Sunday, 18 July 2010

సాక్షిలో సౌశీల్య ద్రౌపది



ఈరోజు సాక్షి ఫండేలో ప్రచురించబడిన సౌశీల్య ద్రౌపది పుస్తక సమీక్ష..


రామాయణ, భారతాది పురాణాలు భారతీయ జీవనవిధానంలోని ఔన్నత్యాన్ని ప్రదర్శించి మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఈనాడు ప్రతి మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు , సందేహాలకు తగిన సమాధానాలు ఈ పవిత్ర గ్రంధాలలో లభిస్తాయి. అందుకే ఈ పురాణగ్రంధాలు ముఖ్యంగా రామాయణ, భారతాలు యుగాలు గడిచినా ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఈ పురాణగాధలలో తరచి చూస్తే ఎన్నో అద్భుతమైన జీవితపాఠాలు మనకు లభిస్తాయి. రచయిత కస్తూరి మురళీకృష్ణగారు తన నవల “సౌశీల్య ద్రౌపది” లో నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను ఎత్తి చూపారు. ఈ నవలలో ద్రౌపది పాత్రను , ఆమె మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి ఆధునిక మహిళకు ప్రతీకగా చేసారు. ద్రౌపది అసమాన సౌందర్యరాశిగా, ధీరగా, సహనానికి ప్రతిరూపంగా, ఉచితానుచితాలు తెలిసిన ఇంతిగా, తన భర్తల పట్ల అమితమైన ప్రేమ, వారి శౌర్యపరాక్రమాలపట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఇల్లాలిగా చరిత్రలో నిలిచిపోయిన ఒక మహాశక్తి.


సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆమె ఆకాశంలో సగం అయింది. ఆమెయే ప్రకృతి. కాని అనాదిగా స్త్రీని కాముక దృష్టితో చూస్తున్నారు, ఆటవస్తువుగా ఆడుకోవాలని ప్రయత్నించారు. దుష్టశిక్షణ కోసం జరిగిన రామరావణ యుద్ధమైనా, దాయాదుల మధ్య జరిగిన మహాభారత యుద్ధమైనా ఘోర నష్టం జరిగింది. ఆ యుద్ధాలకు కారణం వేరైనా స్త్రీనే నిందించారు. ఒక మహోన్నత వ్యక్తిత్వం గల కారణజన్మురాలైన స్త్రీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కోక తప్పలేదు అని పాండవ పత్ని ద్రౌపది కథ తెలియచేస్తుంది. ఆమె ఎదుర్కొన్న అవమానాలు, మానసిక సంఘర్షణ, క్లిష్టమైన సమయంలో ఆమె చూపిన సంస్కారం సవివరంగా మనకు అవగతం చేసారు కస్తూరి మురళీకృష్ణగారు రచించిన "సౌశీల్య ద్రౌపది" లో. ఈ కథ చదువుతుంటే స్త్రీకి తన అందం, వ్యక్తిత్వమే శత్రువుగా మారుతుంది అని నిరూపణ అవుతుంది. పాండవుల పట్టపురాణి ఐనా కూడా కాముకుల వలన అవమానింపడింది. తన తప్పిదం లేకున్నా నిండుసభలో వస్త్రాపహరణకు గురైంది.



మహిళల జీవితంలో ఎన్ని అపోహలు, ఎన్ని అపార్ధాలుంటాయో అన్నీ తాను అనుభవించింది. ఒక పురుషుడు ఎంత ఉన్నతుడైనా స్త్రీ పట్ల అతడి ఆవగాహనకు పరిమితులుంటాయి. ఎంత ప్రయత్నించినా పురుషుడు ఓ పరిధి దాటి స్త్రీని అర్ధం చేసుకోలేడు. ఇలా ద్రౌపది తన గతం గుర్తు చేసుకుంటూ, మహాభారత యుద్దానంతరం వానప్రస్ధానం స్వీకరించి పాండవులతో కలిసి హిమాలయాలలో ప్రయాణిస్తున్న సంఘటనలతో నవల మొదలవుతుంది. ద్రౌపది స్వయంవరం, తల్లి ఆదేశం మేరకు ఐదుగురు పాండవులు ఆమెని వివాహమాడడం, వైవాహిక జీవితం, రాజసూయ యాగం, ద్యూతక్రీడ , వస్త్రాపహరణం, అరణ్యవాసం, సైందవుని పరాభవం, కీచకుని వధ, రాజసూయ యాగం , మహాభారత యుద్దం .. ఇలా కథ సాగిపోతుంది. ఎన్నో సందర్భాలలో ద్రౌపది మానసిక సంఘర్షణ, ఆవేశం, అధర్మాన్ని ప్రశ్నించడం వంటి ఎన్నో విషయాలు మనసుకు హత్తుకునేలా, ఆలోచించేలా చేసారు రచయిత. మహాభారత కథ ఏమున్నది అనుకుంటాము కాని కొన్నికొన్ని సందర్భాలలో రచయిత చెప్పిన మాటలు నన్ను కదిలించాయి..


