Saturday, May 8, 2010

భారతీయ విలువలు..

రోజూ మనం ఎన్నో సంఘటనలు చూస్తుంటాం, వింటుంటాం, చదువుతుంటాం. కాని వాటికంత ప్రాముఖ్యత ఇవ్వం. ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు కాబట్టి. దాని గురించి మనకు ఆలోచించే అవసరం , సమయం లేదు కనుక ఆ సంఘటనలను త్వరగానే మర్చిపోతాము. కొన్ని కథలు మనను కదిలిస్తాయి, కొన్ని కలవరపరుస్తాయి మరి కొన్ని ఆలోచింపచేసి మనం మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తాయి. అటువంటి కథ ఒకటి కొంత కాలం క్రింద చదవడం జరిగింది. అది చదివి చాలా కాలమైనా ఆ సమయంలో ఆ కథలో చెప్పిన విషయం కాని సంఘటనలు కాని నాకు ఎదురు కాలేదు. అందుకే అంతగా పట్టించుకోలేదు. కాలక్రమేనా ఎదురైన సంఘటనలు మళ్లీ ఆ కథను గుర్తు చేసుకోమన్నాయి. అది కొత్తపాళీగారు రాసిన Indian Values. మీరు చదివేసి రండి. నా అనుభవం , అభిప్రాయం చెప్తాను.అమ్మాయ్! ఏంటలా మగరాయుడిలా తిరుగుతావ్? కాస్త నిదానంగా, ఒద్దికగా ఉండడం నేర్చుకో. చూసినవాళ్లు ఏమంటారు? ఆడపిల్లలంటే ఎలా ఉంఢాలి.. భారతీయ మహిళవి ఇలాగేనా ఉండేది. అమ్మాయిలంటే ఒదిగి , ఎదురు మాట్లాడకుండా ఉండాలి. పదిమందిలో గట్టిగా నవ్వరాదు. పెద్దవాళ్ల ముందు గొంతు పెంచి మాట్లాడరాదు. తెలిసిందా? లేదంటే కన్నవాళ్లని అంటారు?మీ పిల్లకు ఏం నేర్పించారు? అని. ఈ మాటలు దాదాపు ప్రతీ ఆడపిల్లకు చిన్నప్పటినుండి నూరిపోస్తున్న మాటలు.. అమాయకంగా, హద్దులు ఎరుగక ఆడుతూ పాడుతూ ఉన్న అమ్మాయికి ఎప్పటికప్పుడు అడ్డగిస్తూ ఉంటారు. ఈ హద్దులు, విలువలూ అంటూ స్త్రీని జీవితాంతం ఒక అదృశ్య చట్రంలో బంధించాలని చూస్తుంది ఈ సమాజం.కాని మహిళా చైతన్యం కొత్త మలుపులు తిరుగుతుంది. వివిధ రంగాలలో మగవారితో సమంగా పోటీ పడుతూ అభివృద్ధిపధం వైపు దూసుకెళ్తున్నారు. ఈ వికాసక్రమంలో స్త్రీలు ప్రశ్నించడం , నిర్ధిష్టంగా వ్యవహరించడం నేర్చుకున్నారు. ఈ అనూహ్యమైన మార్పు చదువుకున్న మహిళలలోనే కాక గ్రామీణ మహిళలలో కూడా స్పష్టంగా కానవస్తుంది. కాని కొన్ని విషయాల్లో మాత్రం మార్పు ఇంకా రాలేదు అనిపిస్తుంది. అభివృద్ధి, స్వేచ్చ, మార్పు మహిళను ఉన్నతురాలిగా చేసినా కొన్ని విషయాల్లో ఆమెని స్త్రీగా భారతీయ విలువలు , మోరల్ వాల్యూస్ అంటూ ఆంక్షలు పెడుతుంది సమాజం. విద్య, ఉద్యోగ రీత్యా మహిళలు మగవారితో కలిసి పని చెయాల్సి వస్తుంది. వారితో స్నేహంగా ఉండక తప్పదు. ఆ మగవారిలో కూడా ఎటువంటి దురుద్ధేశ్యాలు ఉండవు. తోటీ విద్యార్థినిగా, సహోద్యిగిగా ఆ స్త్రీకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కాని కొందరు ప్రబుద్ధులు, ప్రబుద్ధురాళ్లు మాత్రం ఇది ఆమె విచ్చలవిడితనంగా భావిస్తారు. ఒక మగవాడితో కాస్త చనువుగా, నవ్వుతూ మాట్లాడిందీ అంటే చాలు దానికి చిలువలు పలువలుగా కథలు అల్లుతారు. ఎవరెవరితో తిరుగుతుందో అని వాళ్లకు వాళ్లే ఊహించేసుకుంటారు. ఈ మాటలు అబ్బాయిలకు ఉండవండి మరి.. అదృష్టవంతులు ....