Monday 30 August 2010

మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం.. సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్‌ అని ఫిక్స్‌ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహం కమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకు చేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకు జరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతో గుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసు కాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తు చేసుకుని మరీ చిటపటలాడుతుంది.


హ్యూమన్‌ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ నవ్వుకీ మన నవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనే మూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్‌ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్‌ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలు తీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ?

మీ
నల్లమోతు శ్రీధర్

7 వ్యాఖ్యలు:

జ్యోతి

Well said Sridhar. ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న మాటలే ఇవి. మనతో ఇంత సన్నిహితంగా ఉన్నవారు ఎలా అపార్ధం చేసుకుంటారో అర్ధం కాదు. ఒకవేళ అపార్ధాలు వచ్చినా వాటిని వెంటనే అడిగి క్లియర్ చేసుకోవాలిగా. కోపం,ద్వేషం పెంచుకుంటారు. అంత సడన్ గా వారి ఆలోచనావిధానం ఎలా మారిపోతుందో అర్ధం కాదు. తమ అవసరాలకోసమే మనతో పరిచయం పెంచుకుని స్నేహం చేసేవాల్లు ఎంతోమంది ఉన్నారు.అసలు పరిచయమైన అందరినీ స్నేహితులు అనుకోవడం మన తప్పే. అందరిని పరిచయస్తులు అనే భావించాలి. కొందరు మాత్రం మనకు దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగా ఉంటారు. ఎప్పుడూ మన క్షేమాన్నే కోరుకుంటారు. అవసరమైనప్పుడు వాళ్లే పలకరిస్తారు. హెచ్చరిస్తారు.అభినందిస్తారు. ఇలాంటివాళ్లను మనం నిజమైన స్నేహితులు అనాలి. ఈ విషయంలో బాగానే బొప్పి కట్టింది ఆ అనుభవంతో చెప్తున్న మాటలు..

బులుసు సుబ్రహ్మణ్యం

ఇంత చక్కగా చెప్పిన శ్రీధర్ గార్కి అభినందనములు. ఇది ఇక్కడ పరిచయంచేసిన జ్యోతి గార్కి ధన్యవాదాలు.
మనం మనసు తో ఆలోచించడం మానేస్తున్నామో ననిపిస్తోంది చాలామాట్లు. తప్పు ఎవరిది అని వెతక్కుండా సర్దుకు పోదామనే భావనను రానీయటం లేదు. "ఒకవేళ అపార్ధాలు వచ్చినా వాటిని వేంటనే అడిగి క్లియర్ చేసుకోవాలిగా" అన్నారు జ్యోతిగారు. నిజమే కానీ అపార్ధాలు వచ్చాయని తెలిసి కూడా మనం చొరవ తీసుకోవటం లేదు. మనస్తత్వాలు మారుతున్నాయి కాలంతో పాటు.అందరివీ.

lalithag

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవే అభిప్రాయాలు రెండు వైపులా వినిపిస్తాయి.
ఇరు వైపులా "మేము బాధితులం" అనే భావనలోనే ఉంటారు.
నిజంగానే ఒకరిదే తప్పు అవ్వచ్చు. ఇద్దరిదీ అవ్వచ్చు. మూడో వర్గంది కూడా అవ్వచ్చు.
ఎవరికి వారు ఎవరి మనసుని వారు అర్థం చేసుకుని ఆ "పరిస్థితి" ని గెలిచే ప్రయత్నం చెయ్యాలి.
చెప్పినంత సులభం కానే కాదు. చిటికెలో తీరేదీ కాదు. కానీ ఇది ఒక్కటే మార్గం.
సమస్య తీరక పోవచ్చు. మనుషులు మారక పోవచ్చు. తీరనూ వచ్చు, మారనూ వచ్చు.
కానీ సమస్యను దాటి ముందుకు మాత్రం వెళ్ళవచ్చు.

సి.ఉమాదేవి

మనసుకవి ఆత్రేయగారు మనసుపై ఎన్నో పాటలు రాసారు.మనసును తడిపిన పాటలవి.శ్రీధర్ గారు వ్యాస సంపాదకీయాలు మనసుతోనే రాస్తున్నట్లుంది.మనసు చేసే గారడీలను అతి చక్కగా వివరిస్తున్నారు.మీ మాటలు అక్షరసత్యాలు.మనసు చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి కేవలం చెవితో వినడం నోటికొచ్చింది (మానసిక విశ్లేషణ లేకుండా)అనెయ్యడం అనుబంధాలను ఎలా పెంచగలుగుతుంది?మానవతను ప్లాస్టిక్ సర్జరీతో మాయంచేసి కృత్రిమనవ్వులను ముఖంపై నాటుకుని మనసు కనబడని మరో కొత్త మనిషి నేటి సమాజంలో నడయాడుతుంటే మనసునెలా వెతికేది?ఎలా గెలిచేది?మనసు గతి ఇంతే అని పాడుకోవాల్సిందేనా?వద్దు!మరుగునబడ్డ మానవత్వాన్నిమనసంతా నింపుకుని ప్రేమ,కరుణ,క్షమ అను దివ్యాక్షరాలను గాయత్రీ మంత్రంలా పఠిస్తుంటే మనసులు గెలవడం సుసాథ్యమే.మా మనసులకింత విశ్లేషణామృతాన్ని రుచిచూపిస్తున్న శ్రీథర్ గారికి,అందచేసిన జ్యోతిగారికి మనసానమామి.

