Thursday, July 15, 2010

వాన ముచ్చట్లు..


మొన్న

కల్లా కపటం తెలీని అమాయకపు బాల్యం. అమ్మ కథలు చెప్తూ బతిమాలి పెట్టిన బువ్వ తిని, బుద్ధిగా స్కూలు పాఠాలు చదువుకుంటూ గడిచిపోయిన అందమైన పసితనం అది. శనివారం సగం దినం స్కూలు అంటేనే ఆ రోజు సగం, మరునాడు ఆదివారం మొత్తం పండగలా గడిచిపోయేది. కాదంటారా? ఆదివారం రాత్రి అవుతుంది అంటేనే గుండెల్లో గుబులు మొదలు. అమ్మో! రేపు స్కూలుకెళ్లాలి.. మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయో?. ఎప్పుడు వాన పడుతుందా? అని ఎదురుచూడడం. ఆ వాన కూడా స్కూలుకు వెళ్లకముందే రావాలి. రాత్రి రావొద్దు. అలా వస్తే తెల్లారేసరికి తగ్గిపోతుందిగా. మనం నిద్ర లేవకముందు మొదలై స్కూలు ఇంటర్వెల్ లేదా లంచ్ బెల్ వరకు పడితేచాలు. ఆతర్వాత మనం బయటకు వెళ్లి ఎంచక్కా ఆడుకోవచ్చుగా. వానలో ఆడుకోవాలని ఉన్నా అమ్మ వెళ్లనివ్వదుగా. తన పని చేసుకుంటూనే పిల్లలవైపు ఓ కన్నేసి ఉంచుతుంది. తగ్గినతర్వాత పాత నోట్ బుక్కులనుండి పేజీలు చింపుకుని బయటకు పరుగు. ఇంటి ముందు పారుతున్న నీటిలో పడవలు చేసి అవి వెళుతున్నంతసేపు చూడడం. అప్పుడప్పుడు స్కూలు స్క్రాప్ బుక్ లో బొమ్మల కోసం కొన్న రంగుల పేపర్లు దాచుకుని వాటితో పడవలు చేసి వదలడం భలేగా ఉండేది. రంగు రంగు పడవలు మనముందు నీటిలో కదులుతున్నట్టు, మనం దానికి ఓనరైనట్టు.. మమూలు పడవ చేయడం అందరికీ వచ్చు. అది మునిగిపోకుండా చేయాలి. అదో ఆర్టు. మళ్లీ కత్తి పడవ చేయడమంటే పేద్ద ఘనకార్యం అన్నమాట. కాగితం పడవలు నీటిలో ఎంతవరకు వెళతాయో అంతవరకు వాటి వెనకాలే అడుగులేయడం. చివరికి అవి ఎక్కడో మునిగిపోయేసరికి దిగాలు పడి , వెనక్కు పరిగెత్తుకురావడం గుర్తు లేనిదెవ్వరికంటా?. అప్పుడు వానలో, నీళ్లలో ఆడడం తప్ప వేరే ధ్యాస లేదు. తడిస్తే జలుబు చేస్తుందని అమ్మ భయం. అమ్మకు తెలీకుండా ఒక్కసారి వానలో తడిచేసి జ్వరం తెచ్చుకుంటే ఎంత బాగుండు అని కోరుకున్న రోజులెన్నో. స్కూలు వెళ్లే పనుండదు మరి.. జ్వరం వస్తే అమ్మ దేనికీ తిట్టదు. రాజమర్యాదలు. కదా.. :)


