Monday, 22 June 2009

చెట్టు కథలు - మల్లె చెట్టు

అనుబంధం అంటే మనుష్యులతోనే ఉండాలి, మరీ చెట్లతో మరిచిపోలేని అనుబంధమా?? మరీ చోద్యం కాకపోతే. అని అనేవారు ఎందరో. కాని ఈ రోజుల్లో మనుష్యులు, కుటుంబీకుల మధ్యే సంబంధాలు మరీ ఆధునికము, యాంత్రికము, పలుచనయ్యాయి. ఇక మిగతవాటితో ఏముంటుంది? కొన్ని చెట్లతో మనకు ఇదీ అని చెప్పలేని అనుబంధం ఏర్పడుతుంది చిన్నప్పటినుండి. దాన్ని మనసులోనే ఉంచుకుంటాము. వ్యక్తపరచలేము. కాని పెద్దయ్యాక ఆ అనుబంధం దూరమయ్యాక ఆ ఆలోచనలు, అనుభూతులు మాటల రూపంలో వెలికి వస్తాయి. ఔరా! మాటలాడే మనిషికంటే మాటరాని ఆ చెట్టుతో మనకు ఎంత గాఢమైన అంబంధం ఉంది కదా అనుకుంటాం..



నా చిన్నప్పుడు ఇంట్లో ఒక మల్లెచెట్టు ఉండేది. ఏదో మల్లె చెట్టు కాదు. చమేలి . బొద్దుగా, ముద్దుగా నాలుగే రెక్కలతో మత్తైన సువాసనలు వెదజల్లే ఈ పూలంటే నాకు చాలా ఇష్టం.. ప్రాణం అనుకోండి . అమ్మకు కూడా చెట్లు, పూలు అంటే ఇష్టమే కాబట్టి ఇల్లు కట్టేటప్పుడే మల్లె చెట్టు కూడా పెట్టించింది. ఇక వేసవి వచ్చిందంటే మనసంతా ఆ చెట్టు మీదే. ఎలాగు సెలవులు, అప్పట్లో టీవీ, ఫోన్లు లేవు ఆటలన్నీ ఇంట్లోనే.. రోజూ సాయంత్రం కాగానే స్టూలు వేసుకుని ఒక్కో పువ్వు వెతికి కోసి ఒక గిన్నెలో వేసుకొవడం ఒక పెద్ద అలుపురాని పని .. అవన్నీ తీసికెళ్లి అమ్మను సతాయించి దండ కట్టించుకోవడం. మొహాలు కడుక్కుని ఇంచక్కా ఆ పూల దండ తురుముకుని , ఆ చెట్టు క్రింద శుభ్రపరచుకొని ఒక దుప్పటి పరుచుకుని తమ్ముళ్లతో గచ్చకాయలు, అష్టాచెమ్మా వగైరా ఆటలు .. ఇవీ వేసవి సెలవుల్లో క్రమం తప్పని దినచర్య. ఎందుకో ఆ మల్లెచెట్టంటే అంత ఇష్టం .. సాయంత్రం కాగానే ఎర్రని గీతలతో సన్నగా, వయ్యారంగా మొగ్గలేసుకుని రారమ్మని పిలుస్తుంది. కాని ఆ పూలు తెల్లారేసరికి వాడిపోతాయని భలే కోపమొచ్చేది. ఇంకో రెండురోజులుంటే ఏం పోయేది అని తిట్టుకునేదాన్ని. ఏమ్, చామంతి, బంతి ఉండట్లేదా?? ... కాని బంగారూ! నేనిచ్చే పూలు ఒక్కరోజే ఉంటాయని దిగులు పడకు.. రోజూ ఇస్తాగా.. ఎంచక్కా పెట్టుకుందువుగాని అని నన్ను బుజ్జగించేదేమో ఆ మల్లెచెట్టు. పూలదండలో మాత్రం నాకు గజానికి తక్కువ పనికిరాదు. మిగిలింది అమ్మకు. సరే తల్లి .. తీసుకో అనేది.. ఎంతైనా అమ్మ కదా.. ఒక్కోసారి అనిపించేది.. ఈ మల్లెచెట్టు అస్సలు మంచిది కాదు.. మండే ఎండల్లో పూలు ఇస్తుంది. . హాయిగా చలికాలంలో ఐతే ఎంతా బాగుంటుందో కదా. చల్లగా, మంచి వాసనలు.. కాని ఆ కోరిక తీరే అవకాశం లేదని చాలా పెద్దయ్యాక తెలిసింది...



