Sunday, 8 March 2009

ఆడవాళ్లలో జీనియస్సులు ఎందుకు లేరు???


ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలు. ఇవాళ ఒక్కరోజే కాదు , ప్రతి రోజు మనదే. ప్రత్యేకమైనదే. మనచేతిలో ఉన్నదే. దానిని అందంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం మనచేతిలో ఉంది. కుటుంబంతో పాటు మనగురించి కూడా ఆలొచించి అద్భుతాలు సాధించగలం అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి. నిజంగా మనం గొప్పవాళ్లం. ఎవరితో పోల్చుకోవద్దు. పోటీ వద్దు. మన టాలెంట్ మనం గుర్తిస్తే చాలు. ఎవరో మనను గుర్తించాల్సిన పనిలేదు. అవసరం లేదు. ధృడ విశ్వాసంతో మీ ప్రయాణం సాగించండి. దారికడ్డం వచ్చే పిచ్చి (గజ్జి) కుక్కలు, చీడ పురుగులను పట్టించుకోకుండా ముందుకు అడుగులేయండి. విజయం మీదే.. ఎక్కడైనా..


ఏ. ఆర్. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సాధించినప్పుడు మనందరికీ ఎంతో గర్వంగా అనిపించింది. దేశమంతా పండగ చేసుకున్నారు. అతని తోడుగా ఉన్న తల్లి కూడ గర్వంతో పులకరించిపోయింది అని చెప్పక తప్పదు. అలాగే అతని భార్య అందరికంటే ఎక్కువగా గర్వపడి ఉండొచ్చు. నా భర్త ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అది నాకూ కూడా సంతోషం. నాకే వచ్చినంత ఆనందంగా ఉంది అనుకొని ఉండొచ్చు కదా. భర్తను ప్రేమించే, గౌరవించే ప్రతి భారతీయ నారి ఇలాగే అనుకుంటుంది. కాని... ఇక్కడ పరిస్థితి రివర్స్ చేస్తే... భార్య ఇలాగే పెద్ద పేరు తెచ్చుకుంటే భర్త కూడా గర్వపడతాడా ??? నాకైతే డౌటే.

పూర్వకాలంలో మగాళ్లు అంటే పని చేయాలి, ఇల్లు నడిపించే బాధ్యత అతనిదే, భార్య అంటే ఇల్లు, వంట, పిల్లలు, కుటుంబ సభ్యుల గురించి చూసుకోవాలి అని నియమం ఉండేది. ఆడవాళ్లు గడప దాటి బయటకొచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం భార్యా భర్తలు ఇద్దరూ పని చేయకుంటే తప్పేట్టు లేదు. ఇంతవరకు ఓకే.

ఈ రెండువేల సంవత్సరాలలో ప్రపంచ ప్రసిద్ధులైన వ్యక్తుల లిస్ట్ తయారు చేస్తే... అందులో ఆడవాళ్లు ఎంత మంది ఉంటారు. 1901 నుండి ఇస్తున్న నోబుల్ బహుమతుల్లో ఎంత మంది స్త్రీలు ఆ అవార్డు పొందారు?. నాటక రచయితలు, సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, సైంటిస్టులు .. అందరూ ఎక్కువగా మగవాళ్లే. స్త్రీలు చాలా చాలా తక్కువ. ఎందుకని. స్త్రీలలో జీనియస్సులు లేరా. వాళ్లు ప్రతిభాపాటవాలు లేవా?

