అలమేలుమంగపతికి అన్నమయ్య ఆరగింపు సేవ
|
ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి
మీరిన కెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును పెరుగులు పాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ |
భర్తకు ఇష్టమైన వంటకాలు తయారుచేసి అతనికి కొసరి కొసరి వడ్డించడం ప్రతీ ఇల్లాలికి ప్రియమైన పని. అతను తృప్తిగా భోజనం చేస్తే సంతోషిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుడికి ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి వడ్డిస్తున్న దృశ్యం చూసిన అన్నమయ్య మా ఇందిరాదేవి ప్రేమతో వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామి అంటున్నాడు. ఆ స్వామికి వడ్డించిన వంటకాలు ఏంటయ్యా అంటే నేతి పాయసాలు, అప్పాలు, వడలు, చక్కెర రాసులు, మిరియపు తాళింపు పెట్టిన కమ్మని కూరలు, పచ్చళ్లు, పిండివంటలు, పాలు , పెరుగు మొదలైనవి. అంటే ఆ కాలంలో స్వామివారికి ఈ వంటకాలు నిత్యం నివేదించేవారేమో.
***********************************************************************************
పంకజాక్షులు సొలసిపలికి నగగా-
నింకా నారగించు మిట్లనే అయ్యా
కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు
పలుదెరగులైన అప్పములగములు
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా
పెక్కువగునై దంపుపిండివంటలమీద
పిక్కిటిలు మెర్కుగుబొడి బెల్లమును
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా
కడుమధురమైన మీగడపెరుగులను ముంచు -
అడియాల వూరుగాయల రుచులతో
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా
ఇక్కడ అమ్మావార్లు స్వామివారికి ప్రీతికరమైన వంటకాలు వడ్డించి, మధురమైన మాటలు తమ నవ్వులతో జతచేసి పతికి విందు చేస్తున్నారు. మనం పప్పు +ఆవకాయ, పప్పన్నం + అప్పడం .. ఇలా రెండు మూడు వంటకాలు కలిపి తింటుంటాం కదా. అలాగే అన్నమయ్యా శ్రీనివాసుడిని కూడా పిండివంటలను పొడిబెల్లంతో కలిపి, మీగడపెరుగు ఆవకాయ కలిపి ఆరగించవయ్యా వేంకటగిరివాసా అని నివేదన చేస్తున్నాడు.
4 వ్యాఖ్యలు:
బాగున్నాయి .
Adbhutam! MaaTalu chaalavu!
"మీరిన కెళంగు మిరియపు దాళింపు"
కెళంగు - ఇది తమిళ కొళంబు గామోసు!
"అడియాల వూరుగాయల రుచులతో"
వూరుగాయలు మొదలయ్యింది కృష్ణరాయల వారి 15 వ శతాబ్దంలో అని చదివానొకచోట. అన్నమయ్య అంతకంటే ముందువాడు. అప్పటికే ఊరగాయలు ఉన్నాయన్నమాట!
అన్నమయ్య చిన్న సైజు ఎన్ సైక్లోపీడియా. ఏ విషయాన్నీ ఒదలకుండా పాటల్లో రాసేశాడు.
GOOD BLOG
Post a Comment