Friday 30 July 2010

తనువూ .. మనసూ.


ఈ టపా రాయడానికి కారణం నిన్న మా డాక్టర్ చెప్పిన మాటలు. ఇవే మాటలు నేను ఎంతో మందికి ఎన్నో సార్లు చెప్పాను. విన్నాను కూడా.కాని ఎందుకో ఈసారి ఈ మాటలే నా మనసును కెలికి ఆలోచింప చేసాయి. ఏంటంటే..


జీవితం అన్నప్పుడు ప్రతీ ఒక్కరికి సంతోషం, బాధ , ఆవేదన, ఆవేశం ,ఆనందం అన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అనుభవం. ఒక్కో ఆలోచన. ఈ మనసు ఉందే. చాలా చిత్రమైంది. అది మనలను ఆడిస్తుందా? మనం దానిని ఆడిస్తున్నామా? అర్ధం కాదు. ఎటువంటి సంఘటనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి , నెగటివ్ గా ఆలోచించొద్దు అంటారు. కాని ఎంత మంది అలా ఉండగలరు? చెప్పినంత తేలికగా ఆ పరిస్థితిని ఎదుర్కోగలరా?? కొన్ని సార్లు ఎలా ఉంటుంది అంటే ఆ వ్యక్తీ మనసులో చెలరేగే ఆలోచనలు ఎవరికీ అర్ధంకావు? చూడడానికి బానే కనిపించినా లోలోపల అగ్నిపర్వతంలా ఉంటుంది మనసు. అది కోపంతో అయినా, బాధతో అయినా సరే.. సంతోషం ఐతే వెంటనే బయటకొచ్చేస్తుంది. అడగకున్నా అందరికీ చెప్పాలనిపిస్తుంది. కాని కొన్ని సార్లు ఎవరికీ చెప్పలేని , పంచుకోలేని సమస్య వస్తుంది. చెప్పినా కూడా ఎవరూ అర్ధం చేసుకోరు అని మరింత కృంగి పోతారు. ఈ బాధ , డిప్రెషన్ అనేది ఎవరికీ వారు వెంటనే అణగదొక్కి ,పరిష్కారం ఆలోచిస్తే కాని మామూలు మనిషి కాలేరు. అలా కాకుండా లోలోపల కుమిలిపోతూ, బాధపడుతుంటే క్రమంగా అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. కనిపించని మనసు బాధ కనిపించే శరీరం అనుభవిస్తుంది. మనసుకు ఎక్కువ కష్టం కలిగించకుండా దానిని బుజ్జగిస్తే బాధ తగ్గుతుంది. ఒక్కోసారి మనిషి ఎంతగా కృంగి పోతాడంటే ఛీ ఈ వెధవ బ్రతుకు ఎందుకు చచ్చిపోతే మేలు అనుకుంటాడు.ఇదే ఆత్మహత్యలకు దారితీస్తుంది. కాని మనలో ఉన్న మనసుకు మనని నిర్మూలించే అధికారం ఎందుకివ్వాలి?? మనసుకు గాయమైతే దాని ప్రభావం శరీరం పై పడుతుంది అని చెప్పాగా.. ఎందుకంటే ఈ రోజు బిపి, షుగర్ లాంటి వ్యాధులు సర్వసామాన్యమైపోయాయి. కారణం టెన్షన్ , stress అంటారు డాక్టర్లు. వాళ్లకేంటి అలాగే చెప్తారులే అని కొట్టిపారెయోచ్చు.కాని అది నిజమే కదా. ఈ డిప్రెషన్ అనేది ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది.మనకు మనం బయటపడకపోతే అంతే సంగతి.. కాదంటారా??


కాని ఇక్కడ నా సందేహం ఏంటంటే??


మనసులోని బాధ శరీరానికి హాని కలిగిస్తుంది. కాని శరీరానికి గాయమైతే అది మనసుకు తగుల్తుందా?? కాలికి దెబ్బ తగిలింది.గుండె నొప్పి వచ్చింది. ఆపరేషన్ చేయాలి అన్నారు. అందరూ దిగులు పడిపోరు కదా. డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు వేసుకుంటారు.తగ్గిపోతుంది. మరీ సీరియస్ , మేజర్ ఆపరేషన్లు, వ్యాధులు ఐతే కొంతమందికి దిగులు, భయం ఉంటుంది. డబ్బుల గురించి, ఆపరేషన్ అయ్యాక బ్రతుకుతానో లేదో, పిల్లలు ఏమవుతారో అని? .. తగ్గిపోయాక అంటా మామూలే. అంతే కదా. ఇంతకంటే ఎక్కువ ప్రభావం ఏముంటుంది మనసు మీద.. ఇపుడు చెప్పండి...


మనసు బాధ శరీరం అర్ధం చేసుకుంటుంది తాను కూడా బాధపడుతుంది కాని శరీరం బాధ మనసుకు తెలుస్తుందా??