ఈ జీనియస్ అనబడే వ్యక్తికి చెమ్మగిల్లే హృదయం ఉండాలి. కంట తడిపెట్టగలిగే మెత్త్తటి మనసుండాలి. ఈ గుణాలు ఆడవాళ్లలో సహజంగానే ఉంటాయి. అందుకే ప్రతి స్త్రీలో ఒక జీనియస్ ఉంటుంది. కాని అది పైకి కనపడదు. అది పైకి రావాలంటే , పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే ఆ ప్రతిభకు మెరుగులు దిద్దాలి. ప్రాక్టీసు చేయాలి. ఇలా తమ సమయాన్ని ఎక్కువగా దీనికే వినియోగిస్తే మరి ఇంట్లో వంటెవరు చేస్తారు?, భర్తను, పిల్లలను ఎవరు చూస్తారు? ఇంటి భాద్యతలు సరే సరి. పైగా ఈర్ష్యా అసూయలతో పాటు పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఓ తెగించి ఓ అడుగు ముందుకేయాలంటే ఎన్నో అడ్డంకులు, వాదాలు , వివాదాలు. తనో జీనియస్, తనలో కూడా టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడానికి అనుక్షణం ఎన్నో విషయాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సహజంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే స్త్రీ ఇటువంటి గొడవలు లేకుండా ఉండాలని అందుకుంటుంది. అందుకే సాధారణంగా ఎక్కువ మంది స్త్రీలు తమలో నిభిడీకృతమైన శక్తిని గురించి ఆలోచించరు, జీనియస్‌లుగా ఉండడానికి ప్రయత్నించరు.

1968 లో బార్రన్ ఇలా అన్నాడు... సృష్టించడం అన్నది కళాకారులు మాత్రమే చేయగలరు. వాళ్ల రాతలతోనో, చేతలతోనో, గీతలతోనో.. ఈ విధయమైన సృజనాత్మకత స్త్రీలలో లోపించింది. రిస్క్ ఎందుకని ప్రకృతి డివిజన్ ఆఫ్ లేబర్ క్రింద మగవాళ్లు ఐడియాలని, పెయింటింగ్‌లని , సాహిత్య, సంగీత సంస్థల్ని, దేశాల్ని, మతాల్ని, స్త్రీలు తరాల్ని సృష్టించేట్టుగా ఏర్పాటు చేసింది.

అయితే ఫ్రాయిడ్ ప్రకారం పుట్టుకతో ఆడవాళ్లు ఇన్‌ఫీరియర్ కాదు. సామాజిక బంధాలు, కమిట్‌మెంట్స్ వాళ్లని ఓ మెట్టు తక్కువగా చేసింది. ఈ కంచెల్ని చేధించిన వాళ్లు, తప్పించుకున్నవాళ్లు, మగలక్షణాలున్న ఆడవాళ్లుగా మిగిలిపోతున్నారు. ఒక స్త్రీ నిజమైన స్త్రీత్వం గల మనిషిలాగానైనా ఉంటుంది. లేదా క్రియేటివ్ జీనియస్‌గా ఉండిపోతుంది. ఈ రెండు ఒకే స్త్రీలో ఉండడం చాలా అరుదు. ఆడవాళ్లలో జీనియస్సులు లేరని కాదు. ఎక్కువగా వాళ్ల తెలివితేటలు అణచివేయబడతాయి. ఐనా కూడా కొందరు స్త్రీలు ఈ ఆటంకాలు చేధించుకుని విజయాలు సాధిస్తున్నారు తానొచ్చినా, ఇతరులను నొప్పించని రీతిలో.


మన దేశంలో స్త్రీకి స్వంత అభిమతం, వ్యక్తిత్వం, సృజన ఉండకూడదని , చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలని రూల్ పెట్టేస్తారు. ఇంకా నయం నేటి తరం పురుషులు మారుతున్నారు. స్త్రీలను గౌరవించి, వారి ప్రతిభని వెలికితీయలనే కోరిక కాకున్నా కుటుంబాన్ని నడపడానికైనా వారిని ఉన్నత చదువులు , ఉద్యోగాలకు అనుమతిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం ఒక అవసరం గానే ఉండిపోతుంది. కాని స్త్రీలలోని అసలైన టాలెంట్ బయటకు రావడం అరుదనే చెప్పవచ్చు.

