Sunday 22 November 2009

కలల రాజకుమారుడు - కృష్ణచైతన్య


బాల్యం వీడి యవ్వనంలో అడుగుపెట్టిన కన్నెపిల్లకు ఎన్నో ఊహలు, మరెన్నో ఊసులు. తనకంటూ ఒక అభిప్రాయం ఉండదు. ప్రతీది వింతగానే ఉంటుంది. ఆమెకంటూ ఒక కలల రాజకుమారుడు. ఆ రాజకుమారుడు ఎలా ఉండాలి? అనేది ప్రతీ అమ్మాయి ఆలోచనలు . ఆరడుగుల అందగాడు. ఆస్థిపరుడు. అతని ఆలోచనలు,మాటలు ప్రత్యేకంగానూ, మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. ఓహో.. ప్రతీ అబ్బాయి ఇలా ఉంటే ఎంత బాగుంటుంది?



అందమైన అమ్మాయి అంటే బాపు బొమ్మలా ఉండాలి, సర్వగుణ సంపన్నుడు (ఇందులోఅందం, డబ్బు, గుణం.. అన్నీ ఉంటాయి) అబ్బాయి అంటే యద్దనపూడి నవలానాయకుడిలా ఉండాలి అని అందరూ అనుకునేవారు. అందరూ అంటే అమ్మాయి, అబ్బాయి, వాళ్ల తల్లితండ్రులు కూడా. దాదాపు యద్దనపూడి ప్రతీ నవలలో హీరో అంటే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేవాడు. నిజంగా అలాంటివాళ్లు ఉంటారో లేదో తెలీదుకాని, ఉంటే బాగుండు అనిపిస్తుంది. పాతికేళ్ల క్రిందటి పెళ్లికాని అమ్మాయిలను అడిగిచూడండి .ఏమంటారో? ఔననే అంటారు. ఇప్పట్లా షోకులు, బైకులు, బహుమతులు, డేటింగులు లేని కాలం.



ఇక నాకు అప్పుడూ ,ఇప్పుడూ, ఎప్పుడూ బాగా నచ్చిన హీరో "కృష్ణచైతన్య".. ఏ నవల్లో, సినిమాలో అనుకుంటున్నారా? యద్దనపూడి సులోచనారాణి రాసిన "అగ్నిపూలు" నవలలోని హీరో. 70 చివర. 80 మొదట్లో యద్దనపూడి అంటే ఆడాళ్లందరికీ ఒక క్రేజ్. నేనైతే నా పాకెట్ మనీ అంతా ఈ పుస్తకాలకే పెట్టేదాన్ని. అమ్మ కూడా చదివేది కాబట్టి నో ప్రాబ్లం. ఇందులో హీరో కృష్ణచైతన్య ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కల జమీందారీ బిడ్డ. భార్యకు నాట్యమంటే ప్రాణం అని తెలిసి తన అమ్మమ్మ జమిందారిణికి ఇష్టం లేకున్నా ఒప్పించి ఆమెతో నాట్యప్రదర్శనలు ఇప్పిస్తాడు. కాని ఒక ప్రదర్శనలో జరిగిన ప్రమాదంలో ఆమె అంగవికలురలవుతుంది. చక్రాలకుర్చీకే పరిమితమవుతుంది. ఐనా కూడా అతని ప్రేమ తగ్గదు. భార్యను మరింత ప్రేమగా చూసుకుంటాడు. ఒక విడేశీ వనితను పెళ్లి చేసుకుని తల్లి కోపానికి గురై ప్రాణాలు కోల్పోయిన మేనమామ పిల్లలను చేరదీస్తాడు. మరదలు తమ మీద పగ పట్టినా కూడా ఆమెను అర్ధం చేసుకుని మెల్లిగా ఆమెలో మార్పు తెస్తాడు. ఇలా అన్నీ మంచి లక్షణాలే ఈ హీరోకి. ఎప్పుడూ కోపం రాదు. అందరికీ సాయం చేస్తాడు. ప్రతీ సమస్యకు అతని దగ్గర పరిష్కారం ఉంటుంది. మరి ఏ అమ్మాయి ఇలాంటి హీరోకోసం కలలు కనదు చెప్పండి?



