Friday, July 3, 2009

నేటి మహిళ - 2

మొదటి భాగం చదివారుగా ...


1. ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో హత్య, ఆత్మహత్య అనేవి పెరిగిపోతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటారు? ప్రాణం కంటే ప్రేమ గొప్పదా?

అను : ఈ మధ్య పేపర్లో సమీర బేగం గురించి చదివి నేను చాలా బాధ పడ్డాను. ఈ హత్యలు, ఆత్మహత్యలు అసలు జరిగేది ఎందుకు? ప్రేమగురించా, లేదా పంతం వల్లా? ప్రేమ చాలా గొప్పది, అది యెప్పుడు మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా వుండాలని కోరుతుంది. ఇలా హత్యలు, ఆత్మహత్యలు చేసుకుని అది ప్రేమ కోసం అంటే నేను నమ్మను.

సంజు : ముందుగా ప్రేమ, హత్య కలిసి ఉంటాయని చెప్పలేను. ఇక ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య నిస్సహాయ స్థితిలో, మానసికంగా బలహీనులైనప్పుడు తీసుకునే నిర్ణయం. కాని ఏ సంఘటన ఐనా ప్రాణాలు తీసుకునేవరకు దారితీయవు. ప్రేమ కోసం ప్రాణాలు వదులుకోవడం అంటే అది పిచ్చితనమే అవుతుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అందులో కొన్ని మనకు నచ్చకపోవచ్చు. కాని ఆత్మహత్య అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు.
2. ఒక బస్ స్టాప్ దగ్గర కొందరు అబ్బాయిలు అక్కడున్న అమ్మాయిలు, ఆడవాళ్లను రోజూ వేదిస్తున్నారు. అలాంటి సంఘటన గురించి మీకు తెలిస్తే మీరిచ్చే సలహా ఏంటి? అమ్మాయిలు దీనిని ఎలా ఎదుర్కోవాలంటారు? పోలీసుల సహయం తీసుకోవాలా? దానివల్ల ఉపయోగం ఉంటుందా?

అను : ఏదో కామెంట్ చేస్తూ, పాటలు పాడుతూ ఉంటే చూసీ చూడకుండా వదిలేయడం ఉత్తమం. నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇంజనీరింగులో ఉన్నప్పుడు ఒకబ్బాయి రోజూ నన్ను ఫాలో చేసేవాడు. నేను పట్టించుకోలేదు. ఒకరోజు వాడు నా చున్నీ పట్టుకుని లాగాడు. ఎక్కడినుండి ధైర్యం వచ్చిందో తెలీదు కాని నా డ్రాఫ్టర్ పెట్టి తరిమి కొట్టాను. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా నా వెనకే అతన్ని తరిమారు. డ్రాఫ్టర్ విరిగిపోయింది. కాని భయం వేసి 4-5 రోజులు మా నాన్నను వెంటబెట్టుకుని కాలేజీకి వెళ్లాను. కాని ఆ తర్వాత ఆ అబ్బాయి కనపడలేదు. నా దృష్టిలో ఆడపిల్లలందరూ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఎవరైనా ఫిజికల్ గా టీజ్ చేస్తే బుద్ధి చెప్పాలి. అది ఆగకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాళ్లు తగిన చర్యలు తీసుకుంటారు...

సంజు : ఒకవేళ అది హటాత్తుగా జరిగిన సంఘటన ఐతే పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి. ఒకవేళ ఆ అమ్మాయి ఒంటరిగా ఉండి, సమయానికి ఎటువంటి సహాయం దొరికే అవకాశం లేనప్పుడు సాధ్యమైనంతవరకు మౌనంగా, ప్రశాంతంగా ఉండాలి. ఆ అబ్బాయిలను పట్టించుకోకుండా అక్కడినుండి వెళ్లిపోవాలి. ఇది ప్రతీరోజు జరిగే సంఘటన ఐతే తప్పకుండా పోలీసులకు కంప్లెయింట్ చేయాలి. ఇప్పుడు ఈవ్ టీజింగ్ విషయంలో పోలీసులు, అధికారులు చాలా కఠినంగా ఉన్నారు.
3. మీ పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారు?వాళ్లకి నేర్పాల్సిన ముఖ్యమైన విషయాలేంటి?

అను : జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది.. సంతోషంగా ఉండగలగడం. సంటొషం అన్నది ఎక్కడో బయటినుండి రాదు. అది మనలోనే ఉందని నేను నమ్ముతాను. కనుక మనం ఎలా ఉన్నా సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని మా పిల్లలకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లలు బాధ్యతగల ,నిజాయితీగల మంచి పౌరులుగా అవ్వాలన్నది నా కోరిక. వాళ్లు యోగ్యులై, పదిమంది వాళ్లని చూసి ముచ్చట పడేలా ఉండాలి. వాళ్లు సమాజానికి, దేశానికి ఏమైనా చేస్తే నేను, మా ఆయన కూడా చాలా గర్వపడతాము.

