Thursday, December 23, 2010

ఇంతులూ.. ఇంటర్నెట్

ఇంటర్నెట్ అంటే విద్యార్థులు, కంప్యూటర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఉపయోగం..ఇంట్లో ఉండే మహిళలకు దానివలన లాభమేంటి?? చాలా ఉన్నాయి. నెట్ అంటే చాటింగ్ మాత్రమేకాదు. ప్రతి మహిళకు ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని నన్ను నేను ఉదాహరణగా పెట్టుకుని రాసిన వ్యాసం ..


ఇల్లు, పిల్లలు, వంట, బంధువులు, తీరిక దొరికితే టీవీ సీరియళ్లు, సినిమాలు.... ఇదేనా ఒక గృహిణి తన జీవితంలో చేయగల పనులు. ఈరోజు పెరుగుతున్న అవసరాలు, ఆధునికత, అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం మన నట్టింట్లోకి వచ్చింది. ఈ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అంటే కంప్యూటర్ ఇంజనీర్లకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకే పరిమితమైన కంప్యూటర్ వాడకం, అంతర్జాలం లేదా ఇంటర్నెట్ ఈనాడు నిత్యావసరమైపోయింది. కంప్యూటర్ వాడకం ఉద్యోగాలు చేసే సాంకేతిక నిపుణులకే కాక స్కూలు పిల్లలకు కూడా అవసరమైపోతుంది. తప్పనిసరిగా దాదాపు ప్రతి ఇంట్లో కంప్యూటర్ కొని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించక తప్పడంలేదు. చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్లకు మాత్రమే ఈ కంప్యూటర్ ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. కాసింత ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు ఎక్కువ చదువుకోకున్నా, ఇంగ్లీషు రాకున్నా కూడా కంప్యూటర్ వాడకం నేర్చుకుని ఇంటర్నెట్టు ద్వరా ప్రపంచమంతా చుట్టి రావొచ్చు. అది కూడా ఇంట్లో కూర్చునే, ఇంటిపని చేసుకుంటూనే.ఈనాడు ఇంటర్నెట్ వాడకం అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అసలు ఈ అంతర్జాలం యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అది ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం. అంతర్జాలం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని సమాచారాన్ని, వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి, దగ్గర చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మన చేతివేళ్ల విన్యాసంతో క్షణాల్లో కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పంచుకోవచ్చు. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా సప్తసముద్రాలకావల ఉన్న మిత్రులు, కుటుంబసభ్యులతో నిమిషాల్లో ముచ్చట్లాడుకోవచ్చు. అది ఉత్తరమైనా, మాటలైనా..ఎలా ఐనా. అది కూడా చాలా చవకగా. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం వల్ల కంప్యూటర్లు, నెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటున్నాయి. మహిళలు తీరికసమయాలలో టీవీ సీరియళ్లు, ఊసుపోక కబుర్లు, షాపింగ్ చేసేబదులు కంప్యూటర్ ముందు కూర్చుని ఎన్ని పనులు చేయొచ్చొ చూడండి. మీకు కావలసిన పుస్తకం గురించి ఐనా, సినిమా ఐనా, కాలేజీ ఐనా, సినిమాపాటైనా, స్తోత్రమైనా, పుణ్యక్షేత్రమైనా .. ఏదైనా సెర్చి ఇంజన్ల ద్వారా క్షణాల్లో మనకు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఫీజులు వగైరా వివరాలు కావాలంటే ఎవరు చెప్పాలి?. ఎవరిని అడగాలి అనే మీమాంశ చాలామందికి ఉంటుంది. అప్పుడు ఖంగారు పడకుండా గూగులమ్మని అడిగితే సరి. అలాగే నెట్ ద్వారా పరిచయమైన మిత్రులతో, విదేశాలలో ఉన్న మిత్రులు ఎవరితో ఐనా మాట్లాడి తెలుసుకోవచ్చు. అంతే కాక ఆయా కాలేజీల వెబ్ సైట్లకు వెళ్లి అక్కడి కోర్సులు, ఫీజులు , ప్రవేశ పరీక్షల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మనకు నచ్చిన కాలేజీలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. అంతర్జాలం చదువుకున్న,చదువుకుంటున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చదువుకు సంబంధించిన వివరాలు, ఉద్యోగావకాశాలు, ఒక్కోసారి ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలు మొదలైనవెన్నో ఇంట్లోనే ఉండి తెలుసుకోవచ్చు. ఇక తమ ఉద్యోగ నిర్వహణలో అవసరమయ్యే సమాచారం కోసం ఎక్కువ వెతుకులాడకుండా నిమిషాల్లో నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. రిసెర్చి , ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నవారికి , ఎక్కువ పుస్తకాలు కొనలేని వారికి కంప్యూటర్, అంతర్జాలం చాలా ఉపయోగపడుతుంది. నెట్ లో ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు, ఆయా ప్రొఫెసర్ల వీడియో పాఠాలు కూడా లభ్యమవుతాయి..మీకు సంగీతం, సాహిత్యం, ఆద్యాత్మిక విషయాలంటే ఆసక్తి ఉందా?? వాటి గురించిన మరింత సమాచారం కావాలనుకుంటున్నారా? ప్రతీదానికి పుస్తకాలు కొని ఇంటినిండా నింపుకోవడం వీలు కాదు. అలాంటప్పుడు అంతర్జాలం చాలా ఉపయోగపడుతుంది. కంప్యూటర్నుండే కావలసిన సమాచారం సేవ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. సంగీత, వాయిద్య పాఠాలు కూడా నేర్చుకోవచ్చండోయ్. అలాగే వాటికి సంబంధించిన వీడియోలు కూడా లభిస్తాయి అవీ.. ఉచితంగా... ఇదే విధంగా మహిళలకు ఇష్టమైన కుట్లు అల్లికలు, పెయింటింగులు, వంటలు మొదలైన ఎన్నో హాబీల గురించిన బ్లాగులు, వెబ్ సైట్లు, వీడియోలు అంతర్జాలంలో లభిస్తాయి. అవి చూసి నేర్చుకోవడం చాలా ఈజీ. ఫీజు కూడ కట్టే పని లేదు. ఇంటినుండి కాలు బయట పెట్టే పని లేదు...