ఈనాడు చదువుకున్న ప్రతీ అమ్మాయి ఉద్యోగం చేస్తానంటుంది. లేదా విదేశాలకెళ్లి పై చదువులు చదువుతా అంటుంది. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నన్ను కలిచివేసింది. ఎంత చదివినా, ఎంత కష్టపడినా సమాజం మారదు. కొందరు మనుష్యులు అస్సలు మారరు అనుకున్నా. బాగా చదువుకున్న ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది.. అబ్బాయి కూడా అమెరికాలొ చదువుకుని వచ్చాడు. ఆస్థిపరులే. కట్నకానుకల బేరం కుదిరింది. కాని అమ్మాయికి డాక్టర్ తో టెస్టులు చేయించాలి అన్నారు. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మాది గౌరవమైన కుటుంబం. అందుకే తప్పదు అంటారు ఆ అబ్బాయి తల్లి . డాక్టరైన అక్క.. ఇది ఆ అమ్మాయికి ఎంత అవమానం. ఎవరో తెలీనివారికోసం తన శీలపరిక్ష చేసుకోవాలా?? పెళ్లయ్యాక ఇలాగే ఎప్పటికప్పుడు పరీక్షకు సిద్ధపడాలా?? .. అంతే వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. నేనైతే పదిమందిలో ఆ అబ్బాయికి కూడా డాక్టరు పరీక్షలు చేయించమనేదాన్ని. ఎయిడ్స్ లాంటివి లేవని నమ్మకమేంటి అని.. అంత కోపమొచ్చింది.. ఇలాంటి ఆలోచనలున్న అబ్బాయిలు, తల్లితండ్రులు ఉన్నారు ఈ సమాజంలో.. ఉద్యోగినులైన స్త్రీలకు కూడా ఈ తరహా వేదింపులు తప్పడం లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలైనప్పుడు పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు టంచనుగా ఇంటికి రావాలి. భర్త, పిల్లలను, అత్తామామలను చూసుకోవాలి. లేట్ ఐతే ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎవడితో తిరుగుతుందో అంటారు.. ఇది నిజం..ఇంతకీ భారతీయ విలువలు అంటే ఏంటి?? ఎవరైనా కాస్త చెప్తారా?? ఈ విలువలు అమ్మాయిలకేనా? అబ్బాయిలకు కూడా ఉన్నాయా? (కుమారీ శతకంలో భర్త చనిపోతే భార్య కూడా సర్వం త్యాగం చేసి అతనితో పాటు సతీ సహగమనం చేయాలని ఉంది. మరి అతనివల్ల పుట్టిన పిల్లల గతి ఏంటీ?? వాళ్లనేం చేయాలి చెప్పలేదు. కుమార శతకంలో మాత్రం ఇలాంటి విషయాలు చెప్పలేదు మరి..)) ఈ విలువలను నిర్దేశించింది ఎవరూ? ఎందుకు?? నిజంగా నాకు తెలీదు.. అమ్మాయిలెప్పుడు నిండా కొంగు ముసుగేసుకుని, బుర్ఖా వేసుకుని ఉండాలా?? అలాంటప్పుడు అసలు ఆడపుట్టుకే ఎందుకంట??

