అష్టనాయికలు -పాఠికలు
పొద్దు గడి కోసం అష్టనాయికల కోసం జాలం లో వెతుకుతుంటే ఈ అపురూపమైన సమాచారం దొరికింది. అష్టనాయికలపై దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కవిత్వం, అలాగే అష్ట పాఠికలు గురించి కూడా తెలిసింది. అష్టపాఠికలు గురించిన సమాచారం SCIt లో 1995 లో ఇచ్చారు. వెదకకుండానే బంగారు తీగ తగిలింది. అవి మీతో పంచుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాను. SCIt గురించి మరిన్ని వివరాలు ఎవరైనా చెప్తారా??
అష్ట నాయికలు :
ఇరులలో తారక లివియంచు, తానేనా
కురులలో మల్లియ విరులు తురుము!
అసలే కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతో
పొందుగ లత్తుక పూయు తానే!
అదియేదో అంటే నీ అధరాన నని, తన
మెత్తని పెదవుల నొత్తి తుడుచు!
చూచుచు, మరి మరి చూచి మెచ్చుచు, మక
రికల చెక్కిళ్ళ చిత్రించు తానే!
ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు
ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత
నగవులో, నా మనస్సు నెరిగి గ్రహించి,
తీర్చునే యంచు మురియు `స్వాధీన పతిక '
------------------
విభుని దోతేర పంపిన ప్రియ దూతిక
లెంతకు తిరిగి రారేమో కాని-
ఘనుల సద్గోష్ఠిలో మునిగి యున్నాడని
వెరతురేమో స్వామి దరియుటకును;
నిప్పుల వర్షమై నిలువెల్ల దహియించు
నిలబడనీదు వెన్నెలల వాన;
అయ్యయో మదన దేవా! మ్రొక్కు దాన, నా
పైననా ననతూపు పదను బాకు?
అతనుదవు, నీవు పోగల వటకు, - వారి
ఉల్లమున జేరి నా మాట నూదగలవు;
చనుము - నా ప్రాణముల నిల్పు మని నెలాంత
తల్లడిలు విరహోత్కంఠిత వలవంత?
---------------
పవళింపు గదిలోన, పగడంపు కోళ్ళ చ
ప్పరపు మంచము పైన పాంపు పైన
వలిపంపు జిలుగు దుప్పటి వేసి, కస్తూరి
జువ్వాది కలిపిన గంధ సార,
మగరు వత్తులు, మేలి అత్తరుల్, పచ్చక
ప్పురపు వీడియము పళ్ళెరమున నిడి
ద్వారాన తోరణాల్ కూరిచి, ముంగిట
వన్నెవన్నెల రంగవల్లులుంచి
తానమాడి, పుప్పొళ్ళ నెమ్మేన నలది
నెరుల సిగ నల్లి, నుదుట చెందిరపు బొట్టు,
కనుల కాటుక, అలతి నగవులు మెరయ
విభుని కొరకు వాసక సజ్జ వేచి యుండు
-------------
ఈ తీవ యోవరియే గదా తాముర
మ్మన్న యేకాంత గృహమ్ము! తాము
మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!
ఈ నిరీక్ష్ణము లింకెంత శేపె?
కడచెనే రేయి సగ; మ్మైన శ్రీ వారి
అడుగుల సడియును పడదు చెవుల-
మరిమరి పొగడకే మాయల మారిని,
విసిగిన ప్రాణాలు వేపి తినకె!
పదవె, అడుసాయె నేల నా బాష్పవారి
ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;
"అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు;
విరహమున వేగిపోయిన విప్రలబ్ధ
-----------
"మన సార వలచి వచ్చిన వాడు,నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలు కొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! అ మూతి ముడుపులు
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సునంటలు, అలమటలును!
ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలారు లె" మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు
--------------
విన్నవే యిన్నాళ్ళు, కన్నులారగ చూసి
న్నను, నేడేంతో ఆనంద మాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడే ఝామములాయె - మోహ యాత్ర
నేదో ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక
వలదు విడియగ నిట మానవతులే గాని
వలపు బిచ్చ మాశించెడి వారులేరు;
పిలిచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు ఖండిత అయిన రాధ
--------
"అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా
తల వాలిచె మన మందార తరువు!
పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది
గులుచెంది దిక్కుదిక్కులకు చూచు!
సరెసారెకు మన శారిక పలవించు
కలువరపడి ఏదృ పలుకబోవు!-
ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల
ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి" యనుచు
చల్లుకొను మేన గొజ్జంగి నీరు;
గుప్పుకొను కప్పురము తోడి పుప్పొడులను;
పొరలు సెజ్జ, లేచి మరల నొరుగు సుంత;
పొగులు ప్రోషిత భర్తృక మగని కొరకు
-------------------
నడి రేయి, చక్కని పున్నమి నాటి వెన్నెల
పాల వెన్నెల జడివాన లీల!
హృదయేశు డున్న ఆ పొదరింటి వర కొరుల్
పసిగట్టకుండ పోవలయు గాదె!
తెలికోక తెలి రైక, తెలిమేలి ముసుగులో
మెయి సోయగపు మిసమిసలు దాచి
కాలి యందెల కడియాల గాజుల మువల్
రవళింపకుండ చెరగున జొనిపి
మోముపై, కేలిపై గంద వొడి నలంది
పులుగు రవ్వంత గూట కదల బెదరుచు
ఆకుసడి కదరుచు, గాలి అడుగు లిడుచు,
వెడలె నభిసారికగ ప్రియు కడకు రాధ
-------------------------------------------------------------------------------------------
అష్టపాఠికలు:
నేడు వార, మాస పత్రికా పాఠకులలో మహిళలే అధిక సంఖ్యాకులు.
వీరిలో అష్ట విధములైన వారున్నారు.
1) కథనోత్కంఠిత
2) స్వాధీన పఠిత
3) రీడిత
4) చిత్ర లబ్ధ
5) అభిమానిక
6) పుస్తక సజ్జిక
7) నవలాంతరిత
8) పోషిత పత్రిక
ఈ విధముగా వీరిని వర్గీకరించనగును. వివరణము యీ క్రింద యొసంగ
బడినది.
చిన్న కథల యందు అత్యంత ఆసక్తి కలిగి, యెక్కడ అచ్చు అక్షరము కనిపించిననూ కథయేమోనను భ్రమతో చదువుటకు
వుపక్రమించు నామె కథనోత్కంఠిత.
స్వాధీన పఠిత నిర్ణీత వేళల యందు మాత్రమే పత్రికా పఠనము గావించును. తీరిక సమయములందు కాలహరణమునకు ఈమె చదువును.
మిక్కిలి పఠనాసక్తి గల స్త్రీ రీడిత (రీడింగ్, అను ఇంగ్లీషు పదము దీనికి మూల ధాతువు). కథ, నవల, కవిత, లేఖయని ప్రక్రియా భేదము లేక వాణిజ్య ప్రకటనలతో సహా యీమె చదువ గోరును. సులోచనములు వుండుట యీమెకు సంచార
గుణము.
చదువుట యందు యిసుమంతైనా శ్రధ్ధ చూపక కేవలము చిత్రములను మాత్రమే చూచెడి వనిత చిత్ర లబ్ధ. ముఖ చిత్రాలను చూసి యీమె పరవశించును.
అభిమాన రచయితల,లేదా రచయిత్రుల రచనలు మాత్రమే చదివెడి యామె అభిమానిక. మీ/మా పత్రికలకు లేఖలను, ఆయా పత్రికలలోని రచనలను పొగడుచు సంపాదకులను అభినందించుచు లేఖలు వ్రాయును.
పుస్తకములను, ముఖ్యంగా లావైన నవలలను, మందపాటి ప్రత్యేక సంచికలను తలగడగా అమర్చుకుని నిద్రించు పాఠకురాలు పుస్తక సజ్జిక. నిద్ర కోసము మాత్రమే ఈమె పుస్తకములు చదువును.
దారావాహిక నవల పూర్తియగు వరకు నిద్రాహారములను త్యజించు నామె నవలాంతరిత. ఈమెలో నిద్రలేమి, ఆకలి దప్పికలు లేకుండుట, సంచారీ భావములు. నవలలోని నాయికలో ఐక్యమై, కథానాయిక మనోభావములకు అనుగుణముగా ఈమె మనఃప్రవృత్తి వుండును. సీరియల్సుని కత్తిరించి, బైండు చేయించుటయందు ఈమె కాసక్తి మెండు.