ప్రతి వ్యక్తిలోనూ జీనియస్ ఉంటాడు . పురుషులు తాము అనుకున్నది చేయగలుగుతారు. కాని స్త్రీలు మాత్రం ఎక్కువగా కుటుంబానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. సంసారం, ఇంటిపని, వంటపని, పిల్లల పని ఆడవాళ్లని పీల్చి పిప్పి చేస్తాయి. ఇలా నాలుగు గోడల మధ్య బందీ ఐన జీవితం జీనియస్సులని ఎలా ప్రసాదిస్తుంది. మగవాళ్లు ఇవన్నీ పట్టించుకోకుండా తమ కార్యక్రమాలు చేసుకోగలరు కాబట్టే జీనియస్సులు అయ్యే అవకాశం ఎక్కువ. ఆ అదృష్టం ఆడవాళ్లకు లేదుగా. ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీ ఐనా ముందు ఇంటిపని, పిల్లల పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే ఉద్యోగానికెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్లీ ఇంటిపని తప్పదు. ఎంత చేసినా ఏవో వంకలు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే సంపాదిస్తున్నానని గర్వమా అంటారు. కాని మగవాడికి అలాంటి టెన్షన్స్ ఉండవే.

కుటుంబ విషయాలకు సంబంధించినత వరకైతే ఆడవాళ్లకు ఎక్కడికెళ్లినా కుటుంబం నుండి ఎటువంటి అభ్యంతరం, అడ్డంకి ఉండదు. కాని తన కిష్టమైన పనుల కోసం బయటకు వెళ్లాలంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలు, అడ్డంకులు. భావాలు, ఆలోచనలు, ఊహలు ప్రయాణించినట్టుగా తాము కూడా ప్రయాణించే రోజు ఇంకా రాలేదు మహిళలకు. మగవాళ్లు తమ భార్యలను ప్రోత్సహిస్తారు ఆమే విజయాలకు ఆనందిస్తారు. కాని అది కొంతవరకే.. ఆమె విజయాలు, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైనా, తమ కంటే అధికమనిపించినా వాళ్లలోని ఇగో నేనున్నానంటూ బయటకొస్తుంది. ఇక్కడ ఈర్ష్య మొదలవుతుంది. అప్పుడు వాళ్లను అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. కుటుంబంలో అల్లకల్లోలం భరించలేని స్త్రీలు తప్పనిసరై తలవంచుతారు. అలా కాకుండా ధైర్యంగా మొండికేస్తే తెగించింది, మగరాయుడు, ఇలా ఎన్నో పేర్లు పెడతారు. ఇంట్లోనించి వెళ్లిపొమ్మంటారు. నీకు నీ సంసారం ముఖ్యమా నీ టాలెంట్ ముఖ్యమా తేల్చుకో అని అల్టిమేటం జారీ చేస్తారు. ఉదా.. భర్తకు ఎప్పుడైనా ఎక్కడికెళ్లాలన్నా ఎంచక్కా వెళుతున్నా అని చెప్పేసి వెళ్లిపోతాడు. కాని భార్య వెళ్లాలంటే కుదురుతుందా? లేదు. తను బయటకెళ్లాలంటే ముందు భర్త అనుమతి తీసుకోవాలి. తను లేని లోటు తెలీకుండా ఇంట్లో అన్నీ అమర్చి (కొన్ని గంటలకోసమైనా) బయటకెళ్లాల్సి వస్తుంది. కాని ఆ భర్త, నువ్వ్వెళ్లవోయ్, నేను చూసుకుంటాను అనే రోజు వస్తుందా.. అలా ఉంటే ఇంకా ఎంతో మంది జీనియస్సులు తయారవుతారు అన్నది లక్షలవరహాల మాట.

నేను ఈ విషయాలన్నీ ఊహించి రాసినవి కావు. సంవత్సరాలుగా ఎంతో మంది స్త్రీలను చూసి తెలుసుకున్న నిజాలు. అలా అని అందరు మగవాళ్లు ఇలాగే ఉండరు. భార్యను తనకిష్టమైన చదువులు , ఉద్యోగాలకు ప్రోత్సహిస్తూ, ఇంటిని పిల్లలను చూసుకునే భర్తలు కూడా ఉన్నారు. కాని చాలా తక్కువమంది.. భర్త విజయాలకు పొంగిపోని భార్య ఉంటుందా. ఎప్పుడు కూడా మా ఆయన బంగారం అనుకుంటుంది. కాని అలాగే భార్య విజయాలకు కూడా భర్తలు గర్వపడతారా అన్నదే నా సందేహం???

18 వ్యాఖ్యలు:

Unknown

మిగిలిన వారి సంగతేమో నాకు తెలియదు కాని నేనూ అనుకుంటుంటాను, మా ఆవిడ బంగారం అని. చాలా బాగా వ్రాసారు. మీకు, అందరు మహిళలకూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.

