Tuesday, December 7, 2010

పేపర్ కటింగ్స్...

మీకు పేపర్ లో నచ్చిన వ్యాసాలు, కథలు కట్ చేసి దాచుకునే అలవాటు ఉందా?? నాకైతే ముప్పై ఏళ్ల నుండి ఈ అలవాటు ఉంది. ఆ కాలంలో ఎన్నో సీరియల్లు ముఖ్యంగా యండమూరివి, మాదిరెడ్డి రాసినవి ప్రతి వారం కట్ చేసి పుస్తకంలా బైండింగ్ చేయించి పెట్టుకున్నవి ఇంకా ఉన్నాయి. అలాగే నెహ్రూ, ఇందిరాగాంధీ చనిపోయిన నాటి పేపర్లు ( మా నాన్నగారి దగ్గరనుండి తీసుకుని జాతీయం చేసేసా).. అప్పుడప్పుడు అవి తీసి చదువుతుంటే అదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు, ఆ వార్తను మళ్ళీ కొత్తగా అదేరోజు పేపర్లా అనిపిస్తుంది. ఈ పేపర్ కటింగ్స్ గురించి నేను రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో ఈరోజు ప్రచురించారు.

కొన్ని పదార్థాలు వేడివేడిగా వున్నప్పుడు తింటేనే మజాగా ఉంటుంది. వార్తలూ అంతే ! ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది వేడి వేడి పకోడీలుంచిన ప్లేటు వంటిదన్నమాట. టీయో , కాఫీయో ఒక చేత్తో పట్టుకుని మరోచేత్తో పేపర్ చదువుతూ దినచర్య మొదలెట్టేవారు కోకొల్లలు. ముందుగా ముఖ్య వార్తలు, రాశిఫలాలు, సంచలన వార్తలు, సినిమాలు, క్రీడావిశేషాలు, బులియన్ హెచ్చుతగ్గులు వగైరా చదివేసి తర్వాత తీరిగ్గా మొదటి పేజీ నుండి చివర్లో ఇచ్చే సంతాప సందేశాలు కూడా చదవితే గాని పేపర్ చదివిన తృప్తి ఉండదు. పేపర్ రాత్రి పడుకునేవరకు కూడా మన చేతుల్లో నలుగుతూనే ఉంటుంది. ఎన్ని టీవీ చానెల్స్ వచ్చినా కూడా పత్రికలకున్న ఆకర్షణ, అనుబంధం చెక్కుచెదరలేదు.

కాని పత్రికల్లో ఒక్క వార్తలే కాదుకదా ఉండేది . వ్యాఖ్యలు, వార్తల వెనుక అసలు సిసలు కథలు, వివిధ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులైన వారి విశ్లేషణలు, అపురూపమైన ఫోటోలు, రాజకీయాలపై గిలిగింతలు పెట్టే కార్టూన్లు, ప్రభావితం చేసే సంపాదకీయాలు, ఇలా ఎన్నో విషయాలు నిండిన దినపత్రికలు పుష్పక విమానాలు. పూలు సాయంత్రానికి వాడిపోవచ్చు. కాని మన మనసుని దోచుకున్న వాటి పరిమళం అంత త్వరగా మనల్ని వీడిపోదు. అలాగే ఒక పత్రిక జీవితం ఒక్కరోజైనా, నలిగిపోయి జీవం కోల్పోయినా కూడ మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని , దాచుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వార్తా పత్రికల్లో వచ్చే అనేక ఆసక్తికరమైన విషయాల్ని అలా చదివేసే వదిలేయకుండా, అవసరమైనపుడు మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకున్నపుడు వాటిని కత్తిరించి దాచుకోవాలి. మొత్తం పేపర్లు దాచుకోలేము కదా.పత్రికల్లో వచ్చే వివిధ విషయాలు, అవసరమనిపించినవి సంక్షిప్తంగా డైరీలో రాసుకోవడం కొందరి అలవాటు. కొన్ని అంశాలు మొత్తంగానే భవిష్యత్తులో ఉపయోగపడేవి కావచ్చు. అన్నీ రాసుకోవడం అయ్యే పని కాదు. ఇలాంటి సంధర్భాల్లో నచ్చిన అంశాన్ని కట్ చేసి దాచుకోవడం ఒక్కటే దారి. "అవుటాఫ్ సైట్ , అవుటాఫ్ మైండ్" అన్నారు కదా! ఒకసారి మనకి నచ్చిన సంగతుల్ని భద్రపరచుకోవడానికి బద్ధకిస్తే, ఆ విషయాలు మర్చిపోతాము. మళ్ళీ అదే విషయాల గురించి వివరాలు తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ప్రతీ దానికి మార్కెట్ కెళ్ళి పుస్తకాలు వెతికి కొనలేము కదా!. అయ్యో! ఈ విషయం, సంఘటన ఎప్పుడో చదివాము కదా అనిపిస్తుంది.


