Monday, 14 September 2009

అసాధ్యమే సుసాధ్యమైన వేళ - వార్షికోత్సవ వేళ



ఎందుకో ఈ మధ్య నా ఆలోచనలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. తీరిక లేకుండా సాగిపోతున్న నా దినచర్యలో ఒక్కసారి ఆగి "నేనేంటి??" అన్న ఆలోచన చేయడం మొదలైంది. నేను ఎప్పుడు కూడా గతం గురించి కాని, వర్తమానం గురించి కాని చింతించలేదు. ఈ రోజు మాత్రమే నా చేతిలో ఉంది. దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనుకున్నాను. వేదాంతం మొదలెట్టా అనుకుంటున్నారా? అసలు సంగతి తెలుసుకోవాలంటే రంగు రంగుల రింగులు తిప్పుకుంటూ మూడేళ్లు వెనక్కి వెళ్లిపోదాం పదండి. నా జీవితంలో అసాధ్యం అనుకున్నవి నిజంగా సాధ్యమయ్యాయి.. అవేంటంటారా??



చిన్నప్పటినుండి నేను ఎవరితో ఎక్కువ కలవను..ఎక్కువ కల్పించుకుని మాట్లాడను. స్కూలు, కాలేజీ ఇల్లు అంతే నా లోకం. సినిమాలు , షికార్లు అన్నీ అమ్మతోనే.. స్కూలు స్నేహితులు స్కూలులోనే, కాలేజీ స్నేహితులు కాలేజీలోనే దూరమయ్యారు. ఆ చదువు కూడా నేను సీరియస్సుగా చదవలేదు. చదవాలి కాబట్టి చదివాను. ఒక లక్ష్యం, కెరీర్ అనే ఆలోచనే లేదు. అదేంటో?? కడుపులో చల్ల కదలకుండా రోజులు గడిచిపోతున్నాయి. మంచి సంబంధం అని పెళ్లి చేసేసారు. చదువు కొండెక్కింది (పావురాల గుట్ట కాదండోయ్).. సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు, వాళ్ల చదువులు, ఆరోగ్యం, పరీక్షలు ఇదే నాకు ముఖ్యంగా ఉండింది. అప్పుడప్పుడు కుట్లు , అల్లికలు మామూలే. కాని మూడేళ్ల క్రింద నేను ఎన్నో సార్లు తీవ్రంగా ఆలోచించాను. నేనేంటి? నా జీవితం ఇలాగే గడిచిపోవాలా? పిల్లలు ఉద్యోగాల్లో చేరి, పెళ్లిల్లయ్యాక వాళ్లకు, వాళ్ల పిల్లలకు సేవలు చేయడము, టీవీ చూడడము, అందరి బాగోగులు చూడడమేనా నా పని. వేరే ఏమీ చేయలేనా? నా గుర్తింపు ఏంటి? అసలు నేనేమి చేయగలను? ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు లేవు. పాండిత్యము లేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేయాలి ?? చదివినదంతా టైం పాస్ పుస్తకాలే. సస్పెన్స్ నవళ్లు, వార పత్రికలు .. పుట్టింటివైపు, అత్తింటివైపు పండితులనదగ్గవారు లేరు. కాస్తైనా నాకు ఉందేమో అనుకోవడానికి. నేను ఎప్పటికీ ఫలానా వారి కూతురు, భార్య, తల్లి అని అనిపించుకోవాలా? ఎప్పుడు వారి మీద ఆధారపడాలా?? ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో ??