అన్నట్టు అప్పట్లో మావారి పేరు కృష్ణచైతన్య ఉంటే ఎంత బాగుండు. సినిమాహీరోలా కాకున్నా అని అనుకున్నాలెండి. ఎందుకో ఆ పేరు మీద అంత ఇష్టం. ప్చ్ కుదరలేదు. కాని నాకిష్టమైన పేరును వదలలేకపోయా. మా అబ్బాయి పుట్టినప్పుడు వాడికి పెట్టాను. అసలైతే పిల్లలకు పెద్దలే పేరు పెడతారు. తాతలు ,బామ్మలు .. కాని నేను ససేమిరా అన్నా. బహుశా నాకొసమేనేమో వాడు కృష్ణాష్టమికి నాలుగు రోజుల ముందు పుట్టాడు. పేరు చ తో రావాలన్నారు ఇంకేముంది నేను ఊరుకుంటానా? కృష్ణచైతన్య అని పెట్టేసా.


24 వ్యాఖ్యలు:

కత పవన్

మంచి బుద్దులు ఉన్నవాడు హీరో అవుతాడా లేక హీరొ కే మంచి బుద్దులు వస్తాయా???

రాధిక(నాని )

నేనుకూడా యద్దనపూడి కి అభిమానినే.నేను ఇంటర్ చదివేటప్పుడు సెలవలలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లినప్పుడు మొదట నవల చదివాను.అదియద్దనపూడిదే.అగ్నిపూలునవల నేనూ చదివాను .బాగుంటుంది.సినిమా కూడా తీసారు.కృష్నం రాజు,జయసుద,జయప్రద అనుకుంట,గుర్తులేదు.

Hima bindu

అగ్నిపూలు నవల నేను చదివానండి ..ఆవిడ నవల హీరోలను మరిచిపోలేము .

కొత్త పాళీ

నాకు మీనాలో కృష్ణ ఇష్టం. మిగతా హీరోలందరూ కొంచెం బిగుసుకుపోయుంటారు. తమ మంచితనమ్మీద వాళ్ళకి టూమచ్ నమ్మకం ఉన్నట్టు. కృష్ణ సహజంగా ఉంటాడు.

Unknown

మీ అబ్బాయి ప్రస్తుతం పెళ్ళికెదిగొచ్చాడనుకుంటా . ఈ కృష్ణ చైతన్య కోసం ఏ హీరోయిను కాసుక్కూర్చుందో మరి ?

జ్యోతి

రాధిక,
1981 లో బాపయ్యగారి దర్శకత్వంలో ఈ నవలను సినిమాగా నిర్మించారు. కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, ముగ్గురూ పోటీపడి నటించారు.

కొత్తపాళీగారు,
యద్ధనపూడి నవలలను సినిమాలుగా తీసినపుడు చాలామటుకు అందరికి నచ్చాయి. మీనాలో కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ బాగా నటించారు.అందంగా కూడా ఉన్నారు. అలాగే శోభన్ బాబు కూడా యద్దనపూడి నవల ఆధారంగా నిర్మించిన గిరిజా కళ్యాణం, చండీప్రియ, రాధాకృష్ణ,జీవనతరంగాలు చిత్రాలలో నటించి నవలానాయకుడైనాడు.కాని నాకు అస్సలు నచ్చని చిత్రనాయకుడు ఏ.ఎన్.ఆర్ నటించిన సెక్రటరీ.

నరసింహగారు , ఇంకా వాడికి టైముందండి.వాడి హీరోయిన్ ఎక్కడో పుట్టి,పెరిగి, ఏ ఇంటిముందు ముగ్గేస్తుందో,కంప్యూటర్ తో ఆటలాడుతుందో మరి...

