గోరింటా పూసిందీ కొమ్మా లేకుండా
అతివలకు పసుపు కుంకుమతో పాటు గోరింటాకుతో కూడా అవినాభావ సంబంధముంది. కొమ్మకు పూయాల్సిన ఆ గోరింటాకు అతివల అరచేతిలో ఎర్రగా పూస్తుంది. అందమైన పూలు. లతలు, నెలవంకతో సహా ఎన్నో డిజైన్లలో పండుతుంది. మగువలకు ఎంతో ప్రియమైనది ఈ గోరింటాకు. ఎంత ఆధునికంగా పెరిగినా గోరింటాకు పెట్టుకోవడం అంటే ప్రతీ ఆడపిల్ల మక్కువ చూపిస్తుంది. ఎటువంటి శుభకార్యమైనా , పండగైనా అమ్మాయిలు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.. అంతగా అమ్మాయిల జీవితంతో మమేకమైంది ఈ గోరింటాకు. పండగైనా, పబ్బమైనా, పల్లైనా , పట్నమైనా , పల్లె పడుచైనా, సాఫ్ట్ వేర్ ఇంజనీరైనా , క్రీడాకారులు, కళాకారులు ఇలా అందరినీ ఒకేవిధంగా అకట్టుకుని మనసులను దోచుకుంటుంది గొరింటాకు. భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో ఈ గోరింటాకు ప్రధాన భాగమైంది.
అసలు గోరింటాకు పుట్టుక ఎక్కడ జరిగింది అని ఆరా తీస్తే.. సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన ఈజిప్షియన్లు గోరింటాకు వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. ఉత్తర ఆఫ్రికాలోని ఎడారి వాసులు గోరింటాకును వేడిని తగ్గించే చలువ వస్తువుగా ఉపయోగించేవారు. మొఘల్ చక్రవర్తులు కూడా గోరింటాకు విరివిగా ఉపయోగించేవారు. వారి ద్వారానే భారత దేశంలోకి ఈ గోరింటాకు ప్రవేశించి ఒక ప్రవిత్రమైన సంప్రదాయమై ఎల్లెడలా విస్తరించింది. పిల్లలు, పెద్దలు , వృద్ధులు అన్న తేడా లేకుండా గోరింటాకు పెట్టుకుని, అది పండిన తర్వాత చూసుకుని మురిసిపోతారు. ఇక పెళ్లి కూతురు కాళ్లకు , చేతులకు అందమైన గోరింటాకు ఉండాల్సిందే కదా. అంతేకాదు ఈ గోరింటాకు పూసిన విధానం బట్టి " మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే సిరిసంపదలు కలవాడొస్తాడు, సింధూరాంలా పూస్తే ఆ నింగినున్న చందమామే దిగి వస్తాడు అని అమ్మాయి మనసులో అందమైన ఊహలు, ఆశలు, నమ్మకాలను పండిస్తుంది.. పెళ్లైన యువతి చేతి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే భార్యా భర్తల మధ్య ప్రేమ కూడా అంత గాఢంగా ఉంటుందని విశ్వసిస్తారు..
గోరింటాకు చెట్టు సుమారు నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరిగే మొక్క. ఈ మొక్కకు ముళ్లు , తెల్లటి చిన్న చిన్న పూవులు ఉంటాయి. దీని పళ్లు చిన్నగా కుంకుడు గింజల్లా, విత్తనాలు త్రికోణంగానూ ఉంటాయి. ఈ గోరింటాకు మొక్క భారత దేశంలోని సమశీతోష్ణ ప్రదేశాలన్నిటిలోనూ పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం - లాసోనియా ఇనర్మిస్ (Lawsonia inermis). సంస్కృతంలో మదయన్తిక, హిందీలో మెహంది లేదా హెన్నా అంటారు. తెలంగాణా ప్రాంతంలో మైదాకు అని వ్యవహరిస్తారు. గోరింటాకు మొక్క సౌందర్య సాధనంగానే కాక ఔషద గుణాలు కూడా కలిగి ఉంది. దీని వేర్లు, కొమ్మలు, ఆకులు, విత్తనాలు అన్నీ ఉపయుక్తమైనవే.