Dr. Ram$

జ్యోతి గారు..
ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రతి రోజు మహిళా దినోత్స్వమే నండి..యిలా ఒక రోజు పెట్టి కుదించడం ఏమి బాగా లేదు..ఏమంటారు?? ఏమో లే పెద్దలు యే పని వుత్తి నే చేయరు అని..కనీసం ఈ ఒక్క రోజు అన్నా "ఆది శక్తి" ని గౌరవిస్తారు అని.. పెట్టి వుంటారు..ఏది ఏమైనా మీరు మాత్రం ప్రతి రోజు మహిళా దినోత్సవము జరుపుకోవాలి..జై హింద్..

Anonymous

జ్యోతి గారు..
ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.ప్రపంచ మహిళా దినోత్సవ సంధర్భం గా ఈ రోజు జ్యోతి లో మహిళా బ్లాగరుల గురించి వ్రాయడం బాగుంది. కాని ముఖ్యమైన వారిని, పేరెన్నికగన్న మహిళా బ్లాగరులను వదిలివేయటంతో అసంపూర్ణంగా ఉంది.

సత్యసాయి కొవ్వలి Satyasai

ఎందుకు లేరూ? మిమ్మల్ని మీరే మర్చి పోతే ఎలా?
బాగా రాసారు. ఆడవారు దేంట్లోనూ తీసిపోరు. కానీ కొన్ని శారీరిక పరిమితులుంటాయన్నది నిజం. కుటుంబం ఒక యూనిట్ గా భావిస్తే ఎవరు గొప్పా ఎవరు దిబ్బా అన్న సమస్యకి తావుండదు. వ్యక్తిపరంగా ఆలోచిస్తే కొన్ని సమస్యలుగా అనిపిస్తాయి. భర్త పొంగిపోయినా లేకపోయినా స్త్రీ ఆత్మగౌరవం, ఆత్మాభిమానాల్ని, ఆత్మవిశ్వాసాలని పోగొట్టుకోకుండా చూసుకోవడం తప్పనిసరి. మనబ్లాగర్లందరికీ - మగబ్లాగర్ల వెనకనున్న, బ్లాగ్ప్రపంచంలో ముందున్నఆడవాళ్ళందరికీ - మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

Disp Name

ఆడవాళ్ళకి అసలు బుర్రే లేదు ఇక ఎక్కడినుంచి జీనియస్ కావడం? మీరు మరీ విచిత్రం సుమండి.

చీర్స్
జిలెబి

పెదరాయ్డు

జ్యోతి గారు,

నాకెందుకో, ఇటువంటి భావజాలానికి మహిళకూ సమ భాగస్వామ్యం వుందనిపిస్తోంది. ఉదాహరణకు బాగా స్థిరపడిన ఒక మహిళ తనకన్న తక్కువ చదువుకున్న, తక్కువ ఆదాయమున్న పురుషుణ్ణి పెళ్ళి చేసుకోవటానికి అంగీకరిస్తుందా? ఒక గృహస్తు భర్త( :) ) కావాలని ఎంతమంది కోరుకుంటారు? ఆ విధంగా మీరే వాడిలోని అహాన్ని/ఆధిక్య భావనను పోషిస్తున్నారు.

మరో కాదనలేని నిజం, మహిళలకున్న అనేకానేక సమస్యలకు సాటి మహిళలే కారణం. కట్నం మొదలు అనేక కారణాలతో కోడల్ని హింసించే/కడతేర్చే అత్తలు, ఆడపదుచులు(వీరి మద్దతు లేకుండా కేవలం మగాడు ఈ అకృత్యాలకు పాల్పడటం చాలా తక్కువే). తోడి కోడళ్ళ కలహాలు, కొడుకు పుట్టలేదని పెట్టే ఆరళ్ళు, అసలు పిల్లలే పుట్టలేదని మరో పెళ్ళిని ప్రోత్సహించడాలూ, వీటన్నింటిలో సాటి మహిళల పాత్రే ఎక్కువ.