అనుకోకుండా కాదు కాని పిల్లల కోసం, పిల్లల సాయంతో కంప్యూటర్ నేర్చుకున్నారు. మావారు కూడా నాతో టీవీ చూడ్డం తగ్గించాలని కంప్యూటర్ గురించి చెప్పేవారు. కాని అప్పట్లో నెట్ లో ఉండే స్త్రీలపై మంచి అభిప్రాయం లేదు. చాట్ రూంలు ఐతే మరీ ఘోరం. నా అదృష్టం కొద్ది మస్తీ గ్రూపు, తెలుగు బ్లాగు గుంపులో పడి బ్లాగులో తేలాను. నిజంగా చెప్పాలంటే ఈ తెలుగు బ్లాగు వల్ల నాకంటే ఎక్కువ ప్రయోజనం పొందింది, సద్వినియోగపరుచుకున్నది ఎవరూ లేరనుకుంటా. తీరిక సమయాన్ని నెట్ పై వినియోగించి నేను పొందిన లేదా సాధ్యం చేసుకున్న కలలు చెప్పనా.. నవళ్లు, వార, మాస పత్రికల పిచ్చి చాలా ఉండేది. మాట్లాడుకోవడానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేరు మరి. అప్పుడు పెద్ద పెద్ద రచయిత్రులు రాసిన కథలు, సీరియళ్లు చూసి అలా రాయగలగడం పూర్వ జన్మ సుకృతం. వాళ్లు చాలా పెద్దవాళ్లు . అని అనుకునేదాన్ని. అప్పుడు కల్పన రెంటాల అనే పేరు తరచూ మంచి మంచి వ్యాసాలు ,కథలలో చూసేదాన్ని. ఎందుకో గాని ఆ పేరు మీద ఒకలాంటి అభిమానం మొదలైంది. ఎంత మంచి (గొప్ప రచయిత్రి) కదా. అసలు వీళ్లు ఇంత ఈజీగా ఎలా రాయగలుగుతారు అని ఆశ్చర్యపోయేదాన్ని. కాని అదే కల్పన రెంటాలా హాయ్! నాకు సాయం చేస్తారా? అని నాకు మెయిల్ పెడితే నేనేమైపోవాలి? నాకింత అదృష్టమా?నా అభిమాన రచయిత్రి నాకు మెయిల్ చేయడమా? అని ఉబ్బి తబ్బిబ్బైపోయాను. వెంటనే స్నేహం చేసేసాను. పది నిమిషాల్లో నువ్వు అనుకునేంతగా పరిచయం పెరిగింది. ఇప్పుడు తను నాకున్న కొద్దిమంది ఆత్మీయ స్నేహితుల్లొ ఒకరు. థాంక్ యూ కల్పన..మరో వింత ఏంటంటే...కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్. అతను కూడా నేను అభిమానించే వ్యక్తుల్లొ ఒకరు. (నేను అంతర్జాలానికి రాకముందునుండే) అతని రచనలు, మొత్తం పత్రికను ఒక్కడే రాయడం, సహయ కార్యక్రమాలు చదువుతుంటే చాలా సంతోషమేసేది. పేజీ తిరగేస్తే అతని పరిచయ భాగ్యం కలిగి, అతని బ్లాగు మొదలెట్టి అతనితొ కలిసి నిర్వహించడం అంతకంటే అద్భుతమైన వింత నేను అభిమానించే పత్రికలో నేనే కవర్ స్టోరీ రాయడం. నేను నా జీవితంలొ మరచిపోలేని రోజు , బిజీగా నాకున్న శక్తి మొత్తం వినియొగించిన రోజు అంటే ఈనాడులో వికీ, బ్లాగుల వ్యాసం వచ్చిన రోజు. నిజంగా ఆ రోజు ఒకేసారి నేను మూడు చోట్ల చాటింగ్ చేయాల్సి వచ్చింది. కూడలి కబుర్లు, జిమెయిల్, కంప్యూటర్ ఎరా చాట్ రూం. ఒక చోట కబుర్లు , ఒక చోట అభినందనలు, ఒకచోట తెలుగు పాఠాలు . సునామీ అనుకోండి. రాత్రికి నా కుడిచేయి పనిచేయలేదు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే గాని మరుసటిరోజు ఇంటి డ్యూటీలో పడలేదు. చాట్ రూం లో మూడురోజుల్లో కనీసం 200 మందికి తెలుగు స్థాపించడం ,రాయడం చెప్పడం జరిగింది. నేనొక్కదాన్నే కాదు . మరికొందరు బ్లాగర్లు పాల్గొన్నారు.కాని అదో వింత అనుభూతి. శారీరక అలసట నిచ్చినా మానసిక సంతృప్తి నిచ్చింది.




