Tuesday, 26 October 2010

టంటంట టంటంట

ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సభకు వచ్చాడు. సింహాసనం మీద కూర్చుని "టంటంట" అంటూ కూనిరాగం తీయసాగాడు. అలా కూనిరాగం తీస్తూనే సభకు వచ్చిన కవులను, మంత్రులను పలకరించాడు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఇదేంటని అడగడానికి ధైర్యం చాలడంలేదు. మంత్రి సభను ప్రారంభించడానికి మహారాజు అనుమతి కోరి సభలోని కవులకు ఆనాటి సమస్యను ఇవ్వమన్నాడు.. దానికి కూడా రాజు ""టంటంట టంటం - టంటంట టంటః " " అన్నాడు. ఇది ఆఖరి పాదంగా తీసుకొని మిగిలిన మూడు పాదాలు చెప్పి శ్లోకాన్ని పూర్తి చేయమన్నాడు. అది విన్న కొందరు కవులకు కోపం వచ్చింది, కొందరికి ఆశ్చర్యమేసింది. మరికొందరు మహారాజుకు మతిపోయిందేమో అనుకున్నారు కూడ. కాని మహాకవి కాళిదాసు మాత్రం ఎటువంటి భావం చూపకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు మహారాజు " మహాకవీ! " "టంటంట టంటం - టంటంట టంటః " " ఇంద్ర వజ్ర వృత్తంలో పాదం ఇది. ఈ వృత్తం మీకు కొట్టినపిండి కదా కానివ్వండి మరి " అన్నాడు.

కాళిదాసు ఊరుకుంటాడా? కొద్ది క్షణాలు ఆలోచించుకుని ఇలా చెప్పాడు.

"రాజ్యాభిషేకే మద విహ్వలాయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘట: యువత్యా!
సోపాన మార్గేషు కరోతి శబ్దం
"
టంటంట టంటం - టంటంట టంటః "

రాజుగారికి పరిచారికలు స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి అందాన్ని చూస్తూ మైమరచి తన చేతిలోని బంగారుగిన్నె జారవిడిచింది. ఆ గిన్నె స్నానఘట్టం మెట్ల మీదుగా దొర్లుతూ, రాజుగారు చెప్పినట్టు..."టంటంట.. టంటంట.. టంటంట.. టంటంట " అని మోత చేసింది .. అంతే..

ఎంతైనా మహాకవి . రాజుగారి మన:స్థితి తెలిసినవాడు కదా..

అసలు చందస్సు గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఓ కూనిరాగం కొండగుర్తుగా పెట్టుకుంటే బావుంటుంది కదా. ఎలాగంటారా?? గుర్వులూ, లఘువులూ, గణాలు అంటూ కష్టపడి గుర్తుపెట్టుకునే బదులు హాయిగా టటట లేదా లలలా అంటూ పద్యపాదం గుర్తుపెట్టుకుంటే సరి.

ఉదా.. ఉత్పలమాల లో భరనభభరవ అని బట్టీయం పట్టేబదులు ఇలా ఐతే ఎలా ఉంటుంది చూడండి..

టాటట, టాటటా, టటట, టాటట, టాటట,టాటటా, టటా!
బూవులు గోట మీ టుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కా మి శం

మరో విధానం చూద్దాం..
మత్తేభంలో సభరనమయవ అని గణాలు గుర్తుపెట్టుకునే బదులు ఇలా ప్రయత్నించి చూడండి.
లలలా లాలల లాలలా లలల లా లాలా లలాలాలలా
అరి చూ చున్ హరి చూచు సూ చకము లై అందంద మందార కే

మరి ఆలస్యమెందుకు? మీరు ఈ కొత్త ప్రయోగం మొదలెట్టండి..

11 వ్యాఖ్యలు:

D. Subrahmanyam

బాగుంది :)

రాజేశ్వరి నేదునూరి

చాలా బాగుంది జ్యొతి గారు.ఆశక్తి కరంగా ఉంది.

మాగంటి వంశీ మోహన్

ఏమిటీ - పద్య రచన కూడా మొదలైందా! ఎక్కడో దాగిన కవయిత్రిని బయటకు తీస్తున్నారా? శుభం!

బ్లాగే జనా స్సుఖినోభవంతు!

karlapalem Hanumantha Rao

కొత్తగా ఆసక్తికరంగా చెప్పారు .అభినందనలు

యమ్వీ అప్పారావు (సురేఖ)

చాలా బాగుందమ్మా!!

కథా మంజరి

ఆసక్తికరమయిన కథనం. చాలా బాగుంది. ఛందస్సు గుర్తంచు కోడం కోసం మీరు చెప్పిన చిట్కా తమాషాగా ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం

భోజరాజు ను చూస్తే కవిత్వం అల్లా వచ్చేసేది ట. మీరు ఇంకో కొంచెం ఎక్కువే ట.వారిని తలుచుకొని కవిత్వం చెప్పేస్తారు ట.
భ ర న భ భ ర వ ఉత్పలమాల
న జ భ జ జ జ ర చంపకమాల
స భ ర న మ య వ మత్తేభం
మ స జ స త త గ శార్దూలం
అని పద్యం రాసుకొని మరీ భట్టి పట్టాము మేము. ఇంతకీ అవి కరెక్టే నా లేకపోతే మా తెలుగు మాష్టారు లా చెవి మెలేస్తా నంటారా.
బాగుంది మీ కవిత్వం :-):-)

జ్యోతి

అయ్ బాబోయ్! అందరూ నామీద అలా ఫిక్స్ ఐపోకండి. పాతపుస్తకాలు సర్దుతుంటే భోజరాజు కధలు దొరికింది (ఇంట్లోనే ఉంటే దొరకడమేంటి? కనపడింది).. పేజీలు తిరగేస్తుంటే ఈ పద్యం బావుందే అనుకున్నా. ఈ విషయమై ఒక మిత్రుడితో ముచ్చటిస్తుంటే ఇలా చేస్తే బావుంటుంది కదా అని వచ్చిన అతితెలివి ఐడియా అన్నమాట. అసలే నాకు బద్ధకం ఎక్కువ. పనులు ఎంత ఈజీగా అవుతాయా అని చూస్తున్నా. ఇలా పద్యాలు ప్రయత్నిస్తే బావుంటుందేమో అని చూస్తున్నా.

ఐనా మన బ్లాగ్లోకంలో కూడా ఇలాగే ఆశువుగా పద్యాలు చెప్పేవాళ్లు ఉన్నారు. మాటలనే పద్యాలుగా మార్చేస్తారు. :))

Dr.Tekumalla Venkatappaiah

పద్యకవిత్వం కూడా మొదలెట్టేసారా!! కానివ్వండి.. బాగుంది.

Apparao

:)

ఇందు

నాకు పద్యాలు అట్టే అర్ధం కావు..అందుకని ముందు భావం చదివేసి అపుడు పద్యం చదువుతా...ఇపుడు కూడా మీ పోస్ట్ లో ముందు భావం చదివా....అరె! భలే ఉందే అని అపుడు పద్యం చదివా..చాలా ఈసీ గా ఉంది :) నా మట్టి బుర్రకి కూడా వెంటనే అర్ధమయింది...అది మీరు వ్రాసిన భావం మహత్యమో...కాళిదాసు గారి పద్యమహత్యమో....

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008