భావన

వామ్మో జ్యోతి. అంత అభిమానమా కృష్ణ చైతన్య అంటే.. నాకు చిన్నప్పుడు ఆట్టే ఇష్టం వుండేది కాదు యద్ధనపూడి నవలలంటే... నేను అనుకునే దానిని భగవంతుడా ఈ దవడ కండరం మాటి మాటికి బిగుసుకోనోడె కావాలి నాకు అని. ;-) వూరికే అన్నానులే.. నాకు కలలు కనే వయసొచ్చేసరికి యద్ధనపూడి హవా వుంది కాని నేనెప్పుడు బాలు లా పాట లు పాడే వాడు, లేదా కమలా హసన్ లా మీసం తో డేన్స్ చేసే వాడూ ఈ టైపు లో సాగేయి ఆలోచనలు.. కాని నాకు కూడా మీనా లో కృష్ణ ఇష్టం. ఆయనకు దవ కండరం బిగేసేది కాని కొంచం తక్కువ సార్లు కదు.

అగ్ని పూలు సినిమా లో రెండు పాటలు బలే వుంటాయి.
ఇంకో ఆమె వుండేది ప్రతి నవల లో కృష్ణ హీరో పేరు ఆర్. సంధ్యా దేవి.. మన బ్లాగర్ లో ఎవరికైనా ఇష్టమా?

Bhardwaj Velamakanni

ఆర్. సంధ్యాదేవి అంటే "వైర్‌లెస్ తీగలపై పక్షుల కిలకిలారావాలు" అని నవల మొదలు పెట్టినావిడేనా?

కెక్యూబ్ వర్మ

మీ కృష్ణ చైతన్య దిన దిన ప్రవర్థమానుడై మీకు నచ్చిన హీరోయిన్ నే వరించాలని కోరుకుంటూ...

భావన

" ఆర్. సంధ్యాదేవి అంటే "వైర్‌లెస్ తీగలపై పక్షుల కిలకిలారావాలు" అని నవల మొదలు పెట్టినావిడేనా? " ఏమో తెలియదు భరద్వాజ... ఇది చదవగానే మేము మాత్రమ్ కిల కిల కిస కిస..:-) అలా కూడా రాయ గల సమర్ధు రాలే ఆమె. అమ్మొ రక్తపు వాంతులొచ్చేవి ఆమె రచనల గురించి మా అమ్మ పక్క అత్తమ్మ గారు చేసే చర్చలు వింటే. ఇంక చదివే ధైర్యం కూడానా...

జ్యోతి

హా హా హా..నిజమే ఆర్.సంధ్యాదేవి రచనలు గాలిలో కూడా కాదు.దానిపైన పయనించేవి. ఆవిడ ప్రతినవలలో హీరో పేరులో కృష్ణ అని ఉండేది. కధ ఉండేది టి.టి. బాల్ అంత.. ఆవిడ దాన్ని ఫుట్ బాల్ అంత నవల చేసేది. ఇక హీరో ఎంట్రీ ఉండేది... మన వెంకటేష్ సినిమాల్లో ఇస్తాడే అలా. తల నుంఢి కాలి షూ వరకు సామాన్య జనులకు అర్ధం కాని వర్ణన. ఆ పేజీలు తిప్పుకుంటూ చదివితే అరగంటలో స్టోరీ ఖతమ్..దుకాణం బంద్..

భావన

ఎందుకు అర్ధం కావమ్మా ఆమె వర్ణనలు.. శంఖమంటీ మెడ ముత్యాల హారం, గులాబి రంగు చీర, హీరో తలకు బిల్ క్రీమ్, హీరోయిన్ వెనుక నున్చి వచ్చి దువ్వే క్రా ఫ్. ఎవరక్కడ ఆ పారి పోయే వాళ్ళందరిని ఇటు తెచ్చి కూలెయ్యండి ఇన్క ఒక పేజ్ కూడ చదవలేదు నవల.

పరిమళం

అగ్నిపూలు సినిమా చూశాను కాని కృష్ణంరాజు పేరుకి హీరో ఐనా చూట్టానికి విలన్లా ఉంటాడు నా కళ్ళకి !
అన్నట్టు మీ కృష్ణచైతన్యకి హీరోయిన్ ఎలాఉండాలి కాజల్ లాగా , హన్సిక లాగా :) :)

Srujana Ramanujan

Hehehe. Good discussion.