బ్లాగు నుండి వెబ్ పత్రిక పొద్దులో నా పేరు అచ్చులొ మొదటిసారి చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం చెప్పలేను. నేను కూడా రాయగలనా అనుకున్నా. అలాగే దినపత్రికలలో తరచూ వచ్చే వ్యాసాలు దానికింద నా పేరును పదే పదే చూసుకునేదాన్ని. ఇది నేనేనా? ఒకప్పుడు కల్పన పేరు చూసి నా పేరు కూడా ఇలా అచ్చులో చూసుకోగలనా అన్న ఆలోచన ఇప్పుడు సఫలీకృతమై కళ్ల ముందు కనపడుతుంది. అది ఆనందమా? ఆశ్చర్యమా?, గర్వమా? అర్ధం కాలేదు. ఇది ఏ పోటీలో ప్రైజు వచ్చింది కాదు. అస్సలు నేను రాయగలను అన్న ఆలోచన కూడా లేకుండా ఇలా పత్రికలలో రాస్తున్నాను అంటే ఇంకా నమ్మలేకున్నాను. ఎందుకంటే నేను నేర్చుకుంది అల్పం. నేర్చుకోవాల్సింది అనల్పం. నిరంతర విద్యార్థినే అనుకుంటాను ఎప్పటికప్పుడు. ఒకసారి మా చుట్టాలమ్మాయి బిజినెస్ లో పేరు సంపాదించింది అని పేపర్లో ఫోటో వేసారు. అందరూ ఎంత గొప్పగా చెప్పుకున్నారో.మనకా రాత ఎక్కడిది. అంట్లు తోముకుంటూ, బట్టలు కుట్టుకుంటూ ఉండేవాళ్లకి అంత అదృష్టమా అని లైట్ తీసుకున్నాను . కానీ అదీ సంభవమైంది కూడా. (అలాగే బానే దిష్టి కొట్టిందనుకోండి).. అన్నిటికంటే నాకు దొరికిన అపురూపమైన వరం, "స్నేహం." అసలు నాకు జీవితంలో స్నేహితులు లేరు, ఏదైనా ఆలోచనలు పంచుకోవాలన్నా, చర్చించాలన్నా ఎవరూ లేరు,నాకు నేనే మాట్లాడుకోవడం. కాని ఇప్పుడు .. నాలా ఆలోచించి, నాతో చర్చించి, నా తప్పులు ఎత్తి చూపే ప్రియమైన స్నేహితులు ఉన్నారు. ఇంతకంటే విలువ కట్టలేని , తరగని నిధి ఉంటుందా??




ఇక బ్లాగుల విషయానికొస్తే ఈ బ్లాగు రాసుకునేది నాకోసం. ఇది నా అంతరాత్మ. నా మనసులో కదలాడే ప్రతీ ఆలోచనను ఇక్కడ పొందుపరచి , అందరితో పంచుకుంటున్నాను. మిగతా బ్లాగులైతే నాకోసం, అందరికోసం.. బ్లాగు గుంపు నుండి బ్లాగుకు, బ్లాగు నుండి పత్రికలకు, పత్రికల నుండి సొంత వెబ్ సైట్.. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాగుతున్న నా బ్లాగు ప్రయాణం రేపు ఏటు పోతుందో? ఏమో?? బ్లాగు రాతల వల్ల , పండితులైన ఇతర బ్లాగర్ల పరిచయ భాగ్యం వల్ల అప్పుడప్పుడు సాహిత్యంలో కూడా తప్పటడుగులు వేస్తున్నాను. ఇక్కడో ముఖ్య విషయం చెప్పాలి..అన్ని బ్లాగులు చదవకున్నా, ఎన్ని బ్లాగులు చదివినా .. కొన్ని బ్లాగులంటే నాకు చాలా భాయం. సాధ్యమైనంతవరకు ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్తపడతాను. కవితలు, రాజకీయాలు, పద్యాలు.. అయ్యబాబొయ్! అసలు కవితలే అర్ధం కావు, చదవని నేను చిన్ని ప్రయత్నం చేసాను. పర్లేదు.. ముందడుగు వేయొచ్చు అన్న ధైర్యం వచ్చింది.


నాకు ఉన్న మరో కల.. సహాయం చేయడం. అది చేయాలని ఉన్నా నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని బాధపడేదాన్ని.కాని ప్రమదావనం సభ్యులతో చేరి కొన్ని సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల ధన్యురాలనయ్యాను. థాంక్ యూ ప్రమదల్లారా..



