Wednesday, 30 March 2011

బ్లాగు సంకలిని - Aggregator


బ్లాగు సంకలిని

భావవ్యక్తీకరణకు అద్భుతమైన వేదిక బ్లాగు అని చెప్పుకున్నాము కదా. ఆలోచనలకు అక్షరరూపమిచ్చి , వాటిని తమ బ్లాగులో పొందుపరుచుకుని పదిమందితో పంచుకుంటున్నారు. ఇప్పుడు రెండువేలకు తెలుగు బ్లాగులు ఉన్నాయి. అందులో సుమారు యాబైకి పైగా బ్లాగుల్లో నిత్యం హడావిడిగానే ఉంటుంది. ఏదో ఒక బ్లాగులో కొత్త టపా లేదా పోస్టు ఉంటుంది. వాటిల్లో కవితలు, రాజకీయాలు, కవితలు, వంటలు, క్రికెట్, లేదా ఏదైనా విషయంపై సీరియస్ చర్చలు కూడా జరుగుతుంటాయి. మరి ఇన్ని బ్లాగులను ఎలా చూసేది? అన్ని అడ్రస్సులు లేదా యు.ఆర్.ఎల్ (బ్లాగు చిరునామా)ఎలా గుర్తుపెట్టుకుంటాము?. ఈ సమస్యకు పరిష్కారమే ఆగ్రిగేటర్ లేదా సంకలిని. బ్లాగులన్నింటిని ఒకే చోట చూడగలిగే మార్కెట్ అని చెప్పవచ్చు. ఈరోజు బాగా ప్రాచుర్యం పొందిన సంకలినులు నాలుగు ఉన్నాయి. అవి..

కూడలి... http://koodali.org/
మాలిక... http://maalika.org/
హారం... http://haaram.com/
జల్లెడ... http://www.jalleda.com/



కొత్తగా బ్లాగు మొదలెట్టగానే ఈ సంకలినులకు వెళ్లి బ్లాగు చిరునామా తదితర వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు బ్లాగులో కొత్త టపా రాసిన కొద్ది నిమిషాల్లోనే బ్లాగు పేరు, టపా శీర్షికతొ సహా సంకలినుల్లో ప్రత్యక్షమవుతుంది. కొత్త టపాలు ఏమేమి వచ్చాయో తెలుసుకోవడానికి సంకలినికి వచ్చినవాళ్లు ఆ లంకె (లింకు)పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి, చదివి తమ స్పందన తెలియచేస్తారు. వీటన్నింటికి మనకు ఎటువంటి ఖర్చూ ఉండదు. కాని సంకలినులు నిర్వహించడానికి మాత్రం ఖర్చు తప్పదు. ఈ సంకలినులు లేదా అగ్రిగేటర్లు నిర్వహించేవారు తమ తమ వృత్తులలో తీరికలేకుండా ఉన్నా, తెలుగు భాష మీది అభిమానం, బ్లాగులన్నింటినీ ఒక్కచోట చేర్చి చూపించాలనే సదుద్ధేశ్యంతో ఖర్చుకు వెనుకాడడం లేదు. బ్లాగులను చూపించడమే కాక ప్రతీ సంకలినిలో విభిన్నమైన ప్రత్యేకతలు, విభాగాలతో అందరికీ సులువుగా ఉండేలా నిత్యం కృషి చేస్తున్నారు. ఇలా చెయడం వల్ల వాళ్లకు ఎటువంటి ఆదాయమంటూ లేదు కాని మాతృభాషకోసం పని చేస్తున్నామన్న సంతృప్తి కనిపిస్తుంది.


కూడలిలో వివిధ విభాగాలు ఇలా ఏర్పాటు చేయబడ్డాయి. బ్లాగులు, వార్తా పత్రికలూ, ఫోటో బ్లాగులు, సేకరణలు రాసే బ్లాగులు, చివరిలో తెలుగుబ్లాగర్ల ఇంగ్లీషు బ్లాగులు. అదే విధంగా అన్నిబ్లాగులలో మరిన్ని విభాగాలు మనకు లభ్యమవుతాయి. సినిమా విశేషాల బ్లాగులు, సాహిత్యానికి సంబంధించిన బ్లాగులు, హాస్యం, సాంకేతికం, రాజకీయాల గురించి తరచూ రాసే బ్లాగులు . మనకు నచ్చిన విభాగంలోని బ్లాగులను చాలా సులువుగా చదవవచ్చు. కూడలిలో ఉన్న మరో ప్రత్యేకత ..ఫోటో బ్లాగులు. తెలుగు వారి ఫోటో బ్లాగులు ఇందులో పొందుపరచబడ్డాయి. కూడలి మొదటి పేజీలో ఈ ఫోటో బ్లాగులలోని ఏదో ఒక యాదృచ్చిక చిత్రం కనిపిస్తుంది. దానంతట అదే మారుతుంది కూడా.


