Monday, 8 March 2010

మరు జన్మంటూ ఉంటే !!


 
   మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


అసలు ఇలా మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలా? అని అనుకుంటే?  అవసరమూ లేదు. దానివల్ల ఒరిగేదేమీ లేదు.. కాని   ప్రతి మహిళ ఇల్లు , పిల్లలు, కుటుంబం అనుకోకుండా తీరిగ్గా తన గురించి తాను ఆలోచించాలి. అలాగే సమాజంలో ఉన్న ఇతర మహిళలు, వాళ్లు చేసే కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. వారి పోరాట పటిమని గుర్తించి స్ఫూర్తి చెందాలి అని నా అభిప్రాయం. ఈ క్రమంలోనే నాలో చెలరేగిన కొన్ని ఆలోచనలు.


సృష్టిరచనలో, నిర్వహణలో స్త్రీ, పురుషుడు.... ఇద్దరి బాధ్యత సమానంగా ఉంటుంది. వీరిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. కాని తరతరాలుగా పితృస్వామ్య సమాజమే కొనసాగుతుంది. స్త్రీ ఎంత విద్యావంతురాలైనా, ధైర్యవంతురాలైనా ఆమెని ఎప్పటికప్పుడు అణగదొక్కాలనే చూస్తారు. తమని దాటిపోతే తమని లెక్కచెయదేమో అనే అహంభావం. అందుకే మగవాళ్లకంటే ఆడవారు ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉండాలి , తాము చెప్పినట్టు వినాలి , చెప్పింది నోరు మూసుకుని పాటించాలి అని సమాజమే నిర్ణయించేసింది.


పెళ్లికాకముందు ప్రతి ఆడపిల్లా ఏ చీకు చింతా లేకుండా పెరుగుతుంది. కాని పెళ్లి కాగానే ఆమే జీవితమే మారిపోతుంది. తనకోసం కాకుండా తన కుటుంబం, భర్త పిల్లల కోసం ఆలోచిస్తుంది. మగవాళ్ళు పెళ్ళి కాకముందు ఏ బాదరబందీ, ఆంక్షలు లేకుండా పెరుగుతారు, తిరుగుతారు. అందుకే పెళ్ళి కాగానే తమ స్వాతంత్ర్యం కోల్పోయామని ఫీలవుతారు. కాని ఆడపిల్లలకు అసలు స్వాతంత్ర్యమే ఉండదు.  పెళ్ళి  కాక ముందు తల్లితండ్రులు, పెళ్ళి అయ్యాక భర్త, వృదాప్యంలో పిల్లలు చెప్పినట్టు ఉండాల్సివస్తుంది. ఐనా వాళ్ళు అది సంతోషంగా నిర్వహిస్తారు. స్త్రీ జీవితంలో కూతురిగా, భార్యగా, తల్లిగా, అత్తగా ఇలా ఎన్నోపాత్రలు నిర్వహించాల్సి వస్తుంది. అటు పుట్టింటివారిని, అత్తింటివారిని మెప్పిస్తూఎవ్వరితోను మాటపడకుండా,తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది స్త్రీ.


ఒకప్పుడు స్త్రీకి చాకలి పద్దులు రాసేటంత చదువు వస్తే చాలు అనేవారు. కాని క్రమక్రమంగా ఎన్నో మార్పులు జరిగాయి,, జరుగుతున్నాయి. స్త్రీలు, పురుషులు, వీరందరితో కూడిన సమాజం కూడా మారింది. స్త్రీకి చదువు , ఉద్యోగం తప్పకుండా ఉండాల్సిందే, తన కాళ్ల మీద తాను నిలబడాలి, ఎవ్వరి మీదా ఆధారపడకూడదు అని ప్రతి తండ్రి తన కూతురిని, కొడుకులతో సమానంగా చదివిస్తున్నాడు. వంటింటికే పరిమితమైన ఇల్లాలిని భర్త ప్రోత్సహించి ఉద్యోగం చేయనిస్తున్నాడు. అదీ కాక కుటుంబ నిర్వహణకు, పిల్లల చదువుల కోసం భార్య కూడా ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం చేయడం తప్పనిసరైపోయింది.  తమకు అధిక శ్రమ ఐనా మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు ప్రతి రంగంలో తమ ప్రతిభని కనబరుస్తున్నారు.