24 వ్యాఖ్యలు:

Giri Dornala

భారతీయ విలువలు అంటే: తాము పాటించకుండా ఎదుటివారు మాత్రం తప్పక పాటించాల్సినవిగా అందరూ కోరుకునేవి.

Unknown

jyothi garu...

chala nijam meeru cheppinavi..
ii madya chala sangatanalu vintunna nenu.. :(...bayam vestondi asalu...
abbailaki emi rules undava??idi eppatiki oka prasna gane migilipotundemo.. :(..

Siva

Good example of how we tend to take things in wrong direction and complicate....

1. If we take "Indian Values" that are under discussion, to be related to morality etc, then they equally apply to every one - men & woman
2.A friendly woman need not be assumed to be against these. These are totally different
3.But the "Neeraja" character potrayed in the story don't seems to be just friendly...kissing, hugging etc. Well, any one could say that these are also just friendly gestures! There is a simple thing to differentiate: Just check if the same act could be done with a third peron in presence of spouse and parents. If you can do it, it's a friendly gesture. I don't think that hugging and kissing can be termed as friendly gestures

BTW, what if Krishna Prasad said he was also a virgin, and "hence" expecting his wife also to be one?

Kathi Mahesh Kumar

ఉత్తమమైన భారతీయ విలువ హిపొక్రెట్ గా బ్రతకడం.

Anonymous

భారతీయ విలువలైనా మరే విలువలైనా అప్పటి పరిస్థితులను బట్టి, వారికున్న అవగాహణను బట్టి ఏర్పడినవే. అంతే కాదు, అప్పుడైనా ఇప్పుడైనా జనులు ఆ విలువలను తమకు ఆపాదించుకోవడమో, ఆచరించడమో చేసినవి ఉన్నాయి లేదా తుంగలో తొక్కినవి ఉన్నాయి.

భారతీయ విలువలను ప్రశ్నించే స్త్రీలు, వాటివల్ల తమకు లాభము చేకూరుతుందనో లేక అవి తమకు ఇప్పుడు అవసరమనో భావిస్తే భారతీయ విలువల గురించి లెక్చర్లివ్వడం మనందరికీ తెలుసు. ఉదాహరణకు, స్త్రీలను గౌరవించడం వారికి కొన్ని ప్రత్యేక వసతులు కల్పించడం లాంటివి. ఇక మగవారు విషయానికి వస్తే వారికి భారతీయ విలువలు ఆడవారు కొన్ని డ్రస్సులు వేసుకున్నప్పుడు, వారు కూడా మగవాడిలాగా తాగినప్పుడో గుర్తుకు వస్తాయి. అంతే కానీ, తాము ఒక అమ్మాయిపట్ల వివక్ష చూపించినప్పుడు, వారిని అనవసరంగా ఇబ్బంది పెట్టినప్పుడు గుర్తుకు రావు.

మొత్తానికి తప్పు భారతీయ విలువలలో కాదేమో, వాటిని మనకు అవసరమైనప్పుడో లేక మనకు ఉపయోగ పడతాయనుకున్నప్పుడొ మాత్రమే నెత్తికెత్తుకునే మనదే తప్పు అని నాకనిపిస్తోంది.

Rajasekharuni Vijay Sharma

ఏమి నేర్పింది నా భారతదేశం? నన్ను నన్నుగా చూడమంది. నా చుట్టూ ఉన్న ప్రపంచంలో నా ఉనికిని గమనించమంది. ప్రతి చెట్టులో, పుట్టలో, తినే తిండిలో, నీ తోడులో, వాగులో, వంకలో, మాటలో, మంచిలో ఉన్న నన్ను నన్నుగా చూడడం నేర్వమంది. ఆ క్రమంలో దానవత్వం నుండి, మానవత్వం వైపుకు, అటునుండి దైవత్వం వైపుకు పురోగమించే నా శక్తిని వీక్షించమంది.

భారతదేశం ఒక యోగ భూమి. ఇక్కడి నుండి ఆ ప్రకంపనలు ప్రపంచం నలువైపులా విస్తరించి వెలుగును ప్రసాదించాయి. ఇక్కడ ఎందరో మహాపురుషులు తమ జీవితాలను లోకకళ్యాణం కోసం ధారపోసి ఎన్నో యోగ రహస్యాలను మధించి, వాటిని మనకు ఆచరణ యోగ్యంగా ఉండేలా ఓ జీవన విధానం రూపొందించి మనకు ప్రసాదించారు.

అది కాదని దూరపుకొండలు నునుపన్నట్లు మనం పలు ప్రలోభాలతో పాశ్చ్యాత్య సాంప్రదాయంలో పడ్డాము. మన సంస్కృతిలొ మనకు కావల్సింది స్వీకరించి మిగతాది ఆ ఇప్పుడెవరు పాటిస్తాడూ అనేదీ మనమే, రంధ్రాన్వేషణ చేసేదీ మనమే.