అసలు ఈ ఆకుల వల్ల మన చర్మం మీద ఎర్రగా ఎలా పండుతుంది అనుకుంటున్నారా?? ఆకులోని లాసోన్ అనే పదార్ధం చర్మంలోని స్త్రామ్ కార్నియం పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. లాసిన్తో పాటు మేనైట్ యాసిడ్ మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్టాక్వినొన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండడం వల్ల ఇది మంచి కలర్ డైగా వాడుకలో ఉంది. అందుకేనేమో మన దేశంలో పెళ్లికి, గోరింటాకుకు విడదీయలేని అనుబంధం ఉంది అని చెప్పవచ్చు. పెళ్లి లేని గోరింటాకు ఉండవచ్చునేమో కాని గోరింటాకు లేని పెళ్లి సందడి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఉత్తర భారతీయులైతే పెళ్లికి ముందు మెహెంది అని గోరింటాకు పెట్టుకోవడానికే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అబ్బాయి తరఫునుండి వచ్చిన గోరింటాకుతో పెళ్లి కూతురుకు అందమైన దిజైన్లు దిద్దుతారు. కొన్ని సంప్రదాయాలలో కొత్త పెళ్లి కూతురి చేతి గోరింటాకు వదిలేవరకు వంటింట్లోకి రాకూడదని అంటారు. అమ్మాయిని అంత అపురూపంగా చూసుకుంటారన్నమాట.
అరుణ వర్ణంలో, అందంగా పండడానికి గోరింటాకు తయారుచేయడంలో కూడా కొన్ని కిటుకులు ఉన్నాయి. లేతగా ఉండే గోరింటాకును తెచ్చి రోటిలో వేసి మెత్తగా రుబ్బుతారు. ఇందులో చిక్కని రంగు రావడానికి కొంచం కాసు లేదా పెరుగు కలుపుతారు. కొందరు నిమ్మరసం, లవంగ నూనె, యూకలిప్టస్ నూనె, బెండకాయ రసం మొదలైనవి కూడా కలుపుతారు. ఇదంతా గోరింటాకు బాగా పండాలని, ఎక్కువ రోజులు చేతికి ఉండాలనే ఆరాటం. రుబ్బిన ముద్దను అరచేతిలో , వేళ్లకు కావలసిన రీతిలో పెట్టుకుంటారు. రుబ్బిన ఆకుతో సన్న డిజైన్లు వేసుకోవడం కష్టం .. అదీ కాక ఈ రోజుల్లో గోరింటాకు దొరకడం కూడా కష్టమే. అందుకే మార్కెట్లో సులువుగా దొరికే గోరింటాకు పొడి లేదా తడిపిన గోరింటాకుతో ఉండే కోన్ లు తెచ్చుకుంటారు చాలా మంది. ఆకులను నీడన ఆరబెట్టి పొడి చేసి అమ్ముతారు. ఆ పొడిని తడిపి ప్లాస్టిక్ కవర్లో పెట్టి సులువుగా అందమైన డిజైన్లు వేసుకునేలా కోన్ రూపంలో చేసి అమ్ముతారు. చవక కూడా. చేతికి గాని, కాళ్లకు గాని గోరింటాకు పెట్టుకుని 6- 8 గంటల వరకు ఉండనివ్వాలి. దానివలన ఆకుల రసం చర్మంలోకి ఇంకి, చిక్కని రంగు వస్తుంది. ఎక్కువరోజులు తెల్లబడకుండా ఉంటుంది. ఆరిపోయిన గోరింటాకుపై చక్కెర కలిపిన నిమ్మరసంతో అద్దుతారు. పూర్తిగా ఎండిన తర్వాత గోరింటాకును నీళ్లతో కడగకుండా చాకుతో కాని చేత్తో కాని తీసేయాలి. తీసిన తర్వాత కూడా కనీసం 12 గంటల వరకు నీటి తడి తాకకుండా ఉంటే ఆ ఎరుపు ఇంకా చిక్కబడుతుంది.. రంగు ఎక్కువ రోజులు ఉంటుంది. శరీర తత్వం బట్టి గోరింటాకు రంగు వేర్వేరుగా ఉంటుంది.