స్త్రీ ఎన్నటికి అబల కాదు. ఆమెలో కూడా అనంతమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించి వెలికితీయాలి. అది అంత కష్టమేమి కాదు. ఈరోజు ఎందరో మహిళలు ఉన్నతపదవులు అలంకరించడంలోను , వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో వారికి స్ఫూర్తి, ప్రోత్సాహం ఎవరిస్తున్నారు?  అని ఆలోచిస్తే ముందుగా ఆమెను ప్రోత్సహించి ముందుకు నడిపించేది భర్త, స్నేహితులు.. దానికి తోడుగా ఆమెలోని సంకల్పం, ఆత్మస్థైర్యం తప్పనిసరిగా ఉంటుంది. ఈనాడు మహిళలు రాణించని రంగం ఏదైనా ఉందా?. ఉద్యమాలైనా, రాజకీయాలైనా, పరిపాలనా బాధ్యతలైనా, అద్యాపక వృత్తి ఐనా, డాక్టరైనా, గాయని ఐనా, పోలీసైనా, మిలటరీ ఐనా  సరే తాను కూడా చేయగలను అని ముందుకొస్తుంది మహిళ.   ఉద్యోగాలు చేయకున్నా ఎందరో మహిళలు ఇంటినుండే తమకు తెలిసిన స్వయం ఉపాధి పధకాలు ప్రారంభిస్తున్నారు. మేమున్నది వంట చేయడానికి, ఇల్లు సర్దుకోవడానికి మాత్రమే కాదు. కుటుంబ నిర్వహణలో  భర్తకు  చేదోడువాదోడుగా నిలుస్తుంది.


నేను ఎప్పుడూ ఆడవారినే సమర్ధిస్తాను. వారి కష్టాలు మాత్రమే చెప్తూ మగవారినందరినీ ఒక గాటన కట్టి విమర్శిస్తాను . ఆడవారి కష్టాలకు కారణం మగాడు మాత్రమే అని చెప్తాను అని చాలా మంది అనుకుంటున్నారు కదా.. కాని నేను మగవారిని విమర్శించేది., తప్పులు ఎత్తి చూపేది ఆయా సంఘటనలను బట్టి మాత్రమే . ఆయా పరిస్థితుల్లో మగవాడిది తప్పు అంటాను తప్ప మగవాళ్లందరూ చెడ్డవాళ్లు అని నా ఉద్ధేశ్యం ఎప్పటికీ కాదు. పైగా ఒక మహిళ మరో మగాడి గురించి, మగవాళ్ల గురించి ప్రశంసిస్తూ రాస్తే దాన్ని నీచంగా వ్యాఖ్యానించేవాళ్లు ఎందరో ఉన్నారు ఈ బ్లాగ్లోకంలో...


అందుకే నా ఈ జీవనప్రయాణంలో నన్ను ప్రోత్సహించినవారిగురించి ఈరోజు గుర్తు చేసుకుని వారందరికీ మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


ముందుగా నన్ను ఇంట్లోనే కూర్చోపెట్టకుండా ప్రతీ పనిలో తనతో తీసికెళ్లి ఏ పని ఎలా చేయాలి? ఏలా తెలుసుకోవాలి? అని నేర్పించింది మావారే. నేను ఇప్పుడు ఇలా సొంతంగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నాను. మిగతావారికి చెప్పగలుగుతున్నాను అంటే ఆయన నాకు నేర్పిన మంత్రం " రాదు అంటే ఏది రాదు. ప్రతి దానికి ఏదో ఒక సమాధానం, పరిష్కారం ఉంటుంది. శోధన చేయి. తెలుసుకో. అదే వస్తుంది. అర్ధమవుతుంది "  అనేవారు.  ఇక ఈ బ్లాగ్లోకంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించివారు తోటి బ్లాగర్లే. వారందరూ మగవారే. సాంకేతికమైనా, టపాల రచనలోనైనా, ఎప్పుడు ఏ సందేహమొచ్చినా, సమస్య వచ్చినా నాకు ధైర్యం చెప్పి, ముందుకు నడిపించారు. నా ప్రతి సంతోష సమయంలో  వారికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాను. కాని అపార్ధం చఏసుకున్నవాళ్లు మాత్రం ఆడవాళ్లే.  ఆడవాళ్లే ఆడవాళ్లను అర్ధం చేసుకుంటారు అనుకునేదాన్ని ఇంతవరకు. కాని ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు  అవుతారని ఈ బ్లాగ్లోకంలోనే నెత్తి మీద గంటతో కొట్టినట్టుగా అర్ధమైంది. కాని వారి మీద నాకు ద్వేషం మాత్రం లేదు. అంతా మాయ..