" భారతీయ విలువలు అంటే: తాము పాటించకుండా ఎదుటివారు మాత్రం తప్పక పాటించాల్సినవిగా అందరూ కోరుకునేవి. "

ఇలా భావించినంత కాలం భారతీయత అంటే ఏమిటో ఏమి తెలుస్తుంది? నిజంగా తెలుసుకోవాలంటే ఎదుటివారిలో తప్పులను మన్నించి, మంచిని గుర్తించే గుణం మన కలవడాలి. అప్పుడు తెలుస్తుంది మన విలువలు ఎంత గొప్పవో.

ఎవరో కొందరు తమస్వార్థానికి భారతీయతను వాడుకున్నంత మాత్రాన అది భారతీయత అనిపించుకోదు. మీరు,నేనూ మార్చగలిగేది భారతీయత కాదు. రంగు మాత్రమే.

karthik

@రాజశేఖరుని విజయ్ శర్మ
I completely agree with everything you said.. hats off

-Karthik

Kathi Mahesh Kumar

@రాజశేఖరుని విజయ్ శర్మ: చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ చాలా అసంబద్ధమైన వాదన.

విలువలంటే పుస్తకాల్లో ఉండేవి, ఊహల్లోమాత్రమే బ్రతికుండేవి కావు. మనుషులు జీవించే పద్దతి. మీరు చెబుతున్న భారతీయ విలువలు నాకైతే చుట్టుపక్కల కనిపించడం లేదు. మరెందుకీ ఢాంభికాలు.

Rao S Lakkaraju

@మహేష్ కుమార్ గారూ భారతీయ విలువలు మా చుట్టుపట్ల కనపడుతున్నాయి అండీ. మీకు కనపడలేదు అంటే మీ చుట్టూ పక్కలని మార్చాలేమో.

Kathi Mahesh Kumar

అయ్యా లక్కరాజుగారూ,
నాకు చుట్టుపక్కల కనిపిస్తున్నవి భారతీయవిలువల పేరుతో పేరుకుపోయిన పెద్ద హిపోక్రసీ. కొత్తపాళీ గారి కథకన్నా ఘోరమైన పరిస్థితి.

మానవత్వంకన్నా సమానత్వం కోసం పోరాడుతున్న సమూహాలు.దైవత్వం పేరుతో సాటిమనుషుల్ని నిలువునా ముంచుతున్న మతం, మతంపేరుతో మానవత్వాన్ని ఎండగట్టి తిరోగమనం దిశగా పయనిస్తున్న ప్రజలు. యోగభూమి సంగతేమోగానీ కొన్ని వందల యుద్దభూములుమాత్రం ఎక్కడైనా సిద్దంగా ఉండే దేశం మనది.

నేను హైదరాబాద్ లో ఉంటాను. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు తిరిగాను. అన్ని మూలలూ చూశాను. అన్నిరకాల ప్రజలతోనూ గడిపాను. వీళ్ళనందరినీ మార్చాలంటే మొత్తం దేశాన్నే మార్చాలి.

Rajasekharuni Vijay Sharma

@ మహేష్ కుమార్ గారు : ప్రపంచంలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. మంచిని చూస్తారో, చెడుని చూస్తారో అది మీ ఇష్టం.

నిజం చెప్పండి తోటి వారి కష్టాన్ని తమ కష్టంగా భావించే వారు లేరంటారా? ఆడ వారికి రక్షణ లేదంటున్న నేటి లోకంలో వారికి చేయూతనిచ్చే మొగవారు లేరంటారా? పోనీ నేటికీ సంధ్యావందనాదులు చేసే బ్రాహ్మలు లేరంటారా? వారానికో సారైనా గుడికి వెళ్లే వారు లేరంటారా? ఇంటి ముందు అందమైన ముగ్గుని చూసినంతనే పొంగిపోయే హృదయాలు లేవంటారా? తమలోని తప్పును దిద్దుకునే వారు లేరంటారా? మంచి కోసం పరి తపంచే, సత్యాన్వేషణ సాగించే మీ వంటి వారు లేరంటారా?