మగవాళ్లు తమ భార్యలను ప్రోత్సహిస్తారు ఆమే విజయాలకు ఆనందిస్తారు. కాని అది కొంతవరకే.. ఆమె విజయాలు, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైనా, తమ కంటే అధికమనిపించినా వాళ్లలోని ఇగో నేనున్నానంటూ బయటకొస్తుంది. కానీ పని చేస్తున్న భార్యలు పనిచేయని భర్తకిచ్చే మర్యాద చాలా సందర్భాలలో బహిర్గతం చేయటానికి కూడా వీలుచేయనట్లుంటుంది.

మగవాళ్ళు భౌతికంగా మాత్రమే బలవంతులు. కాని మహిళలు ప్రత్యేకించి మన దేశపు మహిళలు మానసికంగా ఎంతో బలవంతులు, కాని వారి దీన స్థితికి సాటి మహిళలే కారణం. ఎన్నో మహిళాభ్యుదయ ఉద్యమాలకు కారణం పురుషులే. ఈ విషయంలో మహిళల పేర్లు చాలా తక్కువే. ప్రస్తుత మహిళా సంఘాల (అన్నీ కావు, చాలా వరకు) సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కాని బలవంతులైన మగాళ్ళు బలహీనులైన ఆడవాళ్ళపై భౌతికంగా అకృత్యాలకు పాల్పడటం క్షమించరాని నేరం అత్యంత జుగుప్సాకరం. మానవుడిగా ఈ దాష్టీకానికి నేను సిగ్గుపడుతున్నాను. మహిళలు సబలలుగా మారి ఇటువంటి దాష్టికాల మూలాలను ఐకమత్యంగా ఎదుర్కొన్న రోజే నిజమైన మహిళా దినోత్సవం.

మహిళల్లో జీనియస్ ల విషయానికొస్తే, మేడం క్యూరీ, మదర్ థెరీసా, ఇందిరాగాంధీ, హిల్లరీ క్లింటన్, సునీతా విలియంస్, శారదా మాత, పురాణాలలో సత్యభామ, గాంధారి, సరస్వతీ దేవి వరకు ఎందరో ఉన్నారు. వారి ప్రతిభను సందర్భోచితంగా గుర్తించడంలోనే మనం వెనుకబడి వున్నాం.

జ్యోతి

పెదరాయుడుగారు , మీరు చెప్పింది నిజమే. మహిళల్లో జీనియస్ లు ఉన్నారు కాని చాలా తక్కువమంది. ఈ మహిళా దినోత్సవమని ఒక్కరోజు మురిసిపోవడమెందుకు. గృహసంబంధమైన సమస్యలు అధిగమించి నేటి మహిళలు తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. ఇది నిజం. అలాగే కొందరు పురుషులు కూడ తమ భార్యలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. నేను కాదనడంలేదు. వీరి సంఖ్య ఇంకా పెరగాలని మా చిన్ని అభిలాష. దానివల్ల ఇంకొందరు జీనియస్ మహిళలు వెలుగులోకి వస్తారు..

సత్యసాయిగారు ,
ధన్యవాదాలు.నా భావాలు అర్ధం చేసుకున్నందుకు.

నరసింహంగారు, రామ్ గారు, ధన్యవాదాలు.

గిరిచంద్ గారు,
మీరు చెప్పే ప్రముఖ మహిళల కన్నా, ఇప్పుడు విస్తృతంగా రాసి అందరిని అలరిస్తున్న ఎందరో మహిళా బ్లాగుల గురించి తెలియడం ముఖ్యం కదా. ఐనా తాడేపల్లిగారన్నట్టు(గుంపులో) రైలు టికెట్టు రైలంత పెద్దగా ఉండదు. ఎక్కతే కాని అసలు సంగతి తెలీదు.:)

జిలేబీగారు... మీరు మరీను.. :)

Ramana

Jyoti gaaru,
మహిళా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి.మరీ యెక్కదికో తీసుకు వెళ్లి పోయారు............

Ramana

Jyoti gaaru,
మహిళా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి.మరీ యెక్కదికో తీసుకు వెళ్లి పోయారు............

