Wednesday, 21 July 2010

వెండి వెన్నెల జాబిల్లి - సుశీల




నవపారిజాతాలు పుస్తక రచయిత్రి డా.సీతాలక్ష్మిగారు నాకు ఇచ్చిన అమూల్యమైన కానుక ఈ వ్యాసం. సీతగారి మాటలకు పాటలు జతచేర్చాను. కొన్ని పాటలు దొరకలేదు.

మధుమాసపు ప్రత్యూషమా
మత్తకోకిల మధురస్వరమా
ఉత్పలాల సోయగమా,
చంపకాల అందమా
పారిజాత పరిమళమా,
మందార మకరందమా
గోదావరి తరంగమా,
వెన్నెలమ్మా సంతకమా
గంగానిర్ఝరీ ప్రవాహమా,
తెలుగుభాష తీయందనమా
నవరసాల సారమా, వైవిధ్య భరితమా
వాసంతపు వాక్సుద్ధీ, గ్రీష్మాదిత్య నైశిత్వం
వర్షఋతువు ఆర్ద్రత, శరదృతువు స్వచ్చత.
శిశిరపు ఒద్దిక, హేమంతపు పొందిక

ఎన్నో… ఎన్నెన్నో… సుశీలమ్మ స్వరాల సుగంధాలు

నవరసాల్ని నవకంగా, సన్నివేశపరంగా, సరసంగా ఆవిష్కరించగలిగిన ప్రజ్జాశాలి శ్రీమతి సుశీల. సరస సంగీతసాహిత్య సీమలో సరిలేని సుమధుర గాయని ఆమె. గోదారి, వెన్నెల, మల్లెలు, పారిజాతాలు, మలయానిలాలు ఆ కల్యాణి కంఠాభరణాలే.

రేడియోలు ఇంటింటా లేని రోజుల్లో మా ఊరు బాపట్లలో సినిమా పాటలు పగలు గూడురిక్షా మైక్ల్లోను, రాత్రివేళ ఎక్కడో చాలా దూరంనుండిన్నీ వినిపిస్తూ వీనులవిందు చేసేవి. ఐతే అప్పట్లో ఆ పాటల్ని పాడిన లతా, రఫీ, కిషోర్, గీతా, ఘంటసాల, జిక్కి, లీల, భానుమతి గార్ల పేర్లు కూడా అంతగా తెలియవు. ఆ చిన్నవయసులో మనసుకు క్రొత్తగా అందిన పాట “బలే తాత మన బాపూజీ” సందెగొబ్బెమ్మ చుట్టూ తిరిగి పాడే రాముడి పాటలు, కృష్ణుడి పాటలే కాక క్రొత్తగా నేర్చుకున్న “బృందావనమది అందరిదీ” పాట కూడా జత కలిసింది. అట్లతద్దె, ఉండ్రాళ్లతద్దె రోజుల్లో తదియ చంద్రుడి వెన్నెల్లో గోరింటాకు చూసుకుంటూ ఉయ్యాలలూగుతూ స్నేహితులతో “సుందరాంగ మరువగలేనోయ్” పాడుకోవటం నాకిప్పటికి తీపిగుర్తు. కాలమెంత మారినా ఎన్ని కొత్త స్వరాలు సంగీత రసఝరిలో చేరినా నాకు మాత్రం సుశీలగారి పట్ల నాటినుండి నేటివరకు చెక్కుచెదరని అభిమానం. 1958 ప్రాంతాల్లో మా ఊళ్లో భయంకరమైన కలరా వచ్చింది. వేడి అన్నం, పాత చింతకాయ పచ్చడి, వేడిచారు, త్రాగడానికి వేడినీరు. నెలరోజులపాటు ఇదే మా ఇంట్లో భోజనం. స్కూళ్ళకు నిరవధికంగా శలవులు ఇచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలు జరిపారు. కలరా అంటే దేవుడికి మనమీద కోపం వచ్చిందని అందువల్ల దైవప్రార్ధన చేయాలని పెద్దవాళ్ల బోధ. పదేళ్ల వయస్సున్న నేను మా చెల్లెల్ని పట్టుకొని కళ్ళు మూసుకొని “పాలకడలిపై శేషతల్పమున”, “నారాయణా హరి నారాయణా”, పాటలు గట్టిగా పాడుకున్న సన్నివేశం ఈనాటికి నాకళ్ళముందు కనిపిస్తుంది. దేవుడి ప్రార్ధన కూడా సుశీలగారి పాటలే. భయంవేసినా, భక్తి కలిగినా, సంతోషమైనా, బాధకలిగినా ఆ భావాన్ని చిన్నతనంలో గట్టిగా, పెద్దయ్యాక మెల్లగా సుశీలగారి పాటలతో అనుభవించడం నాకు బాగా అలవాటై పోయింది.