సంజు : నేనైతే పిల్లలకు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఆలోచించడం, జీవించడం నేర్పిస్తాను. వాళ్లు ఎప్పుడు కూడా ఎవరి మీదా ఆధారపడకూడదు. వాళ్లు తమలోని శక్తి సామర్ధ్యాలను గుర్తించి వాటికనుగుణంగా పనిచేస్తూ ఎప్పుడు కూడా ముందుకెళ్లాలి. అలాగే తమను, ఇతరులను అందరని ఒకేవిధంగా గౌరవించాలి. మానవత్వంతో మెలగాలి.

4. పిల్లలపై తల్లితండ్రులు ఎంతవరకు కంట్రోల్ ఉంచాలి? వాళ్లు ఏం చేస్తున్నారు. ఏం చదువుతున్నారు అని గమనిస్తూ ఉండాలా?లేదా అమెరికాలో లాగా పదిహేను నిండగానే they are grown up అని వదిలేయాలా?

అను : శరీరాన్ని కంట్రోల్ చేయగలమేమొ కానీ మనసుని యెలా కంట్రోల్ చేస్తాము? నియంత్రించటము కన్నా నేర్పించటము మిన్న కదా. మంచీ-చెడూ వాళ్ళకివాళ్ళే తెలుసుకునేలా పెంచితే మనమున్నా లేకపొయినా పిల్లలూ ఒకేలా వుంటారు. ఇరవైనాలుగుగంటలు వాళ్ళతో వుండాలంటే కుదరదు కదా. నాకు మా అమ్మా-నాన్నల పద్ధతి బాగా నచ్చింది. మా చిన్నప్పుడు వాళ్ళు మేమే సర్వం అన్నట్టు వుండేవారు. కాని ఇన్జినీరింగ్ అయి పొయాక రాత్రికి రత్రే వాళ్ళు ఫ్రెండ్స్ గా మారిపొయారు - ముఖ్యంగా నా పెళ్ళి కుదిరాక. నా జీవితంలో ప్రతి క్షణంలో నాకు ఎలాటి అంద అవసరమైందో అది వాళ్లు అందించారు. అదే నా అభిప్రాయం కూడా. పిల్లలకి అవసరం వున్నంత వరకు మనం గమనించాలి. వాళ్ళు మనలని వదిలేసే దాకా, రెక్కలొచ్చి యెగిరేదాక, మనం చూస్కుంటూనే వుండాలి. వాళ్ళు స్త్రిక్ట్ అనుకున్నా సరే - పెద్దయ్యాక అర్ధం చేసుకుంటారు.

సంజు : పిల్లలకు కనీసం 18 ఏళ్లు వచ్చేవరకు మన తోడు అవసరం. మనం ఎవ్వరిని కంట్రోల్ చేయలేము. ఈ రోజుల్లో మూడేళ్ల పిల్లలు కూడా ఒక్కోసారి మన మాట వినరు. వాళ్లని సరైన దారిలొ మళ్లించాలి. సహాయం చేయాలి. అలాగే ఏ విషయం చెప్పినా కూడా అది వాళ్ల మనసులో హత్తుకునేట్టు ఉండాలి. తండ్రి సిగరెత్ తాగుతూ పిల్లలను పొగ తాగడం మంచిది కాదు. ఆరోగ్యానికి చేటు అని చెప్పడం ఎంతవరకు సమంజసం. కాని కొన్ని సమయాలలో మనం కాస్త కఠినంగా ఉండక తప్పదు.

జ్యోతి : అను . నువ్వుచెప్పింది నిజం. పిల్లలతో ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ లా ఉండాలి. ముఖ్యంగా స్కూలు దాటాక వారికి మంచి స్నేహితులు చాలా అవసరం. అది తల్లితంద్రులలో ఎవరో ఒకరు ఐతే మరీ మంచిది. వాళ్లకు తెలీని, తెలిసిన విషయాలు ఇంట్లో కూడా చర్చగలిగే చనువు మనం ఇవ్వాలి. అప్పుడే వాళ్లు చెడు స్నేహాలు పడకుండా ఉంటారు. పెద్దలమని వాళ్లని అధికారంతో దూరం పెట్టి నియంత్రించకుండా మంచి ఫ్రెండ్ లా ఉంటే వాళ్లు కూడా సంతోషిస్తారు. స్నేహితులు, చదువు. సినిమాలు, ప్రేమ కూడా చర్చగలిగే స్వాతంత్ర్యం మన దగ్గర ఉండాలి. ముఖ్యంగా తల్లి ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.
5. సాధారణంగా ఏ సమస్య వచ్చినా , శారీరకంగా మగవాళ్లకంటే ఆడవాళ్లు బలహీనులు ఐనా మానసికంగా ఎంతో ధైర్యవంతులు అంటాను. ఒక్కోసారి వాళ్లే ఈ సమస్యను ఎంతో నేర్పుగా పరిష్కరించగలరు. మీరేమంటారు?