అందుకే స్త్రీకి  ఎన్నో కష్టాలున్నా, సమస్యలున్నా మరో జన్మంటూ ఉంటే నాకు ఇలాగే ఒక ఆడపిల్లగా మాత్రమే పుట్టాలనిఉంది. అందులో జ్యోతిలానే. ఇలాగే ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. స్త్రీ అంటే ప్రకృతి, రంగులు, సౌందర్యం, అందం మాత్రమే కాదు స్త్రీ అంటే బాధ్యత, కష్టం, దుఖం, సహనం, ఓర్పు, క్షమాగుణం కూడా..


గమనిక : ఈ మధ్య నా టపాల వల్ల ఎంతో మంది  మనోభావాలు దెబ్బ తింటున్నాయి, ఆవేశం పెంచుకుంటున్నారు అని అర్ధమైంది. అసలు నేను ఏ టపా రాసినా అది నా వ్యక్తిగత అనుభవంతో  ఎంతో మందితో చర్చించి రాసినవే. ఊరికే పుస్తకాలు చదివి, సినిమాలు చూసి రాసిన టపాలు కావు. ఇది గమనించ ప్రార్ధన.. 
                        

18 వ్యాఖ్యలు:

మిస్టర్ యక్ష

మహిళామతల్లులందరికీ మహిళా దినోత్సవ శుభకాంక్షలు.
ఇలా సెన్సిబుల్ గా రాస్తే మీమనోభావాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేగాని, మీరు ఒక్కొక్క సారి ఆవేశంతో కర్తవ్యంలో విజయశాంతి లాగ తిరగబడతారు. మగజాతిని మటాష్ చెయ్యలంటారు. అప్పుడుమాత్రమే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. మీ అనుభవం కరక్టే! కానీ కాస్త మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న మైండ్ సెట్ ని కూడా చూడండి. ఈ కాలపు మగవాడు, మరీ అంత విలన్ లాగాలేడు. ఒకపక్క మీరే అత్తిల్లు పుట్టిల్లు మెప్పించాలి అని, వంటింటికే జీవితం పరిమితం అని తక్కువ చేసుకుంటారు, మరోపక్క స్త్రీ అబలకాదంటున్నారు. మార్పు రావలసింది తిరగబడటంలో కాదు, అలోచనా విధానంలో అని నా వుద్దేశ్యం.

సుభద్ర

జ్యోతిగారు,
మహిళదినోత్సవ శుభాకా౦క్షలు..
బాగా రాశారు...మూడు ఐదు పేరాలు మీరు రాసి౦ది అక్షర సత్యాలు..
నాకు అనిపిస్తు౦ది ఆడవారి వల్లననే అపార్దలు వస్తాయని..
అ౦దుకే ము౦దు గా మనలోనే మార్పురావాలి..
ఆలోచి౦చి అర్ద౦ చేసుకు౦టే స్త్రీ అ౦త అద్బుత౦ మరేది లేదు ..
మీరు రాసి౦ది ఎవరిమనోబావాలు దెబ్బతీసేలా లేవు..

SRRao

జ్యోతి గారూ !
ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడా, మగా విచక్షణ కంటే అన్యాయం ఎవరివైపునుంచి జరిగినా ఖండిం చాల్సిందే ! తప్పులకు, ఒప్పులకు ఆ తేడాలేదు. ఆడా మగా ప్రాథమికంగా అందరూ మనుష్యులే ! ఎవరి బాధ్యతా వారిది. ముందుగా మనందరి బుర్రల్లోంచి ఆ భావన పోవాలి. కానీ నా దృష్టిలో భరించేవాడు భర్త అంటే పురుషుడు కాదు, స్త్రీ ... అంటే తల్లి, భార్య. మీ వివరణ బావుంది.