వార, పక్ష, మాస పత్రికలకు చందాలు చెల్లించి, తాను చదవక, ఇరుగు పొరుగు వారికి అరువిచ్చునామె పోషిత పత్రిక. పత్రికల పంపిణీ ద్వారా పలుకుబడిని సంపాదించుట ఈమె ధ్యేయము.
13 వ్యాఖ్యలు:
అష్ట నాయికలు కొంత మందికి తెలిసే ఉంటారు ..కానీ అష్టపాఠికలు సమాచారం బావుంది జ్యోతిగారూ !
అష్టనాయికలు బానే ఉన్నారు..... :)
SCIT గురించి, లిష్టుల గురించి కొలిచాలా గారు రాసిన ఈమాట వ్యాసం చూడండి అని చెప్పానా?...లేకపోతే పరుచూరిగారిని అడగండి...వాటిగురించి ఆయనకన్నా వివరంగా మీకు ఎవరూ చెప్పలేరు
"అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట" http://maruvam.blogspot.com/2009/01/blog-post_22.html
*****
అదుపన్నది ఎరుగనే, అలసటకి తావీయనే, నీవడిగిన తడవే
మనమనుకున్న తావున నే వేచుండలేదా, నీ "అభిసారిక"నై?
నీపై అలిగానేమోనని నా మది నాపై కినుకవహించి,
నాపై నేనే అలిగానేమోనని తనపై తనకు దిగులు జనించి,
నడుమ తనపై జాలిలేదాని తనువు మదిపై నిందలువేసి,
ఈ అన్నిటినీ చిన్ని గుండె ఇలా వొంటరిగా గమనించేసి,
తనువు, మనసు, ఆ హృదయం కలిసిన నేను నిలిచానిట "కలహాంతరిక"నై.
మునుపే చెప్పాగా, రెప్పల గోడల వెనుక జాలువారుతున్న,
జలధారల ఇక నిన్నభిషేకించాలని లేదని.
నా గుండెకోట లోని వేల గదుల్లో,
ఎక్కడో ఒకచోట నీ కంటపడకుండా దాగిపోవాలనుందనీ.
నీ చేతల పులకించిన ఆనేనే ఇపుడు నిక్కచ్చిగా "ఖండిత"నే
యేనాడు వీడావీ చేయి, హొయలు ఒక పరి, వగలు తదుపరి,
అన్నీ కలిసి కలల కావేరినై, దిగుళ్ళ ద్రిగ్గుళ్ళే దీన దేవేరినై
నిస్పృహలో స్పృహ తప్పిన నిండు గోదారినై,
చుక్కాని జారిన నట్టేటి నావంటి వయ్యారినై,
రేయి గుబుళ్ళలో తనువు త్రుళ్ళింతలో తుంటరినై,
తమకమద్దే వేకువల్లో తల్లడిల్లే ఒంటరినై,
లేతప్రాయంపు "ప్రోషితపథిక"నైతిని కాదా?
ఎంత చిత్రం లోకాలనేలేటి రాజునీవైతే,
సరసాల నిన్నోలలాడించి, నీకు రారాజ్ఞి నేనైతి.
వింత కాదేటిదని అంతా మేళమాడితే,
సరాగాల గారాలొలికిన "స్వాధీనపథిక"ను కాదేటీ?
నిత్యం నీ తడిపొడి తలపులతో తనువునలంకరించుకొని,
రహస్యం దాచలేని గుండె చేసే గడబిడనే గంధంగా రాసుకుని,
కార్యం నెరవేర్చుకుని కన్నుగీటిన నిన్నే కాటుకగా అద్దుకుని,
ఆలస్యం చేయక రారమ్మని వేడుతూ నీ "వాసవసజ్జిక"నైతి.
నీ తనువుపై కరిగి, నీ ప్రతిమగా తిరిగి రూపు దిద్దుకుందామని
నా మెత్తదనం నువ్వద్దిన ముద్దుతోనే నీకు తెలుపుదామని
ముకుళించిన నా చేతుల్లో నీ రూపు ముద్రించుకుందామని
నా ఎదలో నిను బందీ చేసి నీకు నేవశమౌదామని
వేచివున్నానిట నీ "విరహొత్కంఠిత"నై.