అను : శారీరిక బలం కన్నా మనోబలం ఆడవారికి యెక్కువ. నేను ఒప్పుకుంటాను. కాని సమస్యలు పరిష్కరించేటప్పుడు మగవాళ్ళు గొప్పా, ఆడవాళ్ళు గొప్పా - అంటే నేను చెప్పలేను. ఇద్దరూ సమస్యని వేరు వేరు దృష్టికోణాలలో ఆలోచిస్తారు కనుక యే సమస్య వచ్చినా ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటే బెస్ట్.నలుగురి సలహా తీసుకుని మనకి యేది ఉత్తమము అనిపిస్తే అది చేయాలి. ఇందాకటి ఈవ్-టేసింగ్ ప్రశ్నలో - మనొబలం మాత్రమే వుంటే సరిపోదు, కదా?

సంజు : మీ మాటతో నేను పూర్తిగా ఒప్పుకోను. ఎక్కువమంది ఆడవాల్లే మగవాళ్లకంటే మానసికంగా బలవంతులు. కాని అందరూ అలా ఉండరు. ప్రతి వ్యక్త్ని బట్టి ఈ విషయాన్ని నిర్ధారించగలం.

జ్యోతి : సంజు..నేను చెప్పింది అదే. ఎప్పుడు స్త్రీ గొప్పదే అనలేదు. కొన్ని సందర్భాల్లొ ఎంత విషమ పరిస్థితి ఐనా కూడా తన చేతిలోకి తీసుకుని చక్కదిద్దుతుంది. నేను ఇలాటి వారిని కొందరిని చూసాను కూడా . :)

6. మీరు ఉద్యోగం లో ఎదుర్కొనే సమస్యలు, పోటీ ఎలా ఉంటాయి. ఈవ్ టీజింగ్ లేదా హరాస్మెంట్ అనేది చాలా మంది ఉద్యోగినులు ఎదుర్కునే సమస్య కదా. అది ఎలా పరిష్కరించగలం?

అను : పెద్ద మల్టీ నేషనల్ కంపనీస్ లో ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది. ఈవ్ టేజింగ్, హరాస్మెంట్, ఇలాన్టివి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కాని ఈ ప్రొబ్లెం చాలా చోట్లు ఇంకా ఉంది. దీన్ని గురించి మహిళలు కంప్లైన్ చెయటానికి భయపడతారు, లేదా సిగ్గు పడతారు. ఇంట్లొ వాళ్ళు కూడ ఉద్యోగం మానిపించేస్తారే తప్ప వేరే యే చర్య తీసుకొవడానికి ఒప్పుకోరు. ఇది సామజిక సమస్య, ప్రపంచంలో అన్నిదేశాల్లోను ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ సమస్య దూరమవ్వాలంటే మహిళలు కూడ ఉద్యోగం చెయ్యాలి - ఉన్నత స్థాయిలు చేరుకోవాలి. ఈ రోజు 20-30 శాతం ఉద్యొగులు ఆడవారు. దీనితో మగ వాళ్ళ డామినషన్ ఎక్కువ ఉంది. 50 షాతం మహిళలు ఉంటే ఈ డామినషన్ తగ్గవచ్చు. ఇంట్లో వాళ్ళు సహకరిస్తే ఇది చాలా సులభంగా జరుగుతుంది - ఎంతో మంది ఆడవాళ్లు చాలా ప్రతిభ ఉన్నవారు. ఈ సమస్య తీరటానికి ఇంక కొంత కాలం పడుతుంది.

