Thursday 3 December 2009

బస్సు ముచ్చట్లు వినరండి







అమ్మల్లారా! అయ్యల్లారా!!
ఆర్.టీ.సీ ప్రయాణీకుల్లారా!
పిల్లల్లారా!! పెద్దల్లారా!!
అప్పుడప్పుడు మమ్మల్ని తగలపెట్టే కార్యకర్తల్లారా!!
అందరికీ దండాలు. శతకోటి దండాలు..



నన్ను గుర్తుపట్టారా?? నేను మీ నిత్యజీవితంలో భాగమైన ఆర్.టీ.సీ బస్సును. మీ తాత, ముత్తాతల నుండి ఎన్నో తరాలను చూసినదాన్ని. ముందు ముందు ఎన్నో తరాలను చూడాల్సి ఉంది. రోజూ ఎన్నోరకాల మనుష్యులు . అన్నీ బాగుంటే నేను మీ ముందుకెందుకొస్తాను? ఏదో నా కష్టాలు, ఆవేదనను మీతో పంచుకుందామని వచ్చా. కాస్త తీరిక చేసుకుని వినండి..


ఇందుగలడందులేదన్నట్టు ప్రతీ చోటా అవినీతి, నిర్లక్ష్యం. చూసి నేను ఏమీ చేయలేక మౌనంగా నడుస్తున్నాను. టికెట్ల రిజర్వేషన్లలో వింతలు, గందరగోళాలు. నాకు బస్సు వాసన పడదు నాయనా కాస్త కిటికీ పక్క సీటివ్వమంటే ఇంజను దగ్గర సీటిస్తారు. బస్సెక్కి ఏదైనా అడిగితే డ్రైవరు, కండక్టరు మమ్మల్ని కాదు అన్నట్టు ముచ్చట్లలో ఉంటారు. అయ్యా నాకు నడుమునొప్పి ఉంది కాస్త బస్సు మధ్యలో సీటివ్వు ..చచ్చి నీ కడుపున పుడతాను అంటే కక్షకట్టినట్టు వాళ్లకు బస్సు వెనకాల టైరు దగ్గర సీట్ ఇస్తారు. ఇక వాళ్ల బాధ ఎముకల డాక్టరే చెప్పగలడేమో?? మరో వింత సంగతి చెప్పనా... ఈ రిజర్వేషన్లలో పెళ్లైనవారికి కూడా విసిరేసినట్టు అక్కడోటి, ఇక్కడోటి సీట్లిచ్చి తాత్కాలిక విడాకులిచ్చేస్తుంటారు. అలాగే తాత్కాలిక ద్వితీయ వివాహాలు కూడానండోయ్.. ఆర్ధం కాలేదా?? భార్యకు ఒకదగ్గర, భర్తకు ఒక దగ్గర సీట్ ఇస్తారు. ఫ్రయాణం తప్పనిసరై ఇలా అడ్జస్ట్ అవ్వక తప్పదు.


బస్సు స్టార్ట్ అయ్యాక ఇక డ్రైవరు అర్జునుడి రధాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడిలా ఫీలవుతాడు. బస్సు అతని చేతిలో కీలుబొమ్మ కావలసిందే. అతనికిష్టమున్నప్పుడే, ఇష్టమున్నచోటే ఆగుతుంది. బయలుదేరుతుంది. సాధారణంగా సిటీబస్సులు స్టాపుల్లో తప్ప డ్రైవరుకు నచ్చినచోట మాత్రమే ఆపబడుతుంది. నోరెత్తడానికి వీలులేదు. అందుకే చాలా మంది బస్ స్టాపుల కంటే జంక్షన్ల వద్ద ఎక్కువ నిలబడతారు ఎక్కడానికి. కొన్ని రూట్లలో ఒక బస్సులో పదిమందికంటే ఎక్కువ ఉండరు. మరో రూట్లో ఒక బస్సులో నాలుగు బస్సుల మంది ఉంటారు. సగం మంది మనుష్యులు బస్సును గబ్బిలాలలా పట్టుకుని వేళాడుతూ ఉంటారు. ఈ కుర్రాళ్లకి ఈ సాహసాలు వాళ్ల జీవన నౌకాయానం లో పనికొస్తాయేమో.. ఇక్కడ నాకు అస్సలు అర్ధం కాని సంగతేంటంటే ... ఆర్.టీ.సి కి లాభాలు వస్తున్నాయి. బస్సులు ఎక్కడానికి ప్రయాణీకులు ఉన్నారు. మరి బస్సులు పెంచడానికేం మాయరోగం?. ముఖ్యంగా శివార్లలోని కాలేజీ పిల్లలలకు. అవినీతిపరులకు ఆదాయం కూడా ఉంటుందిగా మరిన్ని బస్సులు వేస్తే.. అర్ధం చేసుకోరూ!!!