మాలా కుమార్

కలల రాకుమారుడు క్రిష్ణచైతన్య అని హెడ్డింగ్ చదవగానే , ఆర్ . సంద్యా దేవి హీరో గురించేమో ననుకొని ముందు చదవలే . మరీ గురూజీ కి నెగిటివ్ కామెంట్తే బాగోదుకదా ? మళ్ళీ నన్ను మొట్టికాయేస్తే ! కాని గురూజీ పోస్ట్ చదవకపోతే ఎలా ? ఎంతో కష్టం మీద , ప్రాణాలు బిగబట్టుకొని చదవటము మొదలెట్టా ! హే ఇది యద్దనపూడి హీరో గురించి . ఎంతైనా గురూజీ గురూజీనే పాఠకుల నాడి తెలుసుకదా !

ఏయ్ భావనా ముందు నిన్ను , గుంజకు కట్టేసి , ఆర్. సంద్యాదేవి నవలలన్ని చదవమనాలి . లేకపోతే పాయసములో కంకర రాయేమిటి ? హన్నా .

సుభద్ర

అహా అలా జరిగి౦దా జ్యోతిగారు.....
బాగు౦ది మీ వాడి పేరు వెనక అసలు కధ.
పేరు కూడా బాగు౦ది.... ఎ౦దరికి కలలరాకుమారుడో మరి.
మీ కొడుకు కదా నాకు నమ్మక౦ ఉ౦ది....కధనాయకుడి లా సకలగుణ స౦పన్నుడు కావాలని కోరుకు౦టున్నా.ముగ్గులు వేసే అమ్మాయి ఉన్నార౦టరా!!!ఉ౦డే ఆ అమ్మాయినే ఖాయ౦ చేయ౦డి.

రమణ

బాబోయ్! మీకు తెలిసిన కృష్ణచైతన్య కు మరీ అన్ని మంచి లక్షణాలా?, నాకు కూడా ఒక క్రిష్నచైతన్య తెలుసు. మంచీ, చెడూ ఇలా అన్నీ మిళితమైన లక్షణాలున్నవాడు. చండీదాస్ గారి హిమజ్వాల నవలా నాయకుడు. యద్దనపూడి గారి నవలలు చదవలేదండీ. చదవాలి.

సుజాత వేల్పూరి

హమ్మయ్య! కృష్ణ చైతన్య అని చూడగానే ఇదేదో ఆర్. సంధ్యా దేవి నవల అనుకుని గుండె ఆగి చచ్చినంత పనైంది నాకు! ఒకసారి సెలవుల్లో చుట్టాలింటికి వెళ్ళి అక్కడ ఆమె రాసిన నవలా కళా ఖండాలు చదివి మరణం సమీపంలోకి వెళ్ళొచ్చానులెండి!

భరద్వాజ,
ఆర్ సంధ్యా దేవి అంతటి సమర్థురాలేనండోయ్! నన్నడగండి నేను చెప్తాను.

యద్దనపూడి సోది అంతగా భరించలేను గానీ, అగ్నిపూలు నవలను సినిమాగా మలిచిన తీరు అద్భుతంగా ఉంటుంది. పాత (తండ్రి) కృష్ణంరాజు నటన సూపర్!

మొత్తానికి మీ అబ్బాయికి ఆ పేరు పెట్టి ముచ్చట తీర్చేసుకున్నారా? మా అత్త ఒకావిడ ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు మీనా నవల చదివి వాళ్ళమ్మాయికి ఆ పేరే పెట్టేసిందిట మీనా పాత్ర నచ్చి.

కొత్తపాళీ గారూ,
కృష్ణ సహజంగా ఉంటాడు..అనే మాటలో "బిగుసుకుపోవడం కృష్ణంత సహజంగా ఎవరూ చేయలేరు"అనే అర్థం కనపడుతోంది నాకు! కరెక్టేనా!

Bhardwaj Velamakanni

So, imtakI mI abbaayi oka sUpar hIrO kaavaalamTaaru amtEgaa? ippaTikE ayipOyaaDEmO chUsukOmDi :))

జ్యోతి

భరద్వాజ్,,

అంతలేదు. ఆ పేరు ఇష్టమని పెట్టుకున్నాను. ఇక వీలైనంతవరకు మంచి బుద్దులే నేర్పించాను.తర్వాత వాడి రాత. ఖర్మ..