నిన్న

ప్రకృతి , ఇంకా చెప్పాలంటే ప్రతీది అందంగానే గడిచిపోయిన కాలం. వానచినుకులతో అల్లరి తప్పనిసరి. మండువేసవి దాటి తొలకరి వాన వచ్చే సమయంలో ఉండే ఆనందమే వేరు. ఇపుడు అమ్మ ఏమన్నా మనకు అంత భయం లేదుగా. వానలో తడిస్తే జ్వరం వచ్చినా డాక్టర్ ఉన్నాడు. మందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనిపించే మధురమైన ఉరకలు వేసే యవ్వనం. విశాలంగా ఉన్న నీలి ఉద్యానవనంలో తెల్లని మబ్బుల తునకలు అలా తేలిపోతుంటే వాటితో పాటు పరుగుతీయాలనిపిస్తుంది. ఇక సరసన కోరిన చిన్నవాడుంటే చిలిపి ఊహలు, తరగని ఊసులు.. చెలికాని తోడున్నన్నదన్న ధీమాతో ప్రతి చెట్టు, ప్రతి పువ్వు అందంగా కనిపిస్తుంది. అలరిస్తుంది. మాతో పోటీగా హొయలు కురిపించగలవా అని సవాలు కూడా చేస్తాయి. ఆ చినుకులతో మొదలయ్యే చిరు చలి కూడ వెచ్చగా మారుతుంది. వర్షపు జల్లు కూడా ముత్యాల తలంబ్రాలుగా మారతాయి. కాదంటారా??

నేడు..

జీవితపు చివరి అంకం. బ్రతుకుపోరాటంలో ఎన్నో ఎదురీతలు. ఆటుపోట్లు. అలసినా ఆపలేని ప్రయాణంలో ఎందరో జత కలిసినా చివరిదాకా తోడుండేది ఎవరూ లేరు. ఎవరి జీవితం వారిది. అందరూ మనవారే. అందరికి మనం ఏమీ కాము. ఇప్పుడు మనకు కొత్త జీవితమేముంది. మనసు అల్లకల్లొమైంది. కాని ఈ ప్రకృతి నా బంధువైంది. జడివాన తనువును, మనసును చల్లబరచడానికి కృషి చేస్తుంది. చిరు జల్లులలో కన్నీరు కలిసి వరదలా పారింది. మసకబారిన పొగమంచు ఓదారుస్తూ కౌగలించుకుంది.. అదే పెనుచీకటిగా మారిపోతే ఎంత బాగుంటుంది. ఆ చీకటిలో ఎంత హాయి, వెచ్చదనం,ఆప్యాయత ఉంది. నన్ను నన్నులా అక్కున చేర్చుకుంటుంది. అందరిలా నను ఎప్పటికీ వీడిపోనంటుంది. ఒకోసారి అందులో ఐక్యమైపోవాలని ఉంటుంది. మరు నిమిషం ఆ చీకటిని చీల్చుకుని నాకు నేనే వెలుగునవ్వాలని ఉంటుంది. ప్రజ్వరిల్లి జగమంతా వెలుగు నింపాలని ఉంది. ఆ జ్వాలలోనే జ్వాలనై కరిగిపోతే ఎంత బావుండు..నాడైనా , నేడైనా నాకున్నది ఓకే కోరిక.. ఈ వాననీళ్లు కాస్త గోరువెచ్చగా ఉంటే ఎంత బాగుండు? హాయిగా వానలో కూర్చోవచ్చు. ఆడొచ్చు. జలుబు రాదు, జ్వరం కూడా రాదు. వానపడుతుంటే మధ్యలో పెద్ద గొడుగు క్రింద కుర్చీ వేసుకుని కూర్చొని పాత పాటలువింటూ, వాన హోరును ఎంజాయ్ చేస్తూ రకరకాల ఐస్ క్రీములు, వేడి వేడి జిలేబీలు తినాలని ఆశ. ప్చ్..

18 వ్యాఖ్యలు:

మాలా కుమార్

మొన్న , నిన్న , నేడు విష్లేషణ బాగుంది .
కాని ఈ మద్య మీ పోస్ట్ ల లో వేదాంతం కని పిస్తోందేమి గురూజీ ?

praseeda

బావుంది జ్యోతిగారూ..

agnaata

చావగొట్టి చెవులు మూస్తున్నారు తెలుగు బ్లాగర్లందరూ "వాన" ముచ్చట్లతో.తెలుగు మీడియా వైరస్ బ్లాగులకి కూడా అంటుకున్నట్లుంది ఒకరు ఏది రాయగానే అందరూ అదే పట్టుకోవడం.

ఎంత బాగా రాసినా ఒకటే టాపిక్ పదే పదే కనపడేసరికి బోరు కొడుతోంది టీవీలలో జగన్ మొహం లాగ.

శ్రీలలిత

ఆఖరు నిమిషం లో రాసినా ఎంత బాగా రాసారో..