నేతాళలేనీ విప్రలంబని విన్నవించితి కాదే వేయిమార్లు,
వేగిరపడి, వేదనపడి, వేళపాళయని యోచించక,
విరహాన నను ముంచకని వేడుకుంటిని కానా వేయినూర్లు,
మరి యేలనయా ఈ జాగు, వీడు చేరనేలేదు నీ "విప్రలబ్ద"కై?
ఇన్ని పోలికలు చెప్పి, అన్నీ ఒక నేనేననీ అదీ నీ కొరకేనని చెప్పనా మరోమారు? ఆ అవసరంలేదిక దరిచేర దారిపట్టానంటావా?
*****
నా కవిత ఇది. వ్యాఖ్యల్లో ఆత్రేయ గారి అరుదైన కవితా మణిహారం వుంది.
నాలో మీ "అష్టపాఠికలు" అందరి పోకడలువున్నాయి కనుక నేనవరినో నాకింకా స్పష్టతలేదు మరి ;)
జ్యోతిగారు,ఈ ఆష్టవిధనాయికల మీద (కొన్నేళ్ళక్రితం )బాపుగారు ఆంధ్రజ్యోతి ఆఖరు పేజీలో నేలకు ఒక నాయిక బొమ్మగీసేవారు. అది తరువాత ఆయన బొమ్మల పుస్తకంలో కలర్స్ తో సహా ప్రచురించటం జరిగింది.ఎక్కడైనా దొరికితే చూడండి బొమ్మలు చాలా బాగుంటాయి.
వంశీగారు,
ఇంకా చూడలేదండి. ఏడాది క్రింద తెలుగు, బ్లాగులు రాయడం నేర్చుకున్న కొందరు పండితులు తమంతటివారు లేరని విర్రవీగుతూ, మిగతావారిని వేలెత్తిచూపుతున్నారు. దాదాపు పదిహేను ఏళ్ల క్రింద జాలంలో తెలుగు వాడారు అని తెలిసి, అప్పటివారు ఇంకా ఎవరైనా సమాధానమిస్తారని ఇలా రాసాను. పరుచూరిగారిని కూడా వివరాలు కనుక్కుంటాను.
ఉష :
మీ మరువపు పిలకను నా బ్లాగులో పెట్టినందుకు ధన్యవాదాలు.
తృష్ణ :
ధాంక్స్ అండి. ఆ పుస్తకం కొనాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను.
ఇంతకీ ఇలాటి రచనలు మగవారిపై ఎవరూ రాయలేదా? ఎందుకలా??
Hahaha. Interestng. BTW u mean ashta == eight?
మీ అష్టపాఠికల్లో మొదటి ముగ్గురి పోకడలు మాత్రం నాకున్నాయి.
బాగుంది. దేవులపల్లి పద్యాల్ని అందించినందుకు ధన్యవాదాలు. అష్టవిధ పాఠికలు అలనాటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో శ్రీరమణగారి ఫీచర్లో వచ్చిందన్నట్టు గుర్తు.
Nasy,
You yourself posted this message good 14 years ago; reproducing the text from "rangularaaTnam".
http://tinyurl.com/njwobk :-)
Regards,
Sreenivas
@Sreenivas,
cool.
ఇంటర్నెట్ లో తెలుగు ప్రారంభం, వ్యాప్తి గురించిన సమగ్ర సమాచారం సురేశ్ కొలిచాల గారు ఈమాటలో రెండు భాగాలుగా వివిరించారు.
http://www.eemaata.com/em/issues/200903/1057.html
SCIT గురించిన మరిన్ని వివరాలు..
http://www.eemaata.com/em/issues/200905/1112.html
జ్యోతి గారు,
ఇలా మంచి మంచి కవిత్వం అంతా వెదికి పెడుదురూ! ఈ అష్ట పాఠికల్లో పూర్తిగా ఒక్కదానిలోనూ లేను. వీళ్లందరి లక్షణాలూ ఒకటో రెండో నాలో ఉన్నాయి. నేను తొమ్మిదో పాఠికని అన్నమట.
Post a Comment