Wednesday, May 27, 2009

సినిమా చూడవయా....ప్రతి మనిషికి అంతో ఇంతో వినోదం చాలా అవసరం. ఈ బిజీ బిజీ జీవితంలో పడి మునిగిపోకుండా ఉండడానికి అందరికీ వినోదం ఉండాలి..... అందులొ సామాన్య మానవుడి నుండి సంపన్నుడి వరకు ముఖ్యమైన వినోద వస్తువు సినిమా. టాకీ యుగం నుండి మూకీ, హైటెక్ యుగం వరకు ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. నలుపు, తెలుపైనా, రంగులైనా కూడా వివిధ కారణాల వల్ల సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని ఏడిపిస్తె , కొన్ని నవ్వించాయి.మరి కొన్ని బాధించి పీడించి చంపేసాయి. తరాలు మారుతున్న కొలది సినిమా పోకడ కూడా మారుతూ వచ్చింది అని చెప్పవచ్చు. నరుడా ఏమి నీ కోరిక ? అన్నా, నిన్నొదల బొమ్మాలి అన్నా ప్రేక్షకులు అన్ని రకాల కథాంశాలు ఆదరించారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. అలనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరో , హీరోయిన్ల అందం, చందం, ఈ నాటి కంప్యూటర్ గ్రాఫిక్స్ సినిమాలలో నటిస్తున్న లెక్కలేని ఎందరో హీరో, హీరోయిన్లలో లేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అందుకేనేమో ఈనాటి నటీనటులు ఐదారు సినిమాలకంటే ఎక్కువగా కనపడ్డం అరుదైపోయింది.

అప్పుడూ (కాస్త ఎక్కువ), ఇపుడూ (కాస్త తక్కువ) సినిమాలలో కొన్ని ఆణిముత్యాలున్నాయి. చెత్తరాజములు ఉన్నాయి.. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అదే కొన్ని సినిమాలు ఎందుకొచ్చామురా అని విసుగొస్తుంది. మరికొన్ని ఐతే భరించలేక థియేటర్ నుండి వెళ్లిపోవాలనిపిస్తుంది మనం పెట్టిన డబ్బులు వృధా అనిపించినా కూడా ... కొన్ని సినిమాలైతే భయపెట్టేస్తాయి.. నాకు గుర్తున్నంతవరకు జానపద, పౌరాణిక సినిమాలు అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం. అప్పుడైతే అర్ధరూపాయే టికెట్టు. అమ్మ కూడా నో అనేది కాదు. జానపద సినిమాలైతే కదలకుండా చూసేదాన్ని. ఇప్పటికి కూడా ఆ ఆత్రుత ఉంది. అప్పుడు తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్సుకత, ఇప్పుడేమో భలే ఉన్నాయే సినిమాలు అని.

ఇక శోభన్‌బాబు సినిమాలోకాన్ని రాజ్యమేలినప్పుడు ఆయన నటించిన ప్రతి సినిమా చూసేవాళ్లం. అర్ధమైనా కాకున్నా. మా నాన్నకు ( మాకు కూడా) ఆదివారం సెలవు కాబట్టి, ప్రతి శనివారం సెకండ్ షో తప్పనిసరిగా వెళ్లేవాళ్లం.. అప్పట్లో మార్నింగ్ షో కోసమైతే ఎన్ని తిప్పలో. వేసవి సెలవుల్లో అదే కాలక్షేపం మరి. అప్పుడు టీవీలు లేవుగా. 9 గంటలకు థియేటర్ వాడు గేట్ తీయగానే వెళ్లి లైన్లో నిలబడ్డం. ముందు పిల్లలంతా వెళ్ళి చెప్పులు లైన్లో పెడతారన్నమాట. మనిషికో చెప్పు గుర్తుగా, దూరం, దూరంగా పెట్టి, వాటిని గమనిస్తూనే (ఎవరూ దూరకుండా), పక్కన ఖాళీ స్థలంలో ఆడుకోవడం సరదాగా ఉండేది. టికెట్లు ఇవ్వడానికి సరిగ్గా పదిహేను నిమిషాల ముందు ఇంట్లో పనులన్నీ తీర్చుకుని పెద్దవాళ్లు వచ్చి పిలల్లతో పాటు చెప్పులు తీసి కాళ్ళకు తొడుక్కుని లైన్లో నిలబడతారు. ఇక కొందరు స్త్రీమూర్తులు ఉంటారు. యుద్ధం చేయడానికి వచ్చిన ఝాన్సి రాణీలే .. లైన్లో నిలబడకుండా మధ్యలో దూరిపోతారు. ఇక గొడవ , అరుపులు మొదలవుతాయి. ఒక్కోసారి జుట్లు పట్టుకుని కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మా ఇంటి దగ్గర థియేటర్లో ఒక సవరం ఎన్నొ నెలలు సైకిల్ స్టాండులో వేలాడదీసారు, సొంతదారులు వచ్చి తీసికెల్తారని. ఆ యుద్ధకాండ లో మనకు టికెట్ దొరికితే ఎంత సంతోషమో. అలా మార్నింగ్ షోలలోనే ఎన్నో మంచి సినిమాలు చూసాను. అప్పుడప్పుడు నేను, అమ్మ కలిసి హిందీ సినిమాలు చూసేవాళ్లం. ఎప్పుడైనా ఇంగ్లీషు సినిమాలు. సగం అర్ధమై , సగం అర్ధం కాకపోయేవి. చిన్న పిల్లలం కదా.