ఇదే మన భారతీయత. ఇదే మన తల్లి మనకు నేర్పినది. తరువాతి తరానికి నేర్పవలసినది.

రవి

నా వరకూ సమాజం అన్నది ఒక abstract entity. ఇప్పటి సమాజం వరకూ ఇదే నిజం. ఫలానా వ్యవస్థ బావుందనో, బాలేదనో వాపోవడంలో అర్థం లేదు. వ్యక్తివాదం అన్న ఐడియాలజీ మాట్లాడేటప్పుడు, వ్యక్తిపరిధిలో సమస్యలను పరిష్కరించుకోవడం సబబు. (కొత్తపాళీ గారి కథలో నాకు అదే కనిపించింది. Indian values ను ఎండగడుతున్నట్టు నాకు అనిపించలేదు)

నా సమస్యలకు కారణం సమాజం. నా అభ్యున్నతికి మాత్రం నేనే కారణం. ఈ ఆలోచన హాస్యాస్పదం.ఇలాంటి ఒంటెద్దు పోకడలు ఏ సమస్యనూ పరిష్కరించలేవు.

Rajasekharuni Vijay Sharma

నేనొక టపా రాశాను. ఇక్కడి చర్చలకు కాస్త దగ్గరగా ఉంటుంది. వీలైతే చదవండి.

http://rajasekharunivijay.blogspot.com/2010/05/blog-post_10.html

Krishna K

@Ravi,
"నా సమస్యలకు కారణం సమాజం. నా అభ్యున్నతికి మాత్రం నేనే కారణం. ఈ ఆలోచన హాస్యాస్పదం.ఇలాంటి ఒంటెద్దు పోకడలు ఏ సమస్యనూ పరిష్కరించలేవు." well said.

కొసమెరుపు

భారతీయత అంటే భారత దేశంలో మాత్రమే కనిపించేవి, ఇతరత్రా కనిపించనివి.

కుల వ్యవస్థ, సతీ సహగమనం, వితంతు వ్యవస్థ, స్త్రీలపై కట్టుబాట్లు, జోగినీ వ్యవస్థ, పురుషాహంకారం వగైరా. వీటన్నిటికి తోడు పైన ఎవరో చెప్పినట్టు దేశ జనాభాలో అత్యంత మైనారిటీ అయిన ఒక కులం వారిలో కొంతమంది చేసే 'సంధ్యావందనం' కూడా కావచ్చు.

జ్యోతి

క్షమించాలి .. టపాకు సంబంధం లేని వ్యాఖ్యలు ప్రచురించడం లేదు. దయచేసి వ్యక్తిగతంగా ఎద్దేవాలు, వెక్కిరంతలు వద్దు.

karthik

@కొసమెరుపు గారు

నమ్మిన సిద్దాంతాల కోసం జైళ్ళపాలైన స్వాత్యంత్ర సమరయోధులు, పగవానికి తలవంచక సహగమించిన రాణి పద్మిని.. బిడ్డను మోస్తూ యుద్దరంగాన శత్రువుతో తలపడిన ఝాన్సీ లక్ష్మీ బాయి.. అతి సరళమైన పద్దతిలో ఆరోగ్యాన్ని కాపాడే యోగాసనాలను అందించిన పతంజలి మహర్షి ఇంకా ఎందెరెందరో మహానుభావులు కూడా భారతీయతకు గుర్తే!!

సంధ్యావందన్నాన్ని భారతీయత గా గుర్తించినందుకు ధన్యవాదాలు.

-కార్తీక్

కొసమెరుపు

@కార్తీక్

మీరు మళ్ళీ మొదటికోస్తున్నారు. స్వాతంత్ర సమర యోధులు, త్యాగ దనులు ప్రపంచమంతా ఉన్నారండీ. అప్పుడది కేవలం భారతీయత ఎలా అవుతుంది?