మరో విషయం చెప్పాలండోయ్.. నాకు ఎప్పుడైనాగాని తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఏదైనా సరే మా శ్రీవారు " నువ్వు అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చుంటావ్ అందుకే వచ్చింది " అని తేల్చేస్తారు. అదన్నమాట సంగతి.. ప్చ్..

8 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

Very true.
It is also true that serious threats to the bodily well-being have damaging affects on the mind/psyche. It is well documented.

మాలా కుమార్

ఏమో నండి నాకైతే ఏకొంచం భాధ శరీరానికి తగిలినా మనసు కూడా తల్లడిల్లి పోతుంది . కొని సార్లు ఓర్చుకోవాలి అనుకుంటాను , కాని ఓర్చు కోలేను . పైకి చెప్పక పోయినా చాలా గాభరాగా ఐతే వుంటుంది .

శ్రీలలిత

మనసుకి బాధ కలిగితే గాయం పైకి కనిపించదు కాని దాని ప్రభావం మాత్రం తీవ్రంగా వుంటుంది.
అదే గాయం శరీరానికి కలిగితే అది మన మనస్సుని తప్పక తాకుతుంది. నెప్పి కలిగితే "అమ్మా" అనమూ.. అలాగే.
కాని దానికి మందు వాడాక, సర్జరీ చేయించుకున్నాక శరీరం, మనసూ రెండూ ఆ బాధను మర్చిపోతాయి.
రెండూ రెండు రకాలైన గాయాలే అయినా చికిత్స తర్వాత ఫలితాలు వేరేగా వుంటాయి.
ఇది నా అభిప్రాయం మాత్రమే

రుక్మిణిదేవి

జ్యొతిగారూ,,చాలా బాగుంది మీ విశ్లేషణ..ఆలోచించాల్సిన విషయం..మనసు మనల్ని ఆడిస్తుంది..అది అందరికీ తెలుసు..శరీరానికి కష్టం కలిగితే మనసు విలవిల్లాడుతుందండి..మనకి ఫీలింగ్స్ మనసుకే కదండి కలిగేది..ఆరోగ్యం లేని బ్రతుకు ఎందుకు అన్న విరక్తి కలుగుతుంది..ఫీలింగ్స్ అన్నీ మనసుకే.ప్రాణం పోతే శరీరం నాన్ లివింగ్ క్రింద లెక్క కద..అందుకే ప్రాణానికి, మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు..
శ్రీవార్లు అందరు అంతేనండి..అందుకే అంటాను..........ఆడదాని మనసు అర్ధం చేసుకొనే శక్తి మగవాడికి ఇస్తే ఎంత బాగుంటుంది అని..కాని నిజంగా అలా జరిగితే......... పరిణామాలు....
మనకి తెలియనివా? ఆలోచించాల్సిందే అన్ని కోణాల్లోంచీ.....కద..... గుడ్ గర్ల్.....

swapna@kalalaprapancham

chala baaga rasaru.

జ్యోతి

కొత్తపాళీ, మాల, శ్రీలలిత, రుక్మిణి, స్వప్న

మీ స్పందనకు ధన్యవాదాలు.

మనసుకు తగిలిన దెబ్బ చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. అది మానాలని ప్రయత్నిస్తే మరిచిపోగలమేమో కాని అప్పుడప్పుడు ఆ గాయం సలుపుతూనే ఉంటుంది. కాని శరీరానికి అయిన గాయం మందులతో, ఆత్మీయుల సేవలతో తగ్గిపోతుంది.మచ్చ మిగిలినా కూడా తర్వాత అది ఎటువంటి బాధ కలిగించదు కదా..

సి.ఉమాదేవి

శరీరానికి జ్వరం వచ్చింది.మనసు ఆవేదనకు గురైంది.కారణం!మనసుకనుగుణంగా శరీరం సహకరించలేదు కదా!సరే, మనసు నిత్యము మధనపడుతూనే ఉంటుంది అనుబంధాల అనుభూతులకు దూరమైనందుకు. కారణమేదైనాకావచ్చు. మనసుకు కళ్లెం వేసామనుకుంటాము.ఆ భ్రమను కల్పిస్తాము మనసుకు.మరి శరీరం తన పనులు తాను చేసుకుపోతుంటుంది.కాని ఇక్కడా మనసు మనకు తెలియకుండానే శరీరాన్ని ప్రభావితం చేస్తుంటుంది.అప్పుడు మనం మనసా కవ్వించకే నన్నిలా అంటూ...జ్యోతిగారూ హేట్సాఫ్!

జ్యోతి

ఉమగారు,,

నిజ్జంగా నేను చెప్పాలనుకున్నది ఇదేనండి.. పిచ్చి మనసు కదా.. :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008