ఇక భయపెట్టిన సినిమాలంటే ముందు గుర్తొచ్చేది షోలే... రామక్రిష్ణా థియేటర్లో సెకండ్ షో. అసలే 70mm తెర.. నిజంగా ఆ సినిమా చూసి చలా భయపడ్డాను. గబ్బర్ సింగ్ అరుపులు. ఆ కొండలలో గుర్రాలు, దొంగలు, మ్యూజిక్. ఎన్నో నెలలు నా చెవుల్లో వినపడుతూనే ఉండేవి. ఎప్పుడైనా కార్లో దూరప్రయాణాలు చేస్తుంటే రాత్రి పూట కాని, నిర్మానుష్యంగా ఉన్నప్పుడు కాని, రోడ్డుకిరువైపులా ఉన్న కొండలు, చెట్ల వెనకాల నుండి గుర్రాల మీద దొంగలొస్తారేమో అని భయంతో వణికిపోయేదాన్ని. కళ్లు తెరిచి బయటకు చూస్తే ఒట్టు. ఊర్లొ కొచ్చి లైట్లు కనపడేవరకు బయటకు చూసేదాన్ని కాదు. ఇక పెద్దయ్యాక కూడా భయపెట్టింది అంటే Evil Dead ఇంగ్లీష్ సినిమా. అది కూడా ఇంట్లో చూస్తేనే. అరగంట చూడగానే వెళ్లిపోయి పడుకున్నా.. తెల్లారేవరకు నిద్రపడితే... మళ్లీ ఇంతవరకు ఆ సినిమా ఊసెత్తలేదు.

ఇక చూడ్డమే వేస్ట్ అనిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. మొదటిది అక్బర్ సలీం, అనార్కలి.. మ్యాటినీ షోకి మార్నింగ్ షో టైం కి వెళ్లి లైన్లో నిలబడి టికెట్లు తీసుకుని సినిమా చూస్తే పిచ్చెక్కింది. కొంచం తెలుగు, కొంచం ఉర్దూ, ఎంటేంటో గందరగోళంగా ఉండిండి ఆ సినిమా.. ఐనా భరించి మొత్తం చూసి వచ్చాం పిల్ల్లందరం. తర్వాత అంత విసుగొచ్చిన సినిమా "ఆహా" జగపతిబాబు నటించిన సినిమా. అరగంట సినిమా చూసాక ఒక్క ముక్కా అర్ధం కాలేదు, స్టోరీ ఏంటో, ఎందుకు పాటలు పాడుతున్నారో, ఏంటో ఆ డైలాగులు,, వెళ్లిపోదామని లేచాను కూడా, వెంట వచ్చినవాళ్లు బానే ఉంది కూర్చో అంటే తప్పనిసరై కూర్చుని నిద్రపోయా.. :)... అలాంటి అర్ధం కాని సినిమానే "జల్సా" అని మా అబ్బాయి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ మధ్య టీవీలో వచ్చినప్పుడు కూడా నీకు దమ్ముంటే సినిమా చూసి నాకు కథ చెప్పు అన్నాడు. ఎందుకు రిస్క్ అని అటువైపు వెళ్లలేదు.. "అరుంధతి" కూడా బావుంది, చూడమని , టికెట్లు తెస్తానన్నా చూద్ధాంలే అని ఊరుకున్నా. వాడైతే తెగ భయపడ్డాడు ఆ అరుపులు, మ్యూజిక్ విని. నేను భయపడతానో లేదొ అని వాడి డౌట్. ఒకసారి సిడిలో చూద్దామని తీసుకొచ్చాదు. ఈ సినిమా గురించి అందరూ ఇంతలా చెప్తున్నారు. అసలు దీని కథేంటో చూద్దామని మొదలు, మధ్య, చివరలో పది నిమిషాలు చూసాను. చిరాకేసింది. అనూష్క నటన ఓకే. ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో వెగటు పుట్టింది. అంత భయంకరంగా చూపించాలా? గ్రాఫిక్స్ తో జనాలను భయపెట్టడమే ముఖ్య ఉద్ధేశ్యం అనిపించింది. వేస్ట్.. ... దశావతారం సగం సినిమా కమల్ హాసన్ ని వెతుక్కోవడమే సరిపొయింది. ఆ తర్వాత కథను, చివరలో అసలు సినిమా ఎందుకు తీసాడో అనే ఆలొచనతో బయటపడ్డాను.