సంజు : లేదండి.. పెద్ద పెద్ద ఐటి కంపెనీలలొ ఇలాంటి వేదింపులు ఉండవు. అందరు కూడా ఉన్నత విద్యావంటులు కావడం వల్లనో, ఇలాంటి ప్రవర్తన హేయమైనది, కంపీనీలలో అంగీకరించనిది అనే స్పృహ ఉండడం వల్ల అనుకుంటా. కాని అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నేరాన్ని పూర్తిగా రూపుమాపలేము కదా. మిగతా చోట్ల కంటె ఐటి కంపెనీలలో వేదింపులు తక్కువ,నియంత్రణ ఎక్కువగా ,కఠినంగా ఉంది అంటాను. కాని బయటకెళితే పరిస్థితి తారుమారు కావొచ్చు. ఇదే వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది.ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు ఇలాంటి నేరాలు, వేదింపులను ఖండించాలి. శిక్షించాలి. స్కూల్లు, కాలేజీలలో అధ్యాపకులు, ఇంట్ళో తల్లితండ్రులు భావి తరాన్ని సరియైన రీతిలో తీర్చి దిద్దాలి. ప్రతి తల్లితంద్రి తమ కూతుళ్లను ఇలాంటి సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు మెల్లిగా అర్ధం చేయించాలి. అలాగే మగపిల్లలకు కూడా. అనుకోని సంఘటన ఎదురైతే ఎలా రియాక్త్ అవ్వాలి అనేది వాళ్లకు నేర్పడం ముఖ్యం. నేనైతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు నా బ్యాగును గట్టిగా పట్టుకుంటాను. పరధ్యానంగా ఉండకుండా చుట్టు జాగ్రత్తగా గమనిస్తూ వెళతాను.7. ఉద్యోగంలో చాలా వత్తిడులు ఉంటాయి. ఆడవారని ఎవరూ వదిలేయరు కదా. ఉన్నతమైన , బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నప్పుడు తప్పవు కదా.. ఆఫీసులో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీ కుటుంబ సభ్యులు,ముఖ్యంగా మీ భర్త ప్రతిస్పందన ఎలా ఉంటుంది. ఆపీసు, ఇల్లు సమర్ధంగా ఎలా మేనేజ్ చేస్తారు?

అను : మా ఇంట్లో మా అత్తగారు సి.ఈ.ఒ. పని వాళ్ళని, ఇంటిని, అంతా ఆవిడే చూసుకుంటారు. నాకు భర్త దగ్గర మోరల్ సపోర్ట్ దొరుకుతుంది, కానినిజమైన సపోర్ట్ అంతా మా అత్తగారు అందిస్తారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు ఉద్యోగం మానేయాలనిపించింది. కాని ఆవిడ "నేను ఉన్నాను కదా, నాకు ఓపిక ఉన్నపుడు నువ్వు ఉద్యోగం చేయి " అన్నారు. మా అమ్మ నాన్నా కూడ ఉద్యోగం చేయటానికి ప్రొత్సహించారు. కావాలంటే మీ దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటాము, నీకు ఏ కష్టం ఉండదు అని ధైర్యం చెప్పారు. పిల్లల విషయంలో మా ఆయన చాలా బాధ్యత వహిస్తారు. వాళ్ళకి హొంవర్క్ హెల్ప్ ఆయినే చేస్తారు. ఈ సహకారం లేకపొతే మనకు కెరీర్ మీద ఫొకస్ ఉండదు. ఇంత వున్నా ఏరోజుకారోజు సర్దుకుపోవడం అన్నది చేసుకుంటునే ఉండాలి.

సంజు : ఆడవాళ్లైనా, మగవాళ్లైనా తమ పనిని ఒక నిర్దిష్తమైన ప్రణాలిక ప్రకారం చేసుకుంటే ఏ గొడవా ఉండదు. నేను దాదాపు 15 ఏళ్లుగా పని చేస్తున్నాను అందుకే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది అని చెప్పగలను. కాని దానికోసం కొన్ని విషయాలలో మనం జాగ్రత్త వహించాలి. మన సమయం, శక్తి , మన అవసరాలు (కుటుంబం, పిల్లలు వగైరా) ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఉద్యోగ బాధ్యతలు నియంత్రించుకోవాలి. ఉద్యోగానికి ఎంతవరకు మనం న్యాయం చేయగలమో అంతవరకే చేయాలి. కెరీర్ కోసం కుటుంబాన్ని , వ్యక్తిగత జీవితాన్ని ఎట్టి పరిస్థితిళొనూ కోల్పోకూడదు. ప్రతి వ్యక్తి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇల్లు, పిల్లలు నా మొదటి బాధ్యత. వాటికి తగినంత సమయం కేటాయించడం నా ధర్మం. అదృష్టవశాత్తు మావారు పిల్లల విషయంలో ఎంతో సహాయపడతారు. వాళ్లను స్కూలుకు తీసికెళ్లడం, చదివించడం, ఆటపాటలు.. అత్తగారు వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహమిస్తారు. నేను ఇంటికొచ్చేవరకు పిల్లలను చూసుకుంటారు. కుటుంబానికి సంబంధిచిన ప్రతి కార్యంలో నేను తప్పనిసరిగా పాల్గొంటాను. ఒక్కొసారి ఆఫీసులో లేట్ ఐనా కూడా (ఎన్నో సార్లు జరిగింది) , అత్తగారు, మావారు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. వీలైనంతవరకు నా పని వేళలు నియంత్రించుకుంటాను. తొందరగా ఆఫీసుకు వెళ్లి, తొందరగా ఇల్లు చేరడం. నేటి సాంకేటిక పరిజ్ఞానం వల్ల ఇంటినుండే నా ఆఫీస్ పని పూర్తి చేసుకుంటాను. తప్పనిసరి ఐతేనే ఆఫీసులొ ఆలస్యం అవుతుంది. లేదా ప్రయాణాలు ఉంటాయి. మనం ఏ పనైనా ఒక ప్రణాలిక ప్రకారం నిర్వహిస్తే తప్పక విజయం సాదించగలం. దీనివల్ల స్త్రెస్ అనేది ఉండదు.
8. ఆడది చిన్నప్పుడు తండ్రిపై, పెల్లయ్యాక భర్త, ముసలితనంలో కొదుకుపై ఆధారపడాలి అంటారు పెద్దలు. అలా ఎప్పటికీ ఆధారపడే ఉండాలా. వేరే దారి లేదా??