ఈ జల్లెడలో బ్లాగులు విభాగాల వారిగా జల్లించబడి సులువైన క్యాటగరీలలో మనకు అందించబడతాయి. మనం బ్లాగు టపా రాయగానే ఇచ్చే లేబుల్స్ ఆధారంగా సదరు టపాలు ఇక్కడి వివిధ విభాగాలలో చేరిపోతాయి. ఇందులో ఉన్న విభాగాలు చూద్దాం .. అన్నీ.. కబుర్లు, హాస్యం, రాజకీయం, కవితలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, కొత్తబాబులు (కొత్త బ్లాగులు) , స్త్రీ (మహిళా బ్లాగులు మాత్రమే) , సాంకేతికం, సినిమా, పత్రికలూ (అంతర్జాల పత్రికలు).. ఇందులో తాజా వ్యాఖ్యలు, తాజా టపాలు విడివిడిగా చూడవచ్చు. అంతే కాదు తెలుగు బ్లాగుల జాబితా కూడా లింకులతో సహా ఇందులో చూడవచ్చు. జల్లెడలో ఉన్న మరో విశేషం .. ఇందులో మనం బ్లాగు రచయిత పేరు ఆధారంగా, మనం రాసిన కామెంట్ల ఆధారంగా కూడా టపాలు, బ్లాగులను జల్లించవచ్చు(చూడవచ్చు). దీని ఇంగ్లీషు వెర్షన్ కూడా ఉంది. భారతీయుల ఇంగ్లీషు బ్లాగులు ఇక్కడ చేర్చబడ్డాయి. జల్లెడను తెలుగులోనే కాక RTS లో కూడా చదవగలిగే అవకాశం ఉంది.


హారంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. హారం మొదటి పేజిలో ఎడమ వైపు భాగంలో రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది. మధ్య భాగంలో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపబడతాయి. కుడి భాగంలో హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపబడతాయి. గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపిస్తుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది. అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో చూడొచ్చు. అంటే చందమామ, జ్యోతి, స్వాతి, భూమి లాంటి పత్రికలు కూడా ఉంటాయి. పద్య, సాహిత్య , వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది. కుడివైపు ఇచ్చిన ఆప్షన్ లో మీకు కావలసిన విభాగంలోని బ్లాగులు చూడవచ్చు. అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.హారంలో బ్లాగు టపాలే కాక ప్రతి బ్లాగులోని వ్యాఖ్యలు కూడా వేరే పేజిలో తెరిచి చదువుకోవచ్చు. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.


మాలికకు ప్రత్యేక ఆకర్షణ.. . టపా రాసిన ఐదు నిమిషాలలోపల మాలికలో కనిపిస్తుంది. ఓపన్ చేయగానే ముందుగా ఆకర్షించేది అందమైన ఫోటో పక్కనే వెబ్ పత్రిక వివరాలు. ఫోటోలు, వాటిని తీసిన బ్లాగర్ వివరాలు అన్ని పేజీలలో కనబడతాయి. ఈ ఫోటోలతో పాటు వెబ్ పత్రికలు కూడా అన్నిపేజీల్లో వస్తాయి. మాలికలో కనబడే వెబ్ పత్రికల టపాలు "రియల్ టైమ్" లో వస్తాయి. అంటే, అక్కడ వాళ్ళు ప్రచురించిన వెంటనే ఆలస్యం లేకుండా ఇక్కడ కనబడతాయి. ఇంతేకాక, మీరు రీలోడ్ చేసిన ప్రతిసారి పేజీలోని ఫోటో, వెబ్ పత్రికలు మారిపోతూ ఉంటాయి. వ్యాఖ్యలు కూడా విడిగా వేరే పేజీలో చూడవచ్చు. అవి రెండు వరుసలుగా చూపబడతాయి. దీనివల్ల ఎక్కువ వ్యాఖ్యలు చూసి, చదివే అవకాశముంటుంది.


మరి మీరు బ్లాగు మొదలెట్టగానే ముందుగా ఈ ఆగ్రిగేటర్లలో చేర్చడం మరచిపోవద్దు.

3 వ్యాఖ్యలు:

సో మా ర్క

నాకు ఈ బ్లాగు నిర్వహించుకోవడం,జాల పత్రికకు పంపడం క్రొత్త.ఐనా చూసి నేర్చుకొని ముందుకు పోతున్న నాకు మీరిచ్చిన వివరణ మరింత ఉత్సాహాన్ని,ఊపునిచ్చింది...జ్యొతి గారూ ! మీకు నా ధన్యవాదాలు. అప్పుడప్పుడు ఇలాంటి తెలియని విషయాలను తెలియ చుబుతారు కదూ !

కథాసాగర్

చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం...బ్లాగు సంకలిని తో ఇక ఎన్నో మేజిక్స్ చేయవచ్చు..
మంచి టపా.

Bindu

జ్యోతి గారికి నమస్కరం ఎంతొ విలువైన సమచారం అందించారు. అందుకు మీకు చాల దన్యవాదాలు, మేడం నాకు ఒకటి తెలియటం లేదు. అది ఎంటంటే మన బ్లాగ్ లో కూడలి లాంటి వాటిని ఎలా కనబడేలా చేయాలో అర్దం కావట్లె దయచెసి అది ఎలాగో తెలియజేయండి. ప్లీజ్ నా ఇమేల్ అద్రస్స్ bindu.bindu225@gmail.com
ప్లీజ్ జ్యోతి గారు అది ఎలాగో చెప్పండి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008