కొన్ని సినిమాలు ఇంతకు ముందు చూసినా టీవీలో వచ్చినప్పుడల్లా కదలకుండా చూడాలనిపిస్తుంది. కొన్ని సంఘటనలు, పాటలు, కథాంశం చాలా బావుంటాయి. అస్సలు బోర్ కొట్టదు. అలాంటి కొన్ని సినిమాలు Mr. ఫెళ్లాం, సిరివెన్నెల, కొత్తది అంటే డీ మంచి కామెడీ ఉంది. , పాత సినిమాలు, వంశీ సినిమాలు ... ఇవి ఎప్పటికీ నిత్యనూతనాలే. మనస్సును ఆహ్లాదపరుస్తాయి. పెదవులపై మందహాసాన్ని చిగురింపజేసి ఉల్లాసపరుస్తాయి..

10 వ్యాఖ్యలు:

గీతాచార్య

Evil Dead చూసి భయ పడ్డారా? :-) అది కామెడి అండీ బాబూ. నాకైతే నవ్వాగలేదు చూస్తున్నంత సేపూ. అది హారర్ అని జనం ఎందుకు భయపడ్డారో నాకింకా అర్థం కాలేదు.

భలే రాశారు టపా. మీ విశ్లేషణలూ బాగున్నాయి.

Chari Dingari

Vikramarkudu (RaviTeja) manchi cinemanaa...?

జ్యోతి

నరహరిగారు,
అయ్యో.. క్షమించాలి. ఢీ సినిమా రాయబోయి విక్రమార్కుడు రాసేసాను. ఇప్పుడే సరిదిద్దుతాను.. ఢీ మంచి కామెడీ ఉంటుంది. ఇక మిగతా విషయాలు ఆలోచించొద్దు. ఆశించొద్దు..

Srujana Ramanujan

'అనుష్క’ ఓవర్ యాక్షన్ తీసేస్తే ’విక్రమార్కుడూ బానే ఉంటుంది.

చాలా మంది పైన చాలా కాలం impact చూపిన సినిమా షోలే. బాగుంది చాలా రోజుల తరువాత.

Anil Dasari

>> ".. చెప్పులు తీసి కళ్లకు తొడుక్కుని లైన్లో నిలబడతారు"

పైదాని భావమేమి? :-)

ఇప్పుడొస్తున్న కధానాయికలు బాగోరనటం అన్యాయం. ముందటి తరంలో రాధ, విజయశాంతి, భానుప్రియ, జయప్రద, etc, ప్రస్తుతం శ్రియ, స్నేహ, అనూష్క, etc, etc అందగత్తెలు కారా?

నిజానికి - బ్లాక్&వైట్ జమానాలో సాఫ్ట్‌ఫిల్టర్స్ మితిమీరి వాడి, ఏరికోరి కొన్ని కోణాల్లనుండే కధానాయికలనీ, నాయకులనీ జాగ్రత్తగా చూపించి, ఎక్స్‌ట్రీమ్ క్లోజప్పుల జోలికి అతిగా పోకుండా, భీకరమైన మేకప్ కుమ్మేసి - ఇలా - వాళ్లని అంతో ఇంతో అందంగా చూపించేవాళ్లు. ఆ రకంగా చూస్తే ఇప్పటోళ్లే మెరుగు :-)

పరిమళం

బావుందండీ ..సినిమాల కధ ! ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటేనే భయంగా ఉంటోంది . మంచి సినిమాలు అరుదైపోయాయి అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే వినోదం సినిమా ...నిర్మాతలూ , దర్శకులూ కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీయడం పై దృష్టి పెడితే బావుండును .

జ్యోతి

అబ్రకదబ్ర,,

అప్పు తచ్చు.. :)

తారక

నాకు జీవితం అంటే విసుగొచ్చినప్పుడు మీ బ్లాగ్ లో కొంత సమయం గడుపుతాను, ఐతే, ఈ సారి ఒకటీ అర తప్ప అన్నీ చెత్తగా వున్నాయి.

క్షమించాలి.

కొత్త పాళీ

I've been having trouble writing in Tleugu in these embedded comment boxes. I thought perhaps the problem is temporary, but it seems it is here to stay. So, here it goes.
1. There were many many bad movies made in the olda days also (in fact from day 1 of telugu movie making).
2. You did not mention the half rate morning shows in Hyderabad in the old days. Remember reading about it in Yaddanapudi's Secretary. The concept of morning shows did not come to other towns until 80s.

జ్యోతి

తారగారు, మీ అభిమానానికి థాంక్స్.. సినిమా అనగానే నాలో కలిగిన ఆలోచనలు అలా రాసేసాను.

కొత్తపాళీగారు,
ఈ ఇబ్బంది ఎవరికి రాలేదండి.తాత్కాలికమేమో..
నా చిన్నప్పుడు జానపద, భక్తి సినిమాలైతే అమ్మ తప్పకుండా చూపించేది. అందుకే చెత్త సినిమాల సంగతి తెలీదు.
నేను ఎక్కువగా మార్నింగ్ షోలు చూసింది అర్ధ రూపాయితోనే. కొత్త సినిమాలంటే రెండు రూపాయిల కంటే ఎక్కువ పెట్టలేదు. 85 తరవాత హైదరాబాదులో టికెట్ రేట్లు పెరిగాయి.. ఇప్పుడైతే మండుతున్నాయి.. ఒక్కరికి వంద నోటు సమర్పించాల్సిందే..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008