భగవంతుడు తనకు ప్రతిగా స్త్రీని సృజించాడంటారు. భగవంతుడిలోని సహనం, క్షమాగుణం, ప్రేమ, జాలి, దయ, సౌందర్యం వంటి అన్ని లక్షణాలు తనలో నింపుకుంది స్త్రీ.


మహిళ జీవితంలో వివాహం అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. అంతవరకు పుట్టింటిలో ఎంతో ప్రేమతో పువ్వులా చూసుకుంటారు, లాలిస్తారు, బుజ్జగిస్తారు. కాని రాజకుమారి ఐనా, సామాన్య స్త్రీ ఐనా చివరికి దేవత ఐనా వివాహమాడడంతో ఆమె జీవితం మారిపోతుంది. అంతవరకు తను పెరిగిన వాతావరణం, ఎరిగిన పద్ధతులు, నేర్పిన విద్యలు అన్నీ వదిలి కొత్త జీవితం సరికొత్తగా ప్రారంభించాల్సి వస్తుంది.


పురుషుడిని స్త్రీ ఎంత నిజాయితీగా ప్రేమించినా పురుషుడికి ఆమె నిజాయితీ గురించి ఏదో మూల అనుమానం ఉంటుంది.

ద్రౌపదికి అయిదుగురు భర్తలుండడం వల్ల కాముకి అన్నారు ప్రజలు కాని ఆమెని స్వయంవరంలో గెలుచుకున్నది అర్జునుడే. తల్లి చెప్పిందని అందరూ పంచుకున్నారు. అది ఆమె తప్పు కాదే. కాని కర్ణుడు విషయమై ద్రౌపదిని వేశ్య అని సంబోధించాడు. దుర్యోధనుడు హేళన చేసి తన తొడ మీద కూర్చోమన్నాడు. అన్నవరసైన సైందవుడూ చెరబట్ట చూశాడు. ఇలా అడుగడుగునా అవమానాలు పడింది ద్రౌపది. సౌశీల్యద్రౌపది నవల ద్వారా ద్రౌపది లోని మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మన కళ్లముందుంచారు రచయిత కస్తూరి మురళీకృష్ణగారు. ద్రౌపదిలోని ఉచితజ్ఞత మనకు అనేక సందర్భాలలో ప్రదర్శితమవుతుంది.


ఇందులో ఆడవాళ్లను పొగిడినందుకో, ఆమే గొప్పది అని చెప్పినందుకో నాకు కథ నచ్చింది అని చెప్పడంలేదు. స్త్రీ మనస్సును చదవడానికి ప్రయత్నించి అర్ధం చేసుకున్నారు అనిపించింది. ఆడవాళ్లను అందలం ఎక్కించి కిరీటం పెట్టి ఆహా, ఓహో అనక్కరలేదు. స్త్రీ కూడా మనిషే, ఆమెకు కూడా స్వంత అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, గౌరవించాలి అని మగవాళ్లు(మొగుళ్లు) అనుకుంటే చాలు. ఆనాడు ద్రౌపది వివిధ సందర్బాలలో ప్రదర్శించిన స్దితప్రజ్ఞత , కార్యనిర్వహణ నవసమాజంలో కూడా ప్రతి మహిళకు ఆవశ్యకమైన విషయాలు.