అను : ఈ విషయంలొ నాకు చాలా బలమైన అభిప్రాయం వుంది. డిపెండ్ అవ్వటం అంటే పారసైట్ లాగ వుండడము కాదు. ఇమోషనల్ సపోర్ట్ మనకి ఎప్పుడు అవసరమే. నా జీవితంలో మా నాన్నగారు, మా ఆయిన, మా అబ్బాయి - ముగ్గురూ చాలా ముఖయమైనవారు. అలాగే మా అమ్మా, చెల్లెలు, అత్తగారు, మా అమ్మాయి వీళ్ళందరి వల్లా నాకు చాలా సపొర్ట్ వుంది. కాని అలాగని అన్ని వాళ్ళపై వదిలేసి నేను మీ మీద ఆధారపడి ఉన్నాను మీరే చూసుకోడి అంటే భావ్యం కాదు.

సంజు : మనమందరం సంఘజీవులం. జీవితంలో ఎప్పుడొ అప్పుడు ఎవరిమీదొ ఆధారపడి ఉంటాము. అలాగే ప్రతి మహిళ స్వతంత్రంగా ఉండాలి. తన జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూ, ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలి. భవిష్యత్తులో ఒకరిమీద ఆధారపడే పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఉద్యోగం చేసినా, చేయకున్నా ప్రతి మహిళ ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి ఉండాలి. అది తనే ఏర్పాటు చేసుకోవాలి.

జ్యోతి : అవును ప్రతి మనిషి ప్రేమ,ఆప్యాయతలకోసం తన వారిమీద ఆధారప్డి ఉంటాడు. నేను చెప్పేది కూడా అదే. ప్రతి మహిళ ఆర్ధిక స్వాతంత్ర్యం, ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడుకూడా తన అవసరాలకు భర్త, పిల్లల మీద ఆధారపడకూడదు అని.
9. ఓకోసారి ఈ రాయకీయ నాయకులను చూస్తే నాకు అనిపిస్తుంది ...ఆదవాల్లకు, యువతకు రాజ్యాధికారం ఇస్తె నిజంగా మన రాష్త్రాన్ని బాగు చెయొచ్చా. ఈ చొర్రుప్తిఒన్ ఆపెయొచ్చా అని . మీరేమంటారు..

అను : ఏ రంగంలోనైనా భిన్నత్వం ఉండాలి. అంటే ఆడవారు, మగవారు, పెద్దవారు, యువకులు.. ఇలా ఎవరి దృష్టికోణంలో, అనుభవాన్ని బట్టి వాళ్లు ఆలొచిస్తారు. కనుక సొసైటీలో అన్ని గణాలకి అనుకూలమైన సర్వతోముఖ రాజ్యాంగాన్ని స్థాపించవచ్చు. ఇక అవినీతి అన్నది వ్యక్తి యొక్క దురాశకి సంబంధించింది కనుక దానిని పూర్తిగా నిర్మూలించలేము. పోలియో ద్రాప్స్ లాగా చిన్నప్పుడె ప్రతీ వ్యక్తికి దురాశకి కూడా వ్యాక్సిన్ చేయగలిగితే ఎంత బాగుండునో కదా? :). అవినీతిని విమర్శిస్తూనే మనం దానిని ఆసరాగా తీసుకుంటాము కదా. డ్రైవింగ్ లైసెన్స్ కోసం లైన్లో నిలబడకుండా పని జరుగుతుందని, ట్రాఫిక్ లైట్ దగ్గర చలాన్ కట్టకుండా ఉండొచ్చని, బంగారం కొట్టులో రసీదు తీసుకోకుంటే కొంచం ధర తగ్గుతుందని ఎక్కడికక్కడ మనమే అవినీతిని పెంచుతున్నాము. అలాంటి మనం వెరే వాళ్ల అవినీతిని విమర్శించే హక్కు ఉందంటారా? ఈ అవినీతి తగ్గాలంటే లంచాలు ఇచ్చేవాల్లు, తీసుకునేవాల్లు ఇద్దరినీ శిక్షించాలి. చాలా కఠినమైన చట్టాలు ఉండాలి. అవి అమలు పరచాలి.