రాత్రి భోజనం మాత్రం మల్లె చెట్టుకిందే.. మళ్లీ అన్నీ శుభ్రం చేస్తామనే షరతు మీద అమ్మ ఒప్పుకునేది. కాని తర్వాత తర్వాత ఇంటి రిపేర్లలో సిమెంట్ గచ్చు చేయించడం వల్ల ఆ చెట్టు తీసేయాల్సి వచ్చింది. బాధపడ్డా లాభం లేకుండా పోయింది .. ఇప్పటికీ ఆ విరజాజి మీద అంతే ప్రేమ, ఆప్యాయత ఉంది. మార్కెట్లో గుప్పెడు పూలు కనిపిస్తే చాలు, కొనుక్కోవడమే. చిన్నప్పుడు అంటే పెద్ద ఇల్లు కాబట్టి ఎన్నో చేట్లు ఉండేవి ఇంట్లో . ఇప్పటి ఇరుకిరుకు అపార్ట్ మెంట్ జీవితాలలో నాలుగైదు కుండీలలో చిన్ని చిన్ని చెట్లు పెంచుకోవడం మహా కష్టమైపోయింది. మనసు చావక అదే మల్లె చెట్టు కుండీలో పెంచుతూ,. కనీసం మూడురోజులకొక పూవు పూసినా చాలు అని సంతృప్తి పడిపోవడం. చిన్నప్పటి మల్లెచెట్టును గుర్తుకు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేదుకదా.. కాని వేసవిలో చమేలి పూలు ఎక్కడ కనపడినా , ధర ఎంత ఎక్కువైనా కొనుక్కోవడం మాత్రం మానను.

13 వ్యాఖ్యలు:

Vinay Chakravarthi.Gogineni

baagundi............

హరే కృష్ణ

మల్లె చెట్టు వుంటే పాములు వస్తాయి కదా ..అవి రాలేదా చుట్టుపక్కలకు

జ్యోతి

హరేకృష్ణగారు,

మల్లెచెట్టుకు పాములా?? మొదటిసారి వింటున్నా.. మొగలిపూలచెట్టుకు కదా పాములొచ్చేది???

Hima bindu

జ్యోతిగారు ,బాగుందండీ ఈ అనుభంధం .....సాక్షి లో చెట్టు కథలు చదువుతుంటే నిజంగా ఈ జనరషన్ ఎంత మిస్ అవ్వుతున్నారో అన్పిస్తుంది .

హరే కృష్ణ

ఏమోనండి..మా తోటలో రెండు చెట్లూ వుండేవి మాకు ఈ చెట్టు వల్ల పాములు వచ్చేవో తెలిసేది కాదు ఇప్పుడు మీరు క్లారిఫై చేసారు :)

dhrruva

Jyothakka...

Title is MALLE CHETTU.. pic is SANNA JAAJI.

manchi MALLE CHETTU foto pettu akka !!

జ్యోతి

చిన్నిగారు,
నిజమేనండి. ఈనాటి పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కోవడమే వాళ్లకు తెలిసింది..

Dhruva..

నేను పెట్టింది చమేలీ అనే మల్లె చెట్టు. సన్నజాజి కూడ మల్లె చెట్టు కదా...

మధురవాణి

జ్యోతి గారూ,
బావున్నాయి మీ మల్లెచెట్టు జ్ఞాపకాలు.
అసలు ప్రతీ అమ్మాయికి ఇలా ఒక మల్లెచెట్టుతోనో, సంపంగి చెట్టుతోనో అనుబంధం తప్పకుండా ఉంటుందనుకుంటా.! మీరేమంటారు మరి.?
నాక్కూడా మా ఇంటి ఎర్ర జాంచెట్టు అంటే భలే ఇష్టంగా ఉండేది.
అప్పుడెప్పుడో ఓ టపా కూడా రాసాను. వీలున్నప్పుడు చూడండి.
http://madhuravaani.blogspot.com/2009/01/blog-post_23.html

పరిమళం

జ్యోతిగారు !
మానవ జీవితం అంతా మమతానురాగాల అల్లికే ..చేట్టేమిటి ,పుట్టేమిటి ..చిన్నప్పుడు లక్కపిడతలతో ఆడుకున్న అరుగేమిటి ...అన్నిటిమీదా అనురాగమే ...వాటన్నిటితోనూ అనుబంధమే ...మీ మల్లెచెట్టుతో నా జ్ఞాపకాల తేనెతుట్టను కదిలించారు .

శ్రుతి

జ్యోతి గారు,

నాకు కూడా ఈ పూవులంటే చాలా ఇష్టం. నేను ఎన్ని సార్లు ట్రై చెశానో పెంచడానికి. పందిరి వరకు వస్తుంది. ఓ ౧౦ ౧౫ పూలు పూసి కనుమూస్తుంది. ఏంటో మరి. కాని ఎక్కడ కనిపిస్తే అక్కడ నొండి కొనకుండా కదలను మరి. చాలా థాంక్స్ గుర్తు చేసినందుకు.

సుభద్ర

mallelu gubhalincharu jyothigaaru.

సుజాత వేల్పూరి

ఈ ఛమేలీ మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉంది.పెద్ద పొదలాగా పెరిగిపోయింది. సన్నని ఎర్రని చారతో ఉండే ఆ తెల్లని మొగ్గ ఎంత అందంగా ఉంటుందో! విచ్చితే అంత అందంగా ఉండదు పువ్వు.

తారక

పిక్ మల్లెది కాదెమో?
మీకు అంత ఇష్టమైన చెట్టు (మొక్క) ని తీసేస్తుంతే ఎలా వూరుకున్నరూ?

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008