రాధిక(నాని )

బాగుందండి

రవి

ఎందుకో, వర్షం మీద రాస్తున్నారందరూ. ఆషాఢమొచ్చిందనా?

నేనూ రాద్దామని అనుకుని, ఎందుకో ఆపేశాను.

మీ బ్లాగులో అదేదో జావాస్క్రిప్టు పూలు పూలుగా రాలుతూ, చదవడానికి అడ్డుపడుతూంది. మౌస్ చుట్టూ తిరిగేవి వంటివేైనా చూడండి. www.javascripts.com అని ఉండాలనుకుంటాను.అక్కడ దొరుకుతాయి ఇలాంటివి.

శరత్ 'కాలమ్'

ఏదయినా బ్లాగు ఫత్వా జారీ అయ్యిందా ఏమిటీ? అందరూ వరుసకట్టి వానాకాలం మీద వ్రాసేస్తున్నారు!

జ్యోతి

హా..హా.. అందురూ కంగారు పడ్డారా?? బోర్ కొట్టినప్పుడల్లా ప్రమదావనం సభ్యులం ఇలా ఒకే టాపిక్ మీద రాయాలని డిసైడ్ అవుతామన్నమాట. ఈసారి వాన ముచ్చట్లు..అదీ సంగతి

మాలగారు.. అలాగంటారా?? ఈ మధ్య కలిసిన కొందరి మాటలు, ఈ ఫోటోలు అలా రాయమని ప్రేరేపించాయి. బాల్యం విశేషాలు మాత్రం నావేనండోయ్..

అజ్ఞాతగారు,

వానకాలం కదండి అందుకే ఇలా రాసేస్తున్నారన్నమాట.:)

గీతాచార్య

:)

mee korikalanne teeraalani, vaanalo tadisinaa jwaram raani aarogyam kalagaalanee...

భావన

బావుంది జ్యోతి. మనో ఫలాభీష్టాభిసిద్ధిరస్తూ..

psmlakshmiblogspotcom

బాగుంది జ్యోతీ, వానలో ఐస్ క్రీం బాగుంటుంది కదూ.
psmlakshmi

సత్యవతి

వాన లో ఐస్ క్రీమ్ తినడం బాగుంటుంది కానీ వాన నీళ్ళు వెచ్చగా వుంటే బాగోదు అవి చల్లగానె వుండాలి.అప్పుడె వానలో తడిసిన ముచ్చట.లెకపోతే షవర్ తీసుకున్నట్లుంటుంది కదా/జ్యోతి గారూ..

లలిత

బావుందండీ

ఆవకాయ

saw your OATS special in Sakshi.Nice ones :)

జ్యోతి

గీతాచార్య, భావన ఐస్క్రీమా, గోరువెచ్చని వానా? రెండూ తీరే కోరికేనా??

సత్యవతిగారు,,

మీరు చెప్పింది నిజమేనండి. కాని చిన్నప్పుడు అమ్మ వానలో తడవనివ్వదు.జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని. ఇప్పుడు కాస్త బాల్కనీలో ఐనా వానలో కుర్చీ వేసుకుని కూర్చుందామనుకుంటే మావారు, పిల్లలు గోల. ఎక్కడ పొద్దుపోవడంలేదా? లోపలికొచ్చేయ్ అని. జ్వరం, జలుబు, న్యుమోనియా లాంటివి వస్తే వేలకు వేలకు హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారు? అంతలా ఐతే గీజర్ వేసుకుని షవర్లో రోజంతా కూర్చో పాటలు పాడుకుంటూ అంటారు. నా బాధ అది మరి.. :(

జ్యోతి

తెలుగింటి వీరనారీమణిగారు,

ధాంక్స్ అండి. మిమ్మల్ని ఆవకాయ అనాలంటే అదోలా ఉంటుంది. ఏమని నే పిలవను??

kiran

goruvechati varsham..concept bagundi..appudu nenu eppudu varsham lo ne.. :)

రాజేశ్వరి నేదునూరి

బాగుంది జ్యొతి గారు మీ వాన ముచ్చట్లు మీ వర్ణనలు అనుభూతులు చక్కని చిత్రాలతొ ఆనందపు జల్లులు కురుస్తొంది

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008