Sunday, 17 October 2010

అమ్మలగన్నయమ్మ...


శ్రీలన్ భక్తులపాలు సేసి; మహదాశీర్వాదముల్ కొల్పి; నీ
మ్రోలన్ భక్తిగ వ్రాల జేసి; సుజనామోదంబుగా నుండగా
లీలన్ జేతువు భక్తులన్ కరుణతో లీలావతీ! నీ కృపన్
జాలన్ వర్ణన సేయగా ననుపమా! ఛాముండికా! శాంభవీ!



నవ దుర్గా మహనీయ భావముల నానందంబుగాఁ జూపగా
నవ మాసంబులు మ్రోయు తల్లివిగ నానా రూప సంపూజ్యగా;
ధవళాక్షీ వర సౌమ్య రూపవతిగా; దాక్షాయినీ! వెల్గెదే?
శివసన్మానస హారిణీ! మముల నాశీర్వాదమున్ దేల్చుమా!



కాల విచిత్ర చక్రమున కల్పనలెవ్వియొ? గమ్య మెద్దియో?
చాల మెఱుంగ మేము. నెఱ జాణవు నీవ! మహేశ్వరీ! కృపన్
జాలము సేయకమ్మ! వివశత్వులఁ గాంచుమ! కావుమా! మహా
భీల మదాది రుగ్మతల పీచ మడంచుమ. భక్త బాంధవీ!
జ్యోతిస్వరూపిణిగ; భీతాపహారిణిగ; నీతి ప్రదీపిని వనన్
నీ తీరు జూపగ గుణాతీతుడే పొగడ; భాతిన్ కవిత్వ మగుచున్
శ్వేతాశ్వధాటిగ ప్రభాతారు ణాద్భుత ప్రపూ తామృతాంశ మనగా
మాతా! జనింప గదె? నా తప్పులన్ మరచి; మాన్యత్వముం గొలుపగా!

దుర్గమ మైన నీ హృదయ దుర్గము నీశ్వరుడేలు గాదే! మా
దుర్గ వటంచు మ్రొక్కితిమి దుష్టత బాపి; గ్రహింప రాదొకో?
భర్గుఁడు భక్త బాంధవుఁడు. భార్గవి వీవు గణించి; మమ్ము నీ
వర్గమునందు చేర్చి; వర భక్తి ప్రపత్తుల గొల్వఁ జేయుమా!




పద్యరచన: చింతా రామకృష్ణ
పద్యగానం : సనత్ శ్రీపతి


10 వ్యాఖ్యలు:

తృష్ణ

మీకూ మీ కుటూంబ సభ్యులకూ విజయదశిమి శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్

జ్యోతిగారూ!మీకూ మీ కుటుంబ సభ్యులకూ విజయదశమి శుభాకాంక్షలు.

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు!
మీకూ, మీ కుటుంబ సభ్యులందరికీ
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

శ్రీలలిత

పర్వదినాన్ని అతి పవిత్రంగా మా ముందుంచారు. అభినందనలు. మీకూ మీ కుటుంబసభ్యులకూ దసరా పండుగ శుభాకాంక్షలు..

Revanth

జ్యోతి గారు మీకు మీకుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు.

జయ

మీకు విజయ దశమి శుభాకాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు.

జ్యోతిగారూ!
మికూ; మీ కుటుంబ సభ్యులకూ; పద్యాలను అద్భుతంగా ఆలపించిన సనత్ శ్రీపతిగారికీ; వారి కుటుంబ సభ్యులకూ విజయ దశమి సందర్భంగా శుభాకాంక్షలు.

మాలా కుమార్

దసరా శుభాకాంక్షలు .

హనుమంత రావు

శ్రీమాతపై చింతా వారి పద్యరచన బాగుంది
మీ చిత్రసంకలనం చాలా బాగుంది
ఆలస్యమైనా ఆశ్వీయుజంలోనే....
విజయదశమి శుభాకాంక్షలు.

రాజేశ్వరి నేదునూరి

అమ్మవారి చక్కని చిత్రములతొ చింతా వారి పద్యాలు అద్భుతం.ఆలస్యం గా చెబుతున్నందుకు మన్నించ గలరు. " విజయ దశమి శుభా కాంక్షలు + దీపావళికి [ ముందుగా నే ] శుభా కాంక్షలు "

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008

Jump to TOP