తన పాటల్లోని సాన్నిహిత్యాన్ని ఆమె ఆస్వాదించి ఆలపించటంతో ఉండే ప్రత్యేకత నన్నాకర్షించింది. ఆమె పాటల్ని వింటూ చకాచకా కాగితం మీద సరిగ్గా వ్రాయగలమంటే అది ఆవిడమాట పలికేతీరు, పలుకుదనంలోని స్పష్టత.

తన స్వరం జమున స్వరానికి చాలావరకు సరిపొతుందని తానే స్వయంగా తెల్పిన సుశీలగారు సావిత్రికి పాడినా, అంజలీదేవికి పాడినా చివరకు నిన్నటితరం యువనాయికలకు పాడినా పాటకు న్యాయం చేయడంలో ఏ మాత్రం తేడా చూపలేదు. నటిగాత్రం, సన్నివేశం, కథ, ఔచిత్యాలను బట్టి తన గాత్రంలో అద్భుతమైన వైవిధ్యాన్ని చూపిస్తూ తన స్వరాన్ని ఎందరెందరో నాయికల నోట పలికించి మనకు వినిపించి మంత్రముగ్ధుల్ని చేసారు.

పద్యాన్ని ఆమె ఆలపించేతీరు అద్వితీయం . రమ్యమైన గీతం రసాత్మక కావ్యంతో సమానమై రసహృదయుల్ని ఆనందపరవశుల్ని చేస్తుంది . నవరసాలు ఆమె గళంనుండి జాలువారి వాటి ఉనికిని నిలబెట్టుకున్నాయి. ఎన్నిపాటలు, ఎన్నిరాగాలు, ఎన్నిభావాలు…

శిరీష కుసుమ సదృశమైన లాలిత్యంలో శృంగార రసభరితమైన కొన్నివేళ పాటల్ని ఆమె మనకందించారు. ఆ అమృత రసఝరిలో ఈనాటికీ మనం మునకలు వేస్తూనే ఉన్నాం. “అనురాగం విరిసేనా”, “మాధవా ననులాలించవా”, “ మామచందమామ ”, “బాలనురా మదనా”, “అందెనునేడే”, “అందాలబొమ్మతో”, “ కనులలో కులుకులే ”, “మల్లెపూవులు విరిసెరా”, “మీరజాలగలడా”…….. ఇలా ఒకటా రెండా వందలాది శృంగారరసభరిత మనోహర గీతాలు సుశీలమ్మ మనకు ప్రసాదించిన వరాలు. “అనురాగము విరిసేనా” పాటలో సాహిత్యం గొప్పదా సంగీతం గొప్పదా అంటే ఆ రెండింటి సౌందర్యాన్ని తన గాత్రంలో పరిమళింపజేసిన సుశీలగారి స్వరసౌరభమే గొప్పదని నిస్సందేహంగా చెప్పవచ్చు. “మీరజాలగలడా” పాటను స్థానం నరసింహారావుగారి బాణిలో ఎందరు పాడినా సుశీల గీతమే సత్యభామకు ప్రాణప్రతిష్ట చేసి అజరామర కీర్తిని తెచ్చింది.

