Saturday, December 4, 2010

అందమైన " ఆరాధన"

అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లకు చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని ఒకటవుతారు. కాని అనుకోకుండా పైలట్ ఐన అబ్బాయి యుద్ధంలో మరణిస్తాడు. అమ్మాయిని అత్తగారింట్లో తమ కోడలిగా అంగీకరించరు. తనకు పుట్టిన బిడ్డను దత్తుకు ఇచ్చి అక్కడే ఆయాగా చేరుతుంది. ఒకానొక పరిస్థితిలో హత్యానేరంపై అమ్మాయి జైలు పాలవుతుంది. కొన్నేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యాక జైలర్ ఇంట్లో ఆయాగా చేరుతుంది. జైలర్ కూతురు, ఆమె కొడుకు ప్రేమించుకుంటారు. ఇదీ కధ.. ఇంతవరకు చెప్పింది కథ కాదంటారా??ఎక్కడో విన్నట్టు , చూసినట్టుగా అనిపిస్తుందా?? సినిమానో గుర్తొచ్చిందా?? భారతదేశాన్ని ఊపేసిన హిట్ చిత్రం "ఆరాధన""


ప్రేమ, ప్రీమెరైటల్ సెక్స్, దేశభక్తి, పుత్రప్రేమ, నీలాపనిందలు వెరసి ఒక అందమైన చిత్రంగా మలచారు శక్తి సామంత. వందన (షర్మిల టాగూర్), భారత సైన్యంలో పైలట్ గా పనిచేస్తున్న అరుణ్ (రాజేశ్ ఖన్నా) ప్రేమించుకుంటారు. ఒక వర్షం కురిసిన రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. తర్వాత గుళ్లో పెళ్లి చేసుకుంటారు. పెద్దలను కలుద్దామని అనుకుంటుండగానే పైలట్ ఐన అరుణ్ యుద్ధంలో చనిపోతాడు. గర్భవతియైన వందన అత్తగారింటికి వెళ్లినా వాళ్లు తమకు వీళ్ల పెళ్లి గురించి తెలీదు అని ఆమెను తమ కోడలిగా అంగీకరించరు. ఎలాగో కాలం గడుపుతూ ఒక మగబిడ్డను ప్రసవించి అనాధాశ్రమంలో వదిలేస్తుంది. తర్వాత వెళ్లి చూస్తే అబ్బాయిని ఎవరో దత్తు తీసుకుంటారు. వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిన వందన ఇంట్లోనే తన కొడుక్కు ఆయాగా చేరుతుంది. ఇంటి యజమాని బందువు వందనపై అత్యాచారం చేయబోగా వందన కొడుకు సూరజ్ అతన్ని చంపేస్తాడు. వందన నేరం తన మీద వేసుకుని జైలు కెళ్తుంది. శిక్ష పూర్తయ్యాక తనను ఆదరించిన జైలర్ ఇంట్లో అతని కూతురుని చూసుకోవడానికి ఆయాగా పనిలో చేరుతుంది వందన. అమ్మాయి వందన కొడుకు సూరజ్ ని ప్రేమిస్తుంది. సినిమా అంతంలో వందన నిజాన్ని అందరికీ చెప్తుంది. కథ సుఖాంతమవుతుంది. ఇదీ సినిమా అసలు కథ..


1969లో విడుదలైన ఆరాధన హిందీ సినిమా రంగంలో ఒక సంచలనం సృష్టించింది. చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఉన్న రాజేశ్ ఖన్నాని, కిశోర్ కుమార్ని రాత్రికి రాత్రే సూపర్ స్టార్స్ ని చేసింది. ఇది అక్షరాలా నిజమని ఇప్పటికీ అందరూ ఒప్పుకుంటారు. రాజేశ్ ఖన్నా కొత్తగా సినిమాల్లోకి వచ్చాడు. కాని హీరోయిన్గా చేసిన షర్మిలా టాగో టాప్ పొజిషన్లో ఉంది. ఎటువంటి ఫైటింగులు, కామెడీ లేని సినిమా ఒక చరిత్ర సృష్టించింది. కథ , సంగీతం, నటన, దర్శకత్వం, పాటలు అన్నీ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చేసాయి. సినిమాతోనే రాజేశ్ ఖన్నా తనకంటూ ఒక మేనరిజం క్రియేట్ చేసుకున్నాడు. అలాగే రఫీని దాటుకుని కిశోర్ కూడా తన పాటలతో అందరినీ మత్తులో పడేసాడు. డార్జిలింగ్ అందాలతో షర్మిలా సౌందర్యం పోటీ పడింది అంటే నేడు కూడా కాదనేవారెవరు. సినిమా విజయవంతం అయ్యాక జంట మరి కొన్ని సినిమాలలో కూడా అలరించారు. " అమర్ ప్రేమ్, సఫర్, దాగ్, ఆవిష్కార్" మొదలైనవి.. టాప్ పొజిషన్లో ఉన్న షర్మిలను, ఇంకా హిందీ సినిమా రంగంలో నిలదొక్కుకోని చిన్న హీరోతో సినిమా తీయడమే ఒక సాహసమైతే అందాల భరిణను ముసలిదానిగా చూపించాడు శక్తి సామంత. ఐనా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.