శ్రీనివాస్

నాకేమన్పిస్తుంది అంటే పెద రాయుడు గారు చెప్పినట్టు గృహస్తు భర్త గారిని గౌరవించే సమాజము మనకింకా రాలేదు పైగా .. మగ వాడికి నువ్వు హీరో వి మమ్మల్ని ఉద్దరించదానికే పుట్టావ్ అనే ఫీలింగును మీరే (మహిళామణులు) కలిగిస్తున్నారు .. కాదంటారా???? అందుకే ఆదిపత్య ధోరణి అబ్బాయిలలో ఊహ తెలిసిన దగ్గర నుండి పెరిగిపోతుంది ... భర్త గొప్పదనాన్ని భార్య ఎలా ఆస్వాదిస్తుందో భార్య గొప్పదనాన్ని భర్త పొగడడం చిన్న తనం గా భావించే వారున్నారు మరియు ప్రోత్సహించే వారు కూడా ఉన్నారు .. కాకుంటే కాస్త తక్కువ గా

ఇక పొతే జీనిఎస్సులు లేరా అంటే ఎందుకు లేరు చిన్నప్పుడు ఐదో తరగతి లో నాకు లెక్కలు నేర్పిన స్వప్న దగ్గర నుండి నేటి సునితా విలియమ్స్ దాక జీనిఎస్ లే కదా


ఇక పొతే నువ్వెళ్ళు నేను చూసుకుంట అని భార్య ని సాగనంపే సంస్కారం నాకుంది .. అప్పుడు నన్ను ఆడంగి వెధవ అని విమర్శించేది మరొక మహిళా మణి ఏ కదా .. దీనికి మీరేమంటారు ..

హవ్వ హవ్వ మొగుడ్ని తన్ని మొగసాల కెక్కింది .. అంటూ ఒక మహిళ ని అపహాస్యం పాలు చేసేది మరో మహిళే ..

సో జీనిఎస్ లు అవ్వాలనుకునే మహిళలంతా స్వజాతి గజ్జి కుక్కలను చీడ పురుగులను తోసేస్తే తప్ప పురుష గజ్జి కుక్కల్ని తోలడం కష్టం

ఏదో చిన్న వాడ్ని పసి వాడిని గబుక్కున నా వాక్యలలో వృధా ప్రేలపనలుంటే కడుపు లో దాచుకోండి గాని మనసులో పెట్టుకోకండెం

కరణేషు మంత్రి భోజ్యేషు మాత క్షమయా ధరిత్రీ నీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

M.Srinivas Gupta

జ్యొతక్కా...!
మీ పిచ్చిగాని మీరు చెప్పిన restrictions ఇప్పడు మాత్రం అస్సలె లెవు. కుటుంబ విషయాల్లొ గాని, ఆర్ఠిక విషయాల్లొ మంచి plannings కూడ వాళ్ళదగ్గర వున్నాయి. ప్రస్తుతానికి అడవాళ్ళు మాకంటే మంచి ఉద్యొగాల్లొ ఉన్నారు. మాకంటె ఎక్కువగా కూడ సంపాదిస్తున్నారు. మా classmates నాకు తెలిసి మా కంటె ఎక్కువగానె సంపాదిస్తున్నారు. ఇక మీరు చెప్పినవన్ని మీ generationకు మాత్రమె వర్తిస్తాయి.
ఇంకా చెప్పాలంటె..
ఉద్యొగం కొసమని వెళ్తె అడపిల్లలకె ఎక్కువ priority. ( మెము వాల్లకంటె interview బాగ చెసినకూడ.... )

తెలుగు బాగ వ్రాయటం రాదు, తప్పులుంటె క్షమించగలరు ( మీరె నెర్పించారు లెండి )

imaaya

ఎందుకు లేరు?

ప్రతి జీనియస్సు వెనకా ఆడది ఉంటుంది. తల్లి, భార్య, చెల్లి....