మురళీకృష్ణగారు

మీ పుస్తకంలో నాకు నచ్చనిది టైటిల్. అసలు సౌశీల్య అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది?. ద్రౌపది సౌశీల్యాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ముందుమాటలో చెప్పినట్టు, వివిధ పత్రికల్లో పుస్తక సమీక్షలో ప్రస్తావించిన యార్లగడ్డ నవల మూలంగా జరిగిన నష్టం ఏమున్నదని. అవును అందులో ద్రౌపది గురించి నీచంగా రాసారు. దానివల్ల మనకు కోపం, ఆవేశం వస్తుంది. అంతే తప్ప ద్రౌపదికి కాని, పురాణ గ్రంధాల గురించి తెలిసినవారు, పవిత్రంగా భావించేవారికి ఎటువంటి నష్టం లేదుకదా. పదే పదే నవల గురించి ప్రస్తావించి మనమే ఎక్కువ ప్రచారం కలిగిస్తున్నాము కదా. చెడును, తప్పును పదే పదే ఎత్తిచూపితే అది వాళ్లకే ఎక్కువ ప్రచారం ఇచ్చినట్టు అవుతుంది. అస్సలు పట్టించుకోకుంటే . అదే మరుగునపడిపోతుంది. ప్రహ్లాదుడికంటే హిరణ్యకశ్యపుడే విష్ణువుకు పరమ భక్తుడంట. శత్రువైన శ్రీహరిని ఆక్షేపిస్తూనే ఎక్కువసార్లు తలుచుకునేవాడంట. అందుకే ఇక్కడ యార్లగడ్డ ద్రౌపది ప్రస్తావన అనవసరం అనిపించింది.

మరో విషయం నాకు కొరుకుడుపడలేదండి..
నిజంగా ధర్మరాజు కర్ణుడిని కూడా భర్తగా స్వీకరించేదానివా అని ద్రౌపదిని అడిగాడంటారా? ప్రస్తావన గ్రంధంలో పర్వంలో ఉందో చెప్పగలరా? ధర్మానికి మారుపేరు, ద్రౌపదిని అమితంగా గౌరవించి, ప్రేమించే ధర్మరాజు ఇలా అడిగాడంటే నాకు నమ్మబుద్ది కాలేదు. కర్ణుడు చనిపోకుండా ఉండి, పాండవులతో కలిసిపోయి ఉంటే అతడిని ఆరవ భర్తగా స్వీరించేదా ద్రౌపది? అనే చర్చఎక్కడో చదివాను. కాని అలాటి ప్రస్తావన భారతంలో ఎక్కడా చెప్పబడలేదని కూడా విన్నాను. అందుకే మీ నవలలో నాకు సందేహం కలిగింది.


పుస్తకం లభించు వివరాలు:
Price : Rs. 50
Navodaya Book House
Opp. Arya Samaj Mandir
Kachiguda ‘X’ Roads,
Hyderabad – 27
Ph. 040 – 24652387



"సౌశీల్య ద్రౌపది" చదివినవారు అందులో నచ్చిన, నచ్చని విషయాలగురించి సహేతుకంగా ఇక్కడ చర్చించడానికి అహ్వానిస్తున్నాను.

టపాకు సంబంధంలేని , అవసరంలేని వ్యాఖ్యలను అనుమతించను.. గమనించగలరు.

6 వ్యాఖ్యలు:

Makineedi Surya Bhaskar

jyothi garu,

sakshi lone laghu samikshaki kona sagimpuga ee vyasam bavundi

meeranna mata nijam. manam pattinchu konavasaram ledu. 'sousheelya' ani padi sarlu ante, chivariki kademo anna anumanam vastundi.

misimi sanchika meeda samiksha pampanu, chudaleda?

సి.ఉమాదేవి

కస్తూరి మురళీకృష్ష్ణగారు రచించిన సౌశీల్య ద్రౌపదిపై మీ సమీక్ష పారదర్శకంగా ఉంది.సమీక్ష ద్వారా పుస్తకాన్ని చదవాలనే ఉత్సుకతను రేకెత్తించారు. రామాయణం, మహాభారతం మన దైనందిన జీవితాలలో మమేకమై మనకు తప్పుకు, ఒప్పుకునడుమనున్న వైవిధ్యాన్నిఎత్తి చూపుతూ మనకొక ప్రవర్తనా నియమావళిని ఏర్పరచినదనుటలో సందేహము లేదు.
ద్రౌపది కారణజన్మురాలంటారు.ఆమె జీవితంలోని భిన్నపార్శ్వాలు రచనాప్రేరణ కలిగిస్తాయి.ద్రౌపది పాత్రను నేటిమహిళకు ప్రతీకగా చెప్పారన్నారు. ఈ దిశగా రచయిత దర్శించిన కొత్తకోణం నన్నలరించింది. ప్రాచీన సాహిత్యాన్ని వేదాలైనా, పురాణాలైనా మన ఆధునిక జీవనవిధానాన్ని ఎక్కడో ఒకచోట స్పృశిస్తూనే ఉంటాయి.మరి ద్రౌపదిలోని పట్టుదల,కార్యనిర్వహణా సామర్థ్యం,బుద్ధికుశలత నేటి వనితలకు ఆచరణీయములే కదా!సంప్రదాయం,సంస్కృతిలో ఆధునికత సంతరించుకోవడం నేటి దృక్పథంలోని అభిలషణీయ మార్పు.భారతంలోని పాత్రలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి.అందులోని మంచిని గ్రహించడం మానవీయధర్మం.కొసమెరుపు:అర్జునుడి స్ఫూర్తితో పత్రికా రచన,బ్లాగావళిని ఏకకాలంలో సవ్యసాచియై నిర్వహిస్తున్న జ్యోతిగారికి జయహో!