ఇక హాస్యరసాన్ని మధురమైన కంఠంలో పలికించడం కొంచెం కష్టమే. కాని “పిల్లాపిల్లారా పెళ్లి చేసుకో”, ”నీకోతోడుకావాలి ”, “పొరుగింటి మీనాక్షమ్మను చూసారా”,”ఇంటింటి రామాయణం” వంటి పాటల్లో సున్నితమైన హాస్యంతో పాటు సునిశిత సందేశాన్ని కూడా అందించి హాస్యరసాన్ని సైతం అనేక సందర్భాల్లో అద్భుతంగా పండించిన సుహాసిని సుశీల. సుశీల ఆలపించిన శోకభరిత గీతాలు మనసుల్ని ఆర్ద్రం చేసి కళ్లని తడిపేస్తాయి. “కనులకొకసారైనా”,”అమ్మా చూడాలి ”, “వెన్నెలవేళలు”, “ఏనాటికైనా మూగవీణా”, “పెనుచీకటాయే లోకం”, “నీచెలిమి నేడెకోరితిని ” వంటి పాటలు మనల్ని కదిలించేవీ,కరిగించేవీ.

ఉత్సాహభరితమైన వీరరసం పలికించటానికి ఉత్కృష్టమైన కంఠస్థాయి ఉండాలి. “లేరు కుశలవులసాటి”, “సవనాశ్వంబిది”(పద్యం) వంటి వీరరస ప్రధానమైన పాటలకు , పద్యాలకు నేటికీ వన్నె తరుగలేదు. జయభేరిలో మల్లాదివారి “సంగీతసాహిత్యమే” పాటలలో సుశీలగారు నవరసాల్లో విశిష్టమైన వీరరసశృంగారాలనద్భుతంగా మేళవించారు.

భయానక, బీభత్సాలు కోమలమైన కంఠం నుండి వెలువడాలంటే ఆ గాత్రధారి పాత్రలోనేకాక సన్నివేశంలో కూడా పరకాయ ప్రవేశం చేయక తప్పదు. “నినువీడని నీడని నేను”, “.. నా రాజా, రావారావా” వంటివి ఈ కోవకు చెందినవే. కాగా “దుర్వారోద్యమ” పద్యంలో మొదటి రెండు పాదాల్లో పాండవుల పరాక్రమ ప్రశంసను వీరరసంలోను, తర్వాత రెండు పాదాల్లో కీచకుని పట్ల జుగుప్సను వ్యక్తపరుస్తూ బీభత్సాన్ని వైవిధ్యభరితంగా సమ్మేళనం చేసిన సుశీల అద్వితీయురాలు కాదా.

క్రోధం మూలమైన “భద్రకాళివంటి వీరరుద్రమాంబ మాసోదరి”, “మహాదేవశంభో” వంటి పాటలు సుశీలగళం అందించిన రౌద్రరస ప్రతీకలు, విస్మయాన్ని కలిగించే అద్భుతరసంతో శ్రోతలను సమ్మోహనపరిచే సుశీలమ్మ గీతాలలో కొన్ని చూడండి. ఎవరివల్లైతే ఏ సన్నివేశాల్లో అయితే తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడు వరాలు కోరాడో వాటికి విరుగుడు “కలడంభోధి” పద్యంలో ఉంది. సుశీలగారా పద్యాన్ని మహాగడుసుగా పాడారు. “మధురమైన గురుదీవనా”, వేణుగానమ్ము వినిపించెనే”, “ఎవరవయా”, “స్వాగతం కురుసార్వభౌమా”, “రాయినైనా కాకపోతిని”, “ఎవరునేర్పేరమ్మా ”, “పాటల్లో పాడలేనిది” లాంటి ఎన్నో అద్భుతమైన పాటలు సుశీలమ్మవే.

శాంతం కరుణకు సన్నితురాలు. “కలలుకనే వేళయిదే కన్నయ్యా”, “ మీ నగుమోము”, “కనరానిదేవుడే”, “అందెనా యీ చేతుల”వంటి చక్కని పాటలు, “మందారమకరంద”, కంజాక్షునకుగాని కాయంబు” వంటి సుమధురమైన పద్యాలు మనల్ని సేదదీర్చే శాంతరస ప్రధానాలు.

భక్తిని కూడా రసంగా అంగీకరించే పక్షంలో సుశీలమ్మ పారవశ్యంతో, తాదాత్మ్యంతో గానం చేసిన భక్తి గీతాలు కోకొల్లలు. ఆ రతనాల రాశులలో “నీవుండేదా కొండపై”, “పాలకడలిపై”, “తిరుమల తిరుపతి వేంకటేశ్వరా”, “జగదేకమాతాగౌరీ”, “హ్రీంకారాసన” వంటి మణిమాణిక్యాలు ఎన్నెన్నో. ఇక పోతనగారి పద్యమందారాలకు మకరందాలద్దిన సుమనోహర సుశీలమ్మ తన గాత్రంలో నవరసాలకు ఔపోసన పట్టిన వీణాపాణి.

