Saturday, September 26, 2009

బతుకమ్మ ..పండగ అనగానే పూజలు, కొత్తబట్టలు, పిండివంటలు . ఇవేకాదు. ప్రతి పండగకు ఒకో అర్ధం, పరమార్ధం ఉంటుంది. అలాగే తెలంగాణాలో జరిగే ఒక ప్రముఖమైన, విశిష్తమైన , ఆడపిల్లలకు చాలా ఇష్టమైన పండగ బతుకమ్మ పండగ. తెలంగాణా ప్రాంత సంస్కృతి , సంప్రదాయాలను కళ్లముందుంచే పండగ ఇది.


నా చిన్నప్పుడు ఉన్న సందడిలో సగం కూడా ఇప్పుడు కనపడటంలేదు. అసలు ఈ బతుకమ్మ ఆడటం , వినాయకచవితి నుండి మొదలయ్యేది. పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు, కుంకుమ , పూలు పెట్టి ప్రతి రోజు కల్లాపు జల్లి, ముగ్గు పెట్టిన వాకిట్లో ఈ గొబ్బెమ్మలు పెట్టి , చుట్టుపక్కల ఉన్న పిల్లలు, పెద్దలు, అందరు ఆడవాళ్లు కలిసి ఆడేవారం. అందరికి ప్రతిరోజు అదో ఆటవిడుపులా ఉండేది. ఆడవాళ్లకు కాస్సేపు ముచ్చట్లు వేసుకోవడానికి, పిల్లలకు ఆడుకోవడానికి, తర్వాత అమ్మ పెట్టే అటుకులు, పుట్మాలు,బెల్లం ప్రసాదం తినడానికి. నాకు ఇప్పటికి అర్ధం కాదు. ఈనాటి పిల్లలకు అస్సలు తీరిక సమయం దొరకడంలేదు. బతుకమ్మ పూలు అని ఉండేవి. ఇప్పటికీ అవి ఎక్కడైనా కనపడితే మనసు బంగారు బాల్యంలోకి వద్దన్నా పరిగెడుతుంది. బతుకమ్మ ఆడటం ఐపోయాక ఆ గొబ్బెమ్మలు తీసి గోడకు కొట్టి అదే ముగ్గుపై ఒప్పులకుప్ప ఆడటం ..ఒహ్!! ఒక అందమైన జ్ఞాపకం.తర్వాత మహాలయ అమావాస్య (పెత్తరమాస) నుండి చిన్న బతుకమ్మ మొదలవుతుంది. ఈరోజు నుండి బతుకమ్మను పూలతో పేరుస్తారు. గునుగు పూలు, తంగేడు, బంతి, చామంతి మొదలైన పూలతో రోజుకో డిజైనులో అమ్మ పేరుస్తుంటే పక్కన కూర్చుని వింతగా చూసేవాళ్లం. అమ్మకు పక్కనే కూర్చుని ఆకులు, పూలు కత్తిరించి ఇవ్వడం అప్పుడప్పుడు సలహాలు ఇవ్వడం పెద్ద గొప్పలా ఫీలవ్వడం. బతుకమ్మ మొత్తం పేర్చాక ఓ సారి చూసుకుని దేవుని ముందు పెట్టేది అమ్మ. అదేంటో అప్పుడు అమ్మలందరికీ ఓపిక ఎక్కువేమో అనుకుంటాను ..ఎన్ని పనులు చేసేవారో?? ఈ గునుగు పూలు చివర్లు కత్తిరించడం , రంగు నీళ్లలో ముంచి వేర్వేరు రంగులతో తయారు చేసుకునే వాళ్లం. సాయంత్రం కాళ్లు చేతులు కడుక్కుని మంచి బట్టలు వేసుకుని , దేవుడి ముందు దీపం పెట్టి, పసుపు గౌరమ్మ పెట్టి అప్పుడు బతుకమ్మను వాకిట్లో ఆడుకోవడానికి తీసుకొచ్చేది. బతుకమ్మని ఎప్పుడు కూడా ఒక్కటే చేయరు. పక్కన చిన్న బతుకమ్మ ఉండాల్సిందే . అంటే తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని తప్పనిసరిగా ఉండాలనేవారు పెద్దలు. మెల్లిమెల్లిగా చుట్టు పక్కల ఉన్నవాళ్లు అందరు వచ్చి ఇంటి ముందు గుండ్రంగా తిరుగుతూ లయబద్ధమైన చప్పట్లతో , గొంతెత్తి పాడుకుంటూ బతుకమ్మ ఆడతారు. కాస్త నడవలేని , ముసలమ్మలు పక్కన కూర్చుని గొంతు కలిపేవారు. "ఏం పిల్లలో ఏమో? పాటలు రావు. మా కాలంలో ఐతేనా" అంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా పాటలు రాగయుక్తంగా జాలువారేవి. ఇక అక్కడినుండి పక్కింటికెళ్లి వాళ్ల వాకిట్లో ఆడాల్సిందే. అలా గుంపు పెద్దదవుతుంది. ఆ రంగులు, వయ్యారాలు , అందాలు ఆడవారికే సొంతం కాదా?? చివరిగా దుర్గాష్టమి లేదా సద్దుల బతుకమ్మ రోజు ఇది ముగుస్తుంది.దసరా అంటేనే బతుకమ్మ పండగ . ఆడవాళ్లకు సొంతమైన పండగ. పూజలు ఎలాగూ ఉంటాయి. సద్దుల బతుకమ్మ రోజు చాలా పని ఉంటుంది. రెండు మూడు రకాల సద్దులు అంటే ప్రసాదాలు, అవి ధధ్యోధనం, పులిహోర, మలీద అనే లడ్డూలు చేయడం తప్పనిసరి. మామూలుగా చపాతీలు చేసి వాటిని ఎర్రగా కాల్చి , చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం, యాలకుల పొడి వేసి రోట్లో బాగా దంచి ఉండలు కడతారు. ఆరోగ్యపరంగా కూడా ఇవి చాలా మంచివి అంటారు. ఈ నైవేద్యాలు బతుకమ్మకు సమర్పించి , కాలనీలో అందరూ ఒకేచోట చేరి మధ్యలో తమ బతుకమ్మలను పెట్టి చుట్టూ చేరి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడతారు. ఇవి ఆలాంటిలాంటి పాటలా? నీతికథలు, జానపద కథలు, కొత్త పెళ్లికూతురుకు చెప్పే విషయాలు, కిటుకులు, ఆడవారి కష్టాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఒకరికొకరు పరిచయం, బంధుత్వం ఉండాల్సిన పని లేదు. అందరూ ఒకటే. బతుకమ్మని మధ్యలో పెట్టి మిగతావారితో జత చేరి ఆడడమే. ఇందులో మగవారికి అస్సలు ప్రవేశం లేదు. సద్దుల బతుకమ్మ రోజు పట్టుచీర కట్టి, నిండుగా పూలు, నగలు ధరిచి బతుకమ్మలను పట్టుకుని మహిళలు గుంపులుగా వెళుతుంటే పండగ శోభంతా వీధుల్లోనే కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి కాదేమో.. ఈ ఆటపాటలలో చీకటి పడిండి కూడా తెలియదు. అలిసిపోతే తప్ప. చివరిలో ఒకరికొకరు పసుపు,కుంకుమలిచ్చుకుని బతుకమ్మలను నీటిలో వదుల్తారు. కూతురిని అత్తవారింటికి పంపినట్టుగా భారంగా ఇంటికి తిరిగివస్తారు. రాత్రికి అవే ప్రసాదాలు . తెల్లారితే మళ్లీ పండగ పనులు మొదలు. బతుకమ్మ కోసం మరో ఏడాది ఆగాల్సిందే..

