పకోడీ పద్యాలు
ఇందాక చల్లగా ఉంది కదా ఎదైనా చేద్దామా అని ఆలోచించి పాలకూర పకోడీలు చేసాను. అవి తింటూ , మొన్న పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకాలు బయటికి తీసి ఒక్కోటీ తిరగేస్తుంటే అనుకోని విధంగా చిలకమర్తివారి పకోడీ పద్యాలు కనపడ్డాయి. ఇంకేముంది . పకోడీలు తింటూ , పకోడీ పద్యాలను ఆస్వాదిస్తూ పండగ చేసుకున్నాను. మరి ఆ పకోడీలను అదేనండి పకోడీల్లాంటి పద్యాలను మీతో పంచుకోవద్దూ!!
వనితల పలుకుల యందున
ననిమిషలోకమున నున్నదమృతమటంచున్
జనులనుటెగాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఓ పకోడీ! స్త్రీల మాటల్లోనే అమృతం ఉందని ఈ లోకంలోని జనులంటారేగాని తెలుసుకుంటే నీలోనే అమృతం వుంది.
ఆకమ్మదనము నారుచి
యాకరకర యాఘుమఘుమ మాపొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!
ఓ పకోడీ! ఆ కమ్మదనము, ఆ రుచి, ఆ కరకర ధ్వనులు, ఆ ఘుమఘుమలు, ఆ చక్కదనము, వడుపు, నీకే తగును గానీ మరెందులోనూ లేవు ఇది నిజము.
నీకరకర నాదముబు
మాకర్ణామృతము నీదు మహితాకృతియే
మాకనుల చందమామగ
నేకొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!
నీ కరకర శబ్దాలే మా వీనులకు విందులు. నె సుందరమైన రూపమే మా కనులకు చందమామ. నిన్ను గురించి నేను గొప్పగా చెపుతుంటాను పకోడీ.
ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలుపిండివంటలెల్లను హా! నీ
ముందర దిగదుడుపునకవి
యందును సందియము కలుగదరయ పకోడీ!
పరమాన్నము, రకరకాల పిండివంటలు ఎందుకు? నీ ముందు అవన్నీ నిస్సందేహంగా దిగదుడుపే. వాటికన్నా నీవే గొప్ప పకోడీ.
ఆరామానుజు డాగతి
పోరునమూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడుగాక య
య్యారే నిను గొనిన బ్రతుకడటనె పకోడీ!
లక్ష్మణుడు మూర్చపోయినపుడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చాడు గానీ నిన్ను తీసుకపోయి వుంటే బ్రతుకడంటావా పకోడీ!
పురహరుడు నిన్ను దినునెడ
కరుగదె యొక నన్నెనలుపు గళమున మరిచం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు యుండగలదె పకోడీ!
పరమేశ్వరుడు నిన్ను తినివుంటే ఆయన కంఠంలోని నలుపు పోయేది కదా! అలాగె చందురుడు నిన్ను తిని వుంటే ఆయనపై వున్న మచ్చలు ఇన్నాళ్లు వుండేవా పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరుమును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడివల దాబదులు గప
కోడిందిను మనుచు జెప్పెకూర్మి పకోడీ!!
పూర్వము బ్రాహ్మణులు కోడిని తినేటందుకు అనుమతించమని బ్రహ్మను వేడుకోగా మీకు కోడి వద్దుగాని దాని బదులు పకోడీ తినమని చెప్పాడట. ఆ విధంగా వచ్చిందే " పకోడీ" మనకు అంటున్నారు చిలకమర్తివారు హాస్యానికి..
17 వ్యాఖ్యలు:
hmm jyothi garu manchi pakodilu tinipincharu. mee puttina rojuki emem chesaru?
బాగున్నాయి జ్యోతి పకోడీలు వాటి మీద పద్యాలూనూ. మాకు పెట్టకుండా తినేస్తున్నా, ఫోటో.. పద్యాలు పెట్టావు గాన క్షమించేశేము పో పోయి పకోడి తిని బతుకు ;-)
హేమలతగారు,
మీకు తెలీదేమో స్పెషల్ రోజులలో నేను అస్సలు స్పెషల్ చేయను. :)
భావన,
పకోడీలు తింటూ, పకోడీ పద్యాలు చదివా. తరవాత వేడి కాఫీ తాగుతూ టపా రాస్తూ ఒక్కదాన్నే పండగ చేసుకున్నాగా. ఆహా! ఏమి నా భాగ్యము..
పకోడీ అలా నోరూరిస్తూ మీరొక్కరే తింటున్నారా ? కానీయండి మేమేమిచేయగలం ? పద్యాలు చదువుకొని తృప్తి పడతాము లెండి .