సుశీలగారు అష్టవిధ నాయికలలో పరకాయ ప్రవేశం చేసిన తీరుపై ఒక విహంగ వీక్షణం. “మనసే కోవెలగా”, “ప్రేమ నిండిన యిల్లే” వంటి నాజూకైన పాటలలో స్వాధీన భర్తృకగా, “పాడవేల రాధికా”, “మల్లెపందిరి నీడలోన”, “వస్తాడు నారాజు ఈరోజు ”, “నీపేరు తలచినా చాలు”, మొదలైన గీతాల్లో వాసకసజ్జికగా, “వినిపించని రాగాలే”, “నీదయ రాదా”, “సన్నగవీచే చల్లగాలికి”, “నీవులేక వీణా”, ’సఖియా వివరించవే” వంటి సన్నజాజుల సమూహంలో విరహోత్కంటితగా, “నడిరేయి గడిచేనే”, “నిదురించే తోటలోకి” వంటి సుతిమెత్తని పాటల్లో విప్రలబ్ధగా, “ముందటివలెనాపై”, “ఏమనిపాడెదనో” వంటి గీతాల్లో ఖండితగా “పెనుచీకటాయే లొకం” “మనసా కవ్వించకే” మొదలైన పాటల్లో కొంతవరకు కలహాంతరితగా , “కన్నుమూసింది లేదు”, “నీవురావు నిదురరాదు” , “రేపల్లె వేచెను” వంటి ఆర్ద్ర గీతాలలో ప్రోశితభర్తృకగా , “నిన్నే వలచితినోయీ, కన్నుల్లో దాచితినోయీ, వెన్నెల్లో వేచితినోయీ, నీకై అభిసారికనై”, “నిన్నటిదాకాశిలనయినా ” మొదలయిన గీతాల్లో అభిసారికగా దర్శనమిచ్చే సుశీలమ్మ నవరస రాగరాగిణి, అష్టవిధ నాయికా స్వరూపిణి, మదిమదినీ మురిపించే మంజులవాణి.

లాలిపాటలనైనా, వీణపాటలనైనా, అలకనైనా, ఆలాపనైనా, ప్రశ్ననైనా, సమాధాన్నైనా,దేశభక్తి గీతాన్నైనా, దుర్యోధనునితో యుగళగీతాన్నైనా, ఒకే పాటలో భిన్నపాత్రధారులకు స్వరాన్నందించినా, ఆమె ఆలపించిన తీరు బహుధా ప్రశంసనీయం. ఏభై సంవత్సరాలనుండి శశిరేఖ “అహ నా పెళ్లియంట” అని నిత్యనూతనంగా మనల్ని ఆహ్వానిస్తూనే ఉంది. “ఏమండోయ్ శ్రీవారు”, “నా మాట నమ్మితివేలా” అని కవ్వించినా, “చిన్నమాట ఒక చిన్నమాట” అని చెవిలో గుసగుసలాడినా ఆమె “సరస సరాగాల సుమరాణియే”

“కవికోకిల తీయని పలుకులలో చెలువారు నవరసాలు
కవిరాజ హంస నడకలలో కులికే వయ్యారాలు
కలవోయి “సుశీలమ్మ గళసీమ”లో “

తెలుగుసినీగాన వినీలాకాశంలో ఆమె కృష్ణపక్షం లేని వెండివెన్నెల జాబిలి..

9 వ్యాఖ్యలు:

Dr.Tekumalla Venkatappaiah

గాన మాధురి శౌశీల్య గాత్ర మహిమ
వేయి కోకిల లొకటిగ వెలుగు శీల
చలన చిత్రము లందున చరిత బొందె
జ్యొతి చెప్పెను దీనినే రీతి గాను.