కొంతమంది మరీ ముఖ్యమనుకున్న విషయాల్ని ఫోటోకాపీ చేసి పెట్టుకుంటారు. కొంతమంది కటింగ్స్ ని పుస్తకాలుగా కుట్టి దాస్తారు. కొందరు ఫైల్ చేస్తారు. కొందరు తెల్లకాగితాలపై ఈ కటింగ్స్ ని అతికించి పుస్తకాల్లా తయారుచేసుకుంటారు. పేపర్ కటింగ్స్ సేకరించే హాబీ, మానసికానందాన్నే కాక మానసిక వికాసానికి దోహదం చేస్త్తుంది. పిల్లలకు ఈ అలవాటు చేయడం వల్ల వారికి ప్రోజెక్ట్ వర్క్స్ కోసం, పోటీ పరీక్షలకు పనికొచ్చే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దీని వల్ల పిల్లల్లో విషయసేకరణ, వ్యక్తీకరణ, అలవడుతుంది. ఏళ్ళ తరబడి ఈ కటింగ్స్ ని సేకరించగలిగితే , ఒక మినీ లైబ్రరీ మన చెంత ఉన్నట్టే. ఏ విషయం మీదైనా సమగ్రంగా మాట్లాడాలన్నా, రాయాలన్నా, మనం సేకరించిన పేపర్ కటింగ్స్ ఎంతో ఉపయోగపడతాయి.

ఒకప్పుడు ఆంగ్లపత్రికల్లో ముఖ్యంగా ఆగిపోయిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో ఎన్నో అపురూపమైన వ్యాసాలు, ఫోటొలు వచ్చేవి. అయితే పత్రికా ప్రచురణలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు పత్రికల్లో సైతం ఎన్నో ఉపయుక్తమైన వ్యాసాలు, ఫోటోలు వస్తున్నాయి. వీటిని భద్రపరుచుకుని, అప్పుడప్పుడు చూసుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. కోన్నేళ్ల తర్వాత ఈ పేపర్ కటింగ్స్ ని తిరగేస్తుంటే పాతమిత్రుల్ని అనుకోకుండా కలిసినంత ఆనందంగా ఉంటుంది. మంచి వ్యాసాలు, వంటలు, కుట్లు అల్లికలు, సీరియల్ కథలు, మొదలైనవి తర్వాత చదూకోవచ్చు అనే ప్రతి పేపర్ కటింగ్ ని జాగ్రత్త పరిచి పుస్తకాలు బైండ్ చేసి పెట్టుకోవడం చాలా మంచి,ఉపయోగకరలైన అలవాటు. అప్పుడప్పుడు ఈ పేపర్ కటింగ్స్ ముందు పెట్టుకుని ఒక్కోటి చదువుతుంటే ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాయి మన ఆలోచనలు, వాటితోపాటే మనసు కూడా..

ఎన్నో వందల గ్రంధాలు ఒక్క ఇ బుక్‍ లో ఇమిడిపోయే ఈ రోజుల్లో ఇంకా ఈ పేపర్ కటింగ్స్ ఎందుకంటారా? ఎన్ని స్టార్ హోటల్స్ ఉన్నా, ఇంటి వంట రుచి తగ్గిపోతుందా? సాటివస్తుందా??మూడు రోజుల క్రింద ప్రచురించబడిన మరో వ్యాసం.వయసైపోయింది..