సంజు : అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాలి. సమస్య ఆడవాళ్లు మగవారికంటే సమర్ధంగా పనిచేయగలరని కాదు, మహిళలు సరియైన విధంగా గుర్తింపబడటంలేడు. ఎక్కువమంది మహిళలు ప్రభుత్వంలో చేరితే మంచి నిర్ణయాలు, మార్పులు తీసుకురాగలరు. ఆడవారు, యువత మాత్రమే అవినీతిని ఎదుర్కోగలరని కాదు. ప్రతి రాజకీయనాయకుడు నిజాయితీగా దేశానికి సేవ చెయాలి అని అనుకోవాలి.10. జీవితంలో ఎప్పుడైనా (1)ఉద్యోగం లేదా (2) సంసారం ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి అని అంటే మీరు ఏది ఎంచుకుంటారు?

అను : ప్రస్తుతం రెండూ వున్నయి కనుక నేను చెప్పలేను :) ఇంత వరకు రెండూ మానేజ్ చేసాను; యెందుకంటే నాకు రెండూ చాలా ముఖ్యము. ఒక్కొక్క సారి కెరీర్ మీద యెక్కువ ఫోకస్ చేస్తే, ఒక్కొక్క సారి కుటుంబం మీద యెక్కువ ఫోకస్ చేసాను. మా ఆయినకు వేరే ఊరిలో ఉద్యొగమొచ్చినప్పుడు ఉద్యొగము, ఊరు రెండూ మారాను. అలాగే కెరీర్ కోసం రాత్రి పగలూ కష్ట పడ్డ రోజులున్నాయి. నేను ఒక ప్రోజెక్ట్ చేసేటప్పుడు 6 నెలలు రోజుకి 15-16 గంటలు పని చేసాను. మేము అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చినప్పుడు పిల్లలు అడ్జస్ట్ అయ్యేదాక నాలుగు నెలలు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నాను. ఇలాంటి సంఘటనలు అందరి లైఫ్ లోను ఉంటాయి - నేనే చేసానని అనను. మీ ప్రశ్న చాల ఆసక్తివంతంగా వుంది. రెండిటిలో ఒకటే సాధ్యమైతే యేది యెంచుకుంటాను? ఎప్పుడైన కుటుంబంలో యెవరికైనా నా అవసరముండి, దానికి నా ఉద్యోగమే అడ్డయితే ఉద్యొగం వదిలేస్తాను కాని, కుటుంబాన్ని యెందుకు వదులుకుంటాను? రాజి పడాల్సి వస్తే నేను నిస్సంశయంగా సంసారాన్ని యెంచుకుంటాను. కొన్ని అవసరాలు ఆడవారు మాత్రమే తీర్చగలరు. నా కుటుంబంలో యెవరికైన నా అవసరం వుంటే నా బాధ్యత నేనూ తప్పకుండ నిర్వహించాలనుకుంటాను.

సంజు : జ్యోతిగారు.. ఈ మాట నేనొప్పుకోను. ఐతే ఇది లేకుంటే అది అని. ఎలాంటి విషమ పరిస్థితి వచ్చినా ఎన్నొ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఆడవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్లు దేవతలు,అద్భుత శక్తులు ఉన్నవారు కారు. పిల్లలు చిన్నగా ఉన్నపుడు ఉద్యోగం కంటే కుటుంబం, పిల్లల మీద ఎక్కువ సమయం కేటాయించాలి. ఆ తర్వాత కెరీర్ మీద శ్రద్ధ పెట్టాలి. ఏప్పుడు ఎక్కడ మన అవసరం ఎక్కువుంటుందో అక్కడ మనం మన సమయాన్ని కేటాయించాలి. కొందరు మహిళలు కెరీర్, కుటుంబం రెండింటింతిని ఒకే విధంగా, విజయవంతంగా నిర్వహించగలిగారు అంటే మంచిదే. ఇవాళే నా కొలీగ్ ఇచ్చిన ఈ కొటేషన్ ఈ సందిగ్ధాన్ని తొలగిస్తుందేమో.. When we are motivated by goals that have deep meaning, by dreams that need completion, by pure emotion that needs expressing, then we truly live life.” - Greg Anderson కష్టపదాలనే కోరిక, ఆతంవిశ్వాసం ఉంటే కుటుంబం, కెరీర్, రెండింతిని సమర్ధంగా నిర్వహించడం కష్టమేమీ కాదు ఏ మహిళకైనా..
11. ఇక చివరిగా .. ఉద్యోగినులు, గృహిణులు.. ఇంట్లో ఉండే గృహిణులకు మీలాగా ఎక్కువ టెన్షన్, స్ట్రెస్, పని ఉండదు అనుకుంటారా? ప్రతి ఉద్యోగినికి ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుండా? ఉద్యోగం చేయని గృహిణికి కూడా ఆర్ధిక స్వాతంత్ర్యం ఉందా?