Anonymous

ఇలా ప్రతిదానికి మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళ మెదళ్ళు మాత్రం ఎన్నాళ్ళు వుంటాయి? చిన్నమెదళ్ళు చితికి , ఏ పెట్రోలో పోసుకుని ఒళ్ళు తగలెట్టేసుకుంటారు. శవయాత్రలు జరిగిపోతాయ్. :) అంతేగా!

జ్యోతి

యక్షగారు,
విజయశాంతి సొంతంగా డైలాగులు చెప్పదు కదా. అవును ఒక్కోసారి ఆవేశంతో రాస్తాను. కాని అవి ప్రత్యక్షంగా చూసాను కాబట్టి అలా రాస్తాను . అలా అని అందరు మగాళ్లు అలాటివారే అని అనలేదే.. అనుభవం కానివారికి కోపం వస్తుంది. దానికి నాదా తప్పు. మీరన్నది నిజమే. ఆడవాళ్లే తమ ఆలోచనావిధానాన్ని మార్చుకోవాలి. తిలక్ చెప్పినట్టు అలసి జీవితంలో సొలసి సుషుప్తి చెందారు, అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు. ఆ సుషుప్తినుండి బయటకు రావాలంటే వాళ్లే ప్రయత్నించాలి. ఇదే మాట నేను ఎంతోమందికి చెప్పాను. వింటేగా. నన్నో పిచ్చిదానిలా చూసారు. ప్చ్..

రావుగారు,
ధన్యవాదాలు..

Indian Minerva

ముందు అమ్మాయిలు కూడా కొంచెం mindset లు మార్చుకోవాలి. అందరూ అని కాదుగానీ నేనభిమానించిన చాలా మంది ఈ విషయంలో నన్ను విపరీతమైన నిరాశకు గురిచేశారు. పెళ్ళి కాగానే క్లాసు ఫస్టులూ, అప్పటిదాకా ఆయా రంగాల్లో బాగా రాణిస్తూన్నవారూ ఒక్కసారిగా ఇంటికి పరిమితమై పోయారు. పైపెచ్చు అదేదో జీవితమే ధన్యమై పోయినట్లు ఫీలవ్వడం దానికి పరాకాష్ట.

పరిమళం

జ్యోతిగారు,
మహిళదినోత్సవ శుభాకా౦క్షలు..కాలక్రమంలో చాలా మార్పులు వచ్చిన ఇంకా కొన్నిచోట్ల వివక్ష ఉంటూనే ఉంది.ఐతే స్త్రీ సున్నిత మనస్కురాలు కనుక తట్టుకొని నిలబడలేకపోతోంది బ్లాగుల్లో ఐనా బయటైనా స్త్రీకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు స్పందించేది స్త్రీలు మాత్రమే కాదు ...మీరన్నట్టు వారికి సదా కృతజ్ఞులమై ఉండాలి .చాలా బాగా చెప్పారు జ్యోతిగారు !

psm.lakshmi

స్త్రీ పురుషులమధ్య పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరిసినప్పుడే సంసార రధం సునాయాసంగా సాగుతుంది. లేకపోతే రెండెడ్లబండిని మోయలేని బరువుతో ఒంటెద్దుతో లాగినట్లుంటుంది.
psmlakshmi

శ్రీలలిత

జ్యోతిగారూ,
జరుగుతున్న విషయాలని బాగా విశ్లేషించారు..

కొత్త పాళీ

"అందుకే స్త్రీకి ఎన్నో కష్టాలున్నా, సమస్యలున్నా మరో జన్మంటూ ఉంటే నాకు ఇలాగే ఒక ఆడపిల్లగా మాత్రమే పుట్టాలనిఉంది."