ఏదన్నా ఒక కొత్త విషయం గురించి చెబితే మనవాళ్ళూ అదే మంత్రం జపిస్తూంటారు, అబ్బ వైసైపోతోంది ఇప్పుడింకా కొత్త విషయాలేం వంటపడతాయి? అని. వయసు... ప్రతి నిమిషానికి పెరుగుతూ ఉంటుంది. అది శరీరానికి మనసుకు కూడా.. కాని నలభై దాటగానే చాలామంది అనే మాట పెద్ద వయసు వచ్చేసింది. ముందులాగా పనిచేయలేను, ఆలోచించలేను అంటారు. అప్పటికి పిల్లలు కాలేజీలలోకి వచ్చేస్తారు లేదా పెద్దవాళ్ల అవసరం అంతగా ఉండదు వాళ్లకి. చిన్నగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తారు. ఈ అనారోగ్యం శరీరానికే. కాని చాలామంది మనసుకు కూడా వయసు పెరిగిపోతుంది. ఒక్కో వయసులో ఒక్కో రకమైన పనులు చేయాలని మనని మనమే నియంత్రించుకుంటాం. అది ఆహారమైనా, దుస్తులైనా, ప్రవర్తన ఐనా ఇప్పుడు ఇలా ఉండాలి అని అందరూ అంటుంటే మనం కూడా ఓహో అలాగే ఉండాలి. లేకుంటే సమాజం వెక్కిరిస్తుంది. చుట్టాలు ఆడిపోసుకుంటారు అనుకుని వయసుతో పాటు మనసుని కూడా ముసలిదాన్ని చేసేస్తాం. అదే కాక ఈ జీవన ప్రయాణంలో కుటుంబ నిర్వహణ, పిల్లల సంరక్షణ కోసం పని చేయడం అత్యవసరమై మిగిలిన విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు . ముఖ్యంగా వాళ్లకు ఇష్టమైనవి. కాలక్రమేణా అసలు తమకు నచ్చేది ఏంటో కూడా తెలీనంతగా మర్చిపోతారు. ఇంటద్దె కట్టాలి. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలి, పెళ్లిల్లు చేయాలి అనే కోరికలు ప్రతీ తల్లితండ్రులను పూర్తిగా ఆక్రమించేసుకుంటాయి. దీనికోసమే అహర్నిశలు ఆలోచిస్తూ, పని చేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు స్ధిరపడ్డాక వేరే ఏదైనా ఆలోచించడానికి, చేయడానికి ఓపిక ఉండదు మానసికంగా, శారీరకంగా అలసిపోయామనుకుంటారు. అనుభవించవలసిన కాలం గడిచిపోయింది. పిల్లలు బాగుపడ్డారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో నిలదొక్కుకున్నారు. మంచిసంబందాలు చూసి పెళ్లిల్లు చేసాం. బాధ్యత తీరిపోయింది. ఇక మనకంటూ ఏం చేసుకుంటాములే అంటారు. మళ్లీ పిల్లలు , వాళ్ల పిల్లల గురించే శ్రమ పడతారు.


ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. ఒక స్టేజ్ వచ్చాక పెద్దల జీవితం పెద్దలదే. పిల్లల జీవితం పిల్లలదే. వాళ్లకు అవసరమైనంతవరకు తల్లితండ్రులు చేయూత నివ్వాలి. తర్వాత వాళ్లని స్వతంత్రులను చేసి వదిలేయాలి. తల్లితండ్రుల ఎప్పుడూ పిల్లలమీద భారం కాకూడదు. వాళ్ల జీవితంలో అడ్డు కాకూడదు. అలా అని వారితో అనుబంధం తెంచుకోవాల్సిన పనిలేదు. ఇంతకుముందులా ఉమ్మడి కుటుంబం అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుగా ఉండక తప్పడం లేదు. పిల్లలు, తల్లితండ్రులు కూడా ఈ మార్పులు అంగీకరించాలి తప్పదు. అలా అని పిల్లలను వదిలేయాల్సిన పని లేదు. బాధ్యతలు తగ్గించుకోవాలి. పెద్దవయసు వచ్చాక పిల్లల అండ ఉండాలంటారు. వయసు అనేది మన శరీరానికే వచ్చింది. కాని మనసుకు కాదు. అది మనం ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉంటుంది. అలా మలుచుకోగలం కూడా. వయసు పెరిగి, శారీరకంగా అలసిపోయి ఇక మనమేం చేయలేము అనుకునేవారు ఎందరో. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాంలే? ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఏం చేయాలి? అని అంటారు. కాని తీరిగ్గా కూర్చుని మనగురించి ఆలోచిస్తే ఎన్నో చేయగలం. అవి శారీరక శ్రమ కలిగించని పనులు కూడా ఉంటాయి. అందులో లలితకళలు, చదవడం, రాయడం, సహాయం చేయడం మొదలైనవి. కాలేజీ చదువులు, పోటీ పరీక్షలు, సంసార ప్రయాణంలో మనమే మర్చిపోయిన ఇష్టాలెన్నో.. వాటిని పునరిద్ధరించుకుని మళ్లీ మొదలుపెట్టడంలో తప్పు లేదు. ఇలా చేయడంవల్ల ఎవరో నవ్వుతారు, వెక్కిరిస్తారు అనుకోవడం వృధా. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తారు. నవ్వేవాళ్ల నాపచేనే పండుతుంది .. తెలుసు కదా. మీకే తెలియని , మీకు ఇష్టమైన పనులు చేయండి. వీటికి ఖర్చు స్వల్పమే కాని దానివలన లభించే ఆనందం,సంతృప్తి అనంతం.