చివరిగా ఎంత వద్దనుకున్నా ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను.. నేను నిజ జీవితంలో కాని, బ్లాగుల్లో కాని ఎవరిని ద్వేషించలేదు. నాకు నచ్చకుంటే దూరం ఉంటాను కాని వాళ్ల మీద ద్వేషం, అసూయ పెంచుకోలేదు ఎప్పుడు .. కాని ఒక్క వ్యక్తిని మాత్రం అసహ్యించుకుంటున్నాను నాతో చనువుగా , స్నేహంగా ఉంటూ, నా మీద నీచమైన రాతలు రాసి , అల్లకల్లోలం సృష్టించి ఏం సాధించారో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. పైగా ఇంత జరిగినా సిగ్గులేకుండా చిలకపలుకులు పలుకుంటే అసలు ఏమనాలో కూడా అర్ధం కావట్లేదు. ఊసరవెళ్లి రంగులు మారుస్తుంది అంటే ఇలాగే కామోసు.. కాని ఇలాంటి ఎదురు దెబ్బలే మంచి పాఠాలు నేర్పాయి. అందుకే నేను నా ముందు వచ్చిన ప్రతి అడ్డంకిని అడ్డుగా కాకుండా మెట్టుగా భావించి దానిని ఎక్కి సాగిపోతున్నాను మరింత ఆత్మవిశ్వాసంతో.. ఒకప్పుడు నేనేంటి అనుకున్నదాన్ని,, ఇది నేనేనా అని ఆశ్చర్యపోతున్నాను. గతమంతా ఒక్కసారి తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంత ఆత్మీయత ఏర్పడింది ..



ఈరోజు నా బ్లాగు మూడవ వార్షికోత్సవం. మొత్తం అన్ని బ్లాగులకు కలిపి వీక్షకులు లక్షన్నార, టపాలు రెండువేల పైనే ఉన్నాయి. ఇదంతా నా స్వార్జితం..:) కాదా మరి... నాకు ఇంత మంచి మిత్రులు, అభిమానులు, గౌరవం ఇచ్చిన తెలుగు బ్లాగ్లోకానికి నా తరఫున చిరు కానుక.. బ్లాగ్ గురువు..


ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త విజయాన్ని సాధించుకుంటూ వచ్చాను. గత సంవత్సరం అను సాధించాలి అనుకున్నా.దాని పట్టు పట్టేసాను. సొంత వెబ్ సైట్ మొదలెట్టి మంచి స్పందన, ఆదరణ సంపాదించాను .. నా విజయంలో పాతిక శాతం మావారికి, పాతిక నన్ను ప్రోత్సహించే నా పిల్లలు, మిత్రులకు, మిగతా యాబై శాతం నాకేనండి. ఎప్పుడు కూడా నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకోలేదు. ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, కష్టపడి విజయం సాదిస్తూ వచ్చాను. కాని మొదటిసారి ఒక లక్ష్యం నిర్దేశించుకుని వెళుతున్నాను.. దానివైపు పరిశ్రమించాలి. మీ దీవెనలు కావాలి..
బ్లాగ్ మిత్రులందరికీ మనఃపూర్వక నమస్సుమాంజలి..

45 వ్యాఖ్యలు:

లక్ష్మి

Heartiest Congratulations Jyotigaru, keep going !!!

చిలమకూరు విజయమోహన్

congratulations

గీతాచార్య

That's great. Continue in the same fashion, inspiring many more...

My hearty comgratulations on this occasion.

కొత్త పాళీ

మంచి ఆస్తి మూటగట్టుకున్నారు. లక్షాధికారిణి అయిన మీరు త్వరలో కోటీశ్వరి కావాలని అభిలషిస్తూ .. అభినందనలు

భాస్కర రామిరెడ్డి

మీ అంతరంగ ఆవిష్కరణ బాగుందండి. మరింత పట్టుదలతో మీ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ...

సుభద్ర

జ్యోతిగారు,
happybirthday to " http://jyothivalaboju.blogspot.com"
మీతో నా పరిచయ౦ కి దాదాపుగా ఎడాదిన్నర అవుతు౦ది...
నాకు తోడుగా వచ్చి ప్రమదవన౦లో ది౦పి,
చెయ్యిపట్టి అక్షరాలు దిద్ది౦చి,
నామట్టి కి వచ్చిన తి౦గరి అనుమానాలు తీర్చి,
రాయట౦,బొమ్మలు పెట్టట౦ నేర్పటానికి, మీ విలువైనా కాల౦ నాకోస౦ వెచ్చి౦చి,
మీకు ఎలా చెప్పను ,ఏమి చెప్పినా తక్కువే కదా!
నేను రాయాలి ,రాయలి అని తపన పడుతు౦టే,
మీ సహయసహకారాలు మీ మార్గనిద్దేశ౦ ఏ౦త౦టే,
నా దగ్గర మాటలు లేవు ,అలా అని మాటల్లోను చెప్పలేను.
మీకు అన్ని౦ట్లోను విజయాలా ప౦టలు ప౦డాలి.
మీ ఇ౦ట్లో "షడ్రుచులా" వ౦టలు,మీ వెబ్ సైట్ ను౦చి మా వ౦టిల్లు చేరాలి.
మీ "చైత్రరధ౦" బొమ్మలోని భావాలు చిరాకు మెములమీద చిరునవ్వులు పూయి౦చాలి.
మాకు ఇచ్చిన౦దుకు "బ్లాగ్ గురువు" మీకు జేజేలు చెప్పాలి.
మీరు నా మొట్టికాయల తాయిల౦ నాకు క్రమ౦ తప్పక ఇవ్వాలి .