కొండముది సాయికిరణ్ కుమార్

జ్యోతిగారు - మహాభారతంలోని
"రాజన్యా రాజకన్యాశ్చాపి ఆనయంత్వాభిషేచనం
షష్ఠే త్వాంచతధాకాలే ద్రౌపద్యుపగమిష్యతి
అన్న శ్లోకాన్ని అనువదించే క్రమంలో తిక్కనగారు
"పాంచాల రాజ పుత్రియు అంచితముగ నిన్ను బొందు నార్వురవరుసన్" అని
వివాదానికి మొదటగా తెరదెసారు. ఆ తర్వాత తిరుపతి వెంకటకవులు కూదా
"ఆసతి పెంద్లియాడుగద నారవ భర్తగ సూర్య నందనా" అని పాండవోద్యోగమున వ్రాసారు.
కలగూరగంప తాడేపల్లిగారో, బ్లాగాడిస్తా రవిగారో, భైరవభట్ల కామేశ్వరరావు గారో - వివరణ ఇస్తే బాగుంటుంది.
===
Any ways, shall be grateful if you can provide the Link of Kasturi gaari blog.

జ్యోతి

సూర్య భాస్కర్ గారు, ఉమాదేవిగారు ధన్యవాదాలు.

కిరణ్ గారు, లింక్ ఇచ్చానండి.. ఈ విషయమై మరికొందరిని కనుక్కుంటున్నాను. ఎన్.టి.ఆర్ నిర్మించిన విరాటపర్వంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి వృక్షంపై పెట్టేటప్పుడు ద్రౌపది కర్ణుడిని తన ఆరవ భర్తగా పొందాలని మనసులో కోరికగా ఉన్నట్టు చూపించారు. ఆ సన్నివేశం నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. ఈ పుస్తకంలో ధర్మరాజు అడిగినట్టు ఉంది. అందుకే నిజం తెలుసుకోవాలని ఉంది.

చింతా రామ కృష్ణా రావు.

చాలా చక్కగా పారదర్శికంగా చేసారానవలని.

కామేశ్వరరావు

ధర్మరాజు ద్రౌపదిని అలా అడిగినట్టు నాకూ తెలియదు. సాయికిరణ్ గారు చెప్పినట్టు కృష్ణ కర్ణ సంవాదంలో మాత్రం ఆ శ్లోకం ద్రౌపది కర్ణుడి భార్య కాగలదని కృష్ణుడన్నట్టుగా ధ్వనిస్తోంది. దాన్ని తిక్కన గారు అలాగే అర్థం చేసుకున్నారు. మరికొంత మంది ఇతర భాషా అనువాదకులు కూడా అలాగే తీసుకున్నారు. వ్యాసభారతానికి ప్రసిద్ధమైన నీలకంఠ వ్యాఖ్యలో మాత్రం దీనికి ఏ వివరణ ఇవ్వలేదట! నిజానికి అక్కడ "షష్ఠే" అన్నది "ఆరవవానిగా" అని అర్థం ఇవ్వదనుకుంటాను. "ఆరవ కాలం" అని అర్థం. "ఆరవ కాలం" అక్కడ పట్టాభిషేక సందర్భంలో ప్రత్యేక సమయాన్ని సూచిస్తుంది, ఆ సమయంలో ద్రౌపది నీ వెంట నడుస్తుంది అని అర్థం. మరి ద్రౌపది తనని అనుసరిస్తుందంటే భార్యగానే కదా అని కొంతమంది అంటారు. కాదని మరికొందరంటారు. తెలుగులో చాలా మంది తిక్కన గారి అభిప్రాయాన్ని స్వీకరించినట్టుంది. శలాక రఘునాథశర్మగారు భారతంలో ప్రతి శ్లోకానికి తెలుగులో తాత్పర్యం వ్రాసి అనువదించారు. వారు కూడా ద్రౌపది నిన్ను ఆరవవానిగా స్వీకరిస్తుంది అనే అనువదించారు. మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు మాత్రం అక్కడ ఆరవ భర్తగా అనుసరిస్తుందన్న అర్థం ఏమాత్రం ఉచితం కాదని అంటారు. అది ధర్మ విరుద్ధం కనక, అలాంటి ధర్మ విరుద్ధమైన విషయాన్ని మాటవరసకైనా కృష్ణుడు ఎందుకు ప్రస్తావిస్తాడు, వ్యాసుల వారు ఎందుకు అనిపిస్తారు అని ఆయన వాదన. అలాంటి ఉద్దండ పండితుల మధ్యనే భేదాభిప్రాయాలుంటే, సామన్యులం మనమెంతా!
ఇలాంటిదే వివాదాస్పదమైన శ్లోకం మరొకటుంది. అయితే తిక్కన గారు దాన్ని అనువదించకుండా తప్పించుకున్నారు :-) కుంతి కర్ణుడి దగ్గరకి వచ్చి కర్ణుడు తన కొడుకేనని చెప్పే సందర్భంలో,
"అర్జునే నార్జితాం పూర్వం హృతాం లోభా దసాధుభిః
ఆచ్ఛిద్య ధార్తరాష్ట్రేభ్యో భుఙ్క్ష్వ యౌధిష్ఠిరీం శ్రియం"