అను : దూరపు కొండలు నునుపు అని పెద్దలననే అన్నారు :) ఎవరికి వాళ్ళు వేరేవారు బాగున్నరేమో అనుకుంటాము కాని దేని చాలెంజ్ దానికుంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం యేమిటంటే ఈ టెన్షన్లు, స్ట్రెస్లు వచ్చేవి పని చేస్తున్నామా లేదా అన్నదానిమీద ఆధార పడిలేవు. మన పరిస్థితుల మీద ఆధారపడి వుంటాయి. భార్యా-భర్తలు ఇద్దరూ పని చేస్తున్నా కుటుంబం ఆర్ధిక ఇబ్బందులలో వుంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వుండదు కదా? ఇంటిలో వాళ్ళందిరితొ గొడవలు పెట్టేసుకుంటే పని చేస్తున్నా లేక పొయినా ఇంట్లో స్ట్రెస్ అంతే వుంటుంది కదా.

సంజు : గృహిణి అనేది 24 గంటల ఉద్యోగం. ఎందుకంటె మీరు చేసే ప్రతి పని కుటుంబంపై ప్రభావం చూపుతుంది. ఇద్దరి పని తీరు, నైపుణ్యం, వేరైనా ఒత్తిడి మాత్రం ఒకటే..


నా మాట :

ఆడది ఆకాశంలో సగం అంటారు . కాని ఆకాశం దాటి రోదసిలోకి కూడా వెళ్ళింది. పూర్వకాలంలో స్త్రీ అంటే ఇంటిపట్టున ఉంది భర్తా, పిల్లలు , అత్తగారు, అందరినీ చూసుకుంటూ ఉండాలి. ఇంటి బాధ్యతలు మగవారే చూసుకుంటారు. ఆడదానికి చాకలిపద్దు రాసేంత చదువు వస్తే చాలు అనేవారు. కాని నేడు కాలం మారింది.మనుష్యులు మారుతున్నారు. ఆడవాళ్ళను కూడా చదువుకోమని ప్రోత్సహిస్తూ, ఎన్నో బాధ్యతాయుతమైన పదవులు కూడా నిర్వహించేలా చేస్తున్నారు. చాల మంది ఆడవాళ్ళు పెళ్ళయ్యాక కూడా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ప్రతి భర్తా తన విజయం వెనకాల భార్య ఉంది అంటాడో లేదో కాని, ప్రతి భార్య విజయం వెనక ఆమె భర్త, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది. పెద్ద చదువులు లేకున్నా దాదాపు చాలా మంది మహిళలు ఇంటిపట్టున ఉంది కూడా ఏదో ఒక వృత్తి,వ్యాపారం చేస్తున్నారు. సంసారనిర్వహణలో తమవంతు కృషి చేస్తున్నారు. ఇక ఇల్లు దాటి ఉద్యోగం కోసం వెళ్ళే మహిళలు నిత్యజీవితంలో ఎదుర్కునే సమస్యలు, వాటిని పరిష్కరించుకునే విధానాలు తెలుసుకుందామని నాకుతెలిసిన ఉద్యోగినులను ఈ చర్చకు ఆహ్వానించాను. దాదాపు చాలా విషయాలు వారితో చర్చించగాలిగాను అనుకుంటున్నాను ..

అనుపమ., సంజు .. ధన్యవాదాలు..

11 వ్యాఖ్యలు:

మధురవాణి

జ్యోతి గారూ,
మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.
"ప్రతి భర్తా తన విజయం వెనకాల భార్య ఉంది అంటాడో లేదో కాని, ప్రతి భార్య విజయం వెనక ఆమె భర్త, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది." ఇది మాత్రం నిజ్జంగా నిజం :)

జీడిపప్పు

"స్త్రీలకు అన్యాయం" చెత్త వ్యాసాలు చూసి తల బొప్పి కట్టింది. అందుకు భిన్నంగా మరో కోణాన్ని స్పృశించి చాలా చక్కని వ్యాసాలు అందిచారు జ్యోతిగారు.