సినిమాలో ముఖ్యంగా అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది పాటలు. ఒక్కో పాట ఒక్కో అందమైన అద్భుతంగా మలిచారు. చుట్టూ పచ్చని దార్జిలింగ్ కొండల మధ్యనుండి వెళుతున్న రైలులో కిటికీ పక్కన కూర్చుని పుస్తకం చదువుతున్న షర్మిల . రైలు పక్కనే రోడ్డుమీద వెళ్తున్న జీపులో రాజేశ్ ఖన్నా తన కలల రాణికోసం పాడే "మేరే సప్నో కి రాణి కబ్ ఆయేగి తూ" కిటికీ పక్కన గాలికి కదులుతున్న ముంగురులను సర్దుకుంటూ హీరో పాటను తొంగి తొంగి చూస్తున్న హీరోయిన్, ఆది చూసి ఇంకా హుషారుగా పాడే హీరో. సీను సినిమా అభిమానులందరికీ గుర్తుంటుంది. భోరున కురుస్తున్న వర్షం. ఉరుములు,మెరుపులు, ఏకాంతంలో వేడి పుట్టించే నెగడు.. తడిసిన జంట "రూప్ తెరా మస్తానా.. భూల్ కొయి హంసేనా హో జాయె" అని పాడుకుంటారు. పాట కుటుంబ సమేతంగా వచ్చినవారికి మాత్రం కొంచం ఇబ్బంది కలిగిస్తుంది కాని కుర్రకారుకి హుషారునిచ్చే పాట అనొచ్చు. ఇంకో అందమైన పాట " గున్ గునారహె భవ్రె" రంగురంగుల పూలతోటలో, డార్జిలింగ్ అందాలతో ఊయలలూగిస్తుంది. కొండలలో మారుమ్రోగే పాట "కోరా కాగజ్ థా యెహ్ మన్ మెరా" .. కొడుకు రాజేశ్ ఖన్నా, ఫరీదా జలాల్ ఒకరి మీద ఒకరు పొడుపులు వేసుకుంటూ పాడే "భాగోన్ మే బహార్ హై" ఇలా పాటలన్నీ వింటుంటే ప్రతి ఒక్కరికి ఈనాటి సినిమా పాటలు, రచయితలు, నిర్మాత, దర్శకుల మీద పీకల్దాకా కోపం వస్తుంది. అంత మధురమైన , మరచిపోలేని ఆహ్లాదకరమైన పాటలు అందించారు సంగీత దర్శకుడు ఆర్. డి. బర్మన్.

ఇదే సినిమాను తెలుగులో శోభన్ బాబు, వాణిశ్రీలతో కన్నవారి కలలు గా నిర్మించారు కాని ఆరాధన అంత హిట్ కాలేదు.ఆరాధన సినిమాకి ఆంగ్ల మూల చిత్రం...1946 లో నిర్మించిన To each his own ..

7 వ్యాఖ్యలు:

భమిడిపాటి సూర్యలక్ష్మి

చందా హై తూ,సూరజ్ హై తూ,మేరి ఆఖోంఖా తారా హై తూ---
ఈ పాట చాలా బాగుంటుందండీ,నాకు చాలా యిష్టం. దీని గురించి రాయలేదు. మరి,--

భాను

మేరె సపనో కి రాణి కబ అఎగి తు నాకు ఇష్టమయిన హిందీ పాటల్లో ఒకటి. థాంక్స్ ఫర్ షేరింగ్. ఇదే పాట తెలుగు లో కూడా ఉంది సినిమా పాట నా మరి ప్రైవేట్ సాంగ్ అన్నది నాకు గుర్తుకు లేదు మా చిన్నప్పుడు మా వూళ్ళో ఒకతను ఎప్పుడు స్టేజ్ లపై పాడుతుండేవాడు. " మది పొంగే పోయే అటాలాడే తోటలోన ..ఏదో తెలియని హాయి నిండే మనసులోన చెలియా.. అంటూ వినస్ప్ముగా సాగేది. ఈ హిందీ పాట వింటూంటే చూస్తుంటే అలానే ఉంటుంది.

మాలా కుమార్

రాజేష్ కన్నా పెట్టుకున్న టోపీ కూడా మహా హిట్ . మా వారి ఫ్రెండ్స్ అందరి దగ్గరా వుండేది ఈ టోపి :)

లత

ఈ సినిమా తెలుగు లో చూసిన గుర్తు. బహుశా కన్నవారికలలు అనుకుంటా.శోభన్ బాబు వాణిశ్రీ జంటగా చేశారు.
అందులోని మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు పాట చాల బావుంటుంది.

లత

ఈ సినిమా తెలుగు లో చూసిన గుర్తు. బహుశా కన్నవారికలలు అనుకుంటా.శోభన్ బాబు వాణిశ్రీ జంటగా చేశారు.
అందులోని మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు పాట చాల బావుంటుంది.

Radio Club

mee blog teeru tennulu nijjangaa chaalaa baagunnayi! facebook message lo meerichina salahaa - ade readio lo maa anubhavaala gurinchi- idi kudaa naaku nacchindi. Prastutam nenu Jyothsna US lo unnaam. tirigi vacchaka mimmalni contact chestanu. Meegurinchi telusukodaaniki marokari reference yendukandi? Radio ante antha ishtapade meeru maaku aatmeeyule! - Ilyas-Jyothsna

జ్యోతి

ఇల్సియాస్ గారు,
మీకు, జ్యోత్స్నగారికి నమస్కారం. ముప్పైఏళ్లుగా మీ దంపతుల మాటకు ఆకాశవాణికి వీరాభిమానిని. మీరు నా బ్లాగుకు రావడం నా అదృష్టం. అలాగే మీ రేడియో ముచ్చట్లు పంచుకుంటానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రేడియో అభిమానులు చాలామంది ఉన్నారండి. త్వరగా వచ్చేయండి బ్లాగ్లోకానికి.. ఎదురుచూస్తుంటాము..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008