Unknown

జ్యోతి గారు అభినందనలు. మీరు మొదలెట్టే అన్ని కార్యక్రమాలు దిగ్విజయం కావాలని కోరకుంటున్నాను.

Rajendra Devarapalli

అభినందనలు జ్యోతి గారు,మీ దగ్గర బ్లాగుల గురించి పాఠాలు నేర్చుకున్నవాళ్ళలో నేనూ ఉన్నా.మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ..

మేధ

Congrats Jyothi garu.. All the best..

సిరిసిరిమువ్వ

జ్యోతి గారు, మీరు ఇలానే అప్రతిహతంగా బ్లాగులోకంలోను మరియు మీ వ్యక్తిగత జీవితంలోను కలకాలం వెలుగులు చిమ్ముతూ మరిన్ని విజయసోపానాలు అధిగమించాలని కోరుకుంటూ మీ బ్లాగు మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

Sujata M

బ్లాగడం మీద అవగాహన, తెలుగు లో బ్లాగమని ప్రోత్సాహం.. వగైరాల ద్వారా 'నేను సాధారణ గృహిణినేనర్రా.. ఇపుడు చూడండి నన్ను..' అంటూ, ముఖ్యంగా మహిళల్ని మోటివేట్ చేసారు మీరు. నా రెండు బ్లాగులకీ ఫేస్ లిఫ్ట్ చేసారు. కొత్తవాళ్ళ బ్లాగుల్లో వ్యాఖ్యలు మర్చిపోకుండా రాసి, మంచి అనుభూతిని ఇచ్చారు. మాకే మీ ఆశీర్వాదాలు కావాలి. Thank you.

Anonymous

జ్యోతి గారూ అభినందనలు.
అప్పుడెప్పుడో.... ఈనాడు లో బ్లాగుల గురించి కవర్ పేజీ వ్యాసం లో మీ గురించి చదివా.....బ్లాగరులంతా అభిమానంగా జ్యోతక్క అని పిలుచుకునే మహిళా బ్లాగరుగా మీ గురించి ప్రత్యేకంగా రాసారు. చదివి అబ్బో అనుకున్నాను. ఆ తరువాత చాన్నాళ్ళకి నేను బ్లాగు మొదలుపెట్టి తప్పటడుగులూ కూడా చాతకాక చతికిలపడ్డప్పుడు , మీరు ఎదురై సాయం చెయ్యనా అన్నప్పుడు......నేను పొందిన ఆనందం ఎంతో. ఈ సంవత్సరం లోనూ మీ పరిచయం స్నేహంగా మారి నాకు అడుగడుగునా ఆత్మీయంగా తోడొస్తుంటే .....ఇది అసాధ్యమే సుసాధ్యమైన వేళ కాక మరేవిటి! మంచి గుర్తింపు కోసం సరైన దారిలో ప్రయత్నించేవరికి మీరు ఇంత సాధించడానికి పడిన శ్రమ ఎంత విలువైనదో చెప్పక్కరలేదు. ఇక మిగతా అంతా పైన సుభద్ర చెప్పిందే ......అది అసలు నా కామెంటే , రాత్రి కలలో సుభద్ర తో పిచ్చాపాటీ మాట్లాడుతూ చెప్పేసాను. నాకంటే ముందే కామెంటు వేసేసింది.( మన్మధుడులో నాగార్జునలా ) కదూ సుభద్రా!
మీరు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ.....

నీ నేస్తం

Congrats Jyoti garu :-) Many many happy returns of the day

Sreenu

Kudos....జ్యోతక్కా.

sunita

మీరు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ.....

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

పగిలిన అద్దం ఓడిపోదు.
పదిరెట్లుగా అవతలివారి
ప్రతిబింబాన్ని చూపుతుంది.

రవి

మీ బ్లాగు చూసి, నేను చాలా ఆశ్చర్యపడేది, ఒకింత అస్సొయపడేది ఒక విషయం ఉంది. అది రంగవల్లి వంటి మీ బ్లాగు మూస, దాన్ని మీరు తీర్చిదిద్దిన తీరు. మీ బ్లాగు అంటే, ఈ బ్లాగొక్కటే కాదు, మీరు తీర్చిదిద్దిన ఇతర బ్లాగులు కూడా (దుర్గేశ్వర గారి బ్లాగు ఉదాహరణకు).