Interesting.
కొకు రచనల్లో ఆడపుటకే మధురం అని ఒక గల్పిక ఉంది. ఆధునిక భారతీయ సమాజంలో స్త్రీ స్థానం ఏంటో ఒక ఏడెనిమిదేళ్ళ వయసున్న పాప గొంతులో చెబుతాడు. అద్భుతంగా ఉంటుంది.

జయ

జ్యోతి గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడవాళ్ళు ఎన్ని భవసాగరాలైనా ఈదేయగలరు. All the best.

తార

అవును, అమ్మాయిల అలోచనా విదానం మారాలి. కాని, ఎక్కువసార్లు (99 శాతం) విధి లేని పరిస్థితుల్లోనే స్త్రీలు ఆ విషవలయం చేదించుకోని బయటకి రాలేకపోతున్నారు. పిల్లలొ, ఆర్ధిక సమస్యలో, ఇంకా ఇలాంటివి ఎవో యొన్నో, ఎవరకి మాత్రం మొగుడి చెతుల్లొ తన్నులు తినాలి అని వుంటుంది? ఈ అసహాయతని ఆసరాగా తీసుకొని వేధింపులు ఎక్కువ చేస్తారు, రెచ్చిపోతారు.
బయట ఉద్యోగవకాశాలు, ఆర్ధిక వ్యవస్థ ధనవంతం ఐతే, బయటకి వచ్చి స్వేచ్చగా బతకగలరు.
పెళ్ళే జీవిత పరమావధి అనుకున్నే ఆడపిల్లలు ఎంత మంది వుంటారో, సరి సమాన సంఖ్యలో మగపిల్లలు వుంటారు.

పెళ్ళాన్ని (భార్య - పెళ్ళామ, ఏది వాడాలి అని గిడుగు గారి సలహా పాటించాను) చెప్పు చెత్తల్లొ పెట్టుకోవాలి అనుకోవటం ఎంత తప్పో, మొగుడ్ని చెప్పు చెత్తల్లొ పెట్టుకోని, అత్తగారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అనుకోవటం కూడ చాలా పెద్ద తప్పు, ఈ ఒరవడి ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నది.

మధురవాణి

జ్యోతి గారూ,
బాగా చెప్పారు. చాలా బాలెన్స్ డ్ గా.! మీరన్నది నిజమే! ఎన్నో గొప్ప విజయాల్ని సాధించిన మహిళల వెనుక వాళ్ళ తండ్రులో అన్నయ్యలో, తమ్ముల్లో, భర్తలో అందించే ప్రోత్సాహం ఎంతో!!

జ్యోతి

ఇప్పటికీ ఎన్నో చోట్ల ఆడవారిపట్ల వివక్ష చూపుతున్నారు. మారాలి మనుష్యులు మారాలి.

కొత్తపాళీగారు,

ఈ మాట మూడేళ్ల క్రింద చెప్పేదాన్ని కాదేమో. నా చుట్టూ ఉన్న సమాజం అలాగే ఉంది కాని నేనే మారాను. నా ఆలోచనావిధానం మారింది. అంతే..

tara గారు,
ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడుంటున్నాయండి??

తారక

జ్యోతిగారు, తల్లితండ్రులతో కలిసి వుండటం ఉమ్మడి కుటుంబం అనుకునే పరిస్థితికి వచ్చామా చివరకి?

మాలా కుమార్

మహిళా దినోత్సవాలూ , మహిళలకు రిజర్వేషన్స్ అని అడుక్కోవాలా ? ప్రత్యేకత దేనికి ? అవి ఇవ్వాల్సింది ఎవరు ? మహిళలూ - మహరాణులు . ఎవరినీ అడుక్కోవలసిన పని లేదు . తలెత్తుకు తిరగండి . తెలివి తేటల తో , ధైర్యం తో దేనినైనా సాధించండి . పదండి ముందుకు .

ప్రియ

తథాస్థు! :D

Maitri

Jyotigaaru,
I saw yr blog for the first time. I saw other ones about cooking. But this is the first one about emotions, feeelings, misgivings and misunderstandings. I had a totally different opinion about you.I realized that I was totally wrong about you.
You are so very right. I apologize for any earlier comment which might have hurt you in the past.
Keep the good work on.
Wishing you all the best.
Krishnaveni

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008