పరిమళంగారు,
అమ్మాయి అష్టాచెమ్మ స్వాతిలా ఉంటే చాలండి. అచ్చమైన తెలుగమ్మాయి..

Ruth

హ హా, బాగుంది మీ అబ్బాయి పేరు కథ. కాని, అమ్మాయి అష్టాచెమ్మా స్వాతి లా ఉండాలంటె కష్టం కదండీ, అప్పుడు మళ్ళీ మీ అబ్బాయి పేరు మార్చాలి మహేష్ అని :) :) :)

మురళి

నాకు కృష్ణ చైతన్య అనగానే ఎర్రటి కళ్ళతో కృష్ణంరాజు గుర్తొస్తాడు.. ఆ వెనుకే చక్రాల కుర్చీలో జయప్రద :):) ఆర్. సంధ్యాదేవి బాధితుల్లో నేనూ ఉన్నాను.. మూడు నాలుగు నవలలు ఓపిగ్గా పూర్తి చేసేశాను.. (భావన గారు నాకు సన్మానం ఏర్పాటు చేస్తారో, ఏమిటో) తర్వాత మళ్ళీ ఆ పేరు చూసి పుస్తకం పక్కన పెట్టేయడం మొదలు పెట్టాను. 'సెక్రటరీ' సినిమాలో నాకు ఏఎన్నార్, వాణిశ్రీ ఇద్దరూ నచ్చలేదు.. రాజశేఖరాన్నీ, జయంతినీ చంపేసి నటించారనిపించింది.. ఇంతకీ నవలా నాయకులందరినీ వరుసగా పరిచయం చేయబోతున్నారా?

జ్యోతి

మురళి,
అలాగైతే నేను దాదాపు ఎనిమిది - పది వరకు ఆర్.సంధ్యాదేవి నవళ్లు చదివి నా బుర్రను పదును పెట్టుకున్నా. ప్రతిసారి నవల చూడగానే ముందుగా హీరో పేరు వెతికేదాన్ని. నాకు గుర్తున్నంతవరకు రచయిత్రి పెళ్లయ్యాక రాసిన నవలలో ఒకసారి హీరో పేరులో కృష్ణ లేదనుకుంటా.నాకు పద్మవిభూషణ్ ఇవ్వాలా??

చిన్ని రాస్తానన్నారుగా నవలాహీరో గురించి. నా పుస్తకాలన్నీ ఇచ్చేసాను.వందల నవళ్లు.లేకుంటే ఎప్పుడో ఈ హీరో, హీరోయిన్ల గురించి రాసేదాన్ని. చూద్దాం..

భావన

ఎనిమిది పది నవల్స్ చదివేవా ఆర్ సంధ్యా దేవి వి.. జ్యోతి.. నువ్వు మన్శివి కావు దేవతవు... దేవతవు జ్యోతి..(నోట్లో గుడ్డ కుక్కుని ఏడుస్తున్నా మల్లిక్ జోక్ లో లా వూహించుకో)... ఎలా నిన్న పొగడను ఏమని పొగడను జ్యోతి.. మాటలు రాని మౌన మిది..
ఇక చాల్లే... నేను ఇంతకంటే బాధ పడ లేను కాని మొత్తానికి నీకు మురళి గారికి సన్మానం చెయ్యలి ఐతే..
హేమిటో... వింత జీవితం....

నేను పరిచయం చెయ్యనా యద్ధన పూడి హీరో లను..... మరేమో ఒక వుదయం పెద్ద ఇంపాలా కారు వస్తుంది, అందులోనుంచేమో మరే ఒక ఆరు అడుగుల పొడూగు... ఠాప్... అబ్బ నేను చెప్పనమ్మ.. మాల గారు కొడూతున్నారు వాళ్ళ గురూజీ బ్లాగ్ లో నేను కధ చెప్పేస్తున్నానని..మీరే చెప్పుకోండబ్బా నేను వుత్తరం రాసుకోవటానికి పోతున్నా. ;-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008