మొదటిసారి చూసినప్పుడు, ఓ గృహిణి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుకుంది, నేనో సాఫ్ట్వేరు గాణ్ణి, నా వల్ల కాదా అని అహంకరించాను. అయితే, ఇప్పటికీ నా వల్ల అవలేదు, అవదు కూడాను.

జ్యోతిని ఇలానే వెలగనివ్వండి. కొన్ని ప్రమిదలు అనుకరిస్తాయి, మరికొన్ని, ఆశ్చర్యపడతాయి, అబ్బురపడతాయి, మరెన్నో అనుకరిస్తాయి.

జాన్‌హైడ్ కనుమూరి

జ్యోతి గారూ అభినందనలు

Rani

keep going jyothi :)

తారక

nenu modata mee blog ki vachinappudu 399 vadni, ippudu ade 59k avutunnadi.

english blogs tho poote padutunnaru meeru. vallani minchali, inka marinni manchi tapalu ravali..

Unknown

జ్యోతిగారూ,
మీ మూడవ సంవత్సర బ్లాగు వార్షికోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు.
మీ అంతట మీరుగా నా నరసింహ బ్లాగుకు టెంప్లేటు ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చి ఎంతో అందమైన, సరిగ్గా నప్పేలా తిరుపతి తిరుమల ఆలయ దృశ్యాన్ని నా బ్లాగుకు టెంప్లేటుగా ఏర్పరచి పెట్టినందులకు మీకు ఎలా ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా నాకు తనివితీరటం లేదు. నాకే కాకుండా చాలా మందికి మీరు ఇటువంటి సహాయాలు ఎన్నో చేసారనీ, చేస్తున్నారనీ తెలిసి ఎంతో ఆనందించాను. మీసహాయం పొందిన వారిలో నేను కూడా ఒకడిని.
మీరిలాగే ఇంకా ఇంకా మంచి మంచి పోస్టులు వేస్తూ మా అందరి అభిమానాన్ని ఎప్పటికీ పొందుతుంటారని ఆశిస్తూ...

భావన

Congratulations జ్యోతి... you are awesome. చాలా ఆస్థి సంపాదించుకున్నారు ..... ఇంకా మీ ఖాతా లో మరింత ఆస్థి జమకూడాలని కోరుకుంటున్నా.

జ్యోతి

లక్ష్మి, విజయమోహన్, గీతాచార్య.. మేధ, శ్రీధర్, జాన్, నీ నేస్తం,రాజేంద్ర, సునీత, రాణి

మీ ఆత్మీయతకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు..

జ్యోతి

కొత్తపాళీగారు,

అంత దురాశ లేదులెండి.. ఐనా ఆత్మీయతను ఎక్కడైనా వెలకట్టగలమా?

భాస్కర్ గారు , ధన్యవాదాలని. ప్రయత్నిస్తాను..

సుభద్ర,, మరీ ఎక్కువ మోసేస్తున్నావమ్మా

వరూధినిగారు, థాంక్స్ అండి..

లలిత నువ్వేంటి బ్లాగు మొదలెట్టి ఏడాది కాగనే బోర్ కొట్టిందా రాయడంలేదు..

Anonymous

జ్యోతక్కా,

మూడు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాలుగో వసంతము లోకి అడుగుపెడుతున్నందుకు నా శుభాభి నందనలు.ఇలాగే ఇంకో ముప్పై వసంతాలు పూర్తి చేసుకుని ఎల్లకాలమూ బ్లాగుతూ బ్లాగడానికి రిటైర్మెంట్ లేదు అని బ్లాగులోకానికి చెప్పు. అప్పటికి ఆడియో కామెంట్లు వచ్చుంటే నేను నా ఊడిన దవడలతో "ఇళాలే బ్లాలుతూ వుళ్ళాలి" అని కామెంటిస్తా..

-- విహారి

Kathi Mahesh Kumar

అభినందనలు.

జ్యోతి

Sujata,,

Thanks a lot for ur affection..

శ్రీను,, థాంక్స్ తమ్మి..

తాడేపల్లిగారు, ఎన్నొసార్లు మీరు చెప్పిన మాటలు నాకు దిశానిర్దేశం చేసాయండి. అడిగినవెంటనే సమాధానమిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది రాతిపై చెక్కిన మాట లాంటిది.