Rajasekharuni Vijay Sharma

నాకు ఇద్దరు స్నేహితులున్నారు. వారికి 22, 23 సంవత్సరాలు. ఇద్దరికీ మెన్నటి సవత్సరంలో పెళ్లిళ్లయ్యాయి. వారు న్యాయ శాస్త్రాన్ని చదువుతున్నారు. ఇది కాలేజీ లో చెప్పే న్యాయ శాస్త్రం కాదు. షట్ శాస్త్రాలలో ఒకటి. ఎందుకూ పనికిరాదు నేటి వారి దృష్టిలో. కానీ వారినాన్నగారు డబ్బులకోసం చదివే చదువులు వద్దు. ఏదైనా మనలో ఙ్ఞాన తృష్ణను కలిగించే చదువులు చదవమని వారిని ప్రోత్సహించారు. అలా కాలేజీలలో నేర్పని న్యాయ శాస్త్రాన్ని కంచి వెళ్లి ఓ గురువుగారి వద్ద అభ్యసిస్తున్నారు.

ఈ క్రమంలో మెన్ననే వివాహాలు జరిగాయి. గురువుగారు సూచన మేరకు వారు వివాహానంతర ( first night etc. ) కార్యములు వద్దనుకుని భార్యలకు దూరంగా జీవిస్తున్నారు.

పరాయి స్త్రీని కామంతో మాత్రమే స్వాసించే, ప్రేమించక పోతే యాసిడ్ దాడులు చేసే వ్యక్తులు ప్రపంచానికి అనేకులు తెలుసు. ఎందుకంటే అటువంటి కథలు అనేకం త్వరగా వ్యాప్తి చెందుతాయి. కానీ చదువుకోసం కట్టుకున్న భార్యని కూడా దూరంగా ఉంచగల నిగ్రహం కలిగిన వ్యక్తులు ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే అది మన దేశ సంస్కృతిలో సహజం కనుక. దానిని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఇంకో విషయం ఆ విద్యార్థులు వంటలు ఎక్కువ చేసుకుంటే చదువుకునే సమయం వృధా అవుతుందని మితమైన ఆహారానికే ప్రాధాన్యతనిస్తారు. ఎప్పుడు చూసినా చదువుతునే ఉంటారు.

విద్యార్థులు అన్ని దేశాలలోనూ ఉండ వచ్చు. కానీ విద్యను దైవంగా ఆరాధించే వారు మాత్రం నా దేశ సంస్కృతిలోనే కనిపిస్తుంది.

స్వాతంత్ర్య సమర యోధులు అనేకులు ఉండవచ్చు. కానీ అది ఒక యఙ్ఞంగా భావించి, నిరాయుధుడై ( అహింసే ఆయుధంగా ) పోరాడిన యోధుడు మాత్రం మన దేశమునే కనిపిస్తుంది.

karthik

కొసమెరుపు గారు,
మరి సాంఘిక దురాచారాలు మిగతా దేశాలలో లేవా అది భారతీయత ఎలా అవుతుంది?? సొ చెడు మాత్రం భారతీయత మంచి మాత్రం కాదు.. సూపర్ లాజిక్.. ఒక సారి మీ భుజాన్ని మీరే చరుచుకొండి చెబుతాను.. :D

నేను చెప్పేదేమిటంటే మిగతా ప్రపంచం లో కూడా మనుషులే ఉండేది ;)
కనుక ఈ లక్షణాల నుంచీ తప్పించుకోలేరు..
-కార్తీక్

కొసమెరుపు

రాజశేఖరుని విజయ్ శర్మ గారు,

మీ వాదన విడ్డూరంగా ఉంది. మీరు నిస్వార్థం అనే పైపూతతో భారతీయతను నిర్వచించ జూస్తున్నారు.

మీ స్నేహితులు ఎందుకూ పనికిరాని న్యాయ విద్యను 'నిస్వార్థంగా', 'జ్ఞాన తృష్ణతో' అభ్యసిస్తున్నారు. ఫలానా మనిషి కూడా ఉద్యోగానికి ఎందుకూ పనికిరాని మతపరమైన చదువును మదర్సాలో చదువుతున్నాడు. అయన కూడా విద్యను దైవంగానే చూస్తున్నాడను కోవచ్చు కదా. అది కూడా భారతీయత అంటారా? అయితే ఇలాంటి భారతీయత ఎందుకోసం?