సిటీ బస్సులలో ప్రయాణీకులు ఎక్కువసేపు కలిసి ఉండరు. కొద్ది దూరానికే దిగిపోతారు. విడిపోతారు. కానీ ఊర్లలో తిరిగే బస్సులలో ఎన్నో పరిచయాలు, అనుబంధాలు , స్నేహాలు కూడా. బస్సెక్కి లగేజీ సీటుపైన పైన పెట్టి హాయిగా కళ్లు మూసుకుని మధురస్వప్నాలలో తేలిపోదామనుకునేవారికి అప్పుడప్పుడు .. ఆ బ్యాగులు ధభీమని నెత్తిమీదొచ్చి పడి భయంకరమైన వాస్తవ ప్రపంచంలోకి తీసుకొస్తాయి. ఇక మరి కొందరు తమ పిల్లల పెల్లి సంబంధాల నుండి పక్కవూరి సర్పంచ్ రాసలీలలు కూడా తీవ్రంగా చర్చిస్తారు. మధ్యలో డ్రైవరూ, కండక్టరూ తమ వంతు మాట సాయం చేస్తుంటారు. పాపం .. ఉన్నమాట చెప్పాలి. ఊర్లలోని బస్సులు ఎక్కదంటే అక్కడ ఆపుతారు. భలే ముచ్చటేస్తుంది. కొండరు డ్రైవర్లు మార్గమధ్యంలో బస్సులను బస్ స్టేషన్లలోకంటే కాకా లేదా డాబా హోటళ్ల దగ్గర ఎక్కువసేపు నిలుపుతారు. అక్కడ వాళ్ల లాభం వాళ్లు చూసుకోవద్దా?? దిగిన ప్రయాణీకులు అందరూ ఎక్కారా లేదా అని కూడా చూసుకోకుండా కదిలి వెళ్లిపోతారు.


ఇలా చెప్పుకుంటూ పోతుంటే అంతా బాగానే ఉంటుంది. కాని వాస్తవంగా జరగే విషయాలు కూడా చేప్పుకోవాలిగా.. రోజూ వేలమందిని వారి గమ్యాలకు చేరుస్తామా?..ఈ బస్సులు ఉన్నది మీకోసమే కదా? కాని ఎన్నోసార్లు రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకోసం మా అద్దాలు పగలగొడతారు. నిప్పంటిస్తారు. ఇదేనా మా నిస్వార్ధ సేవకు ప్రతిఫలం. నోరులేదు , మాట్లాడలేమనే కదా ప్రతి గొడవకి మమ్మల్నే బలిపశువులను చేస్తారు. మరి ఆ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు మాత్రం మేమే కావాలి?? అప్పుడు వారందరిని మా బస్సు కిందే వేసి తొక్కేయాలనిపిస్తుంది. మమ్మల్ని వాడుకుని వదిలేయరు కాని కాల్చేస్తారు..



మీరైనా మమ్మల్ని కాపాడరూ? మరీ భద్రత లేని బ్రతుకైపోయింది.

4 వ్యాఖ్యలు:

సంతోష్

MEERU CHEPPINDI AKSHARAALAA NIJAM...
R.T.C NE KAADANDI..
MONNAAMADHYA MA COLLEGE BUS NI KOODA NAASANAM CHESAARU..

Apparao

బస్సులు వీళ్ళ "అమ్మ మొగుళ్ళ సొమ్ము" అందుకే కాలుస్తారు

Sirisha

adaleka maddela odu annatlu evarini em cheyyaleka papam buses ni target chestaru....chala bagundhi jyothi garu

సమీరా వైఙ్ఞానిక్

భలే చెప్పారు మీరు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008