గోరింటాకు ఒక సౌందర్య సాధనమే కాదు. ఆరోగ్య ప్రదాయిణి కూడా. స్త్రీలు ఇంటి పనులలో కాళ్లు, చేతులు ఎక్కువగా నీళ్లలో నానడం వల్ల సున్నితంగా ఉండి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. కాని గోరింటాకు వ్యాధినిరోధక లక్షణాలు కలిగి ఉండడం వల్ల కాళ్లకు , చేతులకు పెట్టుకుంటే రక్షణగా ఉండి క్రిములను దరి చేరనీయదు. శ్రావణ, బాధ్రప్రద మాసాలలో వర్షాలు అధికంగా ఉంటాయి. ఐనా కూడా స్త్రీలు తమ పనులన్నింటినీ నీళ్లలో నానుతూనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం మొదలైన పనులన్నీ నీళ్లలోనే చేసుకోవడం వల్ల కాలి గోళ్లు, మడమలు, చేతులు. వేళ్లు కూడా రోగాల బారిన పడే ప్రమాదముంది. వాటినుండి కాపాడుకోవడానికే ఈ గోరింటాకు పెట్టుకునే ఆచారం పెట్టారు పెద్దలు. ఇలా ప్రకృతికి , వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆచారాలను ప్రవేశపెట్టడం ఒక మూఢ నమ్మకంలా కాక వైజ్ఞానిక దృక్పధం కనిపిస్తుంది.... ఆయుర్వేదంలో కాలేయ రోగాలకు, నోటిపూత, గనేరియా లాంటి రోగాలకు మందుగా వాడతారు. గోరింటాకునుండి లభింఛే లాసోన్ అనే పదార్ధం సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. తరచూ నోటిపూతతో బాధపడేవారు గోరింటాకు కషాయాన్ని నోటిలో వేసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. గోరింటాకు చేతులకే కాదు జుట్టుకు కూడా ఉపయోగిస్తారు. తలకు రంగు వేసుకోవడానికి ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతి సిద్ధమైనది. ఎటువంటి హాని కలిగించని డై ఇది. నువ్వుల నూనెలో గోరింటాకు పొడి లేదా ఆకులు వేసి మరిగించి తలకు రసుకుంటే తెల్ల జుట్టు క్రమేపీ నల్లబడుతుంది. కళ్ల మంటలు తగ్గుతాయి. కాళ్ల పగుళ్లు, జ్వరం, హిస్టీరియా, తలనొప్పి తగ్గించడంలోనూ గోరింటాకు ఉపయోగపడుతుంది.