దీని అర్థం, "మునుపు అర్జునుడు సంపాదించినది, దుష్టులైన ధృతరాష్ట్ర కుమారుల చేత లోభంతో చెరచబడ్డది అయిన ధర్మజుని శ్రీని నీవు అనుభవించు" అని. "భుఙ్క్ష్వ" అంటే భుజించు అని కూడా అర్థం. ద్రౌపదికి "శ్రీ" అనే పేరు కూడా ఉంది. అర్జునుడు సంపాదించినది ద్రౌపది. కుంతీదేవే తెచ్చినదాన్ని అయిదుగురూ భుజించమని అప్పుడు చెప్పింది. కాబట్టి ఇక్కడ కుంతీదేవి కర్ణుడితో ద్రౌపదిని పెళ్ళాడమనే అన్యాపదేశంగా చెప్తోందని కొందరు అర్థం తీసారు. ఇది కూడా వివాదాస్పదమే!

విరాటపర్వం సినిమాలో మీరు చెప్పిన సన్నివేశం మాత్రం కచ్చితంగా సంస్కృత ఆంధ్ర భారతాలలో ఎక్కడా లేదు. మరెక్కడైనా ఉందేమో నాకు తెలియదు. రామారావు తను నటించే పాత్రలని గొప్పగా చూపించుకోవడానికి కథని, పాత్రలని తనకి కావలసినట్టు కల్పించుకోవడం చాలా చోట్ల ఉన్నదే. దీనికి శ్రీమద్విరాటపర్వం, దానవీరశూర కర్ణ సినిమాలు పరాకాష్ట! విరాటపర్వం సినిమాలో 75% కల్పితమనే చెప్పవచ్చు! దానవీరశూరకర్ణ సినిమాలో కూడా వ్యాసభారతంలో లేని కల్పితాలు చాలా ఉన్నాయి. బ్రాహ్మణుడి గోవు ఇంద్రుని మాయగా చూపించారు. కాని కాదు. నిజంగానే ఆవు అడ్డం వచ్చి పొరపాటున కర్ణుని బాణానికి తగిలి చనిపోతుంది. ఇందులో ఇంద్రుని ప్రమేయమేమీ లేదు. అలాగే పరశురాముడు పడుకున్నప్పుడు కూడా ఇంద్రుడే కీటకంగా మారినట్టు చూపించారా సినిమాలో. అదీ మూలంలో లేదు. ఆ కీటకం ఒక రాక్షసుడు. శాపవశాత్తూ కీటకంగా మారి, కర్ణుడిని కుట్టడంతో శాపవిమోచన పొందుతాడు. నేల పాలైన నేతి ఘట్టం అసలు లేనే లేదు మూలంలో! పరశురాముడు శాపమిచ్చిన తర్వాత హస్తినాపురానికి తిరిగి వచ్చి దుర్యోధనుడితో ఆ శాపం గురించి చెప్పడు. పరశురాముడి దగ్గర అస్త్రాలన్నీ సంపాదించాను, ఇక యుద్ధంలో నాకు తిరుగులేదని అబద్ధం ఆడతాడు వ్యాసభారతంలో.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008