ఇంట్లో ఒకరికి జబ్బు చేసింది. డాక్టరు దగ్గరకు వెళితే మందులు రాసిచ్చాడు. కాని తగ్గలేదు. హటాత్తుగా ఆరోగ్యంలో తేడా చేసింది. డాక్టర్ దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. అలా జరగడం మొదటిసారి. ఎందుకలా జరిగిందో తెలిదు. అలాంటప్పుడు అంతర్జాలంలో సెర్చిలో ఆ వ్యాధి లక్షణాల గురించి ప్రస్తావించి వివరాలు అడగొచ్చు. క్షణాల్లో వందలకొద్ది సైట్లు ఆ వివరాలు మనకు అందిస్తాయి. ఆ వ్యాధి గురించి కొన్ని వివరాలైనా తెలిస్తే మరోసారి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా. అలాగని సొంత వైద్యం కూడా చేయరాదు. ఇంకో విషయమేమంటే ఇంట్లో ఉండే మీరు షాపింగ్ చేయవచ్చు. కొన్ని షాపింగ్ సైట్లలో దాదాపు అన్ని రకాల వస్తువులు ధరలు, అవి దొరికే షాపుల వివరాలు, చీరలైనా, నగలైనా, నెలవారీ సరుకులు, చెప్పులు, గాజులు, పూలు, పళ్లు .. ఇలా ఒక గృహిణి తన నిత్యజీవితంలో కావలసిన విషయాలగురించి తెలుసుకుని షాపింగ్ చేయవచ్చు . ఇది ఆన్లైన్లో చేయొచ్చు.

2 వ్యాఖ్యలు:

Lakshmi ...Rasoi ki Malkin..northern and southern spices

Jyothi garu, chala chala baga rasaru..

Ennela

జ్యోతి గారు,టపా బాగుందండీ , నేను ఇంటిదగ్గర అందరినీ ఇంటర్నెట్ పెట్టుకోమని చెపుతుంటాను, కానీ పిల్లలు టయిము వేస్ట్ చేస్తారని ఎవ్వరూ పెట్టించుకోవట్లేదుట..మై నహీ చోడూంగీ.....చెపుతూనే ఉంటా....

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008