రవి,

అందరి బ్లాగులు నేను చేస్తాను. అది అంత సులువు కాదు,అంత కష్టమూ కాదు. కాని బ్లాగు కంటెంట్, బ్లాగరు మనస్తత్వం, వయసు ఇవన్ని దృష్టిలో పెట్టుకుని మూస సెలెక్ట్ చేస్తాను. ఇక నా ఈ బ్లాగు మూస మాత్రం తెలుగువాడి ని గారు చేసిపెట్టారు. తర్వాత కొన్నిమార్పులు చేసుకున్నాను. నీ బ్లాగులు చేసిపెట్టమంటావా?? ఒకటి సంహిత కొసం, ఒకటి నీకోసం..

శ్రీలలిత

జ్యోతీ,

మూడవ వార్షికోత్సవ శుభవేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

అసలు బ్లాగ్ లో రాయడం అంటే ఏమిటో తెలియనిదాన్ని నేను. అటువంటి దానికి అక్షరాభ్యాసం చేసి, చేయి పట్టి అక్షరాలు దిద్దిస్తున్న మిమ్మల్ని నాకన్న చిన్నవారు కనుక మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.. శ్రీలలిత.

జ్యోతి

తార గారు,

థాంక్స్ అండి. పోటీ అంటూ ఏమీ లేదండి. నా బ్లాగు వీక్షకులు 100 -200వరకు ఉంటారు. సంచలనమైన టపాలు రాసి విజిటర్స్ ని దండుకోవడం నాకు రాదండి..

నరసిమ్హం గారు, ధన్యవాదాలు. ఆ శ్రీనివాసుడే నాతో చేయించుకున్నాడంది. నేను కూడా అప్పుడప్పుడు మీ బ్లాగుకు వచ్చి ఆ తిరుమల దర్శనం చేసుకుంటాను తెలుసా..

భావన, మహేష్ థాంక్ యూ..

విహారి అలాగంటావా? అమ్మో అంతవరకు నేనుండను. గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్నట్టు కొద్ది కాలం చాలు.ఇంక ఎందరో జ్యోతక్కలు వస్తారు.రావాలి.

ప్రసాద్ గారు ,

ధన్యవాదాలు. కాని మీ మీద నాదో కంప్లెయింటు. మీరిమధ్య అస్సలు రాయడంలేదు. ఇలా ఐతే ఎలా.. నా శిష్యులు అంటారు.

రవి

జ్యోతక్కా, అంతకన్నానా? నేను కొత్తబ్లాగు ఇంద్రధనస్సు ఈ మధ్య ఆరంభించాను. ఇంకొకటి మొదలెడదామని అనుకుంటున్నాను. వీటికి మీ సహాయం చేస్తే, నా అసూయ గర్వంగా మార్చుకుని పదిమందితో చెప్పుకుంటాను.

psm.lakshmi

హార్దిక శుభాభినందనలూ, శుభాసీస్సులూ జ్యోతీ,
వాళ్ళంతా మీరు నేర్పారంటున్నారు, నాకేమో మీరే చేసేస్తున్నారు (నాకు నేర్పే సమయంలో ఓ లక్ష మందికి తేలిగ్గా సందేహాలు తీర్చగలమన్న నమ్మకంతో). వుండండి..వుండండి...బ్లాగు గురువు కంఠతా పడుతున్నాగా..నేనే చేసుకుంటా మార్పులూ చేర్పులూ...మరి మీమీద అంత నమ్మకం...అదే మీ బ్లాగు నా కర్ధమయ్యేటట్లే వుంటుందని.
psmlakshmi

తారక

జ్యోతి గారు, సంచలమైన టపాలు అని కాదు.

అర్ధవంతముగ వుండేవి, కలకాలం గుర్తుండిపోయేవి రాస్తూ వుంటే అది చాలు మాకు.

మనకి వున్నది వేరే వాళ్ళకి లేనిది మన సంస్కౄతి కదా.

మీ టపాలు కొన్ని చదివినప్పుడు, చొంచ్రెతె అరణ్యం నుంచి బయటకు వచ్చి పచ్చిక బయల్లు మీద నడుస్తునట్టు వుంటుంది.

పోటి అంటరా, తెలుగు వాడు చదువుతాడు అని, తెలుగు వెలుగు యే మాత్రం తగ్గలేదు అని అందరికీ చాటేది ఇలాంటి బ్లాగ్సె.

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు !

