మార్పుని సదా ఆహ్వానిద్దాం.. జనవరి 2011 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్
మార్పు అనేది కాలధర్మం.. జీవిత ధర్మం కూడా! ఈరోజు మనం జీవిస్తున్న జీవితానికి భిన్నంగా మరింత మెరుగైన జీవితం కోసం మన మాటల్లో, చేతల్లో మార్పుని ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. అయితే మన ప్రయత్నం యొక్క చిత్తశుద్ధిపై దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తోందంటే ప్రతీ ఒక్కరూ మనసులో సరికొత్త ఆశలను మోసుకెళ్తుం టారు. కాలెండర్‌లో జనవరి 1 అనే తేదీని ఎంత వేడుకగా చేసుకుంటామో, ఆ తేదీన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఏడాది పొడవునా కొనసాగిస్తామని ఎంత నమ్ముతామో.. అదే నమ్మకం మిగిలిన సందర్భాల్లో మన నిర్ణయాలపై ఎందుకు ఉండదు? ఒక మనిషిగా మనం నిరంతరం మారాల్సిందే.. మనలో ఎన్నో లోపాలు.. అపరిపక్వతలు..!! వాటన్నింటినీ సరిచేసుకుంటూ సంపూర్ణమైన వ్యక్తిగా ఎదిగే విధంగా మనం కోరుకునే మార్పు ఉండాలి. ఆ మార్పు కోసం ఆరాటం అనేది నిరంతరం మనలో జ్వలించవలసిన కోరిక.
ఏడాదిలో ఏ కొద్దిరోజులో మిణుకు మిణుకుమని ఆరిపోయేటంత బలహీనమైనది కాకూడదు. మనం మార్పు వైపు సాగించే ప్రయాణంలో అన్నీ మన అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. మనం ప్లాన్ చేసుకున్నామని, పరిస్థితులు మనకు తగ్గట్లు ప్లానింగై పోవు కదా! ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తుంటారు. వాటన్నింటినీ స్వీకరిస్తూ మనమెళ్లే మార్గాన్ని తేలికపరుచుకుంటూ ముందుకుసాగవలసిన విజ్ఞత కూడా మనకు ముఖ్యమే. అంతే తప్ప నేను మారాలనుకున్నా.. పరిస్థితులు అనుకూలించడం లేదు.. అని వాపోతున్నామూ అంటే మనమెంత పలాయనవాదంలో బ్రతుకుతున్నామో గ్రహించాలి. మార్పు ఏదైనా కావచ్చు.. మన శ్రేయస్సుకి సంబంధించినదే అయి ఉండడం కాదు.. మన చుట్టుపక్కల ఉన్న వారి శ్రేయస్సు, సమాజపు శ్రేయస్సు ఆకాంక్షించేదై ఉండాలి. అప్పుడే ఆ మార్పుకి నైతికంగా బలం చేకూరుతుంది. కేవలం వ్యక్తిగత స్వార్థాలతో కూడిన మార్పులు మనల్ని ఒక్కళ్లనేం సంతుష్టులను చెయ్యగలవు తప్ప.. తీరా ఆ సంతృప్తిని ఆస్వాదించడానికి మనమొక్కళం తప్ప ఇంకెవరూ లేరని గ్రహింపుకు వచ్చినప్పుడు మన వెంట ఎవరూ లేరని మరో అసంతృప్తి మొదలవుతుంది. పాత సంవత్సరం అయినా, కొత్త సంవత్సరం అయినా ఈ క్షణం మన మనసులో స్ఫురించే ఆలోచన ముఖ్యం.. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మనం కనబరచదలుచుకున్న చిత్తశుద్ధి ముఖ్యం! క్షణానికి విలువ ఇవ్వాలి తప్ప వారాలకూ, నెలలకూ, సంవత్సరాలకూ కాదు. ఇలా ఏళ్ల తరబడి నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి వాయిదా వేస్తూ పోతే చివరకు గతించిపోయిన కాలం మాత్రమే కన్పిస్తుంది తప్ప సాధించిన ప్రగతి శూన్యంగానే ఉంటుంది. కాలం మారుతుంది, సమాజం మారుతోంది.. పరిస్థితులు మారుతున్నాయి.. నిజంగానే మనమూ మారాలి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి మనం కోరుకుంటున్న మార్పు మనలో మానవత్వాన్ని చంపేసేదై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదు.. పోటీ పేరుతో మనల్ని యాంత్రికంగా మార్చేదై.. మనుషుల ఆహ్లాదకరమైన సాన్నిహిత్యాన్ని దోచుకునేదై ఉండకూడదు. అలాంటి ఏ మార్పు అయినా ఎల్లవేళలా ఆహ్వానించదగ్గదే!
మీ
నల్లమోతు శ్రీధర్
2 వ్యాఖ్యలు:
Change is inevitable.మార్పు సహజం.మార్పును ఆహ్వానించకపోతే గొంగళి పురుగు సీతాకోకచిలుకయ్యేదా?ఆశావహ మార్పు నిత్యం అభిలషణీయం,అనుసరణీయం.
మారుతున్న వత్సరంలో మార్పుపై వ్యాసం అభినందనీయం.
ఉమాదేవి గారు నమస్కారం. మీ విశ్లేషణాత్మకమైన స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Post a Comment