జ్యోతీగారూ,
ఇంతకీ మీరు పకోడీలు తింటూ పద్యాన్ని ఎంజాయ్ చేసారా... లేక పద్యం చదువుతూ పకోడీని ఎంజాయ్ చేసారా..
నాకు తెలియాలి...హహహహ్
జ్యోతి గారూ ! మీరు రుచికరమైన వంటలని అందమైన ఫొటోలతో పరిచయం చెయ్యడమే కాక, అందమైన చాటు పద్యాలను కూడ అందించడం ఎంతో ముదావహం...
పకోడీల మీద నేనెరిగిన మరో చాటు పద్యం చెప్పనాండీ ?
శనగపిండి, ఉల్లిపాయ,చిన్ని మిరప కాయలున్
జునిపి, అందు అల్లమంత దొనిపి ముద్దఁజేసినన్
అనలతప్తమైన నేతియందు వైచి, వేచినన్
జను, పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమౌ !!
మీరందించినంత పద్యాలలో ఉన్నంత చమత్కారం యీ పద్యంలో లేక పోయినా, మన సాహిత్యంలో యీ చాటు పద్యం కూడా ప్రసిద్ధమే ! ...
మీ బ్లాగెంతో రుచిరం ! అభినందనలు ...
లలితగారండి.. నేను రెండూ చేస్తూ పండగ చేసుకున్నానుగా..
జోగారావుగారు,
ఈ పద్యం నేను ఎప్పుడో వాడుకున్నానుగా. ఈ వ్యాసంలో
చూడగ ముచ్చటఁ గొలుపు ప
కోడీ!జ్యోతక్క మహిమఁ గొనఁ జాలముగా!
వేడిగ నామెయె తినగా
జాడగ కనిపింతు "చిత్ర జాలము" నందున్.
ఆహా ఎంత కమ్మని పద్యాలు.
పద్యాలు వ్రాయటంకన్నా,
పకోడీలు వండటం తేలిక.
ఇక వంట మొదలు పెట్టాలి.
>>వేడి వేడి పకోడి ముందుంటే కనబడవు కానీయండి,
వనితల పలుకుల యందున
నమిషలోకమున నున్నదమృతమటంచున్
జనులనుటెగాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
>>రెండవ పాదం లో యతి చెల్లటం లేదండి..
భవదీయుడు
ఊకదంపుడు
అవును సుమండీ. ఈ పద్యం మీ బ్లాగు రచనలో లోగడ ఉంది.మళ్ళీ చూసాను.
ఫోటో చూస్తూ పద్యాలు చదువుతూ పండగ చేసుకున్నానండి(అహ నా పెళ్ళంట! సినిమాలో కోటా లాగ)ప్చ్..ప్చ్:)
@ఊ.దం. గారు,
మీరు యతిని చూస్తూ ప్రాస గమనించలేదు. అది కూడా చెల్లదు. నేననుకోవడం అది 'అనిమిషలోకమున...' అని ఉండాలి. అప్పుడు యతి, ప్రాస, అర్థమూ అన్నీ సరిపోతాయి.
ఊ.దం. గారూ, చంద్రమోహన్ గారూ, యిద్దరూ యతి ప్రాసల గురించి సరిగానే చూసారు.
టైపింగ్ లో చిన్న పొరపాటు దొర్లడం వల్ల అలా జరిగింది ...
ప్రమాదో ధీమతామపి కదా ?
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున ... .... ... అని ఉండాలి.
యతి పేరు అఖండ యతి. చంద్ర మోహన్ గారు సరిగ్గానే చెప్పారు.
అనిమిషులంటే రెప్ప పాటు లేని వారు ...కను రెప్పలు వేయని వారు (ఈ వివరణ తెలీని పాఠకుల కోసం)
ఊ.దం గారు,
నిజమేనండి. ని ఎలా ఎగిరిపోయిందో చూసుకోలేదు. సరిచేసాను.
జాలంలో తిరుగుతుంటే ఈ బజ్జీ పద్యం దొరికింది..
“ఐదు గంటల వేళ ఆదారి వ్రెక్కగా చుయ్యుమనును, గూబ గుయ్యుమనును
పచ్చి మిరప కాయ, కచ్చి రేపెడియట్లు గుచ్చి చూచుచునుండు గుండెవైపు
శనగ కవచనూనె సలసలా వేగుచో, కడుపులో రసనాడి కదలసాగు
ముక్కకొరికినంత ముల్లోకములయాత్ర చేతకాసులు లేక చేయగలడు
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగజేయు మిరప బజ్జీల రుచిని నే మరువలేను
ఒక్కటో, రెండు మంచిది, ఎక్కువైనా సచినుటెండూల్కరుడు మాకు సాటిరాడు”
మీ,అదేనండి,చిలకమర్తి వారి పకోడీలు రుచి చూపించినందుకు
ధన్యవాదాలు.
*****సురేఖ
Post a Comment