చాలామంది పిల్లల బాధ్యత తీరిపోయాక ఇక చేసేదేముంటుంది. రిటైరయ్యాము. ఇన్నేళ్లు కష్టపడ్డాం. అలసిపోయాం అనుకుంటారు. అలా అనుకుంటే జీవితం ఇంకా నిస్సారంగా మారుతుంది. అలసట అనేది శరీరానికే కలుగుతుంది. మనసు అలిసి, ముసలిదైంది అనుకోవడం పొరపాటు. తమకంటూ ఒక వ్యాపకం, జీవితం సృష్టించుకోవాలి. అది కుటుంబానికి అతీతంగా వెళ్లడం కాదు. వయసు పైబడగానే పూజలు, ఆధ్యాత్మిక విషయాలు చదవడం, మాట్లాడుకోవడం కాదు. తమకు ఇష్టమైన, చేయాలనుకుని చేయలేకపోయిన పనులు చేయాలి.

ఫలానా వయసులో అనుకోవడం వల్ల సగం నీరసం వచ్చెస్తుంది పెద్దవాళ్ళకి. ఏమయినా నేర్చుకోమంటే ఊళ్ళేలాలా ఉద్యోగాలు చేసి అంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు, ఆ... పెళ్ళయ్యి పిల్లలున్న నన్ను ఎవరు చూస్తారు అనే ఫీలింగు తెలీకుండానే చాలామంది ఆడవాళ్ళలో చొచ్చుకొచ్చి వాళ్లని వేరే ఆలోచించనివ్వదు.. సమాజం ఏమంటుందో అనే భావన చాలా మంది ప్రతిభని తొక్కి పెట్టెస్తుంది. ముసలి వయసు కన్నా ముసలి మనసు ప్రమాద కారి.… మనిషి బ్రతికుండగా చేయగలిగిన పనులు చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. కొన్ని వయసు కు తగ్గట్లు వుండాలి కొన్ని ఎప్పటీకి మనసును నిత్య నూతనం గా వుంచుకుని ఆలోచించగలగాలి చెయ్యగలగాలి.

5 వ్యాఖ్యలు:

హనుమంత రావు

జ్యోతిగారు, గొప్ప అలవాటు...మా సురేఖగారికీ
ఈ అలవాటుంది...నాకైతే దాయాలనే వుంటుంది.
కాని అలా అలా పెరిగిపోతుంటే తీసేస్తూవుంటాను.
ఏదైనా పాత విషయాలు క్రొత్త ఆలోచనలు
పుట్టిస్తాయి....మీ టపా బాగుంది.

సి.ఉమాదేవి

జ్యోతీ, ఏమి రాయాలంటూనే చక్కటి వ్యాసాలు రాసారు.చాలా సంతోషం.Keep it up!

Hari Chandana P

Jyothi garu, chala bagunnayi mee vyasaalu..

మాలా కుమార్

అభినందనలు .
నాకూ ఇలా పేపర్ కటింగ్స్ దాచే అలవాటు వుండేది . కాని తరుచూ వూళ్ళు మారటము , ఇక్కడి కి వచ్చినా ఇళ్ళు మారటము తో ఎప్పటికప్పుడు పారేసి రావాల్సి వస్తోంది . అందుకే విసుగొచ్చి, ఈ మద్య మానేసా .

kaartoon.wordpress.com

నాకూ ఇలా ముఖ్యవిషయాలు వున్న న్యూస్ పేపర్లు దాయటం అంటే
ఇష్టం. హిండూలో బోఫర్స్ పై చిత్రాసుబ్రహ్మన్యం చాలా పరిశోధనాత్మక
వ్యాసాలు వ్రాసారు..యన్టీయార్ మొదటిసారి గెలిచినప్పటి ఈనాడు
హెడ్లైన్స్ వార్త పడ్ద పేపరు నా దగ్గర వుంది. కొంతమందికి ఇది ఓ పిచ్చిగా
అనిపించవొచ్చోమో గాని ముందు తరాలవారికి ఉపయోగిస్తుందని నాకు
నమ్మకం.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008