జీనియస్సులను *తయారు చేసేది* ఆడవారే :)

శేఖర్ పెద్దగోపు

జ్యోతి గారు,
నాకు తెలిసి మన దేశంలో స్త్రీలు జీనియస్ కాకపోవడానికి పురుషుల అణచివేతే కారణం అయితే స్త్రీలు పురుషులతో ఇంచుమించు సమానంగా చూడబడే పాశ్చాత్య దేశాల్లో ఈ పాటికి ఎక్కువమంది స్త్రీలు జీనియస్లు గా ఉండాలి. కాని మనం ఒక్కసారి గ్లోబల్ గా కూడా చూసినట్టయితే పశ్చిమ దేశాల్లో ఎంతమంది స్త్రీలు పురుషులతో సమానంగా జీనియస్ లు గా ఎదుగుతున్నారు?

ఇంకో విషయం....ఒక మహిళ గొప్పతనాన్ని గుర్తించటంలో గాని, ఆమెకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వటంలో గాని సాటి మహిళ కంటే పురుషుడే ముందంజలో ఉంటాడు.

జీనియస్లు అంటే లోక కల్యాణం కోసం ఎదోచేసి తెచ్చుకునే గుర్తింపు మాత్రమే కాదు. చిన్నప్పుడు ఎంతో ఓపిగ్గా మనల్ని పెంచి, నడవడిక, నడత నేర్పిన అమ్మ కూడా ఒక జీనియస్సే.

చిలమకూరు విజయమోహన్

కీర్తిశ్శ్రీర్వాశ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా
స్త్రీలలోగలకీర్తి,సంపద,వాక్కు,స్మృతిజ్ఞానము,ధారణాశక్తిగలబుద్ధి,ధైర్యము,ఓర్పు అను ఏదుగుణములు నేనే అయియున్నానని శ్రీకృష్ణభగవానుడే చెప్పాడు కదండి.సాక్షాత్ భగవంతుడే మీలో ఉంటే మళ్ళీ మీకెందుకొచ్చిందండి అనుమానం మీరు జీనియస్సులు కాదని.

David

జ్యోతి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ మీ అభిప్రాయాలతో ఏకిభవిస్తూన్నాను....కాని మీరు గుర్థించిన విషయానికి సొల్యూషన్ ఏమంటారు

Anonymous

వూ ......బావుంది . చాలా రోజులతరువాత ఒక మంచి చర్చ జరిగినట్టుంది.

Anonymous

బావుంది. కాని చర్చ ని ఇంతటి తో ఆపెయ్యడం నచ్చలేదు. కొన్ని కొత్త తరహ అలోచనలు, కొత్త కోణాలు / మార్పులు ఎవరయినా ఆవిష్కరిస్తే చూడాలనుంది.

మేఘన

ఈ శీర్షిక ఈ రోజే చదివాను , మీ రాతల్లో మామూలు జనాల్ని కదిలించగల నేర్పు ఉందండి, మీరు రాసింది బావుంది,
శీర్షిక కి వొచ్చిన వాఖ్యలు బావున్నై, ముఖ్యంగా పెద్దరాయుడు గారి వాఖ్యలు బాగా కదిలించేసాయీ. ఆయన చెప్పినదానితో నే ఏకీభవిస్తాను, ఒకటి తప్ప "ఉద్యోగం చేసే ఆడవాళ్ళూ పనిచేయని భర్తకిచ్చే మర్యాద చాలా సందర్భాలలో బహిర్గతం చేయటానికి కూడా వీలుచేయనట్లుంటుంది." అనే విషయం తప్ప. ఉద్యోగం చేసే మగవాళ్ళు ఇంట్లో, వాళ్ళకన్నిఅమర్చే భార్యలకి ఇచ్చే మర్యాద ఎంత? అంటే భర్త ఉద్యోగం చేస్తే భార్యని ఎంత చిన్నచూపు చూసిన "మా ఆయన బంగారం" అని చెప్పుకోవాలి, అదే ఉద్యోగం చేసే భార్య చిరాకులో ఏదో ఒక మాట గట్టి గా భర్త ని అంటే నన్ను లెక్క చెయ్యట్లేదు , నాకు మర్యాద ఇవ్వట్లేదు అనేస్తారా? మా ఆవిడ కి పొగరు అని ఊరంతా చెప్పి వాళ్ళ ని గయ్యాళి లాగా చేసేదేవరండి???? పని చేయకుండా ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులే తిడతారు, కట్టుకున్న భార్య తిడితే తప్పెలా అవుతుందో కాస్త వివరించమని చెప్పండి .

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008