠింగన ఠింగన ఢిల్లా.." పద్మనాభం, వంగర వెంకట సుబ్బయ్యలమీద చిత్రీకరించిన "రారండోయి.. ద్రోహుల్లారా రారండోయ్ ".. ఇప్పటి ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ ఈ సినిమాకు రికార్డింగ్ - రీరికార్డింగ్ ఇంజనీరుగా పనిచేసారు. నాయకునిగా నందమూరి , నాయికగా రాజసులోచన, ప్రచండుడిగా గుమ్మడి, రాజమాతగా కన్నాంబ,శూరసేనుడిగా రాజనాల,బజరంగునిగా పద్మనాభం మొదలైనవారు తారాగణం.. రచయిత డి.వి.నరసరాజు, సంగీత దర్శకుడు మాస్టర్ వేణు, గుమ్మడి, రాజనాల,.. వీరందరూ బి.ఎన్.రెడ్డితో మొదటిసారి పని చేసారు

అయిష్టంగా, అన్యమస్కంగానే బి.ఎన్.రెడ్డి ఈ సినిమా నిర్మించారు. కాని ఆర్ధికంగా అంతగా లాభించలేదు. ఆయన తీసిన ఏ సినిమా ఐనా కథాపరంగానూ, కళాత్మక విలువల పరంగానూ అత్యున్నతంగా ఉంటుంది. కాని యాక్షన్ సినిమాకు తగ్గట్టుగా నాటకీయత, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన విఫలమయ్యారు. దానితో సినిమా దెబ్బతింది.

5 వ్యాఖ్యలు:

Unknown

చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్ళీ గతస్మ్రుతుల్ని గుర్తుకు తెప్పించారు. మీరిలా పాత చిత్రాల రెవ్యూలు రాసేటప్పుడు, మాలాంటి వారికోసం, సినిమా డివిడి రిలీజ్ అయ్యిందా, దాని క్వాలిటీ ఎలా ఉంది వగైరా వివరాలు రాస్తే ఇంకా బాగుంటుంది. Keep it up.

Unknown

చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్ళీ గతస్మ్రుతుల్ని గుర్తుకు తెప్పించారు. మీరిలా పాత చిత్రాల రెవ్యూలు రాసేటప్పుడు, మాలాంటి వారికోసం, సినిమా డివిడి రిలీజ్ అయ్యిందా, దాని క్వాలిటీ ఎలా ఉంది వగైరా వివరాలు రాస్తే ఇంకా బాగుంటుంది. Keep it up.

Anil Dasari

ఈ సినిమాని సాధారణ ప్రేక్షకులతో కలిసి చూసిన బిఎన్‌కి ఓ విస్తుపోయే సంఘటన ఎదురైందట. ప్రేక్షకుల్లో ఓ పామరుడు, పక్కనున్నతన్ని 'ఇంతకీ రాజమకుటం అంటే ఏంటి బెదరూ?' అనడిగితే ఆ పండితుడు 'అదీ తెలీదారా యెదవ, పట్టా కత్తి' అన్నాడంట. వెనక వరసలో కూర్చుని వీళ్ల మాటలు విన్న బిఎన్ బయటికొచ్చాక నిర్మాత మీద విరుచుకు పడ్డాడట, 'పేరే అర్ధం కాలేదు, ఇక సినిమా ఏమర్ధమవుద్ది వాళ్లకి? వద్దంటున్నా ఇలాంటి సినిమా తీయించి నా పేరు గంగలో కలిపేశారు' అంటూ.

ఎప్పుడో విజయచిత్రలో చదివా ఈ సంగతి, రావికొండలరావు రాసినట్లు గుర్తు.

కొత్త పాళీ

వ్యూహాత్మకంగా ఇది కొంచెం జటిలమైన సినిమా. అంచేత బాక్సాఫీసు దగ్గర విజయం సాధించి ఉండకపోవచ్చు. కానీ మీరన్న మాటలు ..
"కాని యాక్షన్ సినిమాకు తగ్గట్టుగా నాటకీయత, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన విఫలమయ్యారు." ..
నేను ఒప్పుకోను.
ఆకాలంలో వచ్చిన చాలా మంచి సినిమాల్లో ఇదొకటి.
తేనెపూసిన కత్తి లాంటి విలన్ పాత్ర గుమ్మడి వెయ్యడం ఇదే ప్రథమం ఏమో. ఈ తరవాత ఆయన అలాంటి పాత్రలు చాలా వేశారు. రామారావు రాజసులోచన జంట చాలా అందంగా ఉన్నారు. రాజనాల ఒక చిన్న విలన్‌గా ప్రధాన భూమిక పోషించాడు. రాజమాతగా కన్నాంబ రాజసం కురిపించింది. పద్మనాభం వంగర వెంకటసుబ్బయ్యలతో కథకి పెద్దగా సంబంధం లేని హాస్యం కొంచెం చిరాకు పెడుతుంది.
సడిసేయకోగాలి గురించి తెలుగు బ్లాగుల తొలి రోజుల్లో జరిగిన ఈ పాత కబుర్లు చదవండి.
కబురు 1
కబురు 2

జ్యోతి

కొత్తపాళీగారు.
ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు. సినిమా మంచిదే కాని జనాలకు నచ్చలేదెందుకో.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008