మీ స్నేహితులు తమను ఇష్ట పడిన కన్యలను వివాహం చేసు కొన్నారు. వారి ఇష్టాయిష్టాలతో పని లేకుండా తమ గురువు గారు చెప్పారని వారికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల వివాహిత స్త్రీ న్యాయంగా పొందవలసిన దాంపత్య సుఖాన్ని తృణీకరించి నట్టే కదా? అంత మాత్రానికి పెళ్ళెందుకు చేసుకోవడం? బ్రహ్మచారులు గానే ఉండొచ్చు కదా? వేరొకరిని దాంపత్యబంధంలో ఇరికించి, ఆనక ఆ బాధ్యతని విస్మరించి, అది కూడా తమ గొప్పే అని చెప్పుకోవడం భారతీయత అంటారా?

మన వారు చేసిన స్వాతంత్ర పోరాటాల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మన లాగే, మనంత నిస్వార్థంగా ఇతరులు కూడా పోరాటాలు చేశారని చెప్పటమే నా ఉద్దేశం. గాంధీ అహింసా మార్గం గొప్పదే కావచ్చు. కేవలం దానివల్లే స్వతంత్రం వచ్చిందా అనే వివాదం లోకి పోవడం ఇక్కడ చర్చ నీయంశం కాదు. వివరాలు కావలిస్తే ఇక్కడ చూడండి.

Rajasekharuni Vijay Sharma

" వారి ఇష్టాయిష్టాలతో పని లేకుండా తమ గురువు గారు చెప్పారని వారికి దూరంగా ఉంటున్నారు "

మీకు నేను వారి భార్యలు అసంతృప్తితో ఉన్నారని నేను చెప్పానా? మరి మీ రెలా అంచనాలు వేస్తున్నారు? భలే నిర్ణయించారండీ..! ఆశ్చర్యం !

వారు ముందే అనుకున్న ప్రకారం పెద్దలు, పిన్నలు తీసుకున్న నిర్ణయం ప్రకారం అలా ఓ రెండు సంవత్సరాలు దూరంగా ఉంటున్నారు. ఇది అందరూ ఇష్టమై పాటిస్తున్నదే. పైగా పెళ్లైన తరువాత భార్యలను అడిగారట ఇలా దూరంగా ఉండడం కాస్త కష్టంగా ఉన్నా మాకు శాస్త్రం వచ్చేవరకు దూరంగా ఉండి నేర్వాలని మేమనుకుంటున్నాము. కానీ అది మీకు పూర్తి సమ్మతమైతేనే. మిమ్మల్ని కష్టపెట్టి మేము చదవగలిగినది ఏమీ లేదు. కనుక మీకు సమ్మతమేనా? అని.

వారికి ఈ విషయాలు ముందే పెద్దలద్వారా తెలుసు.పైగా బ్రాహ్మణ కుటుంబాలలో ఇది సాధారణమే. కాబట్టి వారు కూడా మనస్ఫూర్తిగా సమ్మతించారట. ఇప్పటికీ వారికి మానసికంగా భార్యల సహకారం ఉండబట్టే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని చెప్తుంటారు నాకు.

దయచేసి రంధ్రాన్వేషణ చేయకండి.

నమస్కారం.

కొసమెరుపు

శర్మ గారు,

మీరు ఇక్కడ అదేదో గొప్ప విషయమైనట్టు రాశాక, మీరు రాసింది చదివి ఊరుకోమని శాశిస్తే ఎలాగండీ?

కాబట్టి వారు కూడా మనస్ఫూర్తిగా సమ్మతించారట

అని మీరు, నేను అనుకుంటే సరిపోదు గదండీ. ఇష్టం లేక పోయినా మన భారత దేశంలో మహిళలు 'మనస్పూర్తిగా సమ్మతింప' జేయ బడుతున్నా రనేదేగా విషయమంతా. అది ఎంత వరకు సబబు అని ఆలోచించాలి గాని, 'నేను ఒప్పింప జేసుకున్నాను, నాకు ఇది ఒకే' అని కాదు గదా! మీరు ఉదాహరించారు కాబట్టి, మీ ఉదాహరణ అంత ఉదాత్త మైనది కాదు కాబట్టే చర్చించ వలసి వచ్చింది. అంతే గాని రంధ్రాన్వేషణ చేసే ఓపిక తీరిక ఉండి కాదు.

జ్యోతి

చర్చ అసలు విషయాన్నిదాటి ఎటో వెళుతుంది. ఇక చాలు. ఇంతటితో కామెంట్లు ఆపేస్తున్నాను..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008