6 వ్యాఖ్యలు:

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు !
ఎంత విపులంగా, హృద్యంగా వ్రాసారండి !
బాల్యంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ’ సిరిసిల్ల ’ జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్ళారు.
అభినందనలు !

మరువం ఉష

nice detailed post. Thanks. I remembered we went to a river along with friends in Sydney to leave the బతుకమ్మ in the waters. Here in USA too we had joined others once or twice. This is not celebrated in our Godavari areas.

గీతాచార్య

మీకునూ పండుగ శుభాకాంక్షలు

swapna@kalalaprapancham

నేను ఇంత వరకు బతుకమ్మ ఆట చూడలేదు.
మీరు ఎలాగు చాలా ఓపికగా మంచిగా బతుకమ్మ చేస్తారు కాబట్టి నాల ఇంత వరకు చూడలేని వాళ్ళని పిలిస్తే వచ్చి చూస్తాము మీకు ఏమి ఇబ్బంది లేకపోతే :)

శ్రీలలిత

అవును. గోదావరి జిల్లాల్లో ఇది జరుపుకోరు. కాని సంక్రాంతి పండగ ముందు నెల పట్టు అని మొదలుపెట్టి, ఆ నెలంతా పెళ్ళికాని ఆడపిల్లలు రోజూ సాయంత్రం సందె గొబ్బెమ్మలని పెడతారు. ఆవుపేడతో మధ్యలో పెద్దది, నాలుగువైపులా చిన్నవీ చేసి, బంతి పూలతోనూ, గుమ్మడిపూలతోనూ అలంకరిస్తారు. చుట్టూ తిరుగుతూ చాలా పాటలు పాడతారు. అందులో ఒకటి..సుబ్బీగొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యవేతామరపువ్వంటీ తమ్ముణ్ణియ్యవేచామంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవేమొగలీ పువ్వంటీ మొగుణ్ణియ్యవేఅంటూ పాడతారు.ఆఖరి లైను వచ్చేటప్పటికి మటుకు సిగ్గొ మరి మొహమాటమో ఎవరూ పాడేవారుకాదు. నా వెనకాల మా తమ్ముడు తిరిగేవాడు. ఆడపిల్లలందరూ ఒక్కసారి ఆగిపోతే వాడి గొంతుక మటుకు

మొగలీ పువ్వంటీ మొగుణ్ణియ్యవే అంటూ గట్టిగా వినిపించేది.

తర్వాత అవన్నీ చిన్న చిన్న పిడకలుగా చేసి, ఎండబెట్టి దండల్లా కట్టి భోగి రోజు భోగిమంటల్లో వేసేవాళ్ళం.

జ్యోతీ పోస్ట్ వల్ల ఒక్కసారి చిన్నతనం గుర్తు వచ్చింది.

srujana

hi jyothi gaaru..chaalaa baga rasarandi..ee year bathukamma pandaga nu miss avuthunnam..meeku bathukkamma pandaga shubhakankshalu..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008