M.Srinivas Gupta

గురువు గారు ఉమాదేవి గారు అన్నట్లు ఈ మద్యలొ మీరు "మనసు" మాటల్ని ఆవిష్కరిస్తున్నారు

>>కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం!...
నేటి మార్కెట్‌‌లొ నిలబడాలంటె తప్పదు కదా.!

>>మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది.

స్నేహాన్ని ప్రాణంగా భావించే వారికి మాత్రం ఈ మాట చివుక్కు మంటుంది.

Anonymous

శ్రీధర్,
ఎందుకో మీ సంపాదకీయాలు నాకు కరెక్ట్ గా సూటు అవుతాయి. మీరు చెప్పిన విధంగానే ఒక స్నేహితుడికి దూరం అయ్యాను. ఆ స్నేహితుడి మీద ఎంత విరక్తి అంటే, జీవితంలో నేను నీతో మాట్లాడను అనేంత. అతనికి నా మీద ఎంత కోపం వచ్చిందో తెలియదు.

బాదాకరమైన అనుభవమైనా స్నేహితులకు , కాలనుకునే వాళ్లకు దూరంగా వుంటే మంచిది అనే పాఠాన్ని నేర్పింది.

Unknown

@జ్యోతి గారు, మన ఆత్మీయుల్ని తప్పుగా అర్థం చేసుకున్నామని వారి వద్ద వ్యక్తపరిస్తే ఎక్కడ మనం చులకన అయిపోతామేమోనన్న భయంతో చాలామంది కమ్యూనికేషన్ గ్యాప్ పెంచుకుంటుంటారు. దాంతో ఇద్దరూ సామరస్యంగా ఆ అగాధాన్ని పూడ్చుకునే అవకాశమే చిక్కదు. బలమైన బంధాలకు తీయటి మాటల పూతలు అవసరం లేదు. ఆయా బంధాల పట్ల మనం కనబరిచే బాద్యతే వాటిని పటిష్టంగా నిలుపుతుంది. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. మీరన్నది చాలా కరెక్ట్. అపార్థాలు వచ్చినా వాటిని సరిచేసుకునే ప్రయత్నమే చెయ్యడం లేదు ఎవరూ! ఒకవేళ "ఆ ఇద్దరి"లో ఎవరొకరు ప్రయత్నించినా మరొకరు ముడుచుకుపోతూ దారులు మూసేస్తుండడంతో శాశ్వతంగా దూరం అవుతున్నారు. మీరు స్పందించినందుకు ధన్యవాదాలు.

@లలిత గారు, నమస్కారం. "ఎవరికి వారు వారి మనసుని అర్థం చేసుకుని ఆ పరిస్థితిని గెలిచే ప్రయత్నం చేయాలి" అని మీరు సూచించిన పరిష్కారం అన్నింటికన్నా ఉత్తమమైనది. మీరన్నట్లు సమస్య తీరకపోవచ్చు, తీరొచ్చు.. అది మనుషుల మధ్య ఉండే వేవ్ లెంగ్త్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ స్పందన వెల్లడించినందుకు ధన్యవాదాలండీ.

@ ఉమాదేవి గారు, నమస్కారం. అస్సలు మనసొకటి లోపల ఉంది అనే స్పృహ మనకు ఈరోజుల్లో ఇంకా మిగిలుంటేగా.. కాస్త తీరికగా మనసుకు నచ్చినట్లు ప్రవర్తించేది! "మానవతను ప్లాస్టిక్ సర్జరీతో మాయంచేసి కృత్రిమనవ్వులను ముఖంపై నాటుకుని మనసు కనబడని మరో కొత్త మనిషి నేటి సమాజంలో నడయాడుతుంటే మనసునెలా వెతికేది?...." చాలా బాగా చెప్పారు. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

@ శ్రీనివాస గుప్త గారు, మిత్రమా :) ఈరోజుల్లో ఈ ప్రపంచంలో మనసు గురించి మాట్లాడడం అనేది వృధా ప్రయాస అని అర్థమవుతూ కూడా ఇలాంటి విశ్లేషణలు వ్యక్తపరచలేకపోతే మనసూరుకోవడం లేదు. "మరో రైలు, మరో మజిలీ.." వాక్యం నిజంగా రాసేటప్పుడు నాకూ బాధేసింది. కానీ ఎందుకో రాయక ఉండలేకపోయాను. రెగ్యులర్ గా నన్ను ఆత్మీయునిగా భావిస్తూ స్పందన తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు.

@ a2zdreams గారు, నమస్కారం. నిజజీవితంలో మీకూ, నాకూ, మనందరికీ ఎదురయ్యే అనుభవాలే ఇవి. మీరూ, నేనూ సంపాదకీయాల ద్వారానో, కామెంట్ల ద్వారానో స్పందిస్తున్నాం. కొందరు వ్యక్తపరచలేరు అంతే తేడా. తరచూ సంపాదకీయాలకు స్పందన తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008