గోరింటాకు పెట్టుకోవడంవల్ల పిల్లలు, వృద్ధులు .. ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగదు.. పైగా ప్రకృతి సిద్ధంగా లభించే సాధనం కావడంవల్ల చల్లగా ఉంటుంది. అందుకే గాయాలకు కూడా గోరింటాకును లేపనంగా ఉపయోగిస్తారు. ఈ మధ్య కాలంలో గోరింటాకును తెల్లజుట్టును నల్లగా చేసేందుకు డై లా విరివిగా వాడుతున్నారు. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి జుట్టుకు ప్రమాదము లేదు. గోరింటాకు వల్ల జుట్టుకు ఎరుపు రంగు వస్తుంది తప్ప పూర్తిగా నల్లబడదు. కాని కొందరు బ్లాక్ హెన్నా అని అమ్ముతున్నారు. అది ఉపయోగించడం మంచిది కాదు. నల్ల రంగు రావడానికి గోరింటాకులో PPD అనే కెమికల్ డై కలుపుతారు. ఇది చర్మానికి హాని కలిగించే కెమికల్. దీనివల్ల కాలేయ, మూత్ర పిండాలు , చర్మ సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఆధునికులు చాలా మంది అందానికి , ఆరోగ్యానికి అద్భుతమైన సాధనంగా ఉన్న గోరింటాకును విడిచిపెట్టి కృత్రిమ రసాయన పదార్ధాలతో తయారు చేసిన గోళ్ల రంగును, అందునా వేసుకున్న దుస్తులకు మ్యాచింగ్ అంటూ ఆయా రంగులు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే హానికారకమైన రసాయన పదార్థాల వల్ల మేలుకంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. గోరింటాకు పొడి కూడా సహజమైన చెట్ల ఆకులనుంఢి తయారుచేసిన పొడి మాత్రమే వాడాలి. కృత్రిమంగా రసాయన పదార్ధాలతో తయారు చేసిన గోరింటాకు మంచిది కాదు.
గోరింటాకు రుబ్బి లేదా పొడిని నీళ్లతో తడిపి అరచేతిలో సూర్యుడు లేదా నెలవంక, చుట్టూ చుక్కలు , గోళ్లకు నిండుగా పెట్టుకోవడం ప్రాచీన సంప్రదాయం. కాని ఇందులో కూడా ఆధునికతను సంతరించుకుని చిత్ర విచిత్రమైన అలంకారాలతో గోరింటాకు కూడా మారింది. గంటలు గంటలు గోరింటాకు పెట్టుకుని కూర్చునే ఓపిక, సమయం లేనివాళ్లకోసం జర్దోజీ విధానం ఉంది. కాళ్లకు, చేతులకు నచ్చిన డిజైన్లతో అలంకరిస్తారు. అరగంట అలా ఉంచేసి కడిగేస్తారు. దీనివల్ల ఆ డిజైన్ లీలగా కనిపిస్తుంది. దానికి వివిధ రంగులు, మెరుపులతో అలంకారాలు అద్దుతారు. ఇది ఎంతో అందంగా కళ్లకింపుగా ఉంటుంది కాని ఎక్కువ రోజులు ఉండదు.. అదే విధంగా కంప్యూటర్ డిజైన్లు, అరబిక్ డిజైన్లు చాలా ప్రాచుర్యం పొందాయి. గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం లేకుంటే అదే డిజైన్లలో స్టిక్కర్లు దొరుకుతున్నాయి. అలా చేతికి అంటించుకోవడమే. ప్రతీ వివాహ శుభకార్యంలో పెళ్లికూతురుకు గోరింటాకు పెట్టడం తప్పనిసరి కదా... దీనికోసం నేడు ఎన్నో బ్యూటీ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. కాలక్షేపానికి నేర్చుకుని వృత్తిగా నిర్వహిస్తున్న నిపుణులైన మెహందీ డిజైనర్లు పుట్టుకొచ్చారు. వివిధ రకాలు డిజైన్లను బట్టి ధర ఉంటుంది.
ప్రాచీనకాలంనాటి అలంకారం మరిన్ని సొబగులు అద్దుకుని అటు ఆధునిక ఫ్యాషన్, ఇటు సంప్రదాయ వేడుకగాను ప్రాశస్త్యం పొందింది ఈ గోరింటాకు.
5 వ్యాఖ్యలు:
Jyothi గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
జ్యొతి గారు, ఒక కిలొ గోరింటాకు పంపించరూ....ఇప్పుడే పెట్టుకొవాలనిపిస్తోంది..
మీకు , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
సూపర్ జ్యోతి. కేక. బాగా రాసేవు. నాకు పెద్ద గా గోరింటాకు మీద ఇష్టం లేక పోయినా నువ్వు రాసిన విధానం బాగుంది. నూతన సవత్సర శుభాకాంక్షలు. అంటే yaapy new year అన్నమాట.
2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
Post a Comment