శ్రీనివాస్ పప్పు

aసుశీల గారు వీణ పాటలకి ప్రసిద్ధి కదా(అంటే మిగతావి కాదు అని కాదు)ఆ కోకిల నోటివెంట ఏమాటొచ్చిన పాటలాగే ఉంటుందిలెంది.ఆ పాటల చిట్టాయే ఓ మహాసముద్రం.
ఈ పైన ఇచ్చిన లిస్టులో "మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం" (అక్కాచెల్లెళ్ళు సినిమాలోది)అన్న పాట ఎక్కడా కనపడట్లేదు చెప్మా.

ఆ.సౌమ్య

చాలా బాగా రాసారు
వీణ పాటల్లో ఇంకో మంచి పాట
మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నొ చెలరేగే...

అలాగే మరి కొన్ని గొప్ప పాటలు

మోహనరాగ మహా (మహామంత్రి తిమ్మరుసు)
కనరాని దేవుడే (రంగుల రాట్నం)
ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట (శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్)
రాకోయి అనుకోని అతిధి (శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్)
తెలియని ఆనందం నాలో కలిగెను ఈ ఉదయం (మాగళ్య బలం)
వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే
నీకై వేచితినయ్యా ఓ ఏకాంత రామయ్యా (శ్రీకృష్ణార్జున యుద్ధం)

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని బ్లాగులైనా చాలవు

తార

ఒకటా రెండా, సుశీలగారు పాడిన వంద పాటలగురించి చెప్పుకున్నా, ఇంకా వందలు మిగిలి ఉంటాయి.

తెలుగుకళ

అసలు మీకంత ఓపిక ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అన్ని గంటలు అంత శ్రద్ధగా
ఒక గాయని గురించి శ్రమించడంలోనే మీ పట్టుదల ఏమిటో తెలిసిపోతుంది.


హాట్సాఫ్....జ్యోతీజీ !

antaryagam

నాకు ఎంతో ఇష్టమైన గాయని గురించి న మీ వ్యక్తీకరణకి హాట్సాఫ్.

ఆవిడ గురించి ఎంత వ్రాసినా ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదేమో.

50-60 సంవత్సరాల తరువాత మళ్ళీ వింటున్నా కూడా మన మన్సుకి హాయిని కూర్చి, సేద తీర్చ గలిగిన సుశీల గారి పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆవిడ గళం లో ఏ పాట అయినా అజరామరం అవుతుంది. దానికి అప్పటి వారి క్రుషి, వారి కళా వ్రుత్తి పట్ల వారి నిబద్ధత, వినయం కారణం అని నాకు అనిపిస్తుంది.

ఇప్పటికీ అదే వినయం తో నా గొంతు కి ఆ కీర్తి తెచ్చి పెట్టింది అప్పటి సౌండ్ ఇంజినీర్స్ అని సవినయం గా సభా ముఖం గా చెప్పగలిగిన సౌశీల్య వంతురాలు ఈ సుశీలమ్మ.

మీ మంచి ప్రయత్నానికి మరో సారి అభినందనలు.

susee

prasthutam Gemini Movies Channel lo Mamu Movies- MOOGA MANASULU chitram- oka adbhutha kalaa khandam prasaaramavuthondi.aa chitramu chhosthoonte-maatalu-paatalu vintoonte-5 dasabdaala lkaalagamanamlo- venukaki velli- aa rasaaanubhuthini- meetho panchukovadam naa vuddesam.paatalaa avi- kaavu-rasagulikalu.suseelamma gaatram- amrithopamaanam. ammaa jyoyhi garu- mee ee manchi prayatnaanni manasaaraa abhnandisthunnaanu.-venkata subba rao voleti

జ్యోతి

సుబ్బారావుగారు.
ధన్యవాదాలు.. సుశీలమ్మ మధురగాత్రం మళ్లీ మళ్లీ వినడానికి పడ్డ శ్రమ ఆ స్వరమాధుర్యంతో మాయమవుతుంది కదా.

కళాసాగర్ గారు, ధన్యవాదాలు..

Anonymous

చాలా బాగా రాశారు. ఏమని పాడెదనో ఈవేళ, పలుకవే నా రామ చిలుకా, పాడవేల రాధికా ... ఇలా ఎన్నేన్నో. ఒక్కోసారి అనిపిస్తుంది, లతమంగేష్కర్ గారి కన్నా సుశీల గారి స్వరమే నేచురల్‌గా వుంటుందని.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008