లక్షన్నర మంది వీక్షకులు ... రెండు వేల టపాలు ...
నేను మిమ్మల్ని ఎప్పుడు అందుకోగలను గురువు గారు ?

బ్లాగుల లోకమందు మును పల్వురి కన్నను ముందు వచ్చి, ఆ
బ్లాగుల యందు ’ జ్యోతి ’ యను బ్లాగు ప్రభల్ వెదజల్లె - ఆ పయిన్
బ్లాగులవేవి వచ్చినను, బాటను చూపెను ’ జ్యోతి ’ కాంతి ! మీ
బ్లాగుకు జై ! తృతీయ ఘన వార్షిక వేళ శుభాభినందనల్ !

మీరింకా, ఇంకా ... ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.

మాలా కుమార్

జ్యొతి గారు ,
మీరు ఇంకా ఇలాటి వార్షికోత్సవాలు చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను.
అభినందనలు.

మధురవాణి

Very inspiring journey..!!
Hearty congratulations and keep Rockingg Jyothi gaaroo.. :)

ప్రియ

Really it's a stunning feat by you, a house wife, for all ur learning and teaching, and helping nature.

Shiva Bandaru

అభినందనలు.

Srujana Ramanujan

Congrats, and BOL for ur aim

M.Srinivas Gupta

జ్యొతక్క అభినందనలు, ఇంకా మరిన్ని వార్షికొత్సవాలు జరుపుకొవాలని ఆశిస్తూ..

జ్యోతి

లక్ష్మి, మాల, మధురవాణి, ప్రియ, సృజన , శ్రీనివాస్ గుప్త .. అందరికీ ధన్యవాదాలు


ఫణీంద్ర గారు,

అసలు లెక్కలు చెప్పాలంటే రెండులక్షలు దాటిందండి. కాని అలా ఆస్తుల వివరాలు చెప్తే డేంజర్ కదా .అందుకే తగ్గించి చెప్పానన్నమాట.మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను గురువుని కాదుగానీ.మీకంటే సీనియర్ ని. ర్యాగింగ్ కి సిద్ధమా మరి?? :)

మరువం ఉష

ఎంత స్ఫూరిదాయకంగావుందో జ్యోతి.

>> ఆలోచన ఇప్పుడు సఫలీకృతమై కళ్ల ముందు కనపడుతుంది. అది ఆనందమా? ఆశ్చర్యమా?, గర్వమా? అర్ధం కాలేదు

అవేమీ కాదు. సంతృప్తి. జీవితమే సఫలమూ పాట గుర్తుకువచ్చింది. మీ మాదిరి జీవితం ఏమిటిక అన్న తలంపుల్లోకి వెళ్ళినపుడు ఇలా వాపోతాను - http://maruvam.blogspot.com/2009/06/blog-post.html అంతలోనే ప్రతి గెలుపునీ గుర్తుకు తెచ్చుకుని నా బాట నేనే వేసుకుంటూ ప్రియనేస్తాల్ని కలేసుకుని ఇలా సాగిపోతాను. http://maruvam.blogspot.com/2009/06/blog-post_05.html

ఇప్పటికి అర్థం అయిందా తల్లీ? ఎందుకు కవితోపాఖ్యానం చేసానో... ;)
>> కవితలు, రాజకీయాలు, పద్యాలు.. అయ్యబాబొయ్! అసలు కవితలే అర్ధం కావు,

అన్నందుకు అలా కసితీర్చుకున్నాను. మీ బ్లాగ్లోకయానం మరింత దివ్యప్రభలతో సతసహస్ర టపాలతో మురిసి మెరవాలి. మీ అనుభవం మరెందరికో మార్గదర్శకం కావాలి.

One Stop resource for Bahki

జ్యోతి గారూ అభినందనలు.


పార్టి ఇవ్వరా ... !
మీ శ్రేయోబిలాషి
కశ్యప్

తృష్ణ

చాలా బాగా రాసారు.మీ ఈ సాఫల్యానికి నా హృదయపూర్వక అభినందనలు.

సార్ధక నామధేయమంటే ఇదేనేమోనండి..!!

జ్యోతి

Thanku Usha నువ్వు చెప్పింది నిజమే.. ఇలా కసి తీర్చుకుంటావా?? హన్నా.. నీలా కాకున్న చిన్న చిన్న కవితలు రాసి సై అంటూ చాలెంజ్ చేయాలని ఉంది .

కశ్యప్, తృష్ణ ,,, ధన్యవాదాలు..

నేస్తం

జ్యోతి గారు అభినందనలు:)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008