"ప్రతి భర్తా తన విజయం వెనకాల భార్య ఉంది అంటాడో లేదో కాని, ప్రతి భార్య విజయం వెనక ఆమె భర్త, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది." ఇది పచ్చి అబద్దం. భర్త ఎప్పుడూ హింసిస్తూనే ఉంటాడు - ఓ మూర్ఖవాద సంఘ అధ్యక్షురాలు. just kidding ;)

జ్యోతి

గతంలో నా టపాలు చూసి మీకలా అనిపించిందా.. లేదండి బాబు.. నేను రెండువైపులా నిజమే చెప్తాను. మావారి గురించి కూడా ఇక్కడ రాసానండి.. అలాగే మగవాళ్లు వంట చేయరు అని చెప్పినా జన్మకో శివరాత్రి అన్నట్టు ఒకసారి మావారు వంట చేస్తే పోటో పెట్టి మరీ అందరికి చెప్పాను.

పరిమళం

ఇద్దరికీ కుటుంబ సహకారం ఉండటం వారి అదృష్టం . మీ ఇంటర్వ్యూ అభినందనీయం .

జీడిపప్పు

జ్యోతిగారూ, క్షమించాలి. నేను అన్నది మిమ్మల్ని ఉద్దేశించి కాదు. మన బ్లాగుల్లో ఉన్నారు కదా ప్రతిదానికీ "స్త్రీలకు అన్యాయం" అంటూ గోల చేసే "స్త్రీవాదులు" (మీకు తెలుసనుకుంటా :) ). వాళ్ళ చెత్త గురించి అన్నాను.

I always appreciate your balanced way of portraying, so far! :)

David

జ్యోతి గారు మంచి ప్రయత్నం చేశారు. మీ ఆలొచన భాగుంది.

తారక

నాకెందుకో మీ బ్లాగ్ లొ నాణ్యత తగ్గుతున్నది అనిపిస్తున్నది.

జ్యోతి

తారగారు,

మీకెందుకలా అనిపించింది. ఈ చర్చ నేను ఏ పత్రిక కోసం చేయలేదు. నా బ్లాగు కోసం చేసాను. అడిగిన ప్రశ్నలు నాకు , వచ్చినవారికి అభ్యంతరం లేదు. నేను ఈ పిచ్చాపాటి చేయడానికి గల కారణాలు కూడా చెప్పాను.

Unknown

నేను ప్రత్యేకించి పై టపా గురించి అనలేదు, మొత్తం మీద చెప్పాను.
మీరు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు వున్నట్టు ఇప్పుడు లేదు.
నవ్యత, శ్రద్ద తగ్గయేమో అని అనిపిస్తున్నది.
ఒకప్పుడు మీ బ్లాగ్ లో అన్ని టపాలు చాలాకాలం గుర్తుండిపోయేవి.
క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూవస్తున్నది.
హత్తుకుపొయెట్లు రాసే మీరు, ఇలా రాయటం కొంచం బాధగా వున్నది.
పై పిచ్చాపాటీలో ఫలవంతమైన చర్చ ఏమీ లేదు అని నా భావన.
అంటే కొత్తదనం ఏమీ లేదు అని.
తప్పులేమైనావుంటె క్షమించగలరు.

తారక

నేను ప్రత్యేకించి పై టపా గురించి అనలేదు, మొత్తం మీద చెప్పాను.
మీరు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు వున్నట్టు ఇప్పుడు లేదు.
నవ్యత, శ్రద్ద తగ్గయేమో అని అనిపిస్తున్నది.
ఒకప్పుడు మీ బ్లాగ్ లో అన్ని టపాలు చాలాకాలం గుర్తుండిపోయేవి.
క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూవస్తున్నది.
హత్తుకుపొయెట్లు రాసే మీరు, ఇలా రాయటం కొంచం బాధగా వున్నది.
పై పిచ్చాపాటీలో ఫలవంతమైన చర్చ ఏమీ లేదు అని నా భావన.
అంటే కొత్తదనం ఏమీ లేదు అని.
తప్పులేమైనావుంటె క్షమించగలరు.

జ్యోతి

తారగారు,

మీ అభిమానానికి మన:పూర్వక ధన్యవాదాలు. అప్పుడప్పుడు ఇలా అవుతుందేమో.. సరిదిద్దుకుంటాను. అప్పటి పరిస్ధితులనుబట్టి నా మనసులో భావనలు అలా రాసేస్తుంటాను. మొత్తం పూర్తి అయ